show-cause notices
-
IAS Officer: ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి.. అలా చేయడంతో షోకాజ్ నోటీసులు
ఢిల్లీలోని బ్యూరోక్రాట్ల నియంత్రణ, పోస్టింగ్‌పై కేంద్రంతో జరిగిన తగాదా కేసులో సుప్రీం కోర్టు ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం రంగం చేసింది. అదీగాక సుప్రీం కోర్టు నుంచి ఈవిధంగా తీర్పు వెలువడిన వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవినీతి అధికారులను తొలగించి కష్టపడి పనిచేసే అధికారులను తీసుకొచ్చేలా బదిలీలు ఉంటాయని ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే సర్వీసెస్ డిపార్ట్మెంట్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ఆశిష్ మోర్ పదవీచ్యుత్తులయ్యారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం బదిలీ ఉత్తర్వును ఉల్లంఘించిన ఐఏఎస్ అధికారి ఆశిష్ మోర్‌కు ఈ నెల 13న షోకాజ్ నోటీసులు పంపింపించింది. ఆ అధికారి సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించనందుకు గానూ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కూడా యోచిస్తున్నట్లు తెలిపింది. దీనిపై 24 గంటల్లో ఆశిష్ మోర్ నుంచి సమాధానం కూడా కోరింది ఢిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు సేవల శాఖ(సర్వీస్ డిపార్ట్మెంట్) మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ..కొత్త అధికారిని ఆయన స్థానంలో బదిలీ చేసేందుకు ఫైల్ సమర్పించమని సేవల కార్యదర్శి ఆశిష్ మోర్ని ఆదేశించినట్లు తెలిపారు. ఐతే ఆయన మంత్రి కార్యాలయానికి తెలియజేయకుండా సచివాలయానికి వెళ్లిపోయారని ఆరోపించారు. ఫోన్‌ని కూడా స్విచ్ ఆఫ్‌లో పెట్టుకుని పరారిలో ఉన్నారని మండిపడ్డారు. ఆ అధికారికి ఈ విషయాన్ని అధికారికంగా ఆయన వాట్సాప్, ఈమెయిల్ ద్వారా తెలియజేసినప్పటికీ అతని నుంచి ఎటువంటి స్పందన లేదని చెప్పారు. ఆయన బదిలీ అయ్యేందుకు సిద్ధంగా లేరని కూడా ఆరోపించారు. మోర్ మే 21 2015 నాటి హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను ఇంకా పక్కన పెట్టలేదని సూచిస్తూ.. షోకాజ్ నోటీసులు పంపినట్లు మంత్రి సౌరబ్ భరద్వాజ్ పేర్కొన్నారు. దీనిపై త్వరితగతిన ఆశిష్ మోర్ వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, సేవల నిర్వహణపై ఢిల్లీ ప్రభుత్వానికి శాసన కార్యనిర్వాహక అధికారాలు ఉన్నాయని గతవారమే సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఢిల్లీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయని అధికారులపై ఈ విథంగా కఠిన చర్యలు తీసుకునే ప్రక్రియను ప్రారంభించింది. (చదవండి: కర్ణాటక సీఎం ఎపిసోడ్‌పై సస్పెన్స్.. ‘నేనే సీఎం అవుతానని ఆశిస్తున్నా’) -
టెలికాం దిగ్గజానికి షోకాజు నోటీసు
ముంబై : దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ షోకాజు నోటీసులు జారీచేసింది. తన కస్టమర్లకు పారదర్శకత లేని, వివక్షపూరితమైన టారిఫ్‌లు అందజేస్తుందనే ఆరోపణలతో ట్రాయ్ ఈ నోటీసులు పంపింది. మార్చి 25 వరకు ఈ నోటీసులపై స్పందించాలని ఆదేశించింది. కస్టమర్లు, ప్రత్యర్థ సంస్థల నుంచి ఎయిర్‌టెల్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎయిర్టెల్ పారదర్శకత లేని వివక్షపూరితమైన టారిఫ్‌లను అందిస్తుందని ఫిర్యాదులు అందినట్టు ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి చెప్పారు. నెల నుంచి వీటిపై వివరాలు అందించాలని ఎయిర్‌టెల్‌కు ఆదేశాలు వెళ్తున్నాయి. కానీ ఎయిర్టెల్ వివరాలను అందించకపోవడంతో, ట్రాయ్ షోకాజు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసుల్లో ఎలాంటి రకమైన టారిఫ్‌లను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తుందో వెల్లడిచేయాలని ఆదేశించింది. ఎయిర్టెల్ కూడా ఈ నోటీసులను ధృవీకరించింది. ట్రాయ్ ఇచ్చిన సమయం లోపల ఈ నోటీసులపై స్పందిస్తామని పేర్కొంది. ఎయిర్‌టెల్‌పై యాక్షన్ తీసుకునే ముందు కంపెనీ వెర్షన్ కూడా వినాలనుకుంటున్నట్టు రెగ్యులేటరీ తెలిపింది. రెగ్యులేటరీకి రిపోర్టు చేసిందో లేదో బట్టి కంపెనీపై చర్యలు తీసుకుంటామని ట్రాయ్ అధికారులు చెప్పారు. దోపిడి పూరిత ధరల విధానంపై ట్రాయ్ జారీచేసిన టారిఫ్ ఆర్డర్ అనంతరం పంపిన తొలి షోకాజు నోటీసు ఇదే. ఈ నిబంధనల కింద టెల్కోలు కొంత మంది సబ్స్క్రైబర్లకు కొన్ని ప్రత్యేక ప్లాన్లను ఆఫర్ చేయడానికి వీలులేదు. -
ఆరు టెల్కోలకు షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్) ఆరు టెలికం కంపెనీలకు డిమాండ్ కమ్ షోకాజ్ నోటీసులు జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఆరు టెల్కోలు 2006–07 నుంచి 2009–10 మధ్యకాలంలో వాటి ఆదాయాలను తక్కువ చేసి చూపాయన్న కాగ్ నివేదిక ఆధారంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. నోటీసులు పొందిన సంస్థల్లో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్ వంటి టెల్కోలున్నాయి. ‘కాగ్ నివేదిక ఆధారంగా డాట్ ఆరు ప్రైవేట్ టెలికం సంస్థలకు డిమాండ్ కమ్ షోకాజ్ నోటీసులు పంపింది. నాలుగు ఆర్థిక సంవత్సరాలకు (2006–07 నుంచి 2009–10 వరకు) సంబంధించి రూ.29,474 కోట్ల మొత్తానికి గానూ నోటీసుల జారీ జరిగింది’ అని టెలికం మంత్రి మనోజ్ సిన్హా బుధవారం లోక్‌సభకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఈ మొత్తంలో లైసెన్స్ ఫీజు రూ.6,490 కోట్లుగా, వడ్డీ రూ.13,751 కోట్లుగా, పెనాల్టీ రూ.3,178 కోట్లుగా, పెనాల్టీ మీది వడ్డీ రూ.6,055 కోట్లుగా ఉందని వివరించారు. రూ.29,474 కోట్ల మొత్తంలో భారతీ ఎయిర్టెల్ వాటా రూ.8,162 కోట్లుగా, రిలయన్స్ గ్రూప్ వాటా రూ.7,701 కోట్లుగా, టాటా టెలిసర్వీసెస్ వాటా రూ.5,718 కోట్లుగా, వొడాఫోన్ వాటా రూ.4,695 కోట్లుగా, ఐడియా వాటా రూ.2,708 కోట్లుగా, ఎయిర్‌సెల్ వాటా రూ.490 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. -
‘ఆ హోంగార్డు’లకు షోకాజ్ నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: సమ్మె నేపథ్యంలో అభ్యంతరకరంగా వ్యవహరించిన హోంగార్డులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. గురువారం ఇక్కడ ఇందిరాపార్క్ వద్ద ధర్నా, సచివాలయ ముట్టడికి యత్నం సహా మరికొన్ని నిరసనలకు హోంగార్డులు దిగారు. ఇవి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో పరిస్థితి లాఠీచార్జ్ వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి నగరంలోని ఐదు పోలీసుస్టేషన్లలో క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యారుు. వీటికి బాధ్యుల్ని గుర్తించేందుకు దర్యాప్తు అధికారులు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన చిత్రాలను, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం ఆధారంగా నిరసనల్లో చురుగ్గా పాల్గొన్న, అభ్యంతరకరంగా వ్యవహరించిన హోంగార్డుల్ని గుర్తిస్తున్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఇలా విభాగాలవారీగా ఉన్నతాధికారులు ఈ నోటీసులు తయారు చేస్తున్నారు. వీటిని సంబంధిత హోంగార్డులకు అందించి వారంలోగా సమాధానం ఇవ్వాల్సిందిగా స్పష్టం చేయనున్నారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకొంటారు. -
పక్కా సమాచారం ఇవ్వాల్సిందే
బెదిరింపులకు దిగడం సరికాదు కేసులకు హాజరుకాని అధికారులకు షోకాజ్ నోటీసులు పలువురు అధికారులకు జరిమానా ఆర్టీఐ రాష్ట్ర కమిషనర్ విజయబాబు అనంతపురం టౌన్ : సమాచార హక్కు చట్టం కింద ఎవరైనా దరఖాస్తు చేస్తే వివరాలన్నీ పక్కాగా ఇవ్వాల్సిందే.’ అని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ పి.విజయబాబు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులకు సూచించారు. ఆర్టీఐకి సంబంధించిన కేసుల విచారణకు అప్పిలేట్ అధికారులు హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం డ్వామా హాల్లో సీమ పరిధిలోని జిల్లాల్లో మునిసిపాలిటీ, పంచాయతీరాజ్, డీఆర్డీఏ–వెలుగు, డ్వామా శాఖలకు సంబంధించి 36 కేసులపై విచారణ చేపట్టారు. సుమారు 18 కేసులకు సంబంధించి అధికారులు రాకపోవడంపై మండిపడ్డారు. వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినా కమిషన్ ముందుకు హాజరుకాని డీఆర్డీఏ, ఐకేపీ పుట్టపర్తి ఏపీఎం, బ్రహ్మసముద్రం ఈఓఆర్డీకి రూ.5 వేలు, కడప మునిసిపల్ కార్యాలయం సిటీ ప్లానింగ్ అధికారికి రూ.2 వేలు జరిమానా విధించారు. సమాచారం అడిగిన వారితో పాటు హైదరాబాద్ నుంచి కమిషన్ వస్తే జిల్లాలోనే ఉన్న అధికారులు రావడం లేదంటే వారికి చట్టంపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని విజయబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓపై ఆగ్రహం : సోమందేపల్లి మండలంలో పింఛన్లకు సంబంధించి సమాచారం ఇవ్వలేదని, రూ.10.67 లక్షల అవినీతి జరిగిందని సమాచార హక్కు దరఖాస్తుదారుడు బాబుప్రసాద్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం కోసం రూ.3342 కట్టించుకున్నారని, వివరాలు మాత్రం అందజేయలేదన్నారు. పైగా బెదిరిస్తున్నారని ఎంపీడీఓ లలితాబాయిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీవోను ఆయన ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం డీఆర్డీఏ పీడీ పరిధిలో ఉంటుందని ఆమె తెలుపగా అదే విషయాన్ని రాసివ్వాలని, రికవరీ నివేదికను కమిషన్‌కు అందజేయాలని ఆదేశించారు. విచారణకు ఆదేశం : ∙దర్మవరంలోని బీఎస్ఆర్ బాలికల హైస్కూల్, ఎస్పీసీఎస్ గర్‌్ల్స హైస్కూల్స్‌లో ఉపాధ్యాయులు మహిళలే ఉండాలని జీవో 33 ఉందని, నిబంధనలకు విరుద్ధంగా సుమారు 19 మంది పురుషులు ఉన్నట్లు అనంతపురానికి చెందిన ఉపాధ్యాయుడు పెద్దన్న తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వివరాలు కోరినా ఇవ్వడం లేదని చెప్పడంతో తక్షణం విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ∙పెనుకొండ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని, వివరాలడిగితే సరిగ్గా ఇవ్వడం లేదని బాబావలి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక పుట్టపర్తి వెలుగు కార్యాలయంలో గతంలో పంపిణీ చేసిన గడ్డపారల వివరాలు అడిగితే రికార్డులు లేవని సమాధానం ఇచ్చారని కర్ణాటక నాగేపల్లికి చెందిన ప్రసాద్ విచారణలో తెలిపారు. దీంతో సంబంధిత ఉన్నతాధికారికి షోకాజ్ నోటీస్‌తో పాటు రూ.5 వేలు జరిమానా విధించారు. తాడిపత్రికి సంబంధించి ఓ పంచాయతీలో పని చేస్తున్న వారి వివరాలు ఇవ్వనందుకు డీపీఓకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. -
లెక్కసరే.. మరి మొక్క సంగతీ?
హరితహారం మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యం.. రంగంలోకి అధికారులు సాక్షి, హైదరాబాద్: రోజురోజుకు ‘హరితహారం’ మొక్కల సంరక్షణలో అధికార యంత్రాంగం చిత్తశుద్ధి ప్రదర్శించడంలేదన్న విమర్శలున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లాలో మంత్రులు జోగు రామన్న, జగదీశ్వర్‌రెడ్డి నిర్వహించిన హరితహారం సమీక్ష సమావేశానికి 16 ప్రభుత్వ విభాగాల ముఖ్య అధికారులు గైర్హాజరయ్యారు. దీంతో ఇన్చార్జి కలెక్టర్ సత్యనారాయణ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అటు ఈ నెల 8న సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో మొక్కలు నాటగా, అదేరోజు విజయవాడ జాతీయ రహదారిపై 163 కిలోమీటర్ల మేర అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు మొక్కలు నాటారు. అయితే చాలా చోట్ల నీరు, ట్రీగార్డులను సమకూర్చలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. మరికొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితుల వల్ల మొక్కలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సీఎంవో అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ చౌటుప్పల్, నార్కట్‌పల్లి, నకిరేకల్, తిప్పర్తి మండలాల్లో హరితహారం తీరును పరిశీలించారు. సీఎంవోలో హరితహారాన్ని పర్యవే క్షిస్తున్న ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్ సైతం పది జిల్లాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి నివేదికలు పంపుతున్నారు. ఇటు మున్సిపాలిటీలు, నగర, గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ట్యాంకర్లతోపాటు ఫైరింజన్ల ద్వారా మొక్కలకు నీరు అందించే కార్యక్రమాన్ని ఆలస్యంగా ప్రారంభించారు. -
ప్రై‘వేటు’
♦ 137 ప్రైవేటు స్కూళ్లకు షోకాజ్ నోటీసులు ♦ పట్టణ మండలాల్లోనే ఎక్కువ పాఠశాలలు ♦ వారంలోగా వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ ♦ వివరణ సంతృప్తికరంగా లేకుంటే సీజ్! గుర్తింపులేని పాఠశాలలపై ఉచ్చు బిగుసుకుంటోంది. అనుమతులు లేకుండా పాఠశాలలను నిర్వహిస్తున్న అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ వాటిపై కొరడా ఝళిపిం చేందుకు సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో 137 ప్రైవేటు పాఠశాలలు అనధికారికంగా కొనసాగుతున్నాయి. వాటికి ఎలాంటి అనుమతులు లేనప్పటికీ విద్యార్థులను చేర్చుకుంటున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈక్రమంలో వాటికి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు విద్యాశాఖ ఉపక్రమించింది. ఇందుకు సంబంధించి మండల విద్యాశాఖ అధికారుల ద్వారా నోటీసులను ఆయా పాఠశాలల యాజమాన్యాలకు పంపిస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: అనుమతి లేకుండా కొనసాగుతున్న పాఠశాలలకు రెండ్రోజుల క్రితం షొకాజ్ నోటీసులు జారీ చేసిన విద్యాశాఖ.. వారంలోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అనుమతుల కోసం చేసిన ప్రయత్నాలు.. ప్రభుత్వ శాఖలనుంచి పొందిన సర్టిఫికెట్లకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని విద్యాశాఖ అధికారులకు అందించాలని స్పష్టం చేసింది. మొత్తంగా బడులు తెరిచేనాటికి ఆయా పాఠశాలలు వివరణ ఇవ్వాల్సి ఉంది. వివరణ సంతృప్తికరంగా లేకుంటే వెంటనే సదరు పాఠశాలను సీజ్ చేస్తామని ఆ నోటీసులో విద్యాశాఖ స్పష్టం చేసింది. అన్నీ పట్టణ ప్రాంతాల్లోనే.. రాజధాని నగరానికి చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో అటు గ్రామీణ వాతావరణం.. ఇటు పట్టణ ప్రాంతం మిళితమై ఉంది. జిల్లాలో 37 మండలాలకుగాను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 మండలాలు పూర్తిగా.. ఏడు మండలాలు పాక్షికంగా కలిసిపోయాయి. ఈ పరిధిలో ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు పాఠశాలలున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో 2,250 ప్రభుత్వ పాఠశాలలుండగా.. 3,220 ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటిలో ఇప్పటివరకు గుర్తించిన వివరాల ప్రకారం అనుమతి లేని పాఠశాలలు 137. ఇందులో అత్యధికంగా సరూర్‌నగర్ మండలంలో 28 అనుమతిలేని పాఠశాలలున్నాయి. అదేవిధంగా రాజేంద్రనగర్ మండలంలో 19, ఘట్కేసర్, కుత్బుల్లాపూర్ మండలాల్లో 12 చొప్పున ఉన్నాయి. మండల విద్యాశాఖ కార్యాలయాల్లో.. ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దని విద్యాశాఖ ప్రచారం చేస్తోంది. ఈక్రమంలో గుర్తింపులేని పాఠశాలల వివరాలను మండల విద్యాశాఖ కార్యాలయంలో అందుబాటులో పెట్టింది. పాఠశాలలో విద్యార్థులను చేర్పించే ముందు ఆ పాఠశాల నేపథ్యాన్ని తెలుసుకోవాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అందుకు మండల కేంద్రంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. -
12 కళాశాలలకు షోకాజ్ నోటీసులు
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘ప్రయివేటు కళాశాలపై పట్టు లేకపోతే నీవుండి ఏమి లాభం. ఆర్ఐఓ అంటే ప్రయివేటు కళాశాల యాజమాన్యాలకు భయం ఉండాలి. అధికారాలను ఉపయోగించుకోవడం లేదు. కళాశాల యాజమాన్యాలు అధిక ఫీజులతో విద్యార్థులను దోపిడి చేస్తున్నాయి. ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆర్ ఐఓగా ఏమి చేస్తున్నావు’’ అంటూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆర్ఐఓ పరమేశ్వరరెడ్డిపై నిప్పులు చెరిగారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నవనిర్మాణ దీక్ష ర్యాలీ, ప్రతిజ్ఞకు నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులను తీసుకురమ్మంటే ఎందుకు తీసుకురాలేదని ఆర్‌ఐఓను ప్రశ్నించారు. 12 జూనియర్ కళాశాలల నుంచి రాలేదని ఆర్ఐఓ చెప్పడంతో వెంటనే ఆ కళాశాలలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. నీవు ఇచ్చే షోకాజ్ నోటీసులకు వారు భయపడరు... మాకు పంపితే ఇక్కడి నుంచే ఇస్తామన్నారు. ఈ కళాశాలలపై విచారణకు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక టీమ్‌లను వేస్తామని.. ఆ టీమ్‌లు 48 గంటల్లో విచారణ పూర్తి చేసి నివేదికలు ఇస్తాయని, వాటి ఆధారంగా ప్రయివేటు కళాశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రయివేటు కళాశాలలను అదుపులో పెట్టకపోతే సస్పెండ్ చేస్తానన్నారు. ఈ నెల 8న నవనిర్మాణ దీక్షలో భాగంగా నిర్వహించే మహా సంకల్పం కార్యక్రమానికి నగ రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు తరలిరావాలని ఆదేశించారు. కార్యక్రమం సునయన ఆడిటోరియం లేదా కేవీఆర్ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పలు ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. -
మమతకు ఈసీ షోకాజ్ నోటీసులు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిబంధనలు ఉల్లంఘించారం టూ ఈసీ గురువారం షోకాజ్ నోటీసులు జారీచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కోల్‌కతాలో మాట్లాడుతూ... అసన్సోల్ పేరి ట కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామంటూ మమత వాగ్దానంపై షోకాజ్ పంపామన్నారు. దీనిపై మమత స్పందిస్తూ.. ‘నాకేది ఇష్టమో అదే చెప్పా.. మళ్లీ అదే చెప్తా.. నాకు వ్యతిరేకంగా మీరెం చెయగలరో చేయండి’ అని అన్నారు. -
మీ బదిలీ ఎందుకు రద్దు చేయొద్దు
టీచర్లకు షోకాజ్ నోటీసులుఅక్రమ బదిలీల వ్యవహారంలో మరికొందరు ఉపాధ్యాయులపై వేటు పడింది. ఇప్పటికే డీఈఓ, ముగ్గురు డిప్యూటీ డీఈఓలపై వేటు పడిన విషయం విధితమే. బదిలీల వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతుండగానే పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ మరో తొమ్మిది మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని ఆదేశించారు. - 9మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు - వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలి - ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ - అక్రమ బదిలీ వ్యవహారం.. విద్యారణ్యపురి : జిల్లాలోని తొమ్మిది మంది ఉపాధ్యాయులయకు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు షోకాజ్ నోటీస్‌లు జారీ చేశారు. ఈఏడాది జూలైలో చేపట్టిన టీచర్ల బదిలీ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు బదిలీఅయ్యాక వేరేచోటుకు మాడిఫికేషన్ చేయించుకున్నారని, మరికొందరు స్పౌజ్ కేటగిరీలోనూ నిబంధనలు అతిక్రమించారనే తదితర ఆరోపణలు వచ్చిన విషయం విదితమే ఈ వ్యవహారంపై తొలుత విద్యాశాఖ అడిషనల్ జాయింట్ డెరైక్టర్ సత్యనారాయనరెడ్డి విచారణ జరిపారు. ఆరోపణలు వాస్తవమేనంటూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌కు నివేదించారు. తదుపరి పరిణామాల క్రమంలో డీఈవో చంద్రమోహన్ సస్పెండయ్యూరు. డిప్యూటీ డీఈవోలు రవీందర్‌రెడ్డి, అబ్దుల్హైనీని ఆదిలాబాద్, మరో డిప్యూటీ డీఈవో కృష్ణమూర్తిని కరీంనగర్ జిల్లా డైట్ కళాశాలలకు బదిలీ చేశారు. బదిలీ అక్రమాల వ్యవహారంపై ఓవైపు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో 9మంది టీచర్లకు తాజాగా షోకాజ్ నోటీస్‌లు జారీచేశారు. డీఈవో కార్యాలయం నుంచి ఎంఈవోల ద్వారా ఉపాధ్యాయులకు వీటిని అందిస్తున్నారు. ‘షోకాజ్’లు వీరికే.. లింగాలఘనపురం మండలం నవాబ్‌పేట ఎంపీపీఎస్ ఎస్జీటీ ఎ.భీమా, చేర్యాల పెద్దమ్మగడ్డ పీఎస్ ఎస్జీటీ బి.కనకయ్య, దేవరుప్పల మండలంలోని ఎస్జీటీ శ్రీకాంత్, డోర్నకల్ మండలం చిలుకోడు జెడ్పీఎస్ఎస్ టీచర్లు రవీందర్, రజనీ, జనగామాలోని ఎస్జీటీ శిరోమణి, దేవరుప్పల మండలం మారముల్ల పాఠశాల ఎస్జీటీ అరుణకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వీరు తమ మాడిఫికేషన్‌ను ఎందుకు రద్దు చేయరాదో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు జారీ అయ్యూయి. అలాగే కొడకండ్ల మండలం అవుతాపరం ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ నీరజ తొర్రూరు మండలంలో పనిచేస్తున్న తన భర్త మండలానికి లేదా సమీప మండలాలకు స్పౌజ్ కేటగిరీ వినియోగించుకుని విన్నవించాల్సి ఉండగా, సంగెం మండం కాట్రపెల్లికి ఎలా బదిలీ అయ్యారనేది తెలియడంలేదని, ఇది నిబంధనలకు విరుద్ధమని, ఈ బదిలీ ఎందుకు రద్దు చేయరాదో చెప్పాలంటూ నీరజకు నోటీస్ జారీ అయింది. దీంతో ఉపాధ్యాయులు ఇచ్చే వివరణ కీలకంగా మారింది. నోటీసులు అందిన వారంరోజుల్లో సంజారుుషీ ఇవ్వాలని పేర్కొంటూ షోకాజ్ నోటీస్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. వీరితో కొందరు ఇప్పటికే షోకాజ్ నోటీసులు అందుకున్నారు. వీటికి జవాబు ఎలా ఇవ్వాలనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. -
నేనింతే
‘తప్పుచేస్తే దండన ఉంటుందనే భయం ఉండాలి. అందుకే యాక్షన్‌లోకి దిగా. వారం రోజుల వ్యవధిలో ఆరుగురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశా. పనిచేయని అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చా. ఇదంతా మార్పు కోసమే. అధికారుల్లో స్పీడ్ పెరగాలి. నా స్పీడ్ ఇలాగే ఉంటుంది. నగరపాలక సంస్థను గాడిలో పెట్టే వరకు ఇక్కడే ఉంటా..’ అంటూ మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ తన మనో గతాన్ని వెల్లడించారు. నగర పాలనపై పట్టుబిగించిన ఆయన బాధ్యతలు చేపట్టి మంగళవారానికి అర్ధసంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. - విజయవాడ సెంట్రల్ - తప్పుచేస్తే సస్పెండ్ అవుతామనే భయం ఉండాలి - కార్పొరేషన్ గాడిలో పడే వరకూ ఇక్కడే ఉంటా.. - త్వరలో మళ్లీ సమగ్ర సర్వే - ‘సాక్షి’తో మునిసిపల్ కమిషనర్ వీరపాండియన్ - పాలనలో అర్ధ సంవత్సరం పూర్తి సాక్షి : ఇటీవలి కాలంలో స్పీడ్ పెంచినట్టున్నారు. ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? కమిషనర్ : నేనెప్పుడూ ఇంతే. వచ్చిన కొత్తలో పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నా. తప్పులు చేయొద్దని హెచ్చరించా. కొందరు ఉద్యోగుల్లో మార్పు రాలేదు. అందుకే యాక్షన్‌లోకి దిగా. తప్పు చేస్తే సస్పెండ్ అవుతామనే భయం ఉండాలి. అప్పుడే పరిస్థితులు చక్కబడతాయి. సాక్షి : విభాగాధిపతుల నుంచి సహకారం ఎలా ఉంది. మీకు స్పీడ్ ఎక్కువైందన్న కామెంట్స్ వస్తున్నాయి? కమిషనర్ : వాళ్ల సహకారం బాగుంది. కొందరు అధికారులు స్లోగా ఉన్నారు. అలా ఉంటే పాలన సాగదు. స్పీడ్‌గా పనిచేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు. సాక్షి : బదిలీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది? కమిషనర్ : అలాంటి ఆలోచనలేమీ లేదు. నగరపాలక సంస్థను గాడిలో పెట్టే వరకు ఇక్కడే ఉంటా. ఒక్కరోజు సెలవు పెట్టాలన్నా మనసు ఒప్పడం లేదు. ఉన్నతస్థాయి కాన్ఫరెన్స్‌లు అవైడ్ చేస్తున్నా. రోజూ భోజనం చేసే సరికి సాయంత్రం 4 అవుతోంది. దృష్టాంతా పాలనపైనే. సాక్షి : బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) కొంచెం స్లోగా నడుస్తున్నట్టుంది? కమిషనర్ : ఇప్పుడే వేగం పెరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ స్థాయికి చేరుకున్నాం. 529 దరఖాస్తులు అందాయి. మరో 5,400 లెసైన్స్డ్ సర్వేయర్ల దగ్గర ఉన్నాయి. 21,100 దరఖాస్తులు బీపీఎస్ ద్వారా రావాలన్నది లక్ష్యం. తద్వారా వంద కోట్ల ఆదాయం వస్తోంది. సాక్షి : సమగ్ర సర్వే మధ్యేలోనే ఆపేశారే? కమిషనర్ : మళ్లీ ప్రారంభిస్తాం. సర్కిల్-3లో 90 శాతం, సర్కిల్-2లో 20 శాతం పూర్తయింది. రూ.8కోట్ల ఆదాయం పెరిగింది. ఇతరత్రా పనిఒత్తిళ్లు పెరగడంతో సర్వేకు బ్రేక్ ఇచ్చాం. త్వరలోనే తిరిగి మొదలుపెడతాం. సాక్షి : మొండి బకాయిల వసూళ్ల వ్యవహారం ఎంతవరకు వచ్చింది? కమిషనర్ : చర్చలు సాగిస్తున్నాం. 90 శాతం మేర బకాయిలు చెల్లిస్తే పదిశాతం రాయితీ ఇస్తామంటున్నాం. ఐవీ ప్యాలెస్ చర్చలు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వస్త్రలత బకాయిలు రూ.11 కోట్లు ఉండగా, రూ.4 కోట్లు మాత్రమే చెల్లిస్తామంటున్నారు. వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం కుదరదు. కాబట్టి ఆ ప్రతిపాదనను తిరస్కరించం. సాక్షి : కీలక విభాగాలకు సంబంధించి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కమిషనర్ : యూసీడీ పీవో, ఎస్టేట్స్, ప్రాజెక్ట్స్, రెవెన్యూ వంటి 12 పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇటీవలే లేఖ రాశా. డెప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు కనీసం ముగ్గురు కావాల్సి ఉందని అందులో పేర్కొన్నా. ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. సాక్షి : గుణదల ప్లాట్ల వ్యవహారం ఎంతవరకు వచ్చింది? కమిషనర్ : ఉద్యోగులకే కేటాయిస్తాం. అయితే, ఉన్న ప్లాట్ల కంటే పదింతల దరఖాస్తులు వచ్చాయి. ఎలాంటి వివాదం తలెత్తకుండా ప్లాట్లు విక్రయించాలి. ఆ బాధ్యతను చీఫ్ ఇంజినీర్‌కు అప్పగించా. సాక్షి : భవిష్యత్ ప్రణాళికలు కమిషనర్ : ప్రతి సర్కిల్‌కు రెండు చొప్పున హ్యాపీ స్ట్రీట్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాం. సర్కిల్-3లో గురునానక్ రోడ్డులో శ్రీకారం చుట్టాం. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై సర్వే చేస్తున్నాం. నగరంలో ఎల్ఈడీ బల్బుల్ని ఏర్పాటు చేస్తున్నాం. మరో నెలన్నరలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. -
దోపిడీ అరికట్టండి
స్కూళ్లకు షోకాజ్ నోటీసులివ్వండి ప్రాథమిక విద్యా శాఖకు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశం ‘సాక్షి’ కథ నంతో సుమోటోగా కేసు సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న వైనంపై ‘ఫీ ‘జులుం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనం చదివి, చలించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్.. ప్రైవేటు స్కూళ్ల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాక సుమోటోగా కేసు స్వీకరించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ప్రాథమిక విద్యాశాఖ డెరైక్టర్‌కు సూచించింది. అధిక ఫీజుల వసూళ్లను కట్టడి చేయాలని... ఈమేరకు తెలంగాణ జిల్లాల్లోని డీఈఓలను ఆదేశించాలని స్పష్టం చేసింది. కథనం ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణలో చేపట్టి... విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలంది. లేకుంటే నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు చదువు భారమవుతుందని.. ఆ పరిస్థితి రానివ్వద్దని సూచించింది. న్యాయవాదిని నియమించండి మరో పక్క హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) కూడా అధిక ఫీజులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే రీతిలో ఫీజులు ఉంటే భవిష్యత్‌లో చదువంటేనే భయపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘విద్యా హక్కు చట్టం, విద్యాశాఖ నిబంధనలను గాలికి వదిలి కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు అధిక మొత్తంలో ఫీజులు తీసుకుంటున్నాయి. స్కూళ్ల అభివృద్ధి జరగాలి. కానీ ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకూడదు. హైకోర్టు కూడా ఈ విషయంలో స్పష్టంగా తీర్పు చెప్పింది. అన్ని ధరలు పెరిగాయన్న సాకుతో ఏకబిగిన ఫీజులు వసూలు చేయకూడదు. ఏటా స్వలంగా పెంచుకోవాలే తప్ప ఒకేసారి తల్లిదండ్రులపై భారాన్ని మోపకూడదు. ఫీజుల రూపంలో దోపిడీ తీరును గతంలో ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాం. అయినా స్పందన రాలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా వినతిపత్రం అందజేశాం. ఫీజుల దోపిడీ అడ్డుకుంటామని ప్రభుత్వం సూత్రప్రాయంగా చెప్పింది. జీఓ 42పై ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. దీనిపై వాదించడానికి ప్రభుత్వం తరఫున లాయర్‌ను నియమించాల్సిన అవసరం ఉంది’ అని హెచ్ఎస్పీఏ జనరల్ సెక్రటరీ రవికుమార్ కోరారు. -
మావోయిస్టు ప్రాంతాల్లో పీఓ సుడిగాలి పర్యటన
మారుమూల రోడ్లు పరిశీలన ఇద్దరు వార్డెన్లకు షోకాజ్ నోటీసులు గోమంగి వైద్యసిబ్బందిపై చర్యలకు ఆదేశాలు పాడేరు: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ ఈ ఏడాది ఆఖరి రోజున సాహసోపేత పర్యటన చేపట్టారు. మావోయిస్టులు సంచరించే ప్రాంతంలో పర్యటనలు మానుకోవాలని ఓవైపు పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో బుధవారం ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ జి.మాడుగుల, పెదబయలు మండలాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మారుమూల గ్రామాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోవడంతో పాటు గిరిజన విద్యాలయాల్లో విద్యాభివృద్ధి, ఆస్పత్రుల్లో వైద్య సేవలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. ముందుగా జి.మాడుగుల మండలంలోని నుర్మతి బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ అన్ని రికార్డులను పరిశీలించారు. 317 మంది విద్యార్థినులకు గాను 164 మంది మాత్రమే హాజరుకావడంపై పీవో అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉదయం 10 గంటల వరకు విద్యార్థుల హాజ రు నమోదు చేయకపోవడంపై హెచ్ఎం విధులను తప్పుపట్టారు. వసతిగృహంలోని రికార్డుల్లో చూపిన సంఖ్య కంటే తక్కువ మంది పిల్లలు ఉండటంతోపాటు ఈ నెల 24 నుంచి మెనూలో చూపినట్లు గుడ్లు ఆహారంలో ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసి డిప్యుటీ వార్డెన్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. విద్యార్థులకు మరుగుదొడ్లు, విద్యుత్, నీటి సరఫరా సమస్యలపై దృష్టి సారించాలని హెచ్ఎంను ఆదేశించారు. అనంతరం మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతంగా గుర్తింపు పొందిన మద్దిగరువు నుంచి గోమంగి రోడ్డులో పీవో ప్రయాణించారు. దారి వెంబడి గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు. మావోయిస్టుల హెచ్చరికలతో నిలిచిపోయిన రోడ్ల పరిస్థితిపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. గోమంగి ఆరోగ్య కేంద్రం సందర్శనకు వెళ్లినపుడు మూతపడి ఉండటంపై పీవో మండిపడ్డారు. గిరిజనులకు వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహించడాన్ని తప్పుపడుతూ వైద్యురాలు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏడీఎంహెచ్‌ఓను ఆదేశించారు. గోమంగి మినీ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ అదనపు తరగతుల నిర్మాణం, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బొండాపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి హాజరుపట్టికలో చూపిన సంఖ్య కంటే తక్కువగా విద్యార్థులు ఉండటాన్ని గ్రహించారు. వసతిగృహంలోని స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీలు అప్ టు డేట్‌గా లేకపోవడంతో వార్డెన్‌కు షోకాజ్ నోటీసు జారీచేశారు. ఇక్కడ అదనపు తరగతుల భవన నిర్మాణాలు, ఇతర సౌకర్యాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మద్దిగరువు, బంగారుమెట్ట రోడ్డులో చేపట్టిన హైలెవెల్‌వంతెన, అనేక రోడ్ల పనులను పరిశీలించి ప్రగతిని తెలుసుకున్నారు. ఈ పర్యటనలో గిరిజన సంక్షేమ ఈఈ ఎంఆర్జీ నాయుడు, పెదబయలు, జి.మాడుగుల డీఈఈలు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం అమలుపై అధికారుల ఆగ్రహం
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును ‘సాక్షి’ మంగళవారం పరిశీలించింది. భోజన పథకంలో అనేక లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. దీనిపై ‘ఇదే మెనూ..చచ్చినట్టు తినూ..’ అనే శీర్షికతో ప్రచురితమైన వార్త కథనానికి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం కదిలివచ్చింది. బుధవారం పలు పాఠశాలల్లో డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి సహా పలువురు డిప్యూటీ డీఈవోలు, మండల విద్యాశాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. పలువురు హెచ్ఎంలు, వంట ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలుత డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, ఖమ్మం అర్బన్ ఎంఈవో శ్రీనివాస్‌తో కలిసి నగరంలోని నయాబజార్, రిక్కాబజార్ పాఠశాలల్లో పథకం అమలు తీరును పరిశీలించారు. అన్నం, కూరలను చూసి అవాక్కయ్యారు. నీళ్లచారు, ముద్ద అన్నం పెడుతున్నారని విద్యార్థుల ద్వారా తెలుసుకుని వంట ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు ఆయా పాఠశాలల్లో పరిశీలన జరపాల్సిందిగా డీఈఓ ఉన్నపళంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే విస్తృత తనిఖీలు మొదలయ్యాయి. భోజన పథకం అమలుతీరు, రుచి, శుచిశుభ్రత, తాగునీటి వసతులు ఇలా అన్ని అంశాలను పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న సత్తుపల్లి పాఠశాలను మధిర డిప్యూటీ డీఈవో రాములు పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయునికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. బయ్యారంలో బయటి ప్రాంతాల నుంచి అన్నం వండుకు తెస్తున్న ఏజెన్సీలపై స్థానిక ఎంఈవో మండిపడ్డారు. జిల్లాలో నిరుపయోగంగా ఉన్న వంటగదుల వివరాలనూ తెలపాలని డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు. కోట్లాది రూపాయల వ్యయంతో అమలు చేస్తున్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎదిగే దశలో ఉన్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనేదే భోజన పథకం ముఖ్యోద్దేశమని అటువంటప్పుడు నీళ్లచారు, ముద్ద అన్నంపెడితే ఉపయోగమేంటని ప్రశ్నించారు. మెనూ ప్రకారం కాకుండా ఇతర వంటకాలు, నాసిరకం ఆహారం అందిస్తే సహించేది లేదన్నారు. మధ్యాహ్నభోజనం బిల్లులు, వంట నిర్వాహకులకు నెలనెలా వేత నాలు అందుతున్నాయన్నారు. 9,10 తరగతులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయం వాస్తవమేనన్నారు. దీన్ని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో ఈ పెండింగ్ బిల్లులు కూడా మంజూరు చేసేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ఖమ్మంలో భోజన ఏజెన్సీల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మెనూ సక్రమంగా అమలు చేయని ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో పెట్టి తొలగిస్తామన్నారు. హెచ్ఎంలు ప్రతిరోజూ అన్నం, కూరలను పరిశీలించాలన్నారు. ఎస్ఎంఎస్ చైర్మన్లూ పరిశీలించాలని కోరారు. అవసరమైన సలహాలు, సూచనలు చేయాల్సిందిగా కోరారు. భోజన పథకం అమలుతీరు, తాగునీరు, వంటగదుల కొరత తదితర అంశాలపై పరిశీలన జరిపి పూర్తిస్థాయిలో రిపోర్టు తయారు చేసి కలెక్టర్‌కు సమర్పిస్తామని డీఈవో చెప్పారు. -
ఉపాధి పనులకు రూ. 430 కోట్లు
జిల్లాలో 29 వేల కుటుంబాలకు 100రోజుల పని 20 నర్సరీల్లో టేకు దుంపల పెంపకం 220 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు డ్వామా పీడీ శ్రీరాములనాయుడు బుచ్చన్నపాలెం(మాకవరపాలెం) : ఈ ఏడాది ఉపాధి పథకంలో వివిధ పనులు చేపట్టేందుకు రూ. 430 కోట్లు కేటాయించామని డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ శ్రీరాములనాయుడు తెలిపారు. వీటిలో ఇప్పటివరకు రూ.198 కోట్లు ఖర్చు చేశామన్నారు. మండలంలోని పాపాయ్యపాలెం పంచాయతీ శివారు బుచ్చన్నపాలెంలో ఏర్పాటు చేసిన టేకు నర్సరీని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ నర్సరీలో టేకు దుంపల పెంపకానికి వేసిన బెడ్లను పరిశీలించారు. పెంపకానికి సంబంధించి ఎన్ని పని దినాలు కేటాయించారు, ఎంతమంది కూలీలు పనులు చేస్తున్నారనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు వేతనాలు పంపిణీ చేయాలని, మస్తర్లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. 220 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు జిల్లాలో 1010 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండగా 220 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. వీరంతా లక్షా యలు చేరుకోకపోవడం, సోషల్ ఆడిట్లో రికవరీల జాబితాలో ఉండడంతో వీరిని తొలగించాల్సిందిగా ఆదేశాలు అందాయన్నారు. వారు ఇచ్చే వివరణలను పరిశీలించి తొలగిస్తామన్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 29 వేల కుటుంబాల వారికి వందరోజులు పని కల్పించామన్నారు. ఈ విషయంలో రాష్ట్రంలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. మరో 60 వేల కుటుం బాల వారు 75 రోజులు పని పూర్తి చేసుకున్నారన్నారు. జిల్లాలో 20 టేకు నర్సరీలు రైతులకు మొక్కలు పంపిణీ చేసేందుకు జిల్లాలో 20 టేకు నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో రెండువేల బెడ్లను తయారు చేసి 15 లక్షల టేకు దుంపలను పెంచుతున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 10లక్షల టేకు మొక్కలు పంపిణీ చేశామన్నారు. ఇంకా ఐదు లక్షల మొక్కలు అవసరం కాగా అటవీశాఖ వద్ద నాలుగు లక్షలు, విశాఖలో ఒక లక్ష టేకు మొక్కలను కొనుగోలు చేస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం నీరు నిల్వ ఉండే పనులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. చెక్‌డ్యాంలు, చెరువుల్లో సాగునీటి మదుములకు ఉపాధి హామీలో మరమ్మతులు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఇలాంటివి 520 వరకు పనులు గుర్తించామన్నారు. అక్టోబర్ వరకు ఈ పనులు చేపడతామన్నారు. ఇక నుంచి ప్రతి పనికి సంబంధించిన ఫొటో, నిధుల వ్యయం వివరాలను గూగుల్ మ్యాప్‌లో అప్లోడ్ చేస్తున్నామని, ఎవరైనా ఈ పనులను ఆన్లైన్లో చూసుకోవచ్చన్నారు. అదనపు పీడీ ఆనందరావు, ఏపీడీ శ్రీనివాస్‌కుమార్, ఏపీవో చిన్నారావు, బూరుగుపాలెం సర్పంచ్ రుత్తల సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. రూ. 200కోట్లతో నీటి నిల్వ పనులు నర్సీపట్నం రూరల్ : రూ. 200 కోట్లతో నీటి నిల్వ పను లు చేపట్టనున్నట్టు ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డెరైక్టర్ శ్రీరాములనాయుడు పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో క్లస్టర్ అధికారులు, సిబ్బంది, వన సేవకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది అటవీ ప్రాంతం దిగువన కందకాల ఏర్పాటు, నీటి నిల్వకుంటల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. 1995 తరువాత నిర్మాణం చేసిన చెక్‌డ్యాంలు, నీటి నిల్వ కుంటల పరిస్థితిని అంచనా వేయిస్తున్నట్టు చెప్పారు. వీటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడుతున్నట్టు వివరించారు. ఈ ఏడాది 3,800 ఎకరాల్లో ఉద్యాన పంటలను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ఏపీడీలు ఆనందరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.