ఈ గృహలక్ష్మి... చదువుల సరస్వతి | she 80years but she is intrested for study | Sakshi
Sakshi News home page

ఈ గృహలక్ష్మి... చదువుల సరస్వతి

Published Tue, Jun 3 2014 11:59 PM | Last Updated on Fri, Nov 9 2018 6:22 PM

ఈ గృహలక్ష్మి... చదువుల సరస్వతి - Sakshi

ఈ గృహలక్ష్మి... చదువుల సరస్వతి

స్ఫూర్తి
ఎనభై నాలుగేళ్ళ వయసులో... ఏ మహిళైనా చేసే పనేంటి? అని అడగ్గానే ‘విశ్రాంతి’ అనే పదం ఠక్కున గుర్తొస్తుంది కదూ! అయితే లక్ష్మీబాయి మాత్రం ఇప్పటివరకూ విశ్రాంతి తీసుకోలేదు. కనీసం అలాంటి ఆలోచన కూడా రాలేదామెకు. పనిలో నిమగ్నమైనవాళ్లు విశ్రాంతిని కోరుకోరు. పుంజాల లక్ష్మీబాయి కూడా అంతే... ఇంటి బాధ్యతలు తీరగానే... పుస్తకం పట్టారు. ఎనిమిది పదుల వయసులో పిహెచ్‌డిలు, డీలిట్‌లు చేసి లేటు వయసులోనూ మేటి విద్యార్థినిగా అందరి మన్ననలూ పొందుతున్నారు. కేంద్రమంత్రిగా, వివిధ రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన స్వర్గీయ పి. శివశంకర్ సతీమణి అయిన లక్ష్మీబాయి ఇలా చదువుల తల్లి  సరస్వతిని ఆరాధించడం వెనుక పెద్ద కథే ఉంది.
 
లక్ష్మీబాయి తండ్రి రామకృష్ణారావు బ్రిటిష్ పాలనలో ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లా జయపూర్ అనే మారుమూల గ్రామంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. ఆయనకి చదువంటే ప్రాణం. ఏం లాభం... జయపూర్ చుట్టుపక్కల పాఠశాల అనే పేరే వినిపించేది కాదు. పదకొండుమంది పిల్లల్లో ఒక్కరినైనా పెద్ద చదువు చదివించాలనుకునేవారు. ఆయన కల నెరవేర్చడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు లక్ష్మీబాయి. ఆ మారుమూల గ్రామం నుండే ప్రయివేటుగా పదో తరగతి పరీక్ష రాసి పాసయ్యారు.

1948లో కటక్‌లోని ప్రఖ్యాత ఉత్కళ్ యూనివర్శిటి నుంచి ఇంటర్, బెనారస్ హిందూ  విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి తండ్రి ఆశ నెరవేర్చారు. ‘‘అక్షరం కోసం చిన్నప్పుడు మేం పడ్డ తిప్పలు చదువుపై మరింత మమకారాన్ని పెంచాయి. పదకొండుమందిలో నేనే పెద్దదాన్ని. నా చదువు వివరాలు తెలిసి పి. శివశంకర్‌గారి కుటుంబసభ్యులు మా నాన్నగారిని కలిసి సంబంధం అడిగారు. అప్పటికి శివశంకర్‌గారు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా నన్ను చదువుకోమన్నారు కాని ఉమ్మడి కుటుంబంలో నాకున్న బాధ్యతల దృష్ట్యా చదువుజోలికి పోలేకపోయాను’’ అంటూ తన పెళ్లప్పటి విషయాల్ని గుర్తుచేసుకున్నారు లక్ష్మీబాయి.

అమ్మమ్మ అయ్యాక...
‘‘శివశంకర్‌గారి అన్నదమ్ములు ఎనిమిదిమంది. అందరం కలిసే ఉండేవాళ్లం. ఆడవాళ్లెవరికీ ఇంటి పనుల్లో ఊపిరి సలిపేది కాదు. శివశంకర్‌గారు రాజకీయాల్లోకి వెళ్లాక ఇల్లెపుడూ జనాలతో హడావిడిగా ఉండేది. నా మనసప్పుడు పుస్తకాలపైకి పోయేది. చదివిన చదుంతా మరిచిపోతున్నానేమోనని దిగులు ఉండేది. మాకు ఒకమ్మాయి (జలజ), ఇద్దరు అబ్బాయిలు (వినయ్, సుధీర్). నేను అమ్మమ్మను అయ్యాక... చాలావరకూ ఇంటి బాధ్యతలు తీరాయన్న ఫీలింగ్ కలిగింది. ఇంతకుమించిన సమయం ఉండదని చెప్పి ఎం.ఏ చదవడానికి సిద్ధపడ్డాను.

సుదీర్ఘ విరామం తర్వాత 1990లో ఫిలాసఫీలో ఎం.ఎ పూర్తిచేశాను. అప్పటికి నా వయసు అరవైదాటింది. 1992లో భగవద్గీతపై ‘ఫిలసాఫికల్ ఫౌండేషన్ ఫర్ లైఫ్ ఎడ్యుకేషన్ ఫ్రం భగవద్గీత’ అనే అంశంపై పిహెచ్‌డి చేసి ఉస్మానియా యూనివర్శిటీ నుంచి డాక్డరేట్ కూడా పొందాను’’ అని చెబుతున్నప్పుడు ఎనిమిది పదులు దాటిన లక్ష్మీబాయి ముఖంలో ఓ యువ విద్యార్థిని కనిపించింది. ఎపుడెప్పుడు చదువులు ముగుస్తాయా? అని ఎదురుచూస్తుంటాం, అలాంటిది విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో మెదడుకి పని చెప్పారు లక్ష్మీబాయి.
 
లక్ష్మీ ‘కళ’...
మనుమలు, మనుమరాళ్లతో కాలక్షేపం చేస్తూనే పుస్తకం పట్టిన లక్ష్మీబాయి ఎంబ్రాయిడరీ ఆర్ట్‌లో ఆరితేరిన కళాకారిణి. తన కంట పడ్డ ఏ డిజైన్‌నూ వదిలిపెట్టరు. ఇంట్లో ఏ గోడకు చూసినా ఆమె తయారుచేసిన ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ఈ వయసులో కూడా ఇంట్లో తన పనులన్నీ చకచకా చేసుకోవడం వెనకున్న రహస్యమేమిటని అడిగితే. ‘‘ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలి. మానసిక ఆరోగ్యం అంటారా...దానికి కూడా తగినంత పని ఉంటే అది కూడా మనం బతికున్నంతకాలం చురుగ్గానే ఉంటుంది’’ అని అంటారు లక్ష్మీబాయి నవ్వుతూ.

రెండు డీలిట్‌లు...
ఈ చదువులతల్లి రెండు డీలిట్‌లు పూర్తిచేశారు. మొదటిది... ‘ఎ ఫర్‌ఫెక్ట్ మ్యాన్ ఆఫ్ భగవద్గీత... ఫిలసాఫికల్ ఎడ్యుకేషన్ అండ్ లిట్రరరీ అప్రిసియేషన్’. ఆరేళ్లక్రితం రెండవది...‘స్పిరిచ్యువల్ గ్లోరీ ఆఫ్ ఇతిహాసాస్ అండ్ పురాణాస్’. ‘‘నా చదువు విషయంలో పిల్లలు, మనుమలు అందరూ ప్రోత్సహిస్తారు.  నా వయసుని మరిపింపచేస్తున్నది కూడా చదువేనని వారు కూడా గ్రహించడంతో ‘వాట్ నెక్ట్స్’ అంటున్నారు’’ అని చిరునవ్వుతో చెప్పారు లక్ష్మీబాయి. ఎనభై పదులు దాటిన వయసులో ఇంటి పని, వంట పని, విద్యాభ్యాసం...ఈ పనులు చేయడానికి పాతికేళ్ల వయసుకే చేతులెత్తేస్తున్నవారికి లక్ష్మీబాయి ఆదర్శంగా నిలుస్తారు. నిండు నూరేళ్లు ఈ లక్ష్మిని సరస్వతి వరిస్తూనే ఉండాలని కోరుకుందాం.
         
 - భువనేశ్వరి,
 ఫొటో: ఎమ్. అనిల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement