ఆరు టెల్కోలకు షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) ఆరు టెలికం కంపెనీలకు డిమాండ్ కమ్ షోకాజ్ నోటీసులు జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఆరు టెల్కోలు 2006–07 నుంచి 2009–10 మధ్యకాలంలో వాటి ఆదాయాలను తక్కువ చేసి చూపాయన్న కాగ్ నివేదిక ఆధారంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. నోటీసులు పొందిన సంస్థల్లో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్ వంటి టెల్కోలున్నాయి. ‘కాగ్ నివేదిక ఆధారంగా డాట్ ఆరు ప్రైవేట్ టెలికం సంస్థలకు డిమాండ్ కమ్ షోకాజ్ నోటీసులు పంపింది.
నాలుగు ఆర్థిక సంవత్సరాలకు (2006–07 నుంచి 2009–10 వరకు) సంబంధించి రూ.29,474 కోట్ల మొత్తానికి గానూ నోటీసుల జారీ జరిగింది’ అని టెలికం మంత్రి మనోజ్ సిన్హా బుధవారం లోక్‌సభకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఈ మొత్తంలో లైసెన్స్ ఫీజు రూ.6,490 కోట్లుగా, వడ్డీ రూ.13,751 కోట్లుగా, పెనాల్టీ రూ.3,178 కోట్లుగా, పెనాల్టీ మీది వడ్డీ రూ.6,055 కోట్లుగా ఉందని వివరించారు. రూ.29,474 కోట్ల మొత్తంలో భారతీ ఎయిర్‌టెల్ వాటా రూ.8,162 కోట్లుగా, రిలయన్స్ గ్రూప్ వాటా రూ.7,701 కోట్లుగా, టాటా టెలిసర్వీసెస్ వాటా రూ.5,718 కోట్లుగా, వొడాఫోన్ వాటా రూ.4,695 కోట్లుగా, ఐడియా వాటా రూ.2,708 కోట్లుగా, ఎయిర్‌సెల్ వాటా రూ.490 కోట్లుగా ఉందని పేర్కొన్నారు.