ఆదిలాబాద్ అర్బన్/ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు కొత్త సంవత్సరంలో తీపి కబురునందించింది. జనవరి ఒకటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, వసతిగృహాల్లోని వారికి ఇక నుంచి దొడ్డు అన్నానికి బదులు సూపర్‌ఫైన్ (సన్నరకం) బియ్యం అందించి వారికి భోజనం అందించనుంది. చాలా మంది విద్యార్థులు దొడ్డు అన్నం తినలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ విషయం పేద విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి భరోసాగా మారనుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమస్యలు ఇకనుంచి మెరుగుపడనున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు, పౌర సరఫరాల శాఖ అధికారులకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
4.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం..
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3,849 ఉన్నాయి. ఇందులో 3,24,491 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీంతోపాటు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, గిరిజన, సాంఘిక సంక్షేమ, బీసీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో 78,294 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,02,785 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది.
మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నాసిరకం బియ్యంతోనే భోజనం పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనంలో పురుగులు, రాళ్లు, ఉడకని అన్నం, తదితర సమస్యలతో విద్యార్థులు పలుసార్లు అవస్థలు పడిన విషయం తెలిసిందే. కాగా, ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది.
సన్నబియ్యం కేటాయింపు ఇలా..
2015 జనవరి నుంచి పాఠశాలలు, వసతిగృహాలు, మధ్యాహ్న భోజన పథకానికి ఇక సూపర్‌ఫైన్ బియ్యం (సన్నరకం) అందనున్నాయి. జనవరి నెలకు సంబంధించి గురుకుల పాఠశాలలకు, వసతి గృహాలకు కలిపి 11,523 క్వింటాళ్ల బియ్యం అవసరం కాగా, మధ్యాహ్న భోజన పథకానికి నెలకు 11,820 క్వింటాళ్ల బియ్యం అవసరమవుతాయి. అయితే మధ్యాహ్న భోజనానికి సంబంధించి 19 రోజులకు సరిపడా బియ్యం 7,486 క్వింటాళ్ల సన్నరకం బియ్యం అందించేందుకు కేటాయింపులు చేశారు.
నాసిరకం బియ్యం కాకుండా సూపర్‌ఫైన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలకు 7,487 క్వింటాళ్ల బియ్యం, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు 2,332 క్వింటాళ్లు, బీసీ సంక్షేమ వసతి గృహాలకు 721 క్వింటాళ్లు, మైనార్టీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు 7.35 క్వింటాళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలకు 121 క్వింటాళ్లు, బీసీ గురుకుల పాఠశాలలకు 112 క్వింటాళ్లు, ఏపీ గురుకుల కేజీబీవీ పాఠశాలలకు 264 క్వింటాళ్లు, ఆర్వీఎం ద్వారా నడుస్తున్న ఆర్‌బీసీ, కేజీబీవీ పాఠశాలలకు 475 క్వింటాళ్లు మొత్తం 11,523 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయనున్నారు. అదే విధంగా జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల ద్వారా నడిపిస్తున్న 52 మండలాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు (19 రోజులకు సరిపడా బియ్యం) 7,486 క్వింటాళ్ల బియ్యాన్ని కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
అమలుపై అనుమానాలు..!
విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమే అయినా.. ఈ పథకం అమలు తీరు ఎలా ఉంటుందోననే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలకు బియ్యం సరఫరా చేసేందుకు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖ అధికారుల నుంచి తహశీల్దార్లకు ఆర్వోలు వెళ్తాయి. వారు అంగకరీస్తే ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా బియ్యం సరఫరా అవుతాయి. అక్కడి నుంచి డీలర్లు పేదలకు అందించే బియ్యంతోపాటు పాఠశాలలకు అందించే బియ్యం కూడా తీసుకొస్తారు.
ఈ పరిస్థితుల్లో సన్న బియ్యం పాఠశాలలకు పంపడంలో చేతులు మారే అవకాశం ఉంది. గతంలో ఎంఎల్‌ఎస్ పాయింట్లకు వచ్చిన బియ్యంలో మేలిమి రకమైనవి పాఠశాలలకు అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా డీలర్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్ అధికారులు కుమ్మక్కై మేలిమి బియ్యాన్ని పక్కదారి పట్టించిన సందర్భాలున్నాయి. దీంతోపాటు పాఠశాలల్లో బియ్యం మాయం కావడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.
ఇప్పుడు సన్న బియ్యం సరఫరా అయినా.. అలాంటివి ఇంకా పెరిగే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం లెవీ తగ్గిచడంతోపాటు ఈ సంవత్సరం ఉత్పత్తి కూడా తగ్గింది. సాగైన పంటలో సగానికి పైగా దొడ్డు రకం ధాన్యమే. ఇలాంటి పరిస్థితుల్లో సన్న బియ్యం సరఫరాకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
హాస్టళ్లలో ‘సూపర్’ భోజనం
Published Tue, Dec 30 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM
Advertisement
Advertisement