Goal of life
-
మంచి మాట..జీవన లక్ష్యం
ప్రతి మనిషి జీవితానికి లక్ష్యం అనేది అత్యంత అవసరం. తనకంటూ ఓ గుర్తింపు ఉండాలంటే, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని సఫలీకృతుడవడానికి అంకిత భావంతో పనిచేయాలి. తనకున్న యావచ్ఛక్తిని వినియోగించి పనిచేస్తే, విజయానికి దారులు తప్పక తెరుచుకుంటాయి. ఈ ధరిత్రిపై లక్ష్యం లేకుండా సాగే ఏ మనిషి జీవికైనా నిరర్ధకమంటారు స్వామి వివేకానంద. ఉన్నతపదవి.. వ్యాపారం.. క్రీడలు..లలితకళలు.. యిలా ఏ విభాగంలో మనం రాణిద్దామని అనుకుంటామో, అందులో చేరుకోవాలనుకున్న లక్ష్యాన్ని సావధానంతో నిర్ణయించుకోవాలి. అయితే, లక్ష్యాన్ని నిర్దేశించుకోగానే సరిపోదు. లక్ష్యాన్ని సాధించే దిశగా నిరంతర సాధనతో ముందుకు సాగాలి. ప్రతి పనినీ మొక్కవోని శ్రద్ధతో, ఏకాగ్రతతో, ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి. మన గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ ముందుకు సాగాలి. మనం పయనించే మార్గంలో విజయంతో బాటు అపజయాలు కూడా కలుగుతూనే ఉంటాయి. అపజయం సంభవించినప్పుడు కుంగిపోక, లక్ష్యసాధనలో విజయానికి చేరువ కావడానికి మరింత అనుభవం తనకు సమకూడిందని భావిస్తూ సానుకూల దక్పథంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ఈ ధరిత్రిలో ఏదీ, తనంత తానుగా మన చెంతకు రాదు. ఎనలేని శోధన, వలసినంత సాధన తోడైతేనే లక్ష్యం అవలీలగా సొంతమవుతుంది. మనిషి ఎంచుకునే లక్ష్యం చాలా ఉన్నతంగా ఉండాలి . ఉన్నతంగా ఉండడమంటే జీవనోపాధికోసం అప్పుడే సాధారణమైన ఉద్యోగంలో జేరినవాడు, వెంటనే అత్యంత సంపన్నుడు కావాలని కోరుకోవడం ఏమాత్రం సబబుకాదు. కానీ, తాను చేరిన వృత్తిలో, ఉద్యోగంలో, కృషి చేస్తే తాను ఎంతవరకు ఎదగగలడు అన్న విషయాన్ని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి. సహేతుకమైన ఆలోచనతో, వివేచనతో ముందుకు సాగుతూ నిజాయితీతో కృషి చేస్తే, తను అనుకున్న ఉన్నతమైన స్థానాన్ని అందుకోలేకపోయినా, ఖచ్చితంగా గౌరవనీయమైన స్థానాన్ని మానవుడు కైవశం చేసుకుంటాడని చరిత్ర నిరూపించిన నిదర్శనాలెన్నో మనకు కనబడతాయి. ఓర్పు, పట్టుదల, నిజాయితీలనే ఆయుధాలుగా చేసుకుని లక్ష్యసాధన దిశగా కషి చేసిన వారందరూ, తమ జీవన గమనంలో అప్రతిహతమైన విజయాలను చేబూనారన్న విషయం చరిత్ర తేజోమయంగా మనకు తెలియజేస్తుంది. ఈ విజయపరంపరలో అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి, అత్యున్నత స్థాయి కి ఎదిగిన వ్యక్తులూ మనకు ఎంతో మంది తారసపడుతూనే ఉంటారు. బీద కుటుంబంలో పుట్టి, ఉదయాన్నే వార్తా పత్రిక లను పంచే అతి సాధారణ వ్యాపకాన్ని బాలునిగా ఉన్నప్పుడు నిర్వర్తించిన అబ్దుల్ కలామ్ దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతిగా, భారత అణుశాస్త్ర పితామహునిగా నిలవడం కృషితో నాస్తి దుర్బిక్షం అన్న సామెతకు నిలువెత్తు సాక్ష్యం. కలలు కను..కలలను సాకారం చేసుకో’’ అన్న ఆ మహోన్నత వ్యక్తి లక్ష్య సాధకు లకు చక్కటి సందేశాన్ని ఇవ్వడమే గాక, తన జీవితాన్నే ఆ సుధా మయ వాక్యాలకు నిలువెత్తు ఉదాహరణగా నిలిపిన సార్ధక జీవనుడు. లక్ష్యం ఉన్నతమైనదైతే, చిత్తశుద్ధి దానికి తోడైతే, దారిలో ఎదురయ్యే ఆటంకాలేవీ మనల్ని బాధించవు. లక్ష్యాన్ని చేరే గమ్యంలో ఎదురయ్యే ఆటంకాలు, సవాళ్ళు సాధారణమైనవిగానే మనకు అనిపిస్తాయి. లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎదురయ్యే చిరు సవాళ్ళు, పెనుసవాళ్ళు కూడా మన విజయానికి బాసటగా నిలిచే పునాదిరాళ్ళుగా మనం విశ్వసించాలి. మనిషికి మహితమైన సహనాన్ని, తనలో తనకు విశ్వాసాన్ని పెంపొందించే మేలురాళ్ళుగా ఈ సవాళ్ళను పేర్కొనవచ్చు. మహత్తరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, విజయాన్ని చేబూనిన ప్రతి మానవుడూ మహనీయుడు కాకపోవచ్చు, కానీ సమాజంలో తప్పకుండా మాననీయుడవుతాడు. మహితమైన హితాన్ని నలుగురికీ తద్వారా చేకూరుస్తాడు. లక్ష్యసాధకునికి తప్పనిసరిగా కావలసింది అచంచలమైన ఆత్మవిశ్వాసం. మానవ చరిత్రను పరికిస్తే లక్ష్యాలను సాధించి, ఉన్నతులైన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నిటికంటే ఎక్కువ సామర్థ్యాన్ని పెంపొందించిన మూలశక్తి వారి ఆత్మవిశ్వాసమే. వాళ్ళు మొదటినుంచీ ఉన్నతులు కావాలనే విశ్వాసంతో పరిశ్రమించి, సాఫల్యతను సాధించారని వారి జీవనచిత్రం తిలకిస్తే మనకు అర్థమవుతుంది. లక్ష్యం అంటే గురి.. లక్ష్యం లేకుండా సాగే మనిషి జీవితాన్ని గమ్యం తెలియకుండా పయనించే నావతో పోల్చడం సబబుగా ఉంటుంది. మనం ఏ లక్ష్యం కోసమైతే సాధన, పరిశ్రమ కొనసాగిస్తామో, ఆ సాధనలో అవిశ్రాంతంగా కొనసాగితే, ఈ ధరిత్రిలోని ప్రతిశక్తీ మనకు సహకరిస్తుందనే మాట అత్యంత ప్రసిద్ధిని పొందిన ఓ పాశ్చాత్య దార్శనికుని మాట. – వెంకట్ గరికపాటి , వ్యాఖ్యాన విశారద -
నిరంతర శ్రమతోనే గొప్ప లక్ష్యాలు సాధ్యం
సాక్షి, మెదక్: నిరంతర శ్రమతోనే గొప్పలక్ష్యాలు సాధ్యమవుతాయని తెలంగాణ ప్రెస్ అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం మెదక్ రామాయంపేటలో స్నేహ కళాశాల విద్యార్థులకు ఆయన మార్గదర్శనం చేశారు. విద్యార్థులు లక్ష్యాలను సాధించి.. దేశం పేరును ఖండాంతరాలకు చాటాలని పిలుపునిచ్చారు. పత్రికలను ఆసక్తిగా చదివితే కొత్త పదాలు, భాషాభివృద్ధితో పాటు సామాజిక పోకడలు అవగతమవుతాయని విద్యార్థులకు సూచించారు. విద్యార్థి దశలో చెడు వ్యసనాలు అలవాటు చేసుకుంటే..భవిష్యత్తు ఉండదన్నారు. నూతన ఆవిష్కరణలు,కంప్యూటర్ల వినియోగంపై నైపుణ్యం సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి విధానంలో కాకుండా..అర్థం చేసుకుంటూ చదవాలని సూచించారు. ప్రశ్నించే గుణం అలవర్చుకోవాలన్నారు. -
అలా బతికితే చాలు..
లండన్ : జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో తపన పడే వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలరని తాజా అథ్యయనం వెల్లడించింది. అర్ధవంతమైన జీవితం అకాల మరణాన్ని నియంత్రిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేపట్టిన పరిశోధన తెలిపింది. 6985 మందిపై నిర్వహించిన ఈ పరిశోధనలో ఓ లక్ష్యంతో ముందుకెళుతున్న వారిలో అకాల మరణాల రిస్క్ గణనీయంగా తగ్గినట్టు వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన మిచిగన్ స్కూల్‌కు చెందిన డాక్టర్ లీగ్ పియర్స్ పేర్కొన్నారు. జీవితంలో ఏదో సాధించాలనే ధ్యేయంతో ఉన్న వారు ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తూ అవసరమైతే వైద్యులను సంప్రదిస్తుంటారని, ఆరోగ్యకర అలవాట్లను కలిగిఉంటారని తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. అర్ధవంతమైన జీవితం ఆరోగ్యానికి బాటలు పరుస్తుందనే సంస్కృతి జపాన్‌లో వేళ్లూనుకుందని, అక్కడ పుట్టుక నుంచి మరణం వరకూ ఒక సంకల్పం కోసం సంతోషంగా బతికేయాలనే నినాదం వారిలో ఆరోగ్యకర జీవనానికి నాంది పలికిందని చెబుతున్నారు. లక్ష్యాలు, సంకల్పం వ్యక్తులను బట్టి మారినప్పటికీ ప్రతిఒక్కరూ దీర్ఘకాలం ఆరోగ్యంగా బతికేందుకు అర్ధవంతమైన జీవనం అలవరుచుకోవాలని తమ అథ్యయనంలో వెల్లడైందని డాక్టర్ లీగ్ పియర్స్ సూచించారు. -
ఈ గృహలక్ష్మి... చదువుల సరస్వతి
స్ఫూర్తి ఎనభై నాలుగేళ్ళ వయసులో... ఏ మహిళైనా చేసే పనేంటి? అని అడగ్గానే ‘విశ్రాంతి’ అనే పదం ఠక్కున గుర్తొస్తుంది కదూ! అయితే లక్ష్మీబాయి మాత్రం ఇప్పటివరకూ విశ్రాంతి తీసుకోలేదు. కనీసం అలాంటి ఆలోచన కూడా రాలేదామెకు. పనిలో నిమగ్నమైనవాళ్లు విశ్రాంతిని కోరుకోరు. పుంజాల లక్ష్మీబాయి కూడా అంతే... ఇంటి బాధ్యతలు తీరగానే... పుస్తకం పట్టారు. ఎనిమిది పదుల వయసులో పిహెచ్‌డిలు, డీలిట్‌లు చేసి లేటు వయసులోనూ మేటి విద్యార్థినిగా అందరి మన్ననలూ పొందుతున్నారు. కేంద్రమంత్రిగా, వివిధ రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన స్వర్గీయ పి. శివశంకర్ సతీమణి అయిన లక్ష్మీబాయి ఇలా చదువుల తల్లి సరస్వతిని ఆరాధించడం వెనుక పెద్ద కథే ఉంది. లక్ష్మీబాయి తండ్రి రామకృష్ణారావు బ్రిటిష్ పాలనలో ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లా జయపూర్ అనే మారుమూల గ్రామంలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. ఆయనకి చదువంటే ప్రాణం. ఏం లాభం... జయపూర్ చుట్టుపక్కల పాఠశాల అనే పేరే వినిపించేది కాదు. పదకొండుమంది పిల్లల్లో ఒక్కరినైనా పెద్ద చదువు చదివించాలనుకునేవారు. ఆయన కల నెరవేర్చడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు లక్ష్మీబాయి. ఆ మారుమూల గ్రామం నుండే ప్రయివేటుగా పదో తరగతి పరీక్ష రాసి పాసయ్యారు. 1948లో కటక్‌లోని ప్రఖ్యాత ఉత్కళ్ యూనివర్శిటి నుంచి ఇంటర్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి తండ్రి ఆశ నెరవేర్చారు. ‘‘అక్షరం కోసం చిన్నప్పుడు మేం పడ్డ తిప్పలు చదువుపై మరింత మమకారాన్ని పెంచాయి. పదకొండుమందిలో నేనే పెద్దదాన్ని. నా చదువు వివరాలు తెలిసి పి. శివశంకర్‌గారి కుటుంబసభ్యులు మా నాన్నగారిని కలిసి సంబంధం అడిగారు. అప్పటికి శివశంకర్‌గారు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా నన్ను చదువుకోమన్నారు కాని ఉమ్మడి కుటుంబంలో నాకున్న బాధ్యతల దృష్ట్యా చదువుజోలికి పోలేకపోయాను’’ అంటూ తన పెళ్లప్పటి విషయాల్ని గుర్తుచేసుకున్నారు లక్ష్మీబాయి. అమ్మమ్మ అయ్యాక... ‘‘శివశంకర్‌గారి అన్నదమ్ములు ఎనిమిదిమంది. అందరం కలిసే ఉండేవాళ్లం. ఆడవాళ్లెవరికీ ఇంటి పనుల్లో ఊపిరి సలిపేది కాదు. శివశంకర్‌గారు రాజకీయాల్లోకి వెళ్లాక ఇల్లెపుడూ జనాలతో హడావిడిగా ఉండేది. నా మనసప్పుడు పుస్తకాలపైకి పోయేది. చదివిన చదుంతా మరిచిపోతున్నానేమోనని దిగులు ఉండేది. మాకు ఒకమ్మాయి (జలజ), ఇద్దరు అబ్బాయిలు (వినయ్, సుధీర్). నేను అమ్మమ్మను అయ్యాక... చాలావరకూ ఇంటి బాధ్యతలు తీరాయన్న ఫీలింగ్ కలిగింది. ఇంతకుమించిన సమయం ఉండదని చెప్పి ఎం.ఏ చదవడానికి సిద్ధపడ్డాను. సుదీర్ఘ విరామం తర్వాత 1990లో ఫిలాసఫీలో ఎం.ఎ పూర్తిచేశాను. అప్పటికి నా వయసు అరవైదాటింది. 1992లో భగవద్గీతపై ‘ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఫర్ లైఫ్ ఎడ్యుకేషన్ ఫ్రం భగవద్గీత’ అనే అంశంపై పిహెచ్డి చేసి ఉస్మానియా యూనివర్శిటీ నుంచి డాక్డరేట్ కూడా పొందాను’’ అని చెబుతున్నప్పుడు ఎనిమిది పదులు దాటిన లక్ష్మీబాయి ముఖంలో ఓ యువ విద్యార్థిని కనిపించింది. ఎపుడెప్పుడు చదువులు ముగుస్తాయా? అని ఎదురుచూస్తుంటాం, అలాంటిది విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో మెదడుకి పని చెప్పారు లక్ష్మీబాయి. లక్ష్మీ ‘కళ’... మనుమలు, మనుమరాళ్లతో కాలక్షేపం చేస్తూనే పుస్తకం పట్టిన లక్ష్మీబాయి ఎంబ్రాయిడరీ ఆర్ట్‌లో ఆరితేరిన కళాకారిణి. తన కంట పడ్డ ఏ డిజైన్‌నూ వదిలిపెట్టరు. ఇంట్లో ఏ గోడకు చూసినా ఆమె తయారుచేసిన ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ఈ వయసులో కూడా ఇంట్లో తన పనులన్నీ చకచకా చేసుకోవడం వెనకున్న రహస్యమేమిటని అడిగితే. ‘‘ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి. మానసిక ఆరోగ్యం అంటారా...దానికి కూడా తగినంత పని ఉంటే అది కూడా మనం బతికున్నంతకాలం చురుగ్గానే ఉంటుంది’’ అని అంటారు లక్ష్మీబాయి నవ్వుతూ. రెండు డీలిట్‌లు... ఈ చదువులతల్లి రెండు డీలిట్‌లు పూర్తిచేశారు. మొదటిది... ‘ఎ ఫర్ఫెక్ట్ మ్యాన్ ఆఫ్ భగవద్గీత... ఫిలసాఫికల్ ఎడ్యుకేషన్ అండ్ లిట్రరరీ అప్రిసియేషన్’. ఆరేళ్లక్రితం రెండవది...‘స్పిరిచ్యువల్ గ్లోరీ ఆఫ్ ఇతిహాసాస్ అండ్ పురాణాస్’. ‘‘నా చదువు విషయంలో పిల్లలు, మనుమలు అందరూ ప్రోత్సహిస్తారు. నా వయసుని మరిపింపచేస్తున్నది కూడా చదువేనని వారు కూడా గ్రహించడంతో ‘వాట్ నెక్ట్స్’ అంటున్నారు’’ అని చిరునవ్వుతో చెప్పారు లక్ష్మీబాయి. ఎనభై పదులు దాటిన వయసులో ఇంటి పని, వంట పని, విద్యాభ్యాసం...ఈ పనులు చేయడానికి పాతికేళ్ల వయసుకే చేతులెత్తేస్తున్నవారికి లక్ష్మీబాయి ఆదర్శంగా నిలుస్తారు. నిండు నూరేళ్లు ఈ లక్ష్మిని సరస్వతి వరిస్తూనే ఉండాలని కోరుకుందాం. - భువనేశ్వరి, ఫొటో: ఎమ్. అనిల్