లెక్కసరే.. మరి మొక్క సంగతీ?
హరితహారం మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం.. రంగంలోకి అధికారులు
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకు ‘హరితహారం’ మొక్కల సంరక్షణలో అధికార యంత్రాంగం చిత్తశుద్ధి ప్రదర్శించడంలేదన్న విమర్శలున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లాలో మంత్రులు జోగు రామన్న, జగదీశ్వర్‌రెడ్డి నిర్వహించిన హరితహారం సమీక్ష సమావేశానికి 16 ప్రభుత్వ విభాగాల ముఖ్య అధికారులు గైర్హాజరయ్యారు. దీంతో ఇన్‌చార్జి కలెక్టర్ సత్యనారాయణ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అటు ఈ నెల 8న సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో మొక్కలు నాటగా, అదేరోజు విజయవాడ జాతీయ రహదారిపై 163 కిలోమీటర్ల మేర అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు మొక్కలు నాటారు. అయితే చాలా చోట్ల నీరు, ట్రీగార్డులను సమకూర్చలేదనే విమర్శలు వెల్లువెత్తాయి.
మరికొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితుల వల్ల మొక్కలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ చౌటుప్పల్, నార్కట్‌పల్లి, నకిరేకల్, తిప్పర్తి మండలాల్లో హరితహారం తీరును పరిశీలించారు. సీఎంవోలో హరితహారాన్ని పర్యవే క్షిస్తున్న ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్ సైతం పది జిల్లాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదికలు పంపుతున్నారు. ఇటు మున్సిపాలిటీలు, నగర, గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ట్యాంకర్లతోపాటు ఫైరింజన్‌ల ద్వారా మొక్కలకు నీరు అందించే కార్యక్రమాన్ని ఆలస్యంగా ప్రారంభించారు.