ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును ‘సాక్షి’ మంగళవారం పరిశీలించింది. భోజన పథకంలో అనేక లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. దీనిపై ‘ఇదే మెనూ..చచ్చినట్టు తినూ..’ అనే శీర్షికతో ప్రచురితమైన వార్త కథనానికి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం కదిలివచ్చింది. బుధవారం పలు పాఠశాలల్లో డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి సహా పలువురు డిప్యూటీ డీఈవోలు, మండల విద్యాశాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. పలువురు హెచ్‌ఎంలు, వంట ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తొలుత డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, ఖమ్మం అర్బన్ ఎంఈవో శ్రీనివాస్‌తో కలిసి నగరంలోని నయాబజార్, రిక్కాబజార్ పాఠశాలల్లో పథకం అమలు తీరును పరిశీలించారు. అన్నం, కూరలను చూసి అవాక్కయ్యారు. నీళ్లచారు, ముద్ద అన్నం పెడుతున్నారని విద్యార్థుల ద్వారా తెలుసుకుని వంట ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు ఆయా పాఠశాలల్లో పరిశీలన జరపాల్సిందిగా డీఈఓ ఉన్నపళంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే విస్తృత తనిఖీలు మొదలయ్యాయి.
భోజన పథకం అమలుతీరు, రుచి, శుచిశుభ్రత, తాగునీటి వసతులు ఇలా అన్ని అంశాలను పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న సత్తుపల్లి పాఠశాలను మధిర డిప్యూటీ డీఈవో రాములు పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయునికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు.
బయ్యారంలో బయటి ప్రాంతాల నుంచి అన్నం వండుకు తెస్తున్న ఏజెన్సీలపై స్థానిక ఎంఈవో మండిపడ్డారు.
జిల్లాలో నిరుపయోగంగా ఉన్న వంటగదుల వివరాలనూ తెలపాలని డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు. కోట్లాది రూపాయల వ్యయంతో అమలు చేస్తున్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎదిగే దశలో ఉన్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనేదే భోజన పథకం ముఖ్యోద్దేశమని అటువంటప్పుడు నీళ్లచారు, ముద్ద అన్నంపెడితే ఉపయోగమేంటని ప్రశ్నించారు.
మెనూ ప్రకారం కాకుండా ఇతర వంటకాలు, నాసిరకం ఆహారం అందిస్తే సహించేది లేదన్నారు. మధ్యాహ్నభోజనం బిల్లులు, వంట నిర్వాహకులకు నెలనెలా వేత నాలు అందుతున్నాయన్నారు. 9,10 తరగతులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయం వాస్తవమేనన్నారు. దీన్ని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో ఈ పెండింగ్ బిల్లులు కూడా మంజూరు చేసేలా ప్రయత్నిస్తామని తెలిపారు.
ఖమ్మంలో భోజన ఏజెన్సీల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మెనూ సక్రమంగా అమలు చేయని ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో పెట్టి తొలగిస్తామన్నారు. హెచ్‌ఎంలు ప్రతిరోజూ అన్నం, కూరలను పరిశీలించాలన్నారు. ఎస్‌ఎంఎస్ చైర్మన్‌లూ పరిశీలించాలని కోరారు. అవసరమైన సలహాలు, సూచనలు చేయాల్సిందిగా కోరారు. భోజన పథకం అమలుతీరు, తాగునీరు, వంటగదుల కొరత తదితర అంశాలపై పరిశీలన జరిపి పూర్తిస్థాయిలో రిపోర్టు తయారు చేసి కలెక్టర్‌కు సమర్పిస్తామని డీఈవో చెప్పారు.
మధ్యాహ్న భోజనం అమలుపై అధికారుల ఆగ్రహం
Published Thu, Nov 27 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM
Advertisement