
సాక్షి, మెదక్: నిరంతర శ్రమతోనే గొప్పలక్ష్యాలు సాధ్యమవుతాయని తెలంగాణ ప్రెస్ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం మెదక్ రామాయంపేటలో స్నేహ కళాశాల విద్యార్థులకు ఆయన మార్గదర్శనం చేశారు. విద్యార్థులు లక్ష్యాలను సాధించి.. దేశం పేరును ఖండాంతరాలకు చాటాలని పిలుపునిచ్చారు. పత్రికలను ఆసక్తిగా చదివితే కొత్త పదాలు, భాషాభివృద్ధితో పాటు సామాజిక పోకడలు అవగతమవుతాయని విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశలో చెడు వ్యసనాలు అలవాటు చేసుకుంటే..భవిష్యత్తు ఉండదన్నారు. నూతన ఆవిష్కరణలు,కంప్యూటర్ల వినియోగంపై నైపుణ్యం సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి విధానంలో కాకుండా..అర్థం చేసుకుంటూ చదవాలని సూచించారు. ప్రశ్నించే గుణం అలవర్చుకోవాలన్నారు.