Cooking agency
-
మోడల్ పాఠశాలలో హైడ్రామా
పెద్దదోర్నాల: విధుల నుంచి తప్పించడంతో పాటు కొత్త వారిని విధుల్లోకి తీసుకోవడంతో తీవ్రం మనస్తాపం చెందిన కాంట్రాక్ట్ కుకింగ్ సిబ్బంది ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘటన వై.చెర్లోపల్లి మోడల్ పాఠశాలలో సోమవారం జరిగింది. ఈ సంఘటనతో మండల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫినాయిల్ తాగినట్లుగా అనుమానిస్తున్న కుకింగ్ సిబ్బందిని మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ హనుమంతురావు, ఎస్ఐ అబ్దుల్ రహిమాన్ వైధ్యశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో ఫినాయిల్ తాగినట్లుగా భావిస్తున్న రాజేశ్వరి, విశ్రాంతమ్మ, మల్లేశ్వరి, శ్రీలక్ష్మిలకు వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి చికిత్స చేశారు. ప్రిన్సిపాల్ నయోమి ఫి«ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అబ్దుల్ రహిమాన్ తెలిపారు. -
ఆరుబయట వంట..వానొస్తే తంటా!
ప్రకాశం, తర్లుపాడు: కుకింగ్ ఏజెన్సీల బాధలు వర్ణనాతీతం. ఒక వైపు ఉద్యోగ భద్రత లేక మరో వైపు వేతనాలు, బిల్లులు సకాలంలో అందక, అధికారుల ఆకస్మిక తనిఖీలతో కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. డ్రాపౌట్స్‌ను నివారించడంతో పాటు విద్యార్థుల్లో పౌష్టికాహారం లోపాన్ని నివారించేందుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. మధ్యాహ్న భోజన పథకం సమస్యల నిలయంగా మారింది. కుకింగ్ ఏజెన్సీలకు ప్రభుత్వం సరైన వసతులు కల్పించకపోవడంతో నిర్వాహకులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్లుగా సరైన వర్షపాతం లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఒట్టిపోయాయి. పాఠశాలల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. కుకింగ్ ఏజెన్సీలు వంటకు అవసరమైన నీటిని పాఠశాల సమీపంలో ఉన్న బోర్ల నుంచి తీసుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాఠశాలల్లో వంట గదులు లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో వంట గదులు లేకపోవడంతో ఆరుబయట వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వానోచ్చినా, గాలి వచ్చినా విద్యార్థులకు పస్తులు తప్పడం లేదు. గాలి వస్తే నిప్పురవ్వలు సమీపంలోని ఇళ్లు, గడ్డివామిలపై పడతాయనే భయంతో వంట నిలిపేయాల్సి వస్తుంది. వర్షం వస్తే తడిసి వంట చేసే పరిస్థితి లేదు. రోజు రోజుకూ పెరిగిపోతున్న గ్యాస్ ధరలతో గ్యాస్ వినియోగించి వంట చేస్తే నష్టాలు తప్పవని ఏజెన్సీల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక చివరకు కట్టెలపొయ్యితోనే వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల్లో ఆందోళన పాఠశాలల్లో రేషన్ బియ్యంతో అన్నం వండుతున్నందున అనారోగ్యపాలవుతున్నామంటూ పలువురు విద్యార్థులు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా పాఠశాలల్లో వంటగదులు లేవు. చేసేది లేక నిర్వాహకులు ఆరుబయటే అభద్రత భావంతో వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు, ప్రజాప్రతినిధులు పాఠశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలల్లో వంటగదులు నిర్మించాలని ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు. -
మధ్యాహ్న భోజనం అమలుపై అధికారుల ఆగ్రహం
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును ‘సాక్షి’ మంగళవారం పరిశీలించింది. భోజన పథకంలో అనేక లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. దీనిపై ‘ఇదే మెనూ..చచ్చినట్టు తినూ..’ అనే శీర్షికతో ప్రచురితమైన వార్త కథనానికి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం కదిలివచ్చింది. బుధవారం పలు పాఠశాలల్లో డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి సహా పలువురు డిప్యూటీ డీఈవోలు, మండల విద్యాశాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. పలువురు హెచ్ఎంలు, వంట ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలుత డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, ఖమ్మం అర్బన్ ఎంఈవో శ్రీనివాస్‌తో కలిసి నగరంలోని నయాబజార్, రిక్కాబజార్ పాఠశాలల్లో పథకం అమలు తీరును పరిశీలించారు. అన్నం, కూరలను చూసి అవాక్కయ్యారు. నీళ్లచారు, ముద్ద అన్నం పెడుతున్నారని విద్యార్థుల ద్వారా తెలుసుకుని వంట ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు ఆయా పాఠశాలల్లో పరిశీలన జరపాల్సిందిగా డీఈఓ ఉన్నపళంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే విస్తృత తనిఖీలు మొదలయ్యాయి. భోజన పథకం అమలుతీరు, రుచి, శుచిశుభ్రత, తాగునీటి వసతులు ఇలా అన్ని అంశాలను పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న సత్తుపల్లి పాఠశాలను మధిర డిప్యూటీ డీఈవో రాములు పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయునికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. బయ్యారంలో బయటి ప్రాంతాల నుంచి అన్నం వండుకు తెస్తున్న ఏజెన్సీలపై స్థానిక ఎంఈవో మండిపడ్డారు. జిల్లాలో నిరుపయోగంగా ఉన్న వంటగదుల వివరాలనూ తెలపాలని డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు. కోట్లాది రూపాయల వ్యయంతో అమలు చేస్తున్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎదిగే దశలో ఉన్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనేదే భోజన పథకం ముఖ్యోద్దేశమని అటువంటప్పుడు నీళ్లచారు, ముద్ద అన్నంపెడితే ఉపయోగమేంటని ప్రశ్నించారు. మెనూ ప్రకారం కాకుండా ఇతర వంటకాలు, నాసిరకం ఆహారం అందిస్తే సహించేది లేదన్నారు. మధ్యాహ్నభోజనం బిల్లులు, వంట నిర్వాహకులకు నెలనెలా వేత నాలు అందుతున్నాయన్నారు. 9,10 తరగతులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయం వాస్తవమేనన్నారు. దీన్ని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో ఈ పెండింగ్ బిల్లులు కూడా మంజూరు చేసేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ఖమ్మంలో భోజన ఏజెన్సీల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మెనూ సక్రమంగా అమలు చేయని ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో పెట్టి తొలగిస్తామన్నారు. హెచ్ఎంలు ప్రతిరోజూ అన్నం, కూరలను పరిశీలించాలన్నారు. ఎస్ఎంఎస్ చైర్మన్లూ పరిశీలించాలని కోరారు. అవసరమైన సలహాలు, సూచనలు చేయాల్సిందిగా కోరారు. భోజన పథకం అమలుతీరు, తాగునీరు, వంటగదుల కొరత తదితర అంశాలపై పరిశీలన జరిపి పూర్తిస్థాయిలో రిపోర్టు తయారు చేసి కలెక్టర్‌కు సమర్పిస్తామని డీఈవో చెప్పారు. -
అర్ధాకలే
చప్పిడి చారు.. పలచని పప్పు.. సుద్ద అన్నం.. వెరసి పొగచూరిన వంటలు.. వారానికి రెండు రోజులు ఇవ్వాల్సిన గుడ్డు ఒక్కరోజుకే పరిమితం.. ఇదీ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు. మరోపక్క ఏజెన్సీ నిర్వాహకులకు రెండు నెలలుగా బిల్లులు చెల్లించని వైనం. దీంతో వారు అప్పులు చేసి మరీ మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న పరిస్థితి. మెనూ మమ అనిపిస్తుండటంతో చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్న దుస్థితి. సోమవారం జిల్లాలోని పాఠశాలల్లో నిర్వహించిన ‘సాక్షి విజిట్’లో వెలుగుచూసిన వాస్తవాలివి. ►మధ్యాహ్న భోజన పథకంలో అమలు కాని మెనూ ► బిల్లులు విడుదల కాక ►కింగ్ ఏజెన్సీల అవస్థలు ► అప్పుల ఊబిలో నిర్వాహకులు ►5 నెలలుగా గౌరవవేతనం లేదు ►నిధులు విడుదలైనా మంజూరు చేయని ఎంఈవోలు ►‘సాక్షి విజిట్’లో వెలుగుచూసిన వాస్తవాలు మచిలీపట్నం : జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ అధ్వానంగా మారింది. మెనూ అమలు కాక.. కూరల్లో నాణ్యత లేక అర్ధాకలితో విద్యార్థులు అలమటిస్తున్నారు. కుకింగ్ ఏజెన్సీల నిర్వాహకులకు బిల్లులు సకాలంలో రాక అప్పులు చేసి మరీ పథకాన్ని కొనసాగిస్తున్నారు. సోమ, గురువారాల్లో విద్యార్థులకు కోడిగుడ్డు అందించాల్సి ఉండగా ఒక్కరోజుకే పరిమితం చేస్తున్నారు. గుడ్డు ధర మార్కెట్లో రూ.4.25కు పెరగడంతో విద్యార్థులకు ఇచ్చే మెనూ చార్జీలు గుడ్డుకే సరిపెట్టాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో 3,340 పాఠశాలలు ఉండగా 2,56,584 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ కుకింగ్ ఏజెన్సీల ఆధ్వర్యంలో పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏజెన్సీల నిర్వాహకులకు గత రెండు నెలలుగా బిల్లులు చెల్లించలేదు. దీంతో ఉన్నత పాఠశాలల్లో అధికంగా విద్యార్థులు ఉంటే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు అప్పు చేసి విద్యార్థులకు వండి పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. అప్పులు ఇచ్చిన కిరాణా షాపు యజమానుల నుంచి వేధింపులు అధికం కావడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వారికి చెల్లిస్తూ పథకాన్ని కొనసాగిస్తున్నారు. 35 పైసలు పెంచారు... ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండా ఈ ఏడాది జూన్ నుంచి కుకింగ్ ఏజెన్సీలకు ఇచ్చే కమీషన్‌ను నామమాత్రంగా పెంచింది. గతంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4 చెల్లించేవారు. దానిని రూ.4.35కు, ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు చెల్లించే రూ.6ను రూ.6.35కు పెంచారు. ప్రస్తుత మార్కెట్లో పెరిగిన కూరగాయలు, నిత్యావసరాల ధరలకు, పెంచిన చార్జీలకు పొంతన లేకపోవడం గమనార్హం. ఈ ఖర్చులోనే వారానికి రెండుసార్లు గుడ్డు, వంటకు ఉపయోగించే కట్టెలు సమకూర్చాల్సి ఉంది. దీంతో కుకింగ్ ఏజెన్సీల నిర్వాహకులు అత్తెసరు మెనూ అమలు చేస్తూ మమ అనిపిస్తున్నారు. సోమవారం పలు ఏజెన్సీలు సాంబారు, ఉడకబెట్టిన గుడ్డు మాత్రమే వడ్డించాయి. సాంబారులో వివిధ రకాల కూరగాయలు, కందిపప్పు వేయాల్సి ఉండగా నాలుగు బెండకాయ ముక్కలు వేసి సరిపెట్టారు. అదేమని ప్రశ్నిస్తే ఈరోజు కోడి గుడ్డు ధర రూ.4.25లు ఉందని, ప్రభుత్వం విద్యార్థికి వంట చేసిపెట్టినందుకు ఇచ్చేది రూ.4.35 అని, కోడిగుడ్డు కొనుగోలుకు ఈ నగదు ఖర్చయితే పది పైసలు మిగులుతోందని దీంతో నూనె, కందిపప్పు, కూరగాయలు ఎలా కొనుగోలు చేయాలని ఏజెన్సీ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఐదు నెలలుగా గౌరవవేతనం లేదు... ప్రభుత్వ పాఠశాలలో వంట ఏజెన్సీల నిర్వాహకురాలికి సహాయకులుగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి ఒకరు లేక ఇద్దరు పనిచేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి గౌరవవేతనంగా నెలకు రూ.1000 చెల్లించాల్సి ఉంది. ఐదు నెలలుగా గౌరవవేతనం చెల్లించటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఉన్నత పాఠశాలల్లో 100 నుంచి 1600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. 140 మంది విద్యార్థులు చదివే ఉన్నత పాఠశాలలో కుకింగ్ ఏజెన్సీకి నెలకు కనీసంగా రూ.25 వేలు బిల్లుగా వస్తోంది. గత రెండు నెలలుగా ఈ బిల్లులు ఇవ్వకపోవటంతో బందరు మండలంలోని చిట్టిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకురాలు రూ.50 వేలు అప్పు చేసి వంట చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మూడో నెల పూర్తయ్యే దశలో ఉంది. ఈ మూడు నెలలు కలుపుకుంటే రూ.70 వేల వరకు బిల్లులు రావాల్సి ఉంది. సరకులు, కూరగాయలు తీసుకున్న షాపు యజమానులు అప్పు తీర్చమని ఒత్తిడి తెస్తున్నారని నిర్వాహకురాలు వాపోయింది. అప్పుల పాలవుతున్నాం... గన్నవరంలోని ఓ ఉన్నత పాఠశాలలో నెలకు రూ.70 వేల వరకు బిల్లు రావాల్సి ఉంది. రెండు నెలలుగా బిల్లులు అందకపోవటంతో రూ.1.50 లక్షల వరకు ఏజెన్సీ నిర్వాహకురాలు అప్పుల పాలైంది. ఈ బిల్లులు ఎప్పటికి వస్తాయో, ఎప్పటికి అప్పులు తీర్చాలోనని ఏజెన్సీ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమైన అనంతరం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఏప్రిల్, జూన్ నెలలకు సంబంధించి మొదటి క్వార్టర్‌గా రూ.3.69 కోట్లు, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.10.41 కోట్ల నగదును ఆయా మండలాలకు సంబంధించి ఎంఈవోల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 9, 10 తరగతులకు సంబంధించి మధ్యాహ్న భోజన బిల్లులను మొదటి క్వార్టర్‌గా రూ.51.39 లక్షలు, 2వ క్వార్టర్‌గా రూ.67.18 లక్షలు, 3వ క్వార్టర్‌గా రూ.94.62 లక్షలు ఎంఈవోల ఖాతాల్లో జమ చేసినట్లు వారు తెలిపారు. సకాలంలో బిల్లులు రాకపోవటంతో ఇంట్లోని బంగారు వస్తువులు తాకట్టు పెట్టి కుకింగ్ ఏజెన్సీలు నడుపుతున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టెల పొయ్యి పైనే వంట... జిల్లాలోని 90 శాతం పాఠశాలల్లో కట్టెల పొయ్యి పైనే వంట చేస్తున్నారు. రెండేళ్ల క్రితం పాఠశాలలకు గ్యాస్ పొయ్యిలు అందజేసినా, గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు. దీంతో గ్యాస్ పొయ్యిలు మూలనపడి పాడైపోయే స్థితికి చేరుకున్నాయి. పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే సంబంధిత పాఠశాల హెచ్ఎం లేదా కుకింగ్ ఏజెన్సీ పేరున తీసుకోవాల్సి ఉంది. పాఠశాల హెచ్ఎం బదిలీపై వెళ్లినా, కుకింగ్ ఏజెన్సీని రద్దు చేసి వేరొకరికి అప్పగించినా గ్యాస్ కనెక్షన్ ద్వారా సిలిండర్ తీసుకోవటం ఇబ్బందికరంగా మారుతుందనే కారణంతో ఈ ప్రయత్నాన్ని విరమించారు. కొన్ని పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చినా నెలకు ఒక సిలిండర్ మాత్రమే వాడాలనే నిబంధన విధించటంతో ఒక సిలిండర్ ఎటూ చాలక కట్టెల పొయ్యి పైనే ఆధార పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం వచ్చే బియ్యం నాణ్యత తక్కువగా ఉండటంతో ఏ మాత్రం అజాగ్రత్తగా వండినా అన్నం సుద్దగా మారుతోందని, ఇలా అయితే విద్యార్థులు భోజనం చేయని పరిస్థితి నెలకొంటోందని ఉపాధ్యాయులతో పాటు కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. -
అప్పుల ‘భోజనం’
బి.కొత్తకోట: జిల్లాలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న వంట ఏజెన్సీల నిర్వాహకులు అప్పులపాలవుతున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలల విద్యార్థులకు వంట ఏజెన్సీల నిర్వాహకులే భోజనం వండీ పెడ్తారు. బియ్యాన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఇందుకోసం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.4.35, ఆరు నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6 చొప్పున నిర్వాహకులకు ప్రభుత్వం చెల్లించాలి. ఈ నిధులతో విద్యార్థులకు అందించే భోజనంలో కూరలు, గుడ్లు వడ్డించాలి. అయితే ఏజెన్సీ నిర్వాహకులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను చెల్లించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 9.63కోట్లు పెండింగ్ జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 3.2 లక్షల మంది బాలబాలికలు చదువుతున్నారు. వీరిలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు 70వేల మందికిపైగా ఉన్నారు. మిగిలిన వారంతా 1 నుంచి 8 వరకు చదువుతున్న వా రే. వీరికి భోజనం అందిస్తున్న నిర్వాహకులకు మొత్తం రూ.9.63కోట్లు బకాయిపడ్డారు. రాష్ట్రప్రభుత్వ నిధుల విడుదలలో జాప్యం జరిగేది. కేంద్ర నిధులు సకాలంలో అందేవి. ప్రస్తుతం రెండు ప్రభుత్వాల నిధులు అందలేదు. ఇందు లో 1 నుంచి 8వ తరగతి వరకు రూ.5.12కోట్లను ఈ ఆగస్టు నుంచి ఇప్పటివరకు కేంద్ర నిధులు అందాల్సి ఉంది. 9,10 తరగతుల విద్యార్థులకు ఈ ఫిబ్రవరి నుంచి రూ.4.51 కోట్ల నిధులు అందలేదు. ఒకేసారి కేంద్ర, రాష్ట్ర నిధులు అందకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వడ్డీలకు అప్పులు సకాలంలో మధ్యాహ్న భోజన నిధులు మంజూరుకాకపోవడంతో నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఒక్కో ఏజెన్సీకి రూ.2లక్షల నుంచి నాలుగైదు లక్షల బకాయిలు రావాల్సి ఉంటుంది. నిర్వహణ ఆపలేక రూ.100కు రూ.3నుంచి రూ.6 వడ్డీకి డబ్బు అప్పులకు తీసుకొచ్చి పథకం అమలుచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పథకం నిర్వహణ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. -
మిథ్యాన్నమే!
ఉడికీ ఉడకని మధ్యాహ్న భోజనం... సాక్షి, మహబూబ్‌నగర్: విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నీరుగారిపోతుంది. వంట ఏజెన్సీలకు ఈ ఏడాది ఇప్పటి వరకు నిధులు రాకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు నెలలుగా ప్రభుత్వం పైసలివ్వకపోవడంతో విద్యార్థులకు ఉడకని అన్నం... నీళ్ల చారే దిక్కైంది. మెనూ ప్రకారం విద్యార్థులకు ఎక్కడా భోజనం అందించడంలేదు. ఉడికీ ఉడకని అన్నం నీళ్లచారుతో నిర్వాహకులు సరిపెడుతున్నారు. వారానికి ఒకసా రి ఇవ్వాల్సిన గుడ్డు, అరటిపండు సంగతే పట్టించుకోవడం లేదు. భోజనం తర్వాత కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో ఆవరణలో విద్యార్థులు భోజనం చేస్తుండగా వారి వద్దకు పందులు, కుక్కలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. బుధవారం ‘సాక్షి’ విజిట్‌లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.8 కోట్ల బకాయిలు జిల్లాలో మొత్తం 3,799 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. పాఠశాలలో హాజరు శాతాన్ని పెంచుతూ, డ్రాపవుట్ శాతం తగ్గించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ పథకం కింద అన్ని పాఠశాలల పరిధిలో దాదాపు 4,48,227 మంది విద్యార్థులకు భోజనం పెడుతున్నట్లు అధికార గణాంకాలు సూచిస్తున్నాయి. వీటి నిర్వహణకు ప్రతి నెల రూ.5కోట్ల నిధులను ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా స్కూళ్లు ప్రారంభమైన నాటి నుంచి నిధులు రాలేదు. కేవలం 9, 10 తరగతుల విద్యార్థుల కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిధులు *కోటిన్నర మంజూరయ్యాయి. ఒకటి నుంచి 8 తరగతుల విద్యార్థుల అమలు కోసం 8కోట్ల రూపాయలు ఇప్పటి దాకా మంజూరు కాలేదు. ప్రభుత్వం నుంచి కేవలం బియ్యం మాత్రమే అందుతుండటంతో, మిగతా వంట సరకుల కోసం నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కిరాణషాపులలో అప్పు పుట్టకపోవడంతో చాలా చోట్ల నీళ్ల చారుతో సరిపెడుతున్నారు. ఇరుకు గదులతో ఇక్కట్లు.. జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇప్పటికీ వంటగదులు లేవు. దీంతో నిర్వాహకులు ఆరుబయటే వంట చేస్తున్నారు. జిల్లాకు ఇప్పటి వరకు రెండు విడతలుగా 4,660 గదుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. వీటిలో కేవలం 1,107 మాత్రమే పూర్తయ్యాయి. 500వరకు వివిధ దశలలో కొనసాగుతున్నాయి. మిగతావి పనులు చేపట్టిన దాఖలాలే లేవు. కొన్ని చోట్ల కిచెన్ షెడ్లు ఇరుకుగా ఉండటం వల్ల వంట ఏజెన్సీ మహిళలు ఆరుబయటే వంటలు చేస్తుండటంతో పొగ కమ్ముకుని విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలా పాఠశాలల్లో తాగునీటి సౌకర్య లేకపోవడంతో వంట ఏజెన్సీలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో తినలేమంటూ కొందరు విద్యార్థులు ఇళ్లనుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. ఉపాధ్యాయులు నచ్చచెబుతున్నా కొన్ని చోట్ల సామాజిక అంతరాలను సాకుగా చూపుతూ కొందరు విద్యార్థులు ఈ పథకానికి దూరంగా ఉంటున్నారు. వంట ఎవరు చేయాలనే అంశంపై ఏజెన్సీల నడుమ గొడవలు జరిగి అధికారుల దృష్టిని వెళ్లిన దాఖలా కూడా వుంది. వంట ఏజెన్సీల నియామకంలో రాజకీయ జోక్యం కూడా ఉండటంతో సిగపట్లకు దారితీస్తోంది.