ఉడికీ ఉడకని మధ్యాహ్న భోజనం...
సాక్షి, మహబూబ్‌నగర్: విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నీరుగారిపోతుంది. వంట ఏజెన్సీలకు ఈ ఏడాది ఇప్పటి వరకు నిధులు రాకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు నెలలుగా ప్రభుత్వం పైసలివ్వకపోవడంతో విద్యార్థులకు ఉడకని అన్నం... నీళ్ల చారే దిక్కైంది. మెనూ ప్రకారం విద్యార్థులకు ఎక్కడా భోజనం అందించడంలేదు. ఉడికీ ఉడకని అన్నం నీళ్లచారుతో నిర్వాహకులు సరిపెడుతున్నారు.
వారానికి ఒకసా రి ఇవ్వాల్సిన గుడ్డు, అరటిపండు సంగతే పట్టించుకోవడం లేదు. భోజనం తర్వాత కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో ఆవరణలో విద్యార్థులు భోజనం చేస్తుండగా వారి వద్దకు పందులు, కుక్కలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. బుధవారం ‘సాక్షి’ విజిట్‌లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రూ.8 కోట్ల బకాయిలు
జిల్లాలో మొత్తం 3,799 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. పాఠశాలలో హాజరు శాతాన్ని పెంచుతూ, డ్రాపవుట్ శాతం తగ్గించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ పథకం కింద అన్ని పాఠశాలల పరిధిలో దాదాపు 4,48,227 మంది విద్యార్థులకు భోజనం పెడుతున్నట్లు అధికార గణాంకాలు సూచిస్తున్నాయి. వీటి నిర్వహణకు ప్రతి నెల రూ.5కోట్ల నిధులను ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నాయి.
కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా స్కూళ్లు ప్రారంభమైన నాటి నుంచి నిధులు రాలేదు. కేవలం 9, 10 తరగతుల విద్యార్థుల కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిధులు *కోటిన్నర మంజూరయ్యాయి. ఒకటి నుంచి 8 తరగతుల విద్యార్థుల అమలు కోసం 8కోట్ల రూపాయలు ఇప్పటి దాకా మంజూరు కాలేదు. ప్రభుత్వం నుంచి కేవలం బియ్యం మాత్రమే అందుతుండటంతో, మిగతా వంట సరకుల కోసం నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కిరాణషాపులలో అప్పు పుట్టకపోవడంతో చాలా చోట్ల నీళ్ల చారుతో సరిపెడుతున్నారు.
ఇరుకు గదులతో ఇక్కట్లు..
జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇప్పటికీ వంటగదులు లేవు. దీంతో నిర్వాహకులు ఆరుబయటే వంట చేస్తున్నారు. జిల్లాకు ఇప్పటి వరకు రెండు విడతలుగా 4,660 గదుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. వీటిలో కేవలం 1,107 మాత్రమే పూర్తయ్యాయి. 500వరకు వివిధ దశలలో కొనసాగుతున్నాయి. మిగతావి పనులు చేపట్టిన దాఖలాలే లేవు. కొన్ని చోట్ల కిచెన్ షెడ్‌లు ఇరుకుగా ఉండటం వల్ల వంట ఏజెన్సీ మహిళలు ఆరుబయటే వంటలు చేస్తుండటంతో పొగ కమ్ముకుని విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలా పాఠశాలల్లో తాగునీటి సౌకర్య లేకపోవడంతో వంట ఏజెన్సీలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
అపరిశుభ్ర వాతావరణంలో తినలేమంటూ కొందరు విద్యార్థులు ఇళ్లనుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. ఉపాధ్యాయులు నచ్చచెబుతున్నా కొన్ని చోట్ల సామాజిక అంతరాలను సాకుగా చూపుతూ కొందరు విద్యార్థులు ఈ పథకానికి దూరంగా ఉంటున్నారు. వంట ఎవరు చేయాలనే అంశంపై ఏజెన్సీల నడుమ గొడవలు జరిగి అధికారుల దృష్టిని వెళ్లిన దాఖలా కూడా వుంది. వంట ఏజెన్సీల నియామకంలో రాజకీయ జోక్యం కూడా ఉండటంతో సిగపట్లకు దారితీస్తోంది.
మిథ్యాన్నమే!
Published Thu, Aug 7 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement