అర్ధాకలే | Implementation of the mid-day meal scheme, but the menu | Sakshi
Sakshi News home page

అర్ధాకలే

Published Tue, Nov 25 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

అర్ధాకలే

అర్ధాకలే

చప్పిడి చారు.. పలచని పప్పు.. సుద్ద అన్నం.. వెరసి పొగచూరిన వంటలు.. వారానికి రెండు రోజులు ఇవ్వాల్సిన గుడ్డు ఒక్కరోజుకే పరిమితం.. ఇదీ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు. మరోపక్క ఏజెన్సీ నిర్వాహకులకు రెండు నెలలుగా బిల్లులు చెల్లించని వైనం. దీంతో వారు అప్పులు చేసి మరీ మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న పరిస్థితి. మెనూ మమ అనిపిస్తుండటంతో చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్న దుస్థితి. సోమవారం జిల్లాలోని పాఠశాలల్లో నిర్వహించిన ‘సాక్షి విజిట్’లో వెలుగుచూసిన వాస్తవాలివి.
 
మధ్యాహ్న భోజన పథకంలో అమలు కాని మెనూ
బిల్లులు విడుదల కాక

కింగ్ ఏజెన్సీల అవస్థలు
అప్పుల ఊబిలో నిర్వాహకులు

5 నెలలుగా గౌరవవేతనం లేదు
నిధులు విడుదలైనా మంజూరు చేయని ఎంఈవోలు

‘సాక్షి విజిట్’లో వెలుగుచూసిన వాస్తవాలు
మచిలీపట్నం : జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ అధ్వానంగా మారింది. మెనూ అమలు కాక.. కూరల్లో నాణ్యత లేక అర్ధాకలితో విద్యార్థులు అలమటిస్తున్నారు. కుకింగ్ ఏజెన్సీల నిర్వాహకులకు బిల్లులు సకాలంలో రాక అప్పులు చేసి మరీ పథకాన్ని కొనసాగిస్తున్నారు. సోమ, గురువారాల్లో విద్యార్థులకు కోడిగుడ్డు అందించాల్సి ఉండగా ఒక్కరోజుకే పరిమితం చేస్తున్నారు. గుడ్డు ధర మార్కెట్‌లో రూ.4.25కు పెరగడంతో విద్యార్థులకు ఇచ్చే మెనూ చార్జీలు గుడ్డుకే సరిపెట్టాల్సిన దుస్థితి నెలకొంది.

జిల్లాలో 3,340 పాఠశాలలు ఉండగా 2,56,584 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ కుకింగ్ ఏజెన్సీల ఆధ్వర్యంలో పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏజెన్సీల నిర్వాహకులకు గత రెండు నెలలుగా బిల్లులు చెల్లించలేదు. దీంతో ఉన్నత పాఠశాలల్లో అధికంగా విద్యార్థులు ఉంటే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు అప్పు చేసి విద్యార్థులకు వండి పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. అప్పులు ఇచ్చిన కిరాణా షాపు యజమానుల నుంచి వేధింపులు అధికం కావడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వారికి చెల్లిస్తూ పథకాన్ని కొనసాగిస్తున్నారు.
 
35 పైసలు పెంచారు...
ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండా ఈ ఏడాది జూన్ నుంచి కుకింగ్ ఏజెన్సీలకు ఇచ్చే కమీషన్‌ను నామమాత్రంగా పెంచింది. గతంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4 చెల్లించేవారు. దానిని రూ.4.35కు, ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు చెల్లించే రూ.6ను రూ.6.35కు పెంచారు. ప్రస్తుత మార్కెట్‌లో పెరిగిన కూరగాయలు, నిత్యావసరాల ధరలకు, పెంచిన చార్జీలకు పొంతన లేకపోవడం గమనార్హం. ఈ ఖర్చులోనే వారానికి రెండుసార్లు గుడ్డు, వంటకు ఉపయోగించే కట్టెలు సమకూర్చాల్సి ఉంది. దీంతో కుకింగ్ ఏజెన్సీల నిర్వాహకులు అత్తెసరు మెనూ అమలు చేస్తూ మమ అనిపిస్తున్నారు.

సోమవారం పలు ఏజెన్సీలు సాంబారు, ఉడకబెట్టిన గుడ్డు మాత్రమే వడ్డించాయి. సాంబారులో వివిధ రకాల కూరగాయలు, కందిపప్పు వేయాల్సి ఉండగా నాలుగు బెండకాయ ముక్కలు వేసి సరిపెట్టారు. అదేమని ప్రశ్నిస్తే ఈరోజు కోడి గుడ్డు ధర రూ.4.25లు ఉందని, ప్రభుత్వం విద్యార్థికి వంట చేసిపెట్టినందుకు ఇచ్చేది రూ.4.35 అని, కోడిగుడ్డు కొనుగోలుకు ఈ నగదు ఖర్చయితే పది పైసలు మిగులుతోందని దీంతో నూనె, కందిపప్పు, కూరగాయలు ఎలా కొనుగోలు చేయాలని ఏజెన్సీ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.
 
ఐదు నెలలుగా గౌరవవేతనం లేదు...
ప్రభుత్వ పాఠశాలలో వంట ఏజెన్సీల నిర్వాహకురాలికి సహాయకులుగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి ఒకరు లేక ఇద్దరు పనిచేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి గౌరవవేతనంగా నెలకు రూ.1000 చెల్లించాల్సి ఉంది. ఐదు నెలలుగా గౌరవవేతనం చెల్లించటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఉన్నత పాఠశాలల్లో 100 నుంచి 1600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. 140 మంది విద్యార్థులు చదివే ఉన్నత పాఠశాలలో కుకింగ్ ఏజెన్సీకి నెలకు కనీసంగా రూ.25 వేలు బిల్లుగా వస్తోంది.

గత రెండు నెలలుగా ఈ బిల్లులు ఇవ్వకపోవటంతో బందరు మండలంలోని చిట్టిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకురాలు రూ.50 వేలు అప్పు చేసి వంట చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మూడో నెల పూర్తయ్యే దశలో ఉంది. ఈ మూడు నెలలు కలుపుకుంటే రూ.70 వేల వరకు బిల్లులు రావాల్సి ఉంది. సరకులు, కూరగాయలు తీసుకున్న షాపు యజమానులు అప్పు తీర్చమని ఒత్తిడి తెస్తున్నారని నిర్వాహకురాలు వాపోయింది.
 
అప్పుల పాలవుతున్నాం...
గన్నవరంలోని ఓ ఉన్నత పాఠశాలలో నెలకు రూ.70 వేల వరకు బిల్లు రావాల్సి ఉంది. రెండు నెలలుగా బిల్లులు అందకపోవటంతో రూ.1.50 లక్షల వరకు ఏజెన్సీ నిర్వాహకురాలు అప్పుల పాలైంది. ఈ బిల్లులు ఎప్పటికి వస్తాయో, ఎప్పటికి అప్పులు తీర్చాలోనని ఏజెన్సీ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమైన అనంతరం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఏప్రిల్, జూన్ నెలలకు సంబంధించి మొదటి క్వార్టర్‌గా రూ.3.69 కోట్లు, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.10.41 కోట్ల నగదును ఆయా మండలాలకు సంబంధించి ఎంఈవోల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

9, 10 తరగతులకు సంబంధించి మధ్యాహ్న భోజన బిల్లులను మొదటి క్వార్టర్‌గా రూ.51.39 లక్షలు, 2వ క్వార్టర్‌గా రూ.67.18 లక్షలు, 3వ క్వార్టర్‌గా రూ.94.62 లక్షలు ఎంఈవోల ఖాతాల్లో జమ చేసినట్లు వారు తెలిపారు. సకాలంలో బిల్లులు రాకపోవటంతో ఇంట్లోని బంగారు వస్తువులు తాకట్టు పెట్టి కుకింగ్ ఏజెన్సీలు నడుపుతున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
కట్టెల పొయ్యి పైనే వంట...
జిల్లాలోని 90 శాతం పాఠశాలల్లో కట్టెల పొయ్యి పైనే వంట చేస్తున్నారు. రెండేళ్ల క్రితం పాఠశాలలకు గ్యాస్ పొయ్యిలు అందజేసినా, గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు. దీంతో గ్యాస్ పొయ్యిలు మూలనపడి పాడైపోయే స్థితికి చేరుకున్నాయి. పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే సంబంధిత పాఠశాల హెచ్‌ఎం లేదా కుకింగ్ ఏజెన్సీ పేరున తీసుకోవాల్సి ఉంది. పాఠశాల హెచ్‌ఎం బదిలీపై వెళ్లినా, కుకింగ్ ఏజెన్సీని రద్దు చేసి వేరొకరికి అప్పగించినా గ్యాస్ కనెక్షన్ ద్వారా సిలిండర్ తీసుకోవటం ఇబ్బందికరంగా మారుతుందనే కారణంతో ఈ ప్రయత్నాన్ని విరమించారు.

కొన్ని పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చినా నెలకు ఒక సిలిండర్ మాత్రమే వాడాలనే నిబంధన విధించటంతో ఒక సిలిండర్ ఎటూ చాలక కట్టెల పొయ్యి పైనే ఆధార పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం వచ్చే బియ్యం నాణ్యత తక్కువగా ఉండటంతో ఏ మాత్రం అజాగ్రత్తగా వండినా అన్నం సుద్దగా మారుతోందని, ఇలా అయితే విద్యార్థులు భోజనం చేయని పరిస్థితి నెలకొంటోందని ఉపాధ్యాయులతో పాటు కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement