ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెకేషన్‌కు వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచింది. స్పందన ఆకస్మిక మరణం ఆమె కుటుంబ సభ్యులను,శాండల్‌వుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమో వయస్సు కేవలం 44 ఏళ్లు మాత్రమే. ఒకప్పుడు గుండెజబ్బులు, డయాబెటీస్ వంటి రోగాలు వయసు పైబడిన వారిలోనే కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
60ఏళ్లలో వచ్చే వ్యాధులు కూడా 30-40లోనే పలకరిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇండియాలో 25 శాతం గుండెపోటు కేసులు 40 ఏళ్ల లోపు వారిలోనే నమోదవుతున్నాయి. అసలు చిన్న వయస్సులోనే గుండెజబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి హార్ట్ ఎటాక్ వస్తే ప్రాణాలు పోయినట్లేనా? ఈ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్నవయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఒకప్పుడు 60లో వచ్చే గుండెజబ్బులు ఇప్పుడు టీనేజీ పిల్లలను కూడా కబలిస్తున్నాయి. గుండెపోటు లక్షణాలను మొదట్లోనే గుర్తించకపోవడం కారణంగా చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, కలుషిత ఆహారం, సమయ పాలన లేకపోవడం, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, ఇతర అనారోగ్య సమస్యలు గుండెపోటుకు ప్రధానంగా కారణమవుతున్నట్లు పలువురు వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
మరోవైపు కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు స్ట్రోక్‌కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ గుండెజబ్బులకి కరోనాయే కారణం అని చెప్పే ఆధారాలు లేవని చెబుతున్నా, కోవిడ్‌తో శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పు కూడా పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
డయాబెటీస్ కారణమా?
ఇటీవల జరిపిన ఓ పరిశోధన ప్రకారం.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే దక్షిణాసియా దేశాల ప్రజల్లోనే గుండె సమస్యలతో బాధపడేవారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నట్లు తేలింది. ఇందుకు జీన్స్ మాత్రమే కాదు.. మారుతున్న జీవన శైలి కూడా కారణమని పరిశోధకులు తేల్చి చెప్పారు.2030 నాటికి ఇండియాలో 80 మిలియన్ మంది డయాబెటీస్‌తో బాధపడుతుంటారని అంచనా.
మన దేశ జనాభాలో సుమారు 10శాతం యువత ఇప్పటికే పలు లైఫ్‌స్టైల్ డిజార్డర్‌లతో బాధపడుతున్నట్లు తేలింది. దీనికి ఉప్పు, కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని అతిగా తీసుకోవడం కూడా ఒక కారణం.వీటి వల్ల శరీరంలో చెడు కొవ్వులు, హైపర్ టెన్షన్ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.
చిన్న వయసులోనే గుండెజబ్బు రావడానికి మరో కారణం.. డయాబెటీస్(మధుమేహం). డయాబెటీస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ధమనుల్లో రక్తం గడ్డకడుతుంది. వీటినే బ్లడ్‌క్లాట్స్ అంటారు. రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెకు వెళ్లే రక్త ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా గుండె నొప్పి వస్తుంది. ఇక ధూమపానం, మధ్యపానం వంటి చెడు అలవాట్లు కూడా గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇప్పట్లో యూత్ చిన్న వయసులోనే స్మోకింగ్, డ్రింకింగ్‌ను అలవాటు చేసుకుంటున్నారు. ఇది మితిమీరి గుండెపోటుకు కారణం అవుతుంది.
గుండెనొప్పి సంకేతాలు ఇలా
- గుండె చాలా భారంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది
- రక్తం సరఫరా తగ్గి గుండెలో మంటగా ఉంటుంది.
- మత్తుగా ఉండి, చెమటలు ఎక్కువగా పడుతాయి.
- తీవ్రమైన అలసట, ఛాతి దగ్గర నొప్పి వస్తే అస్సలు నిర్లక్యం చేయొద్దు.
- రీర పైభాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే గుండెనొప్పికి సంకేతంగా భావించవచ్చు.
గుండె ఆరోగ్యం మీ చేతిలోనే..
►గుండెజబ్బులు రాకుండా ముందునుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి
► మీ కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం, గుండె జబ్బులు ఉన్నట్లయితే ముందస్తుగా స్క్రీనింగ్ చేయించుకోవాలి
► ఆరోగ్యానికి హాని చేసే ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
► వ్యాయామం చేస్తే మంచిదే కదా అని అతిగా చేయకూడదు. ఇది గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది
► ఒత్తిడి,సరైన నిద్ర లేకపోవడం కూడా గుండెజబ్బులకు మరో కారణం
► కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు డైట్‌లో ఉండేలా చూసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment