‘రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటేలా లక్ష్యం’
ఖైరతాబాద్: రాబోయే మూడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణం పెద్ద సమస్యగా మారింది. ఈ విపత్తును నుంచి బయటపడకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ప్రభుత్వం కాలుష్య నిర్మూలనకు చర్యలు తీసుకుంటోందని, ఇందుకోసం ప్రణాళికలు సిద్దం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలను బాగస్వాములను చేస్తామన్నారు. వాతావరణ సమతౌల్యం కాపాడేందుకు మొక్కలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 33శాతం ఉన్న అడవుల్ని కాపాడుతూ వస్తున్న దేశాలలో ఆరోగ్యంగా జీవిస్తున్నారని, మనదేశంలో అడవుల శాతాన్ని 24నుంచి 33శాతానికి పెంచాల్సి ఉందన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో 230కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసం 108 రకాల మొక్కలను సిద్దం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని పట్టణాలు, గ్రామాలలో పరిచయం చేసే కార్యక్రమానికి రంగం సిద్దం చేస్తున్నామని మంత్రి తెలిపారు.