కర్నూలు(అగ్రికల్చర్): ‘‘ప్రయివేటు కళాశాలపై పట్టు లేకపోతే నీవుండి ఏమి లాభం. ఆర్‌ఐఓ అంటే ప్రయివేటు కళాశాల యాజమాన్యాలకు భయం ఉండాలి. అధికారాలను ఉపయోగించుకోవడం లేదు. కళాశాల యాజమాన్యాలు అధిక ఫీజులతో విద్యార్థులను దోపిడి చేస్తున్నాయి. ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆర్ ఐఓగా ఏమి చేస్తున్నావు’’ అంటూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆర్‌ఐఓ పరమేశ్వరరెడ్డిపై నిప్పులు చెరిగారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నవనిర్మాణ దీక్ష ర్యాలీ, ప్రతిజ్ఞకు నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులను తీసుకురమ్మంటే ఎందుకు తీసుకురాలేదని ఆర్‌ఐఓను ప్రశ్నించారు.
12 జూనియర్ కళాశాలల నుంచి రాలేదని ఆర్‌ఐఓ చెప్పడంతో వెంటనే ఆ కళాశాలలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. నీవు ఇచ్చే షోకాజ్ నోటీసులకు వారు భయపడరు... మాకు పంపితే ఇక్కడి నుంచే ఇస్తామన్నారు. ఈ కళాశాలలపై విచారణకు రెవెన్యూ అధికారులతో ప్రత్యేక టీమ్‌లను వేస్తామని.. ఆ టీమ్‌లు 48 గంటల్లో విచారణ పూర్తి చేసి నివేదికలు ఇస్తాయని, వాటి ఆధారంగా ప్రయివేటు కళాశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ప్రయివేటు కళాశాలలను అదుపులో పెట్టకపోతే సస్పెండ్ చేస్తానన్నారు. ఈ నెల 8న నవనిర్మాణ దీక్షలో భాగంగా నిర్వహించే మహా సంకల్పం కార్యక్రమానికి నగ రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు తరలిరావాలని ఆదేశించారు. కార్యక్రమం సునయన ఆడిటోరియం లేదా కేవీఆర్ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పలు ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.
12 కళాశాలలకు షోకాజ్ నోటీసులు
Published Tue, Jun 7 2016 9:23 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM
Advertisement