లండన్ : జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో తపన పడే వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలరని తాజా అథ్యయనం వెల్లడించింది. అర్ధవంతమైన జీవితం అకాల మరణాన్ని నియంత్రిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేపట్టిన పరిశోధన తెలిపింది. 6985 మందిపై నిర్వహించిన ఈ పరిశోధనలో ఓ లక్ష్యంతో ముందుకెళుతున్న వారిలో అకాల మరణాల రిస్క్ గణనీయంగా తగ్గినట్టు వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన మిచిగన్ స్కూల్‌కు చెందిన డాక్టర్ లీగ్ పియర్స్ పేర్కొన్నారు.
జీవితంలో ఏదో సాధించాలనే ధ్యేయంతో ఉన్న వారు ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తూ అవసరమైతే వైద్యులను సంప్రదిస్తుంటారని, ఆరోగ్యకర అలవాట్లను కలిగిఉంటారని తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. అర్ధవంతమైన జీవితం ఆరోగ్యానికి బాటలు పరుస్తుందనే సంస్కృతి జపాన్‌లో వేళ్లూనుకుందని, అక్కడ పుట్టుక నుంచి మరణం వరకూ ఒక సంకల్పం కోసం సంతోషంగా బతికేయాలనే నినాదం వారిలో ఆరోగ్యకర జీవనానికి నాంది పలికిందని చెబుతున్నారు. లక్ష్యాలు, సంకల్పం వ్యక్తులను బట్టి మారినప్పటికీ ప్రతిఒక్కరూ దీర్ఘకాలం ఆరోగ్యంగా బతికేందుకు అర్ధవంతమైన జీవనం అలవరుచుకోవాలని తమ అథ్యయనంలో వెల్లడైందని డాక్టర్ లీగ్ పియర్స్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment