early death
-
హీరో భార్య మృతి, చిన్నవయసులోనే గుండెజబ్బులు..ఎందుకిలా?
ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెకేషన్‌కు వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచింది. స్పందన ఆకస్మిక మరణం ఆమె కుటుంబ సభ్యులను,శాండల్‌వుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమో వయస్సు కేవలం 44 ఏళ్లు మాత్రమే. ఒకప్పుడు గుండెజబ్బులు, డయాబెటీస్ వంటి రోగాలు వయసు పైబడిన వారిలోనే కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. 60ఏళ్లలో వచ్చే వ్యాధులు కూడా 30-40లోనే పలకరిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇండియాలో 25 శాతం గుండెపోటు కేసులు 40 ఏళ్ల లోపు వారిలోనే నమోదవుతున్నాయి. అసలు చిన్న వయస్సులోనే గుండెజబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి హార్ట్ ఎటాక్ వస్తే ప్రాణాలు పోయినట్లేనా? ఈ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నవయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఒకప్పుడు 60లో వచ్చే గుండెజబ్బులు ఇప్పుడు టీనేజీ పిల్లలను కూడా కబలిస్తున్నాయి. గుండెపోటు లక్షణాలను మొదట్లోనే గుర్తించకపోవడం కారణంగా చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, కలుషిత ఆహారం, సమయ పాలన లేకపోవడం, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, ఇతర అనారోగ్య సమస్యలు గుండెపోటుకు ప్రధానంగా కారణమవుతున్నట్లు పలువురు వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మరోవైపు కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు స్ట్రోక్‌కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ గుండెజబ్బులకి కరోనాయే కారణం అని చెప్పే ఆధారాలు లేవని చెబుతున్నా, కోవిడ్‌తో శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పు కూడా పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. డయాబెటీస్ కారణమా? ఇటీవల జరిపిన ఓ పరిశోధన ప్రకారం.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే దక్షిణాసియా దేశాల ప్రజల్లోనే గుండె సమస్యలతో బాధపడేవారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నట్లు తేలింది. ఇందుకు జీన్స్ మాత్రమే కాదు.. మారుతున్న జీవన శైలి కూడా కారణమని పరిశోధకులు తేల్చి చెప్పారు.2030 నాటికి ఇండియాలో 80 మిలియన్ మంది డయాబెటీస్‌తో బాధపడుతుంటారని అంచనా. మన దేశ జనాభాలో సుమారు 10శాతం యువత ఇప్పటికే పలు లైఫ్‌స్టైల్ డిజార్డర్లతో బాధపడుతున్నట్లు తేలింది. దీనికి ఉప్పు, కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని అతిగా తీసుకోవడం కూడా ఒక కారణం.వీటి వల్ల శరీరంలో చెడు కొవ్వులు, హైపర్ టెన్షన్ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. చిన్న వయసులోనే గుండెజబ్బు రావడానికి మరో కారణం.. డయాబెటీస్(మధుమేహం). డయాబెటీస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ధమనుల్లో రక్తం గడ్డకడుతుంది. వీటినే బ్లడ్‌క్లాట్స్ అంటారు. రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెకు వెళ్లే రక్త ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా గుండె నొప్పి వస్తుంది. ఇక ధూమపానం, మధ్యపానం వంటి చెడు అలవాట్లు కూడా గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇప్పట్లో యూత్ చిన్న వయసులోనే స్మోకింగ్, డ్రింకింగ్‌ను అలవాటు చేసుకుంటున్నారు. ఇది మితిమీరి గుండెపోటుకు కారణం అవుతుంది. గుండెనొప్పి సంకేతాలు ఇలా గుండె చాలా భారంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది రక్తం సరఫరా తగ్గి గుండెలో మంటగా ఉంటుంది. మత్తుగా ఉండి, చెమటలు ఎక్కువగా పడుతాయి. తీవ్రమైన అలసట, ఛాతి దగ్గర నొప్పి వస్తే అస్సలు నిర్లక్యం చేయొద్దు. రీర పైభాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే గుండెనొప్పికి సంకేతంగా భావించవచ్చు. గుండె ఆరోగ్యం మీ చేతిలోనే.. ►గుండెజబ్బులు రాకుండా ముందునుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి ► మీ కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం, గుండె జబ్బులు ఉన్నట్లయితే ముందస్తుగా స్క్రీనింగ్ చేయించుకోవాలి ► ఆరోగ్యానికి హాని చేసే ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ► వ్యాయామం చేస్తే మంచిదే కదా అని అతిగా చేయకూడదు. ఇది గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది ► ఒత్తిడి,సరైన నిద్ర లేకపోవడం కూడా గుండెజబ్బులకు మరో కారణం ► కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు డైట్లో ఉండేలా చూసుకోవాలి -
మరణం దరి చేరకుండా ఉండాలంటే.
వాషింగ్టన్: అనారోగ్య కారణాలతో మరణం దరి చేరకుండా ఉండాలంటే..రోజూ పరుగు తీయాల్సిందే అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. ముఖ్యంగా హృద్రోగులు, కేన్సర్ బాధితులు వారానికి కనీసం 25 నిమిషాలు రన్నింగ్/జాగింగ్ చేస్తే ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చని చెబుతున్నారు. తద్వారా వారికి ఆయా వ్యాధులతో మరణం వచ్చే అవకాశాలు 27 శాతం తగ్గుతాయని పేర్కొన్నారు. ఐదున్నరేళ్ల నుంచి 35 ఏళ్లలోపు 2,32,149 మంది జీవనశైలి, దినచర్య, ఆరోగ్య నివేదికల పరిశీలన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. వ్యాయామానికి బాటలు వేస్తే వ్యాధులకు చెక్ దేశంలో మధుమేహం, కేన్సర్, హృద్రోగాల వ్యాప్తికి అడ్డుకట్ట పడాలంటే నగరాల్లో పర్యావరణ పరిరక్షణ,మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సూచించింది. కొరవడిన శారీరక వ్యాయామం, ముసురుకుంటున్న కాలుష్యం ప్రజలను వ్యాధిగ్రస్తుల్లా మారుస్తోందని తెలిపింది. దీంతో పడిపోతున్న ప్రజల ఆయుర్దాయాన్ని పెంచాలంటే నగరపాలక సంస్థలు ఇకనైనా మేల్కొనాలని కోరింది. రోడ్లపై పాదచారుల వంతెనలు, వాకింగ్/జాగింగ్ చేసేవారి కోసం రోడ్ల పక్కన కుర్చీలు, ఉద్యానవనాల అభివృద్ధిపై దృష్టి సారించాలని నివేదించింది. వెన్నునొప్పి, నిద్రలేమికి యోగా, పీటీతో చెక్ వెన్నునొప్పి, నిద్రలేమి సమస్యలకు యోగా, ఫిజికల్ థెరపీ (పీటీ) తో కళ్లెం వేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమస్యలకు వైద్యం తీసుకునే అవసరాన్ని కూడా యోగా, పీటీ తగ్గిస్తాయని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక వెన్నునొప్పి, నిద్రలేమి సమస్య ఉన్న 320 మందికి ఓ థెరపిస్టు దగ్గర 12 వారాల పాటు యోగా, పీటీ చేయించారు. అనంతరం వారిలో ఈ సమస్య గణనీయంగా తగ్గినట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. నిద్రలేమి, వెన్నునొప్పి సమస్యలకు వాడే మందులతో దుష్ప్రభావం పడొచ్చని, దీంతోపాటు అతిగా మందులు వాడే ప్రమాదం ఏర్పడవచ్చని, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవ్చని హెచ్చరించారు. -
వీటితో అకాల మరణాలకు చెక్
లండన్ : బీపీని అదుపులో ఉంచుకుని ఉప్పు, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉంటే రానున్న 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2040 నాటికి గుండె జబ్బులను ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా పెద్ద ఎత్తున నియంత్రించవచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఉప్పు, కొవ్వు పదార్ధాలతో తయారయ్యే ప్రాసెస్డ్ ఆహారాన్ని అధికంగా తీసుకుంటే రక్తపోటు తీవ్రమై గుండె జబ్బులకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బీపీని చికిత్స ద్వారా నియంత్రించడం వల్ల కోట్లాది మందిని అకాల మృత్యువాత పడకుండా కాపాడవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. బీపీకి సరైన చికిత్స ద్వారా 4 కోట్ల మందిని, ఉప్పు వాడకం తగ్గించడం ద్వారా మరో 4 కోట్ల మందిని మరణాల ముప్పు నుంచి తప్పించవచ్చని హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధక బృందం వెల్లడించింది. ఇక కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండటం ద్వారా 2040 నాటికి రెండు కోట్ల మందిని మృత్యువు అంచు నుంచి బయటపడవేయవచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పలు అథ్యయనాల్లో వెల్లడైన గణాంకాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పరిశోధకులు ఈ అథ్యయనం చేపట్టారు. -
అలా బతికితే చాలు..
లండన్ : జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో తపన పడే వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలరని తాజా అథ్యయనం వెల్లడించింది. అర్ధవంతమైన జీవితం అకాల మరణాన్ని నియంత్రిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేపట్టిన పరిశోధన తెలిపింది. 6985 మందిపై నిర్వహించిన ఈ పరిశోధనలో ఓ లక్ష్యంతో ముందుకెళుతున్న వారిలో అకాల మరణాల రిస్క్ గణనీయంగా తగ్గినట్టు వెల్లడైందని అథ్యయనానికి నేతృత్వం వహించిన మిచిగన్ స్కూల్‌కు చెందిన డాక్టర్ లీగ్ పియర్స్ పేర్కొన్నారు. జీవితంలో ఏదో సాధించాలనే ధ్యేయంతో ఉన్న వారు ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తూ అవసరమైతే వైద్యులను సంప్రదిస్తుంటారని, ఆరోగ్యకర అలవాట్లను కలిగిఉంటారని తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. అర్ధవంతమైన జీవితం ఆరోగ్యానికి బాటలు పరుస్తుందనే సంస్కృతి జపాన్‌లో వేళ్లూనుకుందని, అక్కడ పుట్టుక నుంచి మరణం వరకూ ఒక సంకల్పం కోసం సంతోషంగా బతికేయాలనే నినాదం వారిలో ఆరోగ్యకర జీవనానికి నాంది పలికిందని చెబుతున్నారు. లక్ష్యాలు, సంకల్పం వ్యక్తులను బట్టి మారినప్పటికీ ప్రతిఒక్కరూ దీర్ఘకాలం ఆరోగ్యంగా బతికేందుకు అర్ధవంతమైన జీవనం అలవరుచుకోవాలని తమ అథ్యయనంలో వెల్లడైందని డాక్టర్ లీగ్ పియర్స్ సూచించారు. -
ఎక్కువైనా.. తక్కువైనా ముప్పే
టోక్యో: అతి నిద్ర, నిద్రలేమి రెండూ హృదయ సంబంధ వ్యాధులకు కారణాలవుతున్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. రోజులో సాధారణంగా కావలసిన నిద్రకన్నా ఎక్కువ నిద్రపోయేవారిలో ముందస్తు మరణాలు, మెదడులో రక్తనాళ సమస్యలు కలుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సహజ నిద్ర సమయంకన్నా ఎక్కువగా అంటే 8 నుంచి 9 గంటలు నిద్రపోయేవారిలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం 5 శాతం ఉండగా, 9 నుంచి పది గంటలు నిద్రపోయేవారిలో 17 శాతంగా ఉందని చెబుతున్నారు. రోజుకు ఆరు లేదా అంతకన్నా తక్కువ నిద్రపోయే వారిలోనూ ఈ ప్రమాద శాతం 9 శాతంగా ఉంది. రాత్రి సమయంలో ఆరు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్రపోయేవారిలో గుండె సంబంధ వ్యాధుల ప్రభావానికి గురయ్యే అవకాశం 9.4 శాతంగా ఉందని చెబుతున్నారు. అయితే హృదయ సంబంధ వ్యాధులన్నింటికీ నిద్రే ప్రధాన కారణమని చెప్పలేం అని యురోపియన్ హార్ట్ జర్నల్ చెబుతోంది. అయితే అతి నిద్ర, నిద్రలేమి కచ్చితంగా గుండెకారక వ్యాధులపై ప్రభావం చూపేవేనని ఆ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల నుంచి 35 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న 1,16,000 మందిపై ఈ పరిశోధన చేశారు. ఇందులో ఉత్తర అమెరికా, యూరప్, దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, చైనా, ఆఫ్రికా దేశాలనుంచి ఉన్నారు. ఎనిమిదేళ్ల కాలానికి పరిశోధనను తీసుకుంటే సుమారుగా 4,381 మంది మరణించగా, 4,365 మంది తీవ్ర హృదయ సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నారని వారు చెప్పారు. -
అవి తీసుకున్నా ఎక్కువకాలం బతకొచ్చు..
లండన్ : మితంగా మద్యం తీసుకుంటే మేలని ఇప్పటికే పలు అథ్యయనాలు వెల్లడించగా, బీరు, వైన్, చాక్లెట్లతో అకాల మరణం ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. మద్యంతో పాటు పండ్లు, కూరగాయలను పుష్కలంగా తీసుకుంటేనే వీటి ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉంటాయని వార్సా యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. రెడ్ మీట్, శీతల పానీయాలు, ప్రాసెస్డ్ ఆహారం తీసుకునేవారితో పోలిస్తే పండ్లు, కూరగాయలతో పాటు వైన్, బీరు, చాక్లెట్లను పరిమితంగా తీసుకున్నవారిలో అకాల మరణాల ముప్పు 15 నుంచి 20 శాతం తక్కువగా ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందని అథ్యయన రచయిత ప్రొఫెసర్ జొన్నా కలూజా చెప్పారు. పండ్లు, కూరగాయలు, రెడ్ వైన్, బీర్, చాక్లెట్లలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులకు దారితీసే ఇన్ఫ్లమేషన్ (వాపు)ను నివారిస్తాయని ఫలితంగా అకాల మరణం ముప్పు తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. 45 నుంచి 83 ఏళ్ల సంవత్సరాలున్న 68,273 మందిపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారం తీసుకున్న వారిలో అకాల మరణాలు వీటిని తక్కువ మోతాదులో తీసుకున్న వారితో పోలిస్తే 18 శాతం తక్కువగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. వీరిలో గుండె జబ్బుల మరణాల ముప్పు 20 శాతం, క్యాన్సర్ మరణాలు 13 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. -
చేపలతో ఆ వ్యాధులకు చెక్
లండన్ : చేపలను తరచూ తీసుకుంటే అకాల మరణాల ముప్పు 40 శాతం వరకూ తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. చేపల్లో ఉండే ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపును తగ్గిస్తాయని, ఫలితంగా క్యాన్సర్, గుండెజబ్బుల బారిన పడే ముప్పు ఉండదని గత అథ్యయనాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే తాజా అథ్యయనంలో చేపలను తరచూ తీసుకునే పురుషుల్లో కాలేయ వ్యాధులతో పురుషుల్లో మరణించే ముప్పు 37 శాతంమేర తగ్గుతుందని, అల్జీమర్స్ కారణంగా మహిళల్లో మరణాల ముప్పు 38 శాతం మేర తగ్గుతుందని తేలింది. చైనాకు చెందిన జెజాంగ్ యూనివర్సిటీ 16 ఏళ్ల పాటు 2,40,729 మంది పురుషులు, 1,80,580 మంది మహిళల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యాన్ని విశ్లేషించిన అనంతరం ఈ వివరాలు వెల్లడించింది. అథ్యయన సమయంలో 54,230 మంది పురుషులు, 30,882 మంది మహిళలు మరణించారు. చేపలను అధికంగా తీసుకున్న పురుషుల్లో గుండె జబ్బులతో మరణించడం పది శాతం, క్యాన్సర్ మరణాలు ఆరు శాతం, ఊపిరితిత్తుల వ్యాధులతో మరణాలు 20 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. మహిళల్లోనూ చేపలను ఆహారంగా తీసుకున్న వారిలో హృద్రోగాలతో మరణించే ముప్పు పది శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఒమేగా-3ని ఆహారంలో అధికంగా తీసుకునే స్ర్తీ, పురుషుల్లో హృద్రోగాల కారణంగా మరణాల ముప్పు వరుసగా 15, 18 శాతం తక్కువగా ఉందని గుర్తించారు. అయితే చేపలను ఫ్రై కాకుండా ఉడికించి తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు స్పష్టం చేశారు. -
విడిపోతే ఆ ముప్పు అధికం..
లండన్ : విడాకుల కారణంగా ఒంటరి జీవితంతో సహవాసం ప్రాణాలతో చెలగాటమేనని తాజా అథ్యయనం వెల్లడించింది. విడాకులు తీసుకున్న వారిలో అకాల మరణం ముప్పు 47 శాతం అధికమని పరిశోధన వెల్లడించింది. జీవిత భాగస్వామి ఎడబాటుతో పొగతాగడం, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో అకాల మరణాల ముప్పు ముంచుకొస్తుందని అథ్యయనం తెలిపింది. జీవితంలో తృప్తి కొరవడటంతో వీరు దురలవాట్లకు లోనయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఆరోగ్యకర జీవనశైలికి కట్టుబడేలా చేసే జీవిత భాగస్వామి లేకపోవడంతో విడాకులు పొందిన వారు త్వరగా మరణించే ముప్పుందని గత పరిశోధనల్లోనూ వెల్లడైంది. జీవిత భాగస్వాముల్లో ఒకరికి పొగతాగే అలవాటు ఉండి, వేరొకరికి లేకుంటే ఒకరి ప్రవర్తనను మరొకరు ప్రభావితం చేస్తారని ఊహించవచ్చని పరిశోధన చేపట్టిన యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా శాస్త్రవేత్త కీల్ బొరసా చెప్పారు. విడాకులతో ఈ సంబంధాలకు తెరపడినప్పుడు మన ఆరోగ్య అలవాట్లపై కీలక సామాజిక నియంత్రణను కోల్పోతామని అన్నారు. పొగతాగుతూ, వ్యాయామం చేయని వారు తమ జీవనశైలిని సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. విడిపోయిన వారిలో ఆహారం, మద్యం తీసుకునే తీరు ఎలా ఉందన్న వివరాలపై భవిష్యత్‌లో పరిశోధనలు చేపట్టాలని అన్నారు. మానసికంగా సంతృప్తికరమైన జీవితం శారీరక ఆరోగ్యంపై మెరుగైన ప్రభావం చూపుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందన్నారు. 5786 మందిపై పరిశోధకులు చేపట్టిన ఈ అథ్యయన వివరాలు జర్నల్ అనాల్స్ ఆఫ్ బిహేవియరల్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి. -
ఒంటరితనం.. ఓ మృత్యు కౌగిలి
వాషింగ్టన్: ఒంటరితనం ఓ ఫీలింగ్ మాత్రమే కాదు.. ఇది శారీరక మార్పులకు కారణమవ్వడమే కాక.. మరణానికి దగ్గరయ్యేలా చేస్తుందట. వృద్ధుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుందట. అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు పెరగడానికి సాంఘిక ఒంటరితనం ప్రధాన కారణమని, దీనివల్ల వృద్ధుల్లో ముందుగానే మరణం సంభవించడానికి 14 శాతం అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఒంటరితనానికి.. కన్సర్వుడ్ ట్రాన్స్క్రిప్షనల్ రెస్పాన్స్ టు ఎడ్వర్సిటీ(సీటీఆర్ఏ)కి సంబంధం ఉందని గత పరిశోధనల ఆధారంగా ఈ బృందం గుర్తించింది. అయితే ఒంటరితనం ప్రతికూల ఆరోగ్య ఫలితాలకు కారణమవుతుందనే అంశంపై మాత్రం ఎవరికీ అవగాహన పెద్దగా లేదు. ఇదే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ షికాగో సైకాలజిస్ట్ జాన్ కాకివొప్పొ నేతృత్వంలోని బృందం పరిశోధనలు జరిపింది. ఒంటరితనం వల్ల కలిగే శారీరక మార్పులు వాటి కారణంగా ఎదురయ్యే దుష్పరిణామాలపై వీరు ప్రధానంగా దృష్టి సారించారు. ఒంటరితనానికి సంబంధించి మనుషులతో పాటు రీసస్ మకాక్స్ అనే జాతి కోతులపైనా అధ్యయనం చేశారు. 2002లో 50 నుంచి 68 ఏళ్ల వ్యక్తులపై ఈ అధ్యయనాన్ని ప్రారంభించారు. ఈ పరిశోధనల్లో ఒంటరితనం అనుభవించే వారిలో రోగ నిరోధక ప్రతిస్పందనలు తక్కువగా ఉంటాయని, అదే సమయంలో వారిలో ఒంటరితనం అనుభవించని వారికంటే నొప్పి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. ఈ నేపథ్యంలో కణాలలో జన్యు మార్పులు, బ్యాక్టీరియా, వైరస్ల నుంచి శరీరాన్ని కాపాడే రోగ నిరోధక శక్తికి సంబంధించిన సెల్స్ ఏవిధంగా పనిచేస్తున్నాయనే దానిపై అధ్యయనం జరిపారు. ఈ పరిశోధనలో ఒంటరితనం కారణంగా శరీరంపై పడే పలు దుష్పరిణామాలు వెలుగుచూశాయి. ఒంటరితనం వల్ల శరీరంలో తెల్లరక్త కణాల ఉత్పత్తి తగ్గిపోయి రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత ఒంటరితనం.. భవిష్యత్‌లో సీటీఆర్ఏ జన్యు ప్రక్రియను అంచనా వేస్తుందని, అలాగే ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత సీటీఆర్ఏ జన్యు ప్రక్రియ ఒంటరితనం పరిణామాలను అంచనా వేస్తుందని గుర్తించారు. కణాల జన్యు పరిణామాలు, ఒంటరితనం ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయని, కాలక్రమంలో ఇవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయని కూడా గుర్తించారు. ఈ పరిశోధన ఒంటరితనానికి మాత్రమే పరిమితమని, నిరాశ, ఒత్తిడి, సామాజిక మద్దతు మొదలైన అంశాలకు దీనికి సంబంధం లేదని పరిశోధకులు పేర్కొన్నారు.