బడి గంట.. మరో గంట లేటంట
మెదక్: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో ప్రభుత్వం విద్యాహక్కు చట్టానికి కొన్ని సవరణలు చేసింది. దీని ప్రకారం ప్రస్తుతమున్న పనిగంటలు మరోగంట మేర పెరగనున్నాయి. ఈ మేరకు బడివేళల్లో మార్పులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంటే, పంతుళ్లు, విద్యార్థులు మాత్రం పరేషాన్ అవుతున్నారు. ఇప్పటి వరకు రోజుకు 6 నుంచి 7 గంటలలోపు మాత్రమే పనిగంటలుండగా, మారిన విద్యాహక్కు చట్టం ప్రకారం అవి 7.30 గంటలకు పె రుగుతున్నాయి.
దీంతో చిన్నారులు అంతసేపు పాఠశాలలో గడపడం ఇబ్బందిగా ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులు మరో గ్రామం నుంచి పాఠశాలలకు వస్తుంటారని, తరగతి గదుల్లో ఉండాల్సిన సమయం పెరగడం వల్ల వారు తిరిగి ఇళ్లకు చేరుకోవడంలో ఇబ్బందులు పడే అవకాశం ఉందని వారు వెల్లడిస్తున్నారు.
ప్రస్తుతం పనిగంటలిలా
జిల్లాలో సుమారు 555 ఉన్నత, 445 ప్రాథమికోన్నత, 2,400లకు పైగా ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 3 లక్షలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు, తిరిగి 1.15 నుంచి 3.35 వరకు మధ్యలో భోజన విరామం గంట కలిపితే విద్యార్థులు మొత్తంగా 6.35 గంటల పాటు పాఠశాలలో గడుపుతున్నారు. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి 12.10 వరకు, తిరిగి 1.10 నుండి 4.05 గంటల వరకు భోజన విరామం కలుపుకుంటే మొత్తంగా 7.05 గంటల పాటు నడుస్తున్నాయి.
ఇక ఉన్నత పాఠశాలలు ఉదయం 9.45 నుంచి 12.55 తిరిగి మధ్యాహ్నం 1.45 నుంచి 4.40 గంటల వరకు మధ్యలో గంటపాటు భోజన విరామం..మొత్తం రోజుకు 6.55 గంటలపాటు కొనసాగుతున్నాయి. మారిన విద్యాహక్కు చట్టం ప్రకారం దాదాపు అన్ని పాఠశాలలు మరో గంట పాటు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది.
స్టడీమెటీరియల్, గైడ్‌లకు సెలవు
ఇకనుంచి పాఠశాలల్లో గైడ్‌లు, స్టడీ మెటీరియల్‌కు స్వస్తి చెప్పాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ఈ మేరకు విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటూ కొత్త చట్టం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం పాఠశాల పనివేళలను పెంచుతున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు తమకు అర్థం కాని అంశాలను స్పష్టంగా తెలుసుకునేందుకు అదనపు సమయాన్ని కేటాయించారు. అంతేకాకుండా కళావిద్య, నైతిక విద్య, పనివిద్య, ఆట పాటలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ క్రమంలో 8 పీరియడ్ల స్థానంలో మరో పీరియడ్‌ను అదనంగా పెంచుతున్నారు. ఉన్నత పాఠశాల స్థాయిలో వారానికి ఉన్న 48 పీరియడ్లు 54కు పెంచుతున్నారు.
పనివేళల పెంపుతో ప్రయోజనం శూన్యం!
ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా కేవలం పనివేళలను మార్చడం ద్వారా ప్రయోజనం ఉండదని ఉపాధ్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అలాగే గ్రామీణ పాఠశాలల్లో చాలామంది విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి వస్తారని, ఉదయం 9 గంటల వరకు పాఠశాలకు రావాలంటే ఇబ్బందిగా ఉంటుందని వారు చెబుతున్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో చదివే చిన్నారులు 7.30 గంటల పాటు పాఠశాలలో గడపాలంటే చాలా ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో 5 రోజుల పనిదినాల పథకం అమలులో ఉండగా, ఇక్కడ మరింత పనిభారం పెంచడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.