ఇక 9, 10వ తరగతుల విద్యార్థులకు ప్రతీ ఏటా రెండు జతల యూనిఫాంలు ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇంత వరకు పాఠశాలల్లో కొనసాగిన రెండు డ్రెస్సుల విధానం కనుమరుగు కానుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా ఒకే రకమైన యూనిఫాంలో కనిపించనున్నారు. జిల్లాలో 231 ఉన్నత పాఠశాలలుండగా 9, 10వ తరగతుల్లో సుమారు 19 వేల మంది చదువుతున్నట్లు సమాచారం. వీరందరికీ ఏడాదికి రెండు జతల యూనిఫాం ఇవ్వనున్నారు.
పాపన్నపేట(మెదక్) : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే రెండు జతల యూనిఫాంల విధానంతో జిల్లాలో ఏటా సుమారు రూ.76 లక్షల వ్యయం కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ధనిక, పేద తారతమ్యం రూపుమాపి విద్యార్థులంతా ఒకటే అనే భావన పెంపొందించేందుకు. నిరుపేద విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించేందుకు.. విద్యాహక్కు చట్టం అమలు పర్చేందుకు 2009 నుంచి ఉచితంగా రెండు జతల యూనిఫాంలు అందజేస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వీటిని సమకూరుస్తున్నారు. దీనికోసం ఒక్కో జత (ప్యాంటు, షర్టు)కు రూ.200 ఇస్తున్నారు. ఇందులో రూ.160 బట్ట ఖరీదు, రూ.40 కుట్టు కూలీ ఖర్చులుగా అందజేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకైతే 1 నుంచి 7వ తరగతుల వారికి నెక్కర్, షర్టు, 8వ తరగతుల వారికి ప్యాంటు, షర్టు, బాలికలకు 1నుంచి 2వ తరగతుల వారికి ఫ్రాక్స్, 3నుంచి 5 వరకు స్కర్టులు, షర్టు, 6 నుంచి 8వ తరగతుల వారికి పంజాబీ డ్రెస్సు, చున్నీ పంపిణీ చేస్తున్నారు. అయితే 9,10వ తరగతుల వారికి మాత్రం యూనిఫాంలు పంపిణీ చేయడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 9,10 తరగతులకు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి భాగస్వామ్యంతో ఇంత వరకు 1నుంచి 8 తరగతుల వారికి యూనిఫాంలు పంపిణీ చేశారు. 9, 10వ తరగతుల విద్యార్థులు ఇష్టమొచ్చిన విధంగా పాఠశాలకు సివిల్ డ్రెస్సులు వేసుకొని వచ్చేవారు. దీంతో పాఠశాలలో భిన్నత్వం కనిపించేది. పేద విద్యార్థులు కొంత మంది చిరిగిన అంగీలు కూడా వేసుకొని వచ్చేవారు. ఈ వివక్షతను రూపుమాపి, పేదలకు బాసటగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం వచ్చే యేడాది నుంచి 9, 10వ తరగతుల విద్యార్థులకు కూడా రెండు జతల యూనిఫాంలు ఇస్తుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. దీనికోసం రూ.34.31 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పారు. దీంతో నిరుపేద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం
9,10వ తరగతుల విద్యార్థులకు కూడా ఉచిత యూనిఫాంలు ఇస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత వరకు 1నుంచి 8 తరగతుల విద్యార్థులకే యూనిఫాంలు ఇవ్వడం, 9, 10వ తరగతుల వారికి ఇవ్వక పోవడం వల్ల ఒకే పాఠశాలలో చదివే విద్యార్థుల మధ్య వైరుధ్యం కనిపించేది. సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిల నిర్ణయంతో జిల్లాలో సుమారు 19వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. నిరుపేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది.
– మధుమోహన్, నోడల్ అధికారి
ఎదురు చూపులు నేడు ఫలించాయి
సుమారు పదేళ్లుగా 9, 10వ తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉచిత యూనిఫాంలు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఈ ఆర్థిక భారం కేవలం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతుండడంతో అటు వైపుగా ఎవరూ ఆలోచించలేదు. ప్రస్తుత నిర్ణయంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ పెరగడానికి ఉచిత యూనిఫాంలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కూడా కారణమే.
– నీలకంఠం, ఎంఈఓ, కొల్చారం
Comments
Please login to add a commentAdd a comment