టోక్యో: అతి నిద్ర, నిద్రలేమి రెండూ హృదయ సంబంధ వ్యాధులకు కారణాలవుతున్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. రోజులో సాధారణంగా కావలసిన నిద్రకన్నా ఎక్కువ నిద్రపోయేవారిలో ముందస్తు మరణాలు, మెదడులో రక్తనాళ సమస్యలు కలుగుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సహజ నిద్ర సమయంకన్నా ఎక్కువగా అంటే 8 నుంచి 9 గంటలు నిద్రపోయేవారిలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం 5 శాతం ఉండగా, 9 నుంచి పది గంటలు నిద్రపోయేవారిలో 17 శాతంగా ఉందని చెబుతున్నారు. రోజుకు ఆరు లేదా అంతకన్నా తక్కువ నిద్రపోయే వారిలోనూ ఈ ప్రమాద శాతం 9 శాతంగా ఉంది. రాత్రి సమయంలో ఆరు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్రపోయేవారిలో గుండె సంబంధ వ్యాధుల ప్రభావానికి గురయ్యే అవకాశం 9.4 శాతంగా ఉందని చెబుతున్నారు.
అయితే హృదయ సంబంధ వ్యాధులన్నింటికీ నిద్రే ప్రధాన కారణమని చెప్పలేం అని యురోపియన్ హార్ట్ జర్నల్ చెబుతోంది. అయితే అతి నిద్ర, నిద్రలేమి కచ్చితంగా గుండెకారక వ్యాధులపై ప్రభావం చూపేవేనని ఆ జర్నల్‌లో ఓ కథనం ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల నుంచి 35 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న 1,16,000 మందిపై ఈ పరిశోధన చేశారు. ఇందులో ఉత్తర అమెరికా, యూరప్, దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా, చైనా, ఆఫ్రికా దేశాలనుంచి ఉన్నారు. ఎనిమిదేళ్ల కాలానికి పరిశోధనను తీసుకుంటే సుమారుగా 4,381 మంది మరణించగా, 4,365 మంది తీవ్ర హృదయ సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నారని వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment