ప్రతీకాత్మక చిత్రం
లండన్ : విడాకుల కారణంగా ఒంటరి జీవితంతో సహవాసం ప్రాణాలతో చెలగాటమేనని తాజా అథ్యయనం వెల్లడించింది. విడాకులు తీసుకున్న వారిలో అకాల మరణం ముప్పు 47 శాతం అధికమని పరిశోధన వెల్లడించింది. జీవిత భాగస్వామి ఎడబాటుతో పొగతాగడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో అకాల మరణాల ముప్పు ముంచుకొస్తుందని అథ్యయనం తెలిపింది. జీవితంలో తృప్తి కొరవడటంతో వీరు దురలవాట్లకు లోనయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఆరోగ్యకర జీవనశైలికి కట్టుబడేలా చేసే జీవిత భాగస్వామి లేకపోవడంతో విడాకులు పొందిన వారు త్వరగా మరణించే ముప్పుందని గత పరిశోధనల్లోనూ వెల్లడైంది. జీవిత భాగస్వాముల్లో ఒకరికి పొగతాగే అలవాటు ఉండి, వేరొకరికి లేకుంటే ఒకరి ప్రవర్తనను మరొకరు ప్రభావితం చేస్తారని ఊహించవచ్చని పరిశోధన చేపట్టిన యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా శాస్త్రవేత్త కీల్ బొరసా చెప్పారు. విడాకులతో ఈ సంబంధాలకు తెరపడినప్పుడు మన ఆరోగ్య అలవాట్లపై కీలక సామాజిక నియంత్రణను కోల్పోతామని అన్నారు. పొగతాగుతూ, వ్యాయామం చేయని వారు తమ జీవనశైలిని సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విడిపోయిన వారిలో ఆహారం, మద్యం తీసుకునే తీరు ఎలా ఉందన్న వివరాలపై భవిష్యత్‌లో పరిశోధనలు చేపట్టాలని అన్నారు.
మానసికంగా సంతృప్తికరమైన జీవితం శారీరక ఆరోగ్యంపై మెరుగైన ప్రభావం చూపుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందన్నారు. 5786 మందిపై పరిశోధకులు చేపట్టిన ఈ అథ్యయన వివరాలు జర్నల్ అనాల్స్ ఆఫ్ బిహేవియరల్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment