కడుపు కాలిపోతాంది.. | Hungry stomach .. | Sakshi
Sakshi News home page

కడుపు కాలిపోతాంది..

Published Wed, May 20 2015 3:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

Hungry stomach ..

నవంబర్ నుంచి బిల్లుల బకాయి
కార్మికులకూ అందని వేతనాలు
సెలవులు వచ్చినా రాని బిల్లులు
అప్పుల పాలై విలవిల్లాడు తున్నామని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల వేడుకోలు

 
  ఈమె పేరు నాగమ్మ. ప్రొద్దుటూరు పట్టణంలోని హోమస్‌పేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో వంట ఏజెన్సీ నిర్వహిస్తోంది. పాఠశాలలో 214 మంది విద్యార్థులు చదువుతుండగా ప్రతి రోజు వీరికి భోజనం వడ్డించేందుకు దాదాపు రూ.800 ఖర్చవుతోంది. ఈ ప్రకారం నెలకు రూ.18 వేల వరకు నాగమ్మ వెచ్చించింది. అయితే ప్రభుత్వం గత ఏడాది నవంబర్ నుంచి ఈమెకు బిల్లులు చెల్లించలేదు. ఎస్సీ వర్గానికి చెందిన ఈమె కడుపేదరాలు.

ఏజెన్సీ నిర్వహణకు డబ్బు లేకపోవడంతో కొంత మంది ఉపాధ్యాయుల వద్ద అప్పు తీసుకుంది. అది సరిపోక తన ఇంటితోపాటు తన మనుమరాలి పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న బంగారు హారం, మాటీలు, కమ్మలు, ఉంగరాలు తాకట్టు పెట్టింది. ఈమెకు గత ఏడాది ఆగస్టు నుంచి రూ.1000 వేతనం కూడా రాలేదు. ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకపోయిన ఈమె.. తాను ఈ పథకాన్ని నిర్వహించలేనని అధికారులకు విన్నవించింది. ఈమెకు బకాయిలు చెల్లించిన తర్వాతే మరొకరికి ఈ ఏజెన్సీని అప్పగించాలని అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు.
 
 ప్రొద్దుటూరు : జిల్లాలో 3,561 పాఠశాలల్లో రోజూ మధ్యాహ్న భోజనం పథకం కింద 2,59,329 మంది విద్యార్థులకు అన్నం పెడుతున్నారు. ఇందుకుగాను సుమారు 9 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి గత ఏడాది నవంబర్ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు 6 నెలలకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఉన్నత పాఠశాలలకు సంబంధించి జనవరి నుంచి ఏప్రిల్ 24వ తేది వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

1-8వ తరగతి విద్యార్థులకు రూ.4.60 చొప్పున, 9, 10 తరగతి విద్యార్థులకు రూ.6.30లు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ప్రకారం ఒక్క ప్రొద్దుటూరు మండలంలోని 129 పాఠశాలలకు సంబంధించి మధ్యాహ్న భోజన బకాయిల బిల్లులు రూ.15 లక్షల వరకు చెల్లించాల్సి ఉందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. బిల్లులు రాకపోవడంతో నిర్వాహకులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా పాఠశాలల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్డు ఇవ్వడం లేదు.

వారం లో ఓ రోజు గుడ్డు ఇస్తే మరో రోజు అరటిపండు ఇస్తున్నారు. చాలా మండలాల్లో ఈ సమస్య ఎంఈఓల దృష్టికి వెళ్లింది. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో పోషకాహారం అందక విద్యార్థులు నష్టపోతున్నారు. బిల్లులు చెల్లించలేని కారణంగా ఉపాధ్యాయులు కూడా నిర్వాహకులను గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్న బోజన బిల్లులకు సంబంధించి తరచూ ఇలాంటి సమస్య ఏర్పడుతుండటంతో దుకాణదారులు వీరికి సరుకులు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు.

ప్రత్యేకంగా గుడ్ల దుకాణ యజమానులు మాత్రం అప్పు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లాగే తమకూప్రభుత్వమే గుడ్లు సరఫరా చేస్తే బావుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది వేసవి సెలవులు వచ్చేనాటికి బకాయిలు లేకుండా బిల్లులు చెల్లించేవారు. ప్రొద్దుటూరుకు చెందిన పలువురు మధ్యాహ్న భోజన నిర్వాహకులు బకాయిలు చెల్లించాలని ఏకంగా గ్రీవెన్స్ సెల్‌లో కలెక్టర్‌కు విన్నవించారు. ముఖ్యమంత్రికి సైతం లేఖలు పంపారు. ప్రస్తుతం పాఠశాల పునఃప్రారంభ సమయం సమీపిస్తున్నా ఇంకా బిల్లులు రాకపోవడం గమనార్హం.

 కార్మికులకు కూడా వేతనాలు లేవు
 మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహణకు సంబంధించి జిల్లాలో సుమారు 9 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.1000 చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తోంది. అయితే గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు వీరికి వేతనాలు రాలేదు.
 
 బిల్లులు మంజూరవుతూనే చెల్లిస్తాం
 మధ్యాహ్న భోజన బిల్లుల బకాయిలు ప్రభుత్వం నుంచి మంజూరవుతూనే చెల్లిస్తాం. చాలా మంది నిర్వాహకులు ఈ విషయాన్ని అడుగుతున్నారు. ట్రెజరీ ఆంక్షల కారణంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement