heart attacks
-
బీపీతో హార్ట్ఎటాక్
సాక్షి, హైదరాబాద్: బీపీతో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. భారత్‌లో ఏటా అధిక రక్తప్రసరణతో వచ్చే గుండెపోటు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో సంభవించే మరణాలకు మొదటి ప్రధాన కారణం బీపీ ఎక్కువగా ఉండటమే. రెండో కారణం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, మూడోది డయేరియా, నాలుగోది ఎయిడ్స్, ఐదోది టీబీ, ఆరోది మలేరియా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉమ్మడి నివేదిక తేలి్చచెప్పింది. ఆయా సంస్థలు బీపీని కట్టడి చేసే విధానంపై నివేదిక రూపొందించాయి.2017లో ప్రారంభమైన ఇండియన్ హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్ (ఐహెచ్‌సీఐ)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది. 2025 నాటికి దేశంలో బీపీ రోగుల సంఖ్యను 25 శాతం తగ్గించాలని నిర్ణయించింది. ఐహెచ్‌సీఐ కార్యక్రమాన్ని ఈ మూడు సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. 25 రాష్ట్రాల్లోని 141 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 21,579 ఆరోగ్య కేంద్రాల్లో 30 కోట్ల మందిని ఈ కార్యక్రమం పరిధిలోకి వచ్చారు. 19 రాష్ట్రాల్లో బీపీ నియంత్రణ ప్రొటోకాల్ తయారుచేశారు. ఈ కార్యక్రమం మొదటి దశ తెలంగాణ, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రారంభమైంది.18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ... భారత్‌లో 18 ఏళ్లు పైబడిన ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ ఉంది. అలా 20 కోట్ల మంది బీపీతో బాధపడుతున్నారు. అందులో సగం మందికి బీపీ ఉన్నట్లే తెలియదు. కేవలం 10 శాతం మందే బీపీని అదుపులో ఉంచుకుంటున్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ బీపీ చెక్ చేయాలని ఆ నివేదిక పేర్కొంది. 2025 నాటికి 4.5 కోట్ల మంది బీపీని అదుపులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు... ⇒ ఐహెచ్‌సీఐ కార్యక్రమం అమలయ్యే చోట నర్సులు, డాక్టర్లు ప్రత్యేకంగా ఉంటారు. అయితే, తెలంగాణ, మహారాష్ట్రల్లో మాత్రమే ప్రత్యేకంగా ఉన్నారు. ⇒ తెలంగాణలో ఈ విధానం అమలులో ఉన్నందున ఏఎన్ఎంలు ఇళ్లకు వెళ్లి బీపీ చెక్ చేస్తున్నారు. ఫోన్ ద్వారా కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ⇒ ఈ కార్యక్రమం కోసం సగటున ఒక వ్యక్తికి ఏడాదికి రూ. 200 మాత్రమే మందుల కోసం ఖర్చవుతుంది. ⇒ బాధితులు ప్రొటోకాల్‌లో ఉన్న మందులను ఒక నెల అడ్వాన్స్‌లో ఉంచుకోవాలి. ⇒ తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో 6 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. కేరళలో నెల రోజులు, మహారాష్ట్రలో 2 నెలల స్టాక్ ఉంది. బీపీ రోగులు వ్యాయామం చేయాలి బీపీ రోగులు పొగాకు, మద్యం మానుకోవాలి. ఉప్పు ఒక స్పూన్కు తగ్గించుకోవాలి. ప్రతీ వారం రెండున్నర గంటల వ్యాయామం చేయాలి. రోజుకు నాలుగైదు సార్లు పండ్లు, కూరగాయలు తినాలి. తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ చెక్ చేయాలన్న నియమం పెట్టుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో 30 ఏళ్లు పైబడిన వారికే బీపీ చూస్తారు. బీపీ ఉంటే ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు. మందులు తప్పనిసరిగా వాడాలి. –డాక్టర్ కిరణ్ మాదల, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం -
CPR: ఒకేసారి 20 లక్షల మందికి సీపీఆర్ నేర్పిస్తే..
ఢిల్లీ: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వచ్చి ఎక్కడికక్కడే కుప్పకూలి మరణిస్తున్న ఘటనల్ని ఈ రెండు మూడేళ్ల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. కానీ, సీపీఆర్ Cardiopulmonary resuscitation (CPR) చేసి బతికిస్తున్న ఘటనలు మాత్రం అరుదుగా చూస్తున్నాం. గణాంకాల్లో పాతికేళ్లలోపు వాళ్లు కూడా ఉంటుండగా.. ఒబెసిటీ లాంటి సమస్యలు లేనివాళ్లు కూడా సడన్‌గా చనిపోతుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. అందుకే ఆపద సమయంలో రక్షించే.. సీపీఆర్‌పై దేశవ్యాప్త అవగాహన కోసం కేంద్రం నడుం బిగించింది. గుండెపోటు హఠాన్మరణాల్ని తగ్గించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక కార్యక్రమం నిర్వహించింది. సీపీఆర్‌పై చదువుకున్న వాళ్లకూ అవగాహన లేదని భావిస్తున్న కేంద్రం.. సీపీఆర్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి ఈ కార్యక్రమంలో 20 లక్షల మంది పాల్గొన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మాన్షుఖ్ మాండవీయ అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. సీపీఆర్ టెక్నిక్‌పై శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. आज देश के हर कोने से 20 लाख से अधिक लोगों के साथ नेशनल बोर्ड ऑफ एग्जामिनेशन द्वारा आयोजित CPR प्रशिक्षण में भाग लिया। इस अभियान के माध्यम से अचानक कार्डियक अरेस्ट होने की स्थिति में हम दूसरे की मदद कर सकते ह pic.twitter.com/SOMLvsdBGl — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 6, 2023 అధికారిక గణాంకాల ప్రకారం.. 2021 నుంచి 2022 మధ్య ఈ తరహా హఠాన్మరణాలు 12.5 శాతం పెరిగాయి. మంచి ఆహారం తీసుకోవాలని, అయినా ఈ తరహా మరణాలు సంభవిస్తుండడంతో సీపీఆర్పైనా అవగాహన ఉండాలని అన్నారాయన. కొవిడ్-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకున్నవారు తర్వాత ఒకటి నుంచి రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదని తెలిపారు. ఈ మేరకు ఆయన భారత వైద్య పరిశోధన మండలి (ICMR) అధ్యయనాన్ని ఉదహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 20 లక్షల మందికి సీపీఆర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. దాదాపు రెండు లక్షల మంది టీచర్లు, కాలేజీ ఫ్రొఫెసర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తారు. గుర్తింపు పొందిన వెయ్యికి పైగా వైద్యకేంద్రాల ద్వారా ఈ శిక్షణ అందుతుంది. జిమ్‌లో పనిచేసేవారూ ఈ శిక్షణలో భాగమవుతారు. -
కీటకాలతో ఔషధం...హార్ట్ఎటాక్ రిస్క్‌ను తగ్గిస్తుంది
ప్రస్తుతం గుండెపోటు మరణాలు ఎక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు 50దాటిన వారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఉండేది. కానీ కోవిడ్ ఎఫెక్ట్‌తో కొంతకాలంగా దేశంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాంప్రదాయ చైనీస్ మెడిసిన్‌తో గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మరి ఏంటా మెడిసిన్? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిన ఘటనలు చూస్తున్నాం. డ్యాన్స్ చేస్తూనో, జిమ్ చేస్తూనో అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోతున్నారు. ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చినవారిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. స్టెమీ(ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ STEMI)లాంటి తీవ్రమైన గుండెపోటు అటాక్ అయినప్పుడు ఈ తరహా పరిస్థితి ఎదురవుతుంటుంది. గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ అనంతరం గుండెపోటు కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దీనికి తగ్గ కారణాలు, ఓషధాలపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో Tongxinluo అనే సాంప్రదాయ చైనీస్ మెడిసిన్ ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని, ఈ మెడిసిన్ ప్రభావం సుమారు ఏడాది పాటు ఉంటుందని సైంటిస్టులు తెలియజేశారు. చైనాలో హార్ట్ స్ట్రోక్ వచ్చిన రోగులకు అందించే చికిత్సలో ఈ మెడిసిన్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. ఇది ప్రధానంగా జిన్సెంగ్, జలగ, తేలు, సికాడా, సెంటిపెడ్, బొద్దింక, గంధం సహా పలు సహజసిద్ధ మూలికలతో తయారు చేసిన ఓ సాంప్రదాయ ఔషధం. టెక్సాస్‌లోని UT సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్లో 3,777 మందిపై ఏడాదిపాటు జరిపిన పరిశోధనల్లో Tongxinluo మెడిసిన్ ఊహించని ప్రయోజనాలను నమోదు చేసిందని సైంటిస్టులు గుర్తించారు. Tongxinluo తీసుకోనివారితో పోలిస్తే, తీసుకున్నవారిలో హార్ట్ రిస్క్ 30% తక్కువగా ఉన్నట్లు వారు కనుగొన్నారు. అంతేకాకుండా ఈ మెడిసిన్ వాడిన ఏడాది వరకు దాని ప్రయోజనాలు ఉన్నట్లు, దీనివల్ల 25% కార్డియాక్ డెత్ ప్రమాదం తగ్గిందని సైంటిస్టులు పేర్కొన్నారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వారు వివరించారు. -
గుండెపోటుతో బాడీ బిల్డర్ మృతి.. పెళ్లి తర్వాత ఈ పొరపాటు చేయడంతో
గుండెపోటు మరణాలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇవి వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా వ్యాయామం చేస్తూనో, చేసిన తర్వాతో గుండెపోటుతో యువకులు కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది. 'మిస్టర్ తమిళనాడు' టైటిల్ విన్నర్, ప్రముఖ బాడీ బిల్డర్ యోగేశ్ గుండెపోటుతో మరణించారు. (ఇదీ చదవండి: విజయ్‌కు వాటితో సంబంధం లేదు.. బాధ్యత అంతా నాదే: లోకేష్ కనకరాజ్) కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని పరిశోధనలు దీనికి మద్దతు ఇస్తుండగా, కొన్ని కోవిడ్ కారణంగా ఇటువంటి సంఘటనలు జరగడం లేదని నిపుణులు చెప్పినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనిస్తూ ఫ్యాట్‌కు దూరంగా ఉండే వారు ఇలా చనిపోవడం సర్వసాధారణమైపోతోంది. యోగేష్ చెన్నైలోని అంబత్తూరు మేనంపేడులోని మహాత్మాగాంధీ వీధిలో నివాసం ఉంటున్నాడు. అతను బాడీ బిల్డర్, కొన్ని సంవత్సరాలుగా వివిధ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొని అనేక పతకాలు సాధించాడు. అతను 2021లోనే 9కి పైగా మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. బాడీబిల్డింగ్‌లో 'మిస్టర్ తమిళనాడు' అవార్డును అందుకున్నాడు. 2021లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీరికి రెండేళ్ల కూతురు కూడా ఉంది. పెళ్లి అనంతరం బాడీబిల్డింగ్ పోటీలకు విరామం ప్రకటించిన యోగేశ్.. ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే జిమ్‌కు వెళ్లిన ఆయన శిక్షణ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైన యోగేశ్.. బాత్రూమ్కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయారు. దీనిని గమనించిన యువకులు వెంటనే యోగేశ్‌ను స్థానిక కిల్పౌక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో యోగేశ్ గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పెళ్లైన తర్వాత బాడీబిల్డింగ్కు విరామం ప్రకటించి తక్కువ బరువులు ఎత్తుతున్న యోగేశ్.. ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. -
కుటుంబంలో ఎవరికైనా గుండె సమస్యలు ఉంటే, మీకూ వస్తాయా?
ఈ మధ్య కాలంలో గుండెపోటు కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా చిన్న వయసులోనే పలువురు గుండె జబ్బులకు గురవుతున్నారు. యువతలో గుండెజబ్బులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వంటివి గుండెజబ్బుల రిస్క్‌ను పెంచుతుంది. అధికంగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అధిక బరువుతో పాటు ఎప్పుడూ కూర్చొనే ఉండటం గుండెజబ్బుకి మరో కారణం. అధిక ఒత్తిడి కూడా గుండెజబ్బులను పెంచుతుంది. ఒత్తిడి, ఊబకాయం, సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, అయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం.. ఇవన్నీ గుండెజబ్బులకు ప్రధాన కారణాలు. ఏం చేస్తే మంచిది? గుండె బలహీనంగా ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అన్నది ఇప్పుడు చూద్దాం. ♦ సొరకాయ జ్యూస్.. దీన్నే లౌకికా జ్యూస్ అని కూడా అంటారు. నెలకు ఒకసారి ఇది తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ♦ గుమ్మడి కాయ, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, కిడ్నీ బీన్స్, ఆపిల్ వంటివి రెగ్యులర్‌గా తీసుకోవాలి. ♦ వెల్లుల్లి.. రక్తాన్ని పలుచన చేస్తుంది. దీనివల్ల శరీరీ భాగాలన్నింటికి రక్తం సరఫరా ఈజీగా అవుతుంది. గుండెజబ్బులు.. వంశపారం పర్యంగా వస్తుందా? ► నిత్యం వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకుంటే గుండెజబ్బుల నుంచి తప్పించుకోవచ్చా అన్నది కశ్చితంగా చెప్పలేం. ఎందుకంటే మన ముందు తరాల్లో అమ్మమ్మకో, నాయినమ్మకో గుండెజబ్బు హిస్టరీ ఉంటే అప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. ► సమతులమైన ఆహారం తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారం జీర్ణక్రియకీ, మన జీన్స్ ని మోటివేట్ చెయ్యడానికీ లివర్ పాంక్రీస్ పనిచేస్తాయి. ► చిన్నప్పటి నుంచి మాంసాహారం తీసుకునే వాళ్లకి మొదటి తరంలోనే బానే ఉంటుంది. కానీ రెండో తరం వాళ్లలో శరీరం మీద గడ్డలూ, కొన్నిచోట్లు దద్దుర్లు రావడం కనిపిస్తుంది. కానీ చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తారు. ► ఇక మూడో తరం వచ్చేసరికి ఎవరికైనా గుండెజబ్బు ఉంటే తప్పకుండా మనవడికి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే హార్ట్ రిస్క్ మూలాలు మూడు తరాల వరకు ఉంటాయి. ► స్ట్రేట్చింగ్ శరీరానికి చాలా మంచిది. ప్రతిరోజూ కనీసం 40 నిమిషాలు అయినా ఫిజికల్ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలి. -నవీన్ నడిమింటి ఫోన్ -9703706660 ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
గుండెపోటు వస్తుందో లేదో ముందే తెలుసుకోండి..ఆ ట్యాబ్లెట్ దగ్గర ఉంచుకోండి
గుండెలో కొవ్వు పేరుకుపోవడం, ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం తినడం, అధిక బరువు, డయాబెటిస్ రోగుల్లో ఇన్సులిన్ రెసిస్టన్స్ కారణాల వల్ల సంభవించవచ్చు. పైన పేర్కొన్న కొన్ని కారణాల వల్ల గుండె కండరాల్లో కొవ్వు అధికంగా పేరుకునేటట్లు చేస్తుంది. ఇలా పేరుకుపోయిన కొవ్వు గుండెను బలహీనపరిచి హార్క్ రిస్క్‌ను పెంచుతుంది. ముందే లక్షణాలను గుర్తించడం వల్ల జాగ్రత్తపడొచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చేముందే శరీరం కొన్ని హెచ్చరికలను మనకు పరోక్షంగా పంపుతుంది. కానీ వాటిని మనం సాధారణంగా భావించి పెద్దగా నోటిస్ చేయము. పల్ప్ టేషన్ కొద్ది మెట్లు ఎక్కినా ఆయసం వస్తుంది. కుడి చేతిని పైకి ఎత్తడంలో ఇబ్బంది,నొప్పి, చెమట పడుతుంది. ఒక వయసు దాటిన వాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే ఇంట్లో "సార్బిట్రేట్ " మాత్రలు( లైఫ్ సేవింగ్ మాత్రలు చాలా తక్కువ ఖరీదు) అందుబాటులో ఉంచుకోవాలి. ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా ఆ మాత్ర ఒకటి నాలుక కింది భాగంలో ఉంచుకోవాలి, మింగకూడదు. డాక్టర్‌ను వెంటనే సంప్రదించాలి. స్టంట్ వేయించుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ? ►స్టంట్ ప్రక్రియ ముగిశాక, మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి, భవిష్యత్తులో అడ్డంకులు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించాలి. అవేంటో చూద్దాం. ► ఆస్పిరిన్,క్లోపిడోగ్రెల్ వంటి యాంటీ ప్లేట్లెట్ మందులతో సహా డాక్టర్ సూచించిన మందులను వాడండి. ► ధూమపానం..అనేక జబ్బులకు కారకం. కాబట్టి మందు, సిగరెట్ వంటివి మానేయడం మంచిది. ► కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు. ► ఊబకాయం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన బరువు ఉంచుకోవడం ముఖ్యం. ► క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ► దీర్ఘకాలిక ఒత్తిడి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధ్యానం, యోగా వంటివి ఒత్తిడిని తగ్గిస్తుంది. -నవీన్ రోయ్ ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
కాసేపట్లో కూతురు పెళ్లి.. అంతలోనే విషాదం..
సాక్షి, కరీంనగర్: కాసేపట్లో కూతురు పెళ్లి.. వివాహ తంతుకు అంతా సిద్ధమవుతుండగా.. ఆమె తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ గ్రామంలో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. గ్రామానికి చెందిన ఎర్రల రాములు(48) కేశవపట్నంలో ట్రాక్టర్ మెకానిక్. అతనికి భార్య మంజుల, కూతుళ్లు లావణ్య, కోమల, వీణ ఉన్నారు. పెద్దకూతురు లావణ్య వివాహం జమ్మికుంట మండలం శాయంపేటకు చెందిన సతీశ్‌తో మండలంలోని కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 10.41 గంటలకు జరగాల్సి ఉంది. బంధువులంతా పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. వేకువజామున రాములుకు ఛాతీలో నొప్పి రావడంతో హుటాహుటిన కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తండ్రి మృతితో లావణ్య వివాహం ఆగిపోయింది. అన్న నిర్లక్ష్యంతోనే అమ్మ మరణం బాన్సువాడ రూరల్: బైక్‌ను అతివేగంగా నడిపి తల్లి మరణానికి కారణమయ్యాడని సొంత అన్నపైనే ఓ చెల్లెలు ఫిర్యాదు చేసింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన బర్మల నర్సవ్వ(55)కు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు కాశీరాం ఉన్నారు. కాశీరాం ఆదివారం తల్లి నర్సవ్వతోపాటు భార్యను బైక్‌పై కూర్చోబెట్టుకొని పైడిమల్ గ్రామానికి బయలుదేరాడు. ఇబ్రహీంపేట్ శివారులో బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ క్రమంలో నర్సవ్వ తల, ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి. బాన్సువాడలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సవ్వను నిజామాబాద్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మహ్మద్‌నగర్‌లో నివసించే నర్సవ్వ కూతురు గుండ్ల సుజాత ఈ విషయమై బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అన్న అతివేగంగా, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని, తల్లి మృతికి కారణమైన సోదరుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరింది. కేసు నమోదు చేసుకున్నామని సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. -
వాల్వ్‌లు బ్లాక్ కావడం వల్ల గుండెపోటు వస్తుందా? రాకుండా ఏం చేయాలి?
ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు ఎక్కువగా వింటున్నాం. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే హార్ట్ఎటాక్కు గురవుతున్నారు.అప్పటి వరకు నవ్వుతూ, సరదాగా ఉంటున్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఈమధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. నడిమింటి నవీన్ మాటల్లోనే.. మన శరీరంలో అన్ని అవయవాలకు రక్తాన్ని పంపు చేసే అవయవం గుండె. అలాంటి గుండెకు కూడా రక్తం అవసరం అవుతుంది.మరి ఈ గుండె గోడలకు "హృదయ ధమనులు" అనే అతి ముఖ్యమైన రక్త నాళాలు ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేస్తాయి. మనం తినే ఆహారంలో అధిక క్రొవ్వు పదార్థాలు ఉన్నట్లైతే ఈ కొవ్వు హృదయ ధమనుల్లో క్రమ క్రమంగా పేరుకు పోయి ఒకానొక దశలో గుండె గోడలకు రక్త సరఫరా పాక్షికంగానో, పూర్తిగానో ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అదృష్టం కొద్దీ బతికితే వైద్యులు హృదయ ధమనులు గుండా రక్తం సాఫీగా ప్రవహించడానికి అవసరమైతే స్టెంట్ వేయడం లేదా రక్తం పలుచబడే ట్యాబ్లెట్స్ వాడమని చెబుతారు. వాల్వ్‌లు బ్లాక్ కావడం వల్ల వచ్చే గుండెపోటు చాలా అరుదుగా జరుగుతుంది. చాలామంది గుండెపోటు రావడానికి కారణం వాల్వ్‌లు బ్లాక్ కావడమే అనుకుంటారు. కానీ హార్ట్ఎటాక్ రావడానికి ప్రధాన కారణం కవాటాలు పనిచేయకపోవడం(వాల్వ్‌లు బ్లాక్ కావడం)కాదు. గుండెపోటు రావడానికి కారణం వృత్తి, వ్యాపారాల్లో భరించలేని టెన్షన్లు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం చిన్నతనం నుంచే అలవాటుపడిన జంక్‌ఫుడ్‌లు వదలలేకపోవడం కాలానికి తగినట్లుగా పిరియాడికల్ టెస్టులు చేయించుకొని శరీరంలో వస్తున్న అనారోగ్య సంకేతాలను ముందే తెలుసుకొని తగిన చికత్సలు తీసుకోకపోవడం శక్తికి మించి జిమ్, ఎక్సర్సైజులు వంటివి చేయడం గుండెపోటు రాకుండా ఏం చేయాలి? క్రొవ్వు పదార్ధాలు అతిగా తినకుండా శరీరానికి అవసరమైన మేరకు తినడం ప్రతి ఉదయం నలభై నుండి అరవై నిమిషాలు నడక వ్యాయామము చేయడం. ఒత్తిడి లేని జీవన శైలి పాటించడం ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడం -డా. నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
మహిళల్లో గుండెపోటు రిస్క్ పెరిగింది.. కోవిడ్ కారణమా?
పెరిగిన గుండెపోటు ముప్పు ఇటీవలి రోజుల్లో చిన్న వయసులోనే మహిళలు కూడా గుండెపోటుకు గురవడం 8 శాతం పెరిగిందని ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ సీఏ మంజునాథ్ తెలిపారు. సోమవారం నటి స్పందన మృతిపై డాక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ ఇటీవల జీవనశైలి, ఆహార పద్ధతులు మారాయని, దీంతో పాటు మానసిక శారీరక ఒత్తిడులు కూడా గుండెపోటుకు కారణమన్నారు. 40 ఏళ్లలోపు వారికి కూడా గుండెజబ్బులు ► ఒక అధ్యయనం ప్రకారం 40 ఏళ్ల లోపు వయసు వారికి గుండెపోటు రావడం 35 శాతం పెరిగింది. ►గతంలో మహిళల్లో గుండెపోటు కేసులు తక్కువగా ఉండేవి, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ► 40 ఏళ్లులోపు మహిళల్లో గుండెపోటు కేసులు 8 శాతం పెరగడం ఆందోళనకరం. ► దేశంలో యువత, మధ్య వయసువారిలో గుండెపోటు వచ్చే ముప్పు 28 శాతం పెరిగింది. ► ఈ కేసుల్లోనూ కార్డియాక్ అరెస్ట్ (గుండె స్తంభించడం) 90 శాతం ఉంది. ► కోవిడ్ మహమ్మారి తరువాత 3 నుంచి 5 శాతం గుండెపోటు కేసులు పెరిగాయి, ప్రతి ఒక్కరూ తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. - ప్రముఖ వైద్యుడు మంజునాథ్ -
జిమ్ చేస్తున్నా గుండెజబ్బులు.. సిద్దార్థ్ నుంచి స్పందన వరకు.. కారణమేంటి?
సాధారణంగానే సెలబ్రిటీలు స్ట్రిక్ట్ డైట్‌ను ఫాలో అవుతుంటారు. వయసు పైబడుతున్నా ఇంకా అదే గ్లామర్‌ను మెయింటైన్ చేస్తున్న వాళ్లు ఎందరో ఉన్నారు. అదే సమయంలో 40ఏళ్లు కూడా నిండకుండానే గుండెపోటుతో ఇటీవల తరచూ సెలబ్రిటీలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.సరైన జీవనశైలి, పౌష్టికాహారం, శారీరక శ్రమ ఉంటే గుండెపోటు నుంచి కశ్చితంగా తప్పించుకోవచ్చు అనడానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని సెలబ్రిటీల మరణాలను చూస్తే అర్థమవుతుంది.వయసుతో సంబంధం లేకుండా చిన్నవయసులోనే ఎంతోమంది సెలబ్రిటీలు గుండెపోటుతో మరణించిన ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిద్దార్థ్ శుక్లా నుంచి స్పందన వరకు.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలు వీళ్లే.. గుండెపోటుతో మరణించిన సెలబ్రిటీలుగతంలో హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ 13 విజేత, ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ నటుడు సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. చనిపోయేనాటికి ఆయన వయస్సు కేవలం 40 ఏళ్లు మాత్రమే. ఆయన నిత్యం వ్యాయాయం చేస్తూ ఆరోగ్యకరమైన డైట్‌ను ఫాలో అయ్యేవాడు. చనిపోయే ముందురోజు కూడా వర్కవుట్స్ చేశాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న సిద్ధార్థ్ దురదృష్టం కొద్దీ ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశాడు.ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ కూడా 2021లో గుండెపోటుతోనే హఠార్మణం చెందిన విషయం తెలిసిందే. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ 46 ఏళ్ల వయసులోనే హార్ట్ఎటాక్కు గురయ్యారు. యన సినిమాలకంటే కూడా పునీత్ ప్రజలకు చేసిన మంచి పనులు, సేవా కార్యక్రమాలు అలాంటి అభిమానులను సంపాదించుకునేలా చేసింది. పునీత్ మరణ వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.చిన్నవయసులోనే హార్ట్ఎటాక్మరో కన్నడ నటుడు చిరంజీవి సర్జా కూడా గుండెపోటుతోనే మరణించారు. ఈయన ప్రముఖ నటుడు అర్జున్‌కు స్వయానా మేనల్లుడు. 35ఏళ్ల వయస్సులోనే హార్ట్ ఎటాక్‌తో చిరంజీవి సర్జా కన్నుమూశారు. చిరంజీవి సర్జా 2009లో వాయుపుత్ర చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి సుమారు 19 సినిమాల్లో నటించాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందాడు. చదవండి: హీరో భార్య మృతి, చిన్నవయసులోనే గుండెజబ్బులు..ఎందుకిలా?టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న కూడా గుండెపోటుతోనే కన్నుమూశారు. 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో అర్థంతరంగా తారకరత్న తనువు చాలించాడు. సుమారు 23రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి విషమించడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు. పునీత్ కుటుంబంలో మరో విషాదంతాజాగా కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే ఆమె స్థానిక ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి విజయ్ రాఘవేంద్ర దగ్గర బంధువు.2021లో పునీత్ కూడా గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు వారి కుటుంబం నుంచే స్పందన కూడా మరణించడం శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఈనెలలో ఈ జంట తమ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. కానీ ఆ వేడకకు కొన్నిరోజులు ముందే స్పందన ఇలా హఠాన్మరణం చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది.వ్యాయామం చేస్తున్నా ఎందుకీ గుండెజబ్బులు?స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నా చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకొస్తుందనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని వేధిస్తుంది. గతంలో 25-30-40 ఏళ్ల వయస్సులో గుండెపోటు అనేది చాలా అరుదుగా ఉండేది. కానీ ఇటీవలికాలంలో ఈ సంఖ్య పెరుగుతోంది. వర్కవుట్స్ చేస్తే మంచిదే కదా అని అతిగా వ్యాయామాలు చేయకూడదు.దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతంది. యువత చాలా ఎక్కువ జిమ్ చేస్తుంటారు. కానీ జిమ్‌లో చేసే కొన్ని పొరపాట్లు కూడా గుండెపోటుకు కారణమౌతుంటుంది. వ్యాయామం ఎప్పుడూ సాధారణ స్థాయిలో, మితంగా ఉండాలి. పరిమితి దాటితే అనర్థాలు తప్పవు.హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంపై, గుండెపై దుష్ప్రభావం పడుతుంది. గంటల తరబడి వ్యాయామం చేయడం కూడా మంచిది కాదని, వయసు పెరుగుతున్న కొద్దీ డాక్టర్ల సూచనతో వ్యాయామం, డైట్‌ను పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
హీరో భార్య మృతి, చిన్నవయసులోనే గుండెజబ్బులు..ఎందుకిలా?
ప్రముఖ కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య గుండెపోటుతో మరణించింది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి బ్యాంకాక్ వెకేషన్‌కు వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచింది. స్పందన ఆకస్మిక మరణం ఆమె కుటుంబ సభ్యులను,శాండల్‌వుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమో వయస్సు కేవలం 44 ఏళ్లు మాత్రమే. ఒకప్పుడు గుండెజబ్బులు, డయాబెటీస్ వంటి రోగాలు వయసు పైబడిన వారిలోనే కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. 60ఏళ్లలో వచ్చే వ్యాధులు కూడా 30-40లోనే పలకరిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇండియాలో 25 శాతం గుండెపోటు కేసులు 40 ఏళ్ల లోపు వారిలోనే నమోదవుతున్నాయి. అసలు చిన్న వయస్సులోనే గుండెజబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఒకసారి హార్ట్ ఎటాక్ వస్తే ప్రాణాలు పోయినట్లేనా? ఈ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నవయసులోనే గుండెపోటు బారినపడేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఒకప్పుడు 60లో వచ్చే గుండెజబ్బులు ఇప్పుడు టీనేజీ పిల్లలను కూడా కబలిస్తున్నాయి. గుండెపోటు లక్షణాలను మొదట్లోనే గుర్తించకపోవడం కారణంగా చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, కలుషిత ఆహారం, సమయ పాలన లేకపోవడం, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, ఇతర అనారోగ్య సమస్యలు గుండెపోటుకు ప్రధానంగా కారణమవుతున్నట్లు పలువురు వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. మరోవైపు కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు స్ట్రోక్‌కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ గుండెజబ్బులకి కరోనాయే కారణం అని చెప్పే ఆధారాలు లేవని చెబుతున్నా, కోవిడ్‌తో శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పు కూడా పెరుగుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. డయాబెటీస్ కారణమా? ఇటీవల జరిపిన ఓ పరిశోధన ప్రకారం.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే దక్షిణాసియా దేశాల ప్రజల్లోనే గుండె సమస్యలతో బాధపడేవారి సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నట్లు తేలింది. ఇందుకు జీన్స్ మాత్రమే కాదు.. మారుతున్న జీవన శైలి కూడా కారణమని పరిశోధకులు తేల్చి చెప్పారు.2030 నాటికి ఇండియాలో 80 మిలియన్ మంది డయాబెటీస్‌తో బాధపడుతుంటారని అంచనా. మన దేశ జనాభాలో సుమారు 10శాతం యువత ఇప్పటికే పలు లైఫ్‌స్టైల్ డిజార్డర్లతో బాధపడుతున్నట్లు తేలింది. దీనికి ఉప్పు, కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని అతిగా తీసుకోవడం కూడా ఒక కారణం.వీటి వల్ల శరీరంలో చెడు కొవ్వులు, హైపర్ టెన్షన్ పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. చిన్న వయసులోనే గుండెజబ్బు రావడానికి మరో కారణం.. డయాబెటీస్(మధుమేహం). డయాబెటీస్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ధమనుల్లో రక్తం గడ్డకడుతుంది. వీటినే బ్లడ్‌క్లాట్స్ అంటారు. రక్తం గడ్డ కట్టడం వల్ల గుండెకు వెళ్లే రక్త ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా గుండె నొప్పి వస్తుంది. ఇక ధూమపానం, మధ్యపానం వంటి చెడు అలవాట్లు కూడా గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇప్పట్లో యూత్ చిన్న వయసులోనే స్మోకింగ్, డ్రింకింగ్‌ను అలవాటు చేసుకుంటున్నారు. ఇది మితిమీరి గుండెపోటుకు కారణం అవుతుంది. గుండెనొప్పి సంకేతాలు ఇలా గుండె చాలా భారంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది రక్తం సరఫరా తగ్గి గుండెలో మంటగా ఉంటుంది. మత్తుగా ఉండి, చెమటలు ఎక్కువగా పడుతాయి. తీవ్రమైన అలసట, ఛాతి దగ్గర నొప్పి వస్తే అస్సలు నిర్లక్యం చేయొద్దు. రీర పైభాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే గుండెనొప్పికి సంకేతంగా భావించవచ్చు. గుండె ఆరోగ్యం మీ చేతిలోనే.. ►గుండెజబ్బులు రాకుండా ముందునుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి ► మీ కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం, గుండె జబ్బులు ఉన్నట్లయితే ముందస్తుగా స్క్రీనింగ్ చేయించుకోవాలి ► ఆరోగ్యానికి హాని చేసే ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ► వ్యాయామం చేస్తే మంచిదే కదా అని అతిగా చేయకూడదు. ఇది గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది ► ఒత్తిడి,సరైన నిద్ర లేకపోవడం కూడా గుండెజబ్బులకు మరో కారణం ► కొవ్వు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు డైట్లో ఉండేలా చూసుకోవాలి -
అవన్నీ గుండెపోట్లు కావు.. గుండెపోటు ఎవరికి వస్తుంది?
సాక్షి, హైదరాబాద్: నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోతున్నారు..నృత్యం చేస్తూ నేలరాలిపోతున్నారు. జిమ్ చేస్తూ జీవితాలు ముగిస్తున్నారు. జోకులేస్తూనే ప్రాణాలొదిలేస్తున్నారు. వీరిలో మధ్య వయసు్కలు, యువత, కొన్ని సందర్భాల్లో 15 ఏళ్ల లోపు వారూ ఉంటున్నారు. దీంతో ఆరోగ్యవంతుల్ని సైతం గుండెపోటు భయం పట్టిపీడిస్తోంది. అనుమానాలతో ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే అన్ని ఆకస్మిక మరణాలకూ గుండెపోట్లనే కారణంగా పరిగణించలేమని వైద్యులు చెబుతున్నారు. జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించడంలో జాప్యం కూడా ఆకస్మిక మరణాలకు దారితీస్తోందని వారంటున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులతో ఈ పరిస్థితుల్ని అధిగమించవచ్చని స్పష్టం చేస్తున్నారు. భయం..భయం.. గుండె పనితీరు గురించిన రకరకాల భయాలు, సందేహాలతో వైద్యుల్ని సంప్రదిస్తున్నవారు ఇటీ వల పెరిగారని ఆన్లైన్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ ‘ప్రాక్టో’అధ్యయనం తేల్చింది. గుండె పనితీరు గురించి సందేహాలతో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణె నగరాల నుంచీ వైద్యుల్ని సంప్రదించిన వారిలో 56% మంది 30–39 సంవత్సరాల మధ్య వయస్కు లేనని వెల్లడించింది.వీరిలో 75% మంది పురుషులు, 25% మహిళలు ఉన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది తాము 100 మందికి పైగా కార్డియాలజిస్టులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుప్రాక్టో నిర్వాహకులు తెలిపారు. టీకా కారణం కాదు యువకులు, మధ్య వయస్కు లు ఆకస్మికంగా తీవ్రమైన అనారోగ్యాలకు గురికావడం ఒక్క ఏడాదిలో 31% నుంచి 51%కి పెరిగిందని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. అయితే ఇవి కరోనా టీకాలు వేసిన, వేయని వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ నివేదిక ప్రకారం.. కోవిడ్ 19 వ్యాక్సిన్లు తీసుకున్న 1,00,000 మందిలో 1.7% మంది మాత్రమే మయోకార్డిటిస్ (కరోనా నేపథ్యంలో గుండె సంబంధిత వ్యాధికి గురికావడం)కు గురయ్యే అవకాశం ఉంది. గుండెపోటు ఎవరికి వస్తుంది? గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులలో ఆకస్మిక అడ్డంకులు ఏర్పడటం వల్ల గుండెపోటు సంభవిస్తుంది. ‘ధమనిలో కొవ్వు ఫలకం ఏర్పడి ఇది రక్తనాళంలోకి ప్రవేశించి, గడ్డ కట్టి, అకస్మాత్తుగా ఉక్కిరిబిక్కిరి చేయడాన్నే గుండెపోటుగా పేర్కొంటారు. ‘సాధారణంగా ధూమపానం చేసే వ్యక్తులు, కూర్చుని ఉద్యోగం చేసేవారు, ఊబకాయం కలిగినవారు, తక్కువ రక్తపోటు లేదా తీవ్రమైన మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలున్నవారిలో ఈ పరిస్థితి రావచ్చు..’అని వైద్యులు చెబుతున్నారు. ‘శిక్షణ లేకుండా లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా కరోనరీ నాళాలలో ఫలకాలు పగిలి, గుండె ఆగిపోవడానికి దారితీయవచ్చు..’అని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయకుమార్ చెప్పారు. వ్యాయామశాలకు వెళ్లేవారిలో, ప్రొటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం పెరిగిందని, వైద్యుల పర్యవేక్షణ లేకపోతే అది ప్రమాదమని స్పష్టం చేశారు. జీవనశైలిలో మార్పులతో.. జీవనశైలిలో మార్పులు చాలావరకు యుక్త వయస్కులలో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అలాగే కొన్ని జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించడంలో ఆలస్యం కూడా ఆకస్మిక మరణాలను తెస్తోంది. నిజానికి ప్రతి ఆకస్మిక మరణాన్నీ హార్ట్ ఎటాక్‌గా పరిగణించలేం. మొత్తం ఆకస్మిక మరణాల్లో 3 శాతమే గుండె పోటు కారణంగా సంభవిస్తాయి. ఆహారపు అలవాట్లు, దినచర్యలో మార్పుచేర్పులతో జీవనశైలిని సరైన విధంగా తీర్చిదిద్దుకోవాలి. అలాగే ఏ మాత్రం సందేహం ఉన్నా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. – డా.ఆర్.కె.జైన్, కార్డియాలజిస్ట్, కిమ్స్ ఆసుపత్రి కార్డియో వ్యాస్క్యులర్వ్యాయామాలు అవసరం.. ధూమపానం, మద్యపానం, మధుమేహం, అధిక కొలె్రస్టాల్ వంటి వాటి వల్ల కావచ్చు, ఆధునిక జీవనశైలి వల్ల కావచ్చు గుండె బలహీనపడటం సాధారణమైపోయింది. హృద్రోగాల వల్ల కోల్పోయిన గుండె సామర్థ్యాన్ని తిరిగి దశలవారీగా సంతరించుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని కార్డియో వాసు్క్యలర్ వ్యాయామాలు చేయడం అవసరం. అవి గుండె పంపింగ్ సామర్థ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని, మందుల వాడకాన్ని తగ్గిస్తాయి. – డాక్టర్ మురళీధర్, ఈఎస్ఐసీ ఆసుపత్రి -
మెదడుకు మెరుగైన చికిత్స...
సాక్షి,హైదరాబాద్: గుండెజబ్బులు, గుండె పోట్లు సాధారణమైపోతున్న కాలమిది. గుండెజబ్బు చేస్తే స్టెంట్లు వేసుకుని కాలం వెళ్లదీయవచ్చునేమో కానీ.. పోటు వస్తే, మెదడుకు రక్త సరఫరా ఆగిపోతే పక్షవాతం బారిన పడాల్సి వస్తుంది. జీవితాంతం మంచానికి పరిమితం కావాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అయితే...ఈ పరిస్థితి ఇంకొంతకాలమే అంటున్నారు ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత కలాం–రాజు స్టెంట్ రూపకర్తల్లో ఒకరైన ఎన్.జి.బద్రీ నారాయణ్. మెదడు నాళాల్లోని అడ్డంకుల (క్లాట్)ను తొలగించేందుకు తాము అత్యాధునిక వ్యవస్థ ఒకదాన్ని తయారు చేశామని ఎన్.జి.బద్రీ నారాయణ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుండెపోటు వచ్చిన తరువాత వీలైనంత తొందరగా (గోల్డెన్ అవర్... గరిష్టంగా 24 గంటల్లోపు) ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే పక్షవాతం రాకుండా చూడవచ్చునని ఆయన తెలిపారు. న్యూరో క్లాట్ రిట్రీవర్, న్యూరో ఆస్పిరేషన్ క్యాథరర్, న్యూరో మైక్రో క్యాథరర్ అనే పరికరాలన్నీ కలిగిన ఈ వ్యవస్థను అతితక్కువ ధరల్లోనే అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ అన్ని ప్రయత్నాలూ చేస్తోందని చెప్పారు. భారత్‌లో ఇలాంటి విప్లవాత్మకమైన టెక్నాలజీ ఒకటి అందుబాటులోకి రావడం ఇదే తొలిసారని, తెలంగాణ గవర్నర్ తమిళిసై గురువారం (డిసెంబరు 15) ఈ కొత్త టెక్నాలజీని లాంఛనంగా ప్రారంభించనున్నారని చెప్పారు. ఎలా పనిచేస్తుంది?: ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ తయారు చేసిన వ్యవస్థ స్టెంట్లు వేసేందుకు వాడే క్యాథరర్ మాదిరిగానే ఉంటుంది కానీ.. వెంట్రుక మందంలో నాలుగోవంతు మాత్రమే ఉంటుంది. దీని చివర సమయంతోపాటు తన ఆకారాన్ని మార్చుకునే ధాతువు (నికెల్–టైటానియం) తో తయారు చేసిన స్టెంట్లాంటి నిర్మాణం ఉంటుంది. మెదడులో అడ్డంకి ఉన్న ప్రాంతానికి దీన్ని తీసుకెళ్లి... వెనుకవైపు నుంచి వ్యతిరేక పీడనాన్ని సృష్టిస్తారు. దీంతో అక్కడి క్లాట్ క్యాథరర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. తద్వారా పక్షవాతం లక్షణాలు తగ్గిపోయే అవకాశం ఏర్పడుతుంది. గోల్డెన్ అవర్‌లో ఈ చికిత్స చేయగలిగితే కనీసం 70 శాతం మందిని పక్షవాతం నుంచి రక్షించుకోవచ్చు. పక్షవాతాన్ని నివారించగలిగే వ్యవస్థను ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో చేర్చగలిగేంత తక్కువ ధరకు అందించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, తద్వారా భారత్‌లో ఏటా కనీసం 2.5 లక్షల మందిని పక్షవాతం నుంచి రక్షించవచ్చని బద్రీ నారాయణ్ తెలిపారు. ఈ వ్యవస్థపై తాము కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నామని, డిజైనింగ్‌తోపాటు పూర్తిస్థాయిలో తయారీ కూడా దేశీయంగానే నిర్వహించినట్లు వివరించారు. ఈ న్యూరో పరికరాల పరీక్షకు తగిన లైసెన్సులు ఇప్పటికే పొందామని, వాణిజ్యస్థాయి ఉత్పత్తికి కూడా తగిన అనుమతులు త్వరలోనే పొందుతామని వివరించారు. వైద్య పరికరం కాబట్టి.. మందులేవీ లేని కారణంగా ఇది యూఎస్ఎఫ్డీఏ క్లాస్–2 వర్గానికి చెందుతుందని, అనుమతులు తొందరగానే వస్తాయన్న ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. మైసూరులో ఫ్యాక్టరీ ఏర్పాటు: ఎం.వి.గౌతమ హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో 2011లో పురుడు పోసుకున్న ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ ఇప్పుడు మైసూరు వద్ద అత్యాధునిక ఫ్యాక్టరీ ఒకదాన్ని నిర్మించనుందని, కర్ణాటక ప్రభుత్వం తమకు 8.5 ఎకరాల స్థలాన్ని అందజేసిందని ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ డైరెక్టర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మాజీ సీఎండీ ఎం.వి.గౌతమ తెలిపారు. యూఎస్ ఎఫ్‌డీఏ ప్రమాణాలతో దీన్ని రానున్న 18 నెలల్లో నిర్మించనున్నామని చెప్పారు. -
జీవనశైలి మార్పుల ప్రభావం గుండెపైనే అధికం
సాక్షి, హైదరాబాద్: మూడు పదుల వయసు దాటిన భారతీయుల్లో గుండె సంబంధిత సమస్యలు మొదలవుతున్నాయి. జీవనశైలిలో వస్తున్న మార్పులతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతుండగా.. వీటిలో అత్యధికంగా గుండెపైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇలాంటి అనారో గ్య సమస్యలపై సకాలంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అవి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తున్నాయి. శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో ఐదుగురు గుండె సంబంధిత సర్జరీలు చేయించుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఎక్కడైనా కార్పొరేట్ వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు చేయించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద చేయించుకుంటున్న శస్త్ర చికిత్సలపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గత ఆర్థిక సంవత్సరంలో పరిశీలన నిర్వహించింది. ఇందులో ప్రతి వంద సర్జరీల్లో 5 శాతం హృదయ సంబంధిత శస్త్ర చికిత్సలే ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద జరుగుతున్న సర్జరీల్లో 79 శాతం ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహిస్తుండగా.. 21 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్నట్లు వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఖర్చు చేస్తున్న ప్రతి రూ.100లో ఏకంగా రూ.26 గుండె సంబంధిత సమస్యల చికిత్సకే ఖర్చు చేస్తున్నట్లు విశ్లేషణలో వెల్లడైంది. అలవాట్లలో మార్పులతో.. గుండె సమస్యలు ముప్ఫై ఏళ్లు దాటిన తర్వాత మోదలవుతున్నాయి. ప్రస్తుతం శస్త్ర చికిత్సల తీరును పరిశీలిస్తే ప్రతి వంద మందిలో 70 మంది పురుషులు హృదయ సమస్యలతో సతమతమవుతున్నారు. మహిళలు మాత్రం 30 శాతమే ఉన్నారు. ప్రధానంగా ప్రజల జీవన శైలిలో వస్తున్న మార్పులు.. ఆహారపు అలవాట్లను మారుస్తుండడంతో హృదయ సమస్యలు తలెత్తుతున్నట్లు పరిశీలన చెబుతోంది. విద్యార్థి దశ నుంచి ఉద్యోగం చేసే స్థాయికి వచ్చే వారి వయసు సగటున 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ దశలోనే ఆహారపు అలవాట్లు గాడితప్పుతున్నాయి. క్రమంగా ఈ ప్రభావం గుండెపైన పడు తున్నట్లు తెలుస్తోంది. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, జంక్‌ఫుడ్ తదితరాలకు అలవాటు పడటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుదలతో గుండె నాళాలు ముసుకుపోతున్న ఘటన లు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో రక్త ప్రసరణలో తేడాలు రావడంతో శస్త్రచికిత్స చేసి స్టెంట్స్ వేయాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రస్తుతం గుండె సంబంధిత శస్త్రచికిత్సలను పరిశీలిస్తే 52 శాతం స్టెంట్ వేసే సర్జరీలే ఉంటున్నట్లు స్పష్టమవుతోంది. వయసుల వారీగా విశ్లేషిస్తే 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో 29 శాతం సింగిల్ స్టెంట్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ►గుండెకు శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న వారిల్లో పిల్లల సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే వీరిలో మెజార్టీ బాధితులు పుట్టుకతోనే గుండె సమస్యలతో జన్మిస్తున్నట్లు ఆరోగ్య శాఖ పరిశీలనలో వెల్లడైంది. అందులోనూ 26 శాతం బాధితులు హోల్ క్లోజర్ (గుండెలో ఏర్పడిన రంధ్రాల పూడిక) కోసమే సర్జరీలు చేయించుకుంటున్నారు. మిగతా 74 శాతం వివిధ రకాల సమస్యలతో చికిత్స చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ►గుండె సంబంధిత శస్త్రచికిత్సలు అత్యధికంగా చేస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉన్నాయి. ►తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు ఆలస్యంగా జరిగింది. దీంతో ఈ పరిశీలన నుంచి తెలంగాణను మినహాయించారు. అయితే తెలంగాణలో ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సల తీరును పరిశీలిస్తే హృదయ సంబంధిత కేటగిరీ ప్రథమ స్థానంలో ఉంది. గుండె సంబంధిత ఆస్పత్రుల సంఖ్య పెరగాలి ఆయుష్మాన్ భారత్ పథకం కింద నమోదైన ఆస్పత్రుల సంఖ్యను పరిశీలిస్తే ప్రతి ఎనిమిది ఆస్పత్రుల్లో ఒకటి మాత్రమే కార్డియాక్ కేర్ హాస్పిటల్ ఉంది. వీటి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు జీవనశైలిలో మార్పులకు అనుగుణంగా వ్యాయామం, యోగాలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. తెలంగాణలో ‘స్టెమీ’పేరుతో హైదరాబాద్‌లోని వైద్య నిపుణుల సహాయంతో టెలీమెడిసిన్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో గుండె వైద్యం అందిస్తున్నారు. వైద్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వాడుకలోకి తీసుకురావాలి. – డాక్టర్ కిరణ్ మాదల, అఖిల భారత ప్రభుత్వ వైద్య సంఘాల సమాఖ్య జాతీయ కార్యవర్గ సభ్యుడు -
గుండె ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులతో మరణిస్తున్న వారిసంఖ్య ఏటా పెరుగుతోంది. దేశంలో ఏటా మూడు మిలియన్ల మంది గుండె సంబంధిత సమస్యలతో మృత్యువాత పడుతున్నారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ తీసుకునే ప్రముఖ వ్యక్తులు కొందరు ఇటీవల హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. దీనికితోడు కోవిడ్ మహమ్మారి దాడి అనంతరం కొందరిని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ కారణాలన్నీ వెరసి గుండె ఆరోగ్య రక్షణపై ప్రజల్లో శ్రద్ధ పెరిగింది. ఇందుకు నిదర్శనం గడిచిన ఏడాది కాలంలో కార్డియాలజీకి సంబంధించి పురుషుల ఆన్లైన్ సంప్రదింపులు 300 శాతం, ఆస్పత్రిలో నేరుగా సంప్రదింపులు 150 శాతం పెరిగాయి. ఈ అంశాన్ని ఇటీవల ఇండియన్ హార్ట్ అసోసియేషన్ (ఐహెచ్ఏ) ఒక నివేదికలో వెల్లడించింది. ఆస్పత్రుల్లో నేరుగా, ఆన్లైన్లో సంప్రదిస్తున్న వారిలో 60 శాతం మంది 21–40 ఏళ్ల మధ్య వయస్కులు ఉన్నట్టు పేర్కొంది. 50 శాతం మంది 50 ఏళ్లు లోపు వారే దేశంలో గుండెపోటుకు గురవుతున్న పురుషుల్లో 50 శాతం మంది 50 ఏళ్ల లోపు వారే. 25 శాతం మంది 40 ఏళ్ల లోపు వారు ఉంటున్నట్టు ఐహెచ్ఏ తెలిపింది. ఆన్లైన్లో వైద్యులను సంప్రదిస్తున్న వారిలో 40 శాతం మంది నగరాలు, పట్టణాలకు చెందిన వారు కాగా 60 శాతం మంది మెట్రో నగరాలకు చెందినవారు. కరోనా ప్రభావం ఏ విధంగా ఉంటుంది? వైద్యులను సంప్రదిస్తున్న వారిలో ఎక్కువ మంది హృద్రోగుల్లో కరోనా ప్రభావం ఎంత.. ఏ విధంగా ఉంటుంది? అనే విషయాలను ఆరా తీస్తున్నారు. అదేవిధంగా గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయి.. కార్డియాక్ అరెస్ట్, కరోనరీ ఆర్డరీ డిసీజ్.. ఇతర గుండె సమస్యలు ఏమిటి.. వాటి లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలా గుర్తించాలి? అనే అంశాల గురించి తెలుసుకుంటున్నారు. అవగాహన పెరగడం మంచిదే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గడిచిన రెండేళ్లలో ప్రజల జీవన విధానాలు పూర్తిగా మారిపోయాయి. దీనికితోడు పోస్ట్ కోవిడ్ సమస్యలు కొందరిని వెంటాడుతున్నాయి. రక్తం చిక్కబడి గడ్డలు కట్టడం సంభవిస్తోంది. పోస్ట్ కోవిడ్ సమస్యలకు తోడు ప్రముఖులు గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో ప్రజల్లో గుండె సమస్యల పట్ల అవగాహన పెరుగుతోంది. మాకు గుండె సంబంధిత ఓపీలు పెరిగాయి. సంప్రదిస్తున్న వారిలో మెజారిటీ యువకులే ఉంటున్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరగడం మంచిదే. అయితే ఏదైనా సమస్య ఉందని తెలిసి ఆందోళన చెందడం మంచిది కాదు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది. ఈ క్రమంలో పూర్వపు జీవన విధానాలు ప్రారంభించడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. యోగ, వ్యాయామం చేయాలి. – డాక్టర్ విజయ్‌చైతన్య, కార్డియాలజిస్ట్ విజయవాడ నేరుగా సంప్రదింపులే ఉత్తమం గుండె సంబంధిత సమస్యలకు ఆన్లైన్లో కంటే నేరుగా వైద్యులను సంప్రదించడమే ఉత్తమం. ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ వంటి పరీక్షలు చేస్తేనే గుండె సమస్యలను గుర్తించవచ్చు. గుండె సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం జీవనశైలి. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరు జీవనశైలి మార్చుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలను వీడాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆధునిక జీవన విధానాలతో చిన్న వయసులోనే బీపీ, షుగర్ చుట్టుముడుతున్నాయి. 20 ఏళ్ల వయసు వారు గుండెపోటుకు గురవుతున్నారు. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, కర్నూలు -
శరీరంలో కొవ్వు ఎంత అవసరం? ఎంతకు మించితే ముప్పు?
ఆధునిక కాలంలో అనుసరిస్తున్న జీవన శైలి వల్ల, తినే ఆహారం వల్ల రకరకాల జబ్బులను కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ హెచ్చుతూనే ఉంది. హృదయ సంబంధ వ్యాధులకు ప్రధానంగా ఆహార పదార్థాలతోపాటు కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువ ఉండటం కూడా ఒక కారణమే. కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరమేనా? ఇది ఎంత ఉండాలి, ఎంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం అనే విషయాల గురించి తెలుసుకుందాం. శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ప్రతి 1 మిల్లీ గ్రాము/డి.ఎల్ ఎల్డిఎల్ పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం ఒకశాతం పెరుగుతుంది. అయితే ఎల్డి ఎల్‌కు ‘సాధారణ స్థాయి’ అంటూ ఏమీ లేదు. ఎల్డిఎల్ స్థాయి 100 మిల్లీ గ్రాము/డిఎల్‌కు పెరిగినప్పుడు గుండె పోటు ప్రమాదం అధికమవుతుంది. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్డిఎల్ స్థాయి 70 మిల్లీ గ్రాము/డిఎల్ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. హెడీఎల్ కొలెస్ట్రాల్ దీనినే మంచి కొలెస్ట్రాల్ అని అంటారు. హెచ్‌డిఎల్ రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్ విచ్ఛిన్నం అవుతుంది. ‘అథిరొస్లె్కరొసిన్’ అనే సమస్య ఉత్పన్నం కాకుండా హెచ్‌డిఎల్ రక్షణగా ఉంటుంది. హెచ్‌డిఎల్ స్థాయి తక్కువ గా ఉందంటే, గుండె రక్తనాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండె పోటుకు బలమైన కారణం ఎల్డిఎల్ పెరగడం కన్నా హెచ్‌డిఎల్ తగ్గడమే. హెచ్‌డిఎల్ పురుషుల్లో 40 ఎంజి/ డిఎల్, మహిళల్లో 50 ఎంజి/డిఎల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార జాగ్రత్తలు ►అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతిరోజు వంటల్లో ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. ►అలాగే గ్రీన్ టీ రోజు తాగడం వల్ల కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు హెచ్‌డీఎల్ స్థాయిని కూడా పెంచుకునే వీలుంది. ►ఇక దనియాలు.. ఈ గింజల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటివి ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ప్రభావం తగ్గుతుంది. వీటిని రోజు నేరుగా తినడం అలవాటు చేసుకుంటే మంచిది. ►మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని నేరుగా తినలేము. ఎందుకంటే ఇవి రుచికి చిరుచేదుగా అనిపిస్తాయి. అందువల్ల నానబెట్టుకుని తింటే మంచిది. ►చివరిగా ఉసిరి. ఇది కొలెస్ట్రాల్ సమస్యకు చక్కని పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏదైనా సమస్య రాకముందే ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచిదని.. చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చని కూడా చెబుతున్నారు. ►మాంసాహారం పూర్తిగా మానేయాలి. శాకాహారం లో వేపుడు కూరలు తినరాదు. వీటి బదులు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే కొబ్బరి, వేరుశనగలు, నువ్వులు వంటివి తీసుకోవడం వల్ల వీటిలో ఫైబర్‌తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది మన శరీర నిర్మాణానికి అవసరం. ►వరి, గోధుమ బదులు తృణ ధాన్యాలు, సిరి ధాన్యాలు తింటే కూడా చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. ►అలాగే పళ్ళు, పచ్చికూరలు తురుముకొని పెరుగులో వేసుకుని తినండి. కీర దోస, కారట్, బీట్రూట్, దోసకాయలు, బూడిద గుమ్మడి, సొరకాయ వంటివి తురుముకొని లేదా మిక్సర్‌లో వేసి పెరుగులో కలిపి తీసుకుంటే చాలా మంచిది. ►పాలకు బదులు పెరుగు, మజ్జిగ తీసుకోండి. పంచదార పూర్తిగా మానేసి తాటిబెల్లం, బెల్లం లేదా తేనె కొంచెం కొంచెం తీసుకోండి. ►ప్రతిరోజూ ఉదయం మొలకలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సలాడ్, పండ్లు తీసుకోవాలి. ఉదయం రెండు కిలోమీటర్ల నడక, ప్రాణాయామం చేయండి. చెడు కొవ్వు తగ్గడానికి... ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి.ఎల్డీఎల్ అనే చెడు కొవ్వులు.. డెసీలీటర్‌కు 70 మిల్లీగ్రాములకు మించకూడదు. ఎంత తక్కువ గా ఉంటే అంత మంచిది. ∙మధుమేహం ఉన్నవాళ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి. ►మంచి కొలెస్ట్రాల్ డెసిలీటర్కు 40 మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి. ∙ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్తపడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ►తిండిని అదుపులో ఉంచుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే.? శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. అన్ని విషయాల్లో మంచి, చెడూ ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ మనకు మేలు చేసేవి, చెడు చేసేవి ఉన్నాయి. చెడు కొవ్వుల్ని ఎల్డీఎల్(ఔఈఔ) అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్(ఏఈఔ) అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా/అదుపులో ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. -
బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కీ.. గుండెపోటుకీ తేడా తెలుసా?
తీవ్రమైన ఒత్తిడికీ, భావోద్వేగాలకు గురైనప్పుడు సినిమాల్లోని కొన్ని పాత్రలు అమాంతం గుండెపట్టుకు కూలబడిపోవడం చూశాం. ఒక్కోసారి తట్టుకోలేమనుకునే ఓ అనారోగ్యం లేదా శస్త్రచికిత్సలతోనూ ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఆ పరిస్థితిని నిభాయించుకోలేక ఒక్కోసారి గుండెపోటు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా గుండె పంపింగ్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. గుండెలోని కొంతభాగం పనిచేయకుండా మొరాయించవచ్చు. మిగతా భాగమంతా మామూలుగానే పనిచేయవచ్చు. కానీ గుండె సంకోచించే కార్యక్రమం కొంత బలంగా జరగాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితినే ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ అనవచ్చు. ఈ కండిషన్‌నే ‘స్ట్రెస్ కార్డియోమయోపతి’ అనీ, ‘టాకోట్సుబో కార్డియోమయోపతి’ అనీ లేదా ‘ఎపికల్ బలూనింగ్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు. ఈ కండిషన్‌కు చికిత్స చేయవచ్చు. ఇందుకు సాధారణంగా కొన్ని రోజులు మొదలుకొని వారాల సమయం పట్టవచ్చు. లక్షణాలు: బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ లక్షణాలన్నీ గుండెపోటులాగే ఉంటాయి. ఛాతీలో నొప్పి వస్తుంది. ఊపిరి అందదు. కారణాలు: బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కు కారణాలేమిటో ఇప్పటికీ ఇదమిత్థంగా తెలియదు. అయితే తీవ్రమైన ఒత్తిడి వల్ల ఒక్కసారిగా పెరిగే ‘అడ్రినాలిన్’ వంటి ‘స్ట్రెస్ హార్మోన్లు’ దీన్ని ప్రేరేపిస్తుందని నిపుణుల అభిప్రాయం. దాంతో కొందరిలో గుండెలో కొంత భాగం... మరీ ముఖ్యంగా గుండె కండరం కొంతమేర దెబ్బతినే ప్రమాదం ఉంది. దాంతో గుండె కండరం నిర్మాణం/ఆకృతిలో కొన్ని మార్పులు రావచ్చు. గుండెకు రక్తం అందించే రక్తనాళాలు (ధమనులు) సన్నబడవచ్చు. అయితే ఈ హార్మోన్లు గుండెనెలా దెబ్బతీస్తాయనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. సాధారణంగా విపరీతమైన శారీరక శ్రమ లేదా మానసిక బాధ/ఉద్వేగం తర్వాత ఇది కనిపిస్తున్నట్లుగా నిపుణులు గుర్తించారు. ఉదాహరణకు ఏదైనా ఆరోగ్య సమస్య తర్వాత అంటే... ఆస్తమా అటాక్, కోవిడ్ ఇన్ఫెక్షన్, ప్రమాదంతో కాలూ చేయి విరగడం లేదా ఏదైనా మేజర్ సర్జరీ వంటి సమస్యల తర్వాత ఇది కనిపించవచ్చు. దగ్గరివారితో వాగ్వాదాలూ లేదా కుటుంబ సభ్యుల్లో అత్యంత ఆత్మీయులో, బాగా దగ్గరివారో చనిపోయినప్పుడు కూడా ఇది రావచ్చు. అయితే కాస్తంత అరుదుగానే అయినా... కొన్ని మందులు కూడా ఈ సమస్యను తెచ్చిపెట్టవచ్చు. ఉదాహరణకు... ► తీవ్రమైన అలర్జిక్ రియాక్షన్ లేదా ఆస్తమాను అదుపు చేసేందుకు వాడే మందులు ► తీవ్రమైన ఉద్విగ్నత (యాంగై్జటీ) పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు వాడేవి, ముక్కులు బిగదీసుకుపోయినప్పుడు రిలీఫ్ కోసం వాడేవి ► కొకెయిన్ వంటి మాదకద్రవ్యాలు వాడినప్పడు కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశాలున్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితి వస్తే... బాధితులు ఏవైనా మందులు వాడుతున్నారా అనే విషయాన్ని డాక్టర్‌కు స్పష్టంగా చెప్పాలి. ఏవైనా కొత్తమందులు వాడాక ఇలాంటి పరిస్థితి ఎదురైతే... ఆ విషయాన్ని డాక్టర్ దృష్టికి వీలైనంత త్వరగా తీసుకెళ్లాలి. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కీ.. గుండెపోటుకీ తేడా ఏమిటంటే... గుండెకు రక్తం అందించే రక్తనాళాలన్నీ (ధమనులన్నీ) పూడుకుపోవడం లేదా దాదాపుగా పూర్తిగా పూడుకుపోవడం జరిగినప్పుడు సాధారణంగా గుండెపోటు వస్తుంది. కానీ ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’లో అలాంటి పరిస్థితి ఉండదు. ధమనుల్లో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ గుండెపోటు లాంటి పరిస్థితి ఎదురవుతుంది. రిస్క్ ఫ్యాక్టర్లు : బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ముప్పును పెంచే అంశాలివి... జెండర్: పురుషులతో పోలిస్తే ఇది మహిళల్లో ఎక్కువ. వయసు : యాభై ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్య చరిత్ర : గతంలో యాంగై్జటీ లేదా డిప్రెషన్ (కుంగుబాటు) వంటి ఏదైనా మానసిక సమస్యకు లోనై ఉండటం. దుష్ప్రభావాలు : ► కొన్ని ద్రవాలు (ఫ్లూయిడ్స్) వెనక్కు ప్రవహిస్తూ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం. (పల్మునరీ ఎడిమా) ► అకస్మాత్తుగా రక్తపోటు తగ్గడం (హైపోటెన్షన్) ►గుండె లయ తప్పడం (అరిథ్మియాస్) ►గుండె వైఫల్యం ►గుండె కండరాలు బలహీనం కావడంతో లోపల రక్తపు గడ్డలు ఏర్పడటం. ► దీని వల్ల మరణం సంభవించే అవకాశం ఉన్నప్పటికీ అది చాలా చాలా అరుదు. నివారణ : తీవ్రమైన ఉద్వేగాలకు / మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా జాగ్రత్తపడటం ప్రధానం. ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్న బాధితుల్లో డాక్టర్లు దీర్ఘకాలిక చికిత్సను అందజేస్తారు. బీటా బ్లాకర్స్ లేదా అలాంటివే మందులు వాడుతూ ఈ పరిస్థితిని నివారిస్తారు. -
76 శాతం గుండె జబ్బులు ఎందుకు తగ్గాయి?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటికీ భయపెడుతున్న ప్రాణాంతక కరోనా వైరస్ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 ఆస్పత్రులు మినహా మిగతా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు దాదాపు ఖాళీగా ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో అవన్నీ హద్రోగులు, క్యాన్సర్ రోగులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితో అవన్ని కిక్కిర్సి పోయి ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆస్పత్రి చూసినా అత్యధికంగా హృద్రోగులు, ఆ తర్వాత క్యాన్సర్ రోగులతో కిటకిటలాడుతుండేవి. కరోనా కేసుల తీవ్రత పెరిగినప్పటి నుంచి ఆ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. మూడోవంతు నుంచి సగం వరకు కేసులు తగ్గాయని అంతర్జాతీయ డేటాలు తెలియజేస్తున్నాయి. (ఇటలీ : కరోనా వ్యాక్సిన్ కనిపెట్టేశాం!) ఎందుకు? గుండె జబ్బులతో బాధ పడుతున్నవారు ఆస్పత్రుల్లో చేరకుండా ఇంటి వద్దనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా ? ఇంటి వద్దనే ప్రాణాలు విడుస్తున్నారా? అలాంటిదేమీ లేదని డేటాలు స్పష్టం చేస్తున్నాయి. స్పెయిన్‌లోని 71 కార్డియాక్ సెంటర్ల నుంచి సేకరించిన డేటా ప్రకారం హద్రోగులకు స్టంట్లు వేయడం, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయడం 81 శాతం తగ్గిపోయాయి. వాటిలో స్టంట్లు వేయడం 40 శాతం తగ్గగా, గుండె జబ్బులు రాకండా ముందు జాగ్రత్తతో ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య 48 శాతం తగ్గింది. మొత్తంగా హద్రోగ సంబంధిత పరీక్షలు నిర్వహించడం 57 శాతం తగ్గింది. (విదేశాల నుండి విమానాలు.. ప్రణాళిక విడుదల) అమెరికాలోని 9 ప్రధాన కార్డియాక్ సెంటర్ల నుంచి సేకరించిన డేటా ప్రకారం తీవ్రమైన గుండె జబ్బులతో (ఆపరేషన్ అవసరం లేని కేసులు) ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య 38 శాతం తగ్గింది. కోవిడ్ సమస్య వచ్చినప్పటి నుంచి హద్రోగ పరీక్షలు నిర్వహించడంలో, రోగులకు వైద్య చికిత్సలు అందించడంలో తీవ్ర జాప్యం జరగుతున్నట్లు హాంకాంగ్ నుంచి అందిన డేటా తెలియజేస్తోంది. భారత్‌లో ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్ నెలల మధ్య గుండె, క్యాన్సర్, కిడ్నీ, లివర్, లంగ్స్ సహా 825 రకాల చికిత్సలకు సంబంధించిన తీవ్రమైన కేసుల సంఖ్య 20 శాతానికి తగ్గిందని ‘నేషనల్ హెల్త్ అథారిటీ’ సేకరించిన డేటా ప్రకారం స్పష్టం అవుతోంది. అదే ఫిబ్రవరి–ఏప్రిల్ నెలల మధ్య గుండె జబ్బులకు సంబంధించిన చికిత్సలు 76 శాతం తగ్గాయి. తీవ్రమైన గుండె కేసులు కూడా గణనీయంగా తగ్గినట్లు ఆస్పత్రుల డేటాలు తెలియజేస్తున్నాయి. ఇవి కారణాలు కావచ్చు! 1. కోవిడ్ కారణంగా అనారోగ్యానికి చెందిన స్వల్ప లక్షణాలతో ఆస్పత్రులకు పరుగెత్తక పోవడం, 2. కరోనా వైరస్‌ను దష్టిలో పెట్టుకొని గుండె రక్త నాళాల్లో పేరుకు పోయిన రక్తాన్ని తొలగించేందుకు వైద్యులు సర్జికల్ పద్ధతులను అనుసరించక పోవడం. బ్లడ్ క్లాట్స్‌ను కరగించేందుకు ట్యాబ్లెట్లను సిఫార్సు చేయడం. క్లాట్స్‌ను కరిగించేందుకు ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉండడంతోపాటు ‘కీలేషన్ థెరపి’ లాంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. 3. గుండె జబ్బులను పెంచే పర్యావరణ కాలుష్యం తగ్గిపోవడం. 4. ఇళ్ల నుంచి పని చేసే సౌకర్యం లభించడంతో వత్తిపరమైన ఒత్తిళ్లు తగ్గిపోవడం. గుండె జబ్బులు కలిగిన వారిలో 50 శాతం మందికి వత్తిపరమైన ఒత్తిళ్ల వల్లనే గుండె జబ్బులు వస్నున్నాయన్నది తెల్సిందే. 5. ప్రయాణ బడలికలు కూడా తగ్గిపోవడం. 6. వేళకు నిద్రపోయే వెసలుబాటు లభించడం. 7. ఆరోగ్యానికి హానికరమైన ధూమపానం, మద్యపానం అందుబాటులో లేకపోవడం. 8. లాక్డౌన్ కారణంగా వాటిల్లుతోన్న ఆర్థిక నష్టం ముందు స్వల్ప అనారోగ్య సమస్యలను పట్టించుకోక పోవడం. 9. కరోనా కారణంగా ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం. 10. ఇక రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే లాక్డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు లేకపోవడం వల్ల ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. -
ఆ రెండింటితో చచ్చేచావు!
రాష్ట్రంలో రక్తపోటు, మధుమేహం జబ్బులు ఎక్కువగా ఉన్నట్లు వివిధ జిల్లాల్లో నిర్వహిస్తున్న స్క్రీనింగ్ పరీక్షల్లో తేలింది. ఆహార అలవాట్లలో వచ్చిన మార్పులు, వ్యాయామం లేకపోవడమే ఇందుకు ప్రాథమిక కారణం. మద్యం, పొగాకు మితిమీరిన వినియోగంవల్ల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి వారి కోసం రాష్ట్రంలో డీ–అడిక్షన్ సెంటర్లు ఏర్పాటుచేయాలని చెప్పాం. రొటీన్ జీవితంలో మార్పులు వచ్చేలా వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి. లేదంటే ఎక్కువగా నమోదవుతున్న క్యాన్సర్, గుండెపోటు వంటి వాటిపై గ్రామీణ ప్రాంతాల వారికి అవగాహన ఉండదు. ఫలితంగా ప్రజలకూ, ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉంటుంది. – సుజాతారావు, రిటైర్డ్ ఐఏఎస్, రాష్ట్ర ఆరోగ్యశాఖ నిపుణుల కమిటీ చైర్పర్సన్ సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానంగా రెండు రకాల జబ్బులు అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అందరూ ఆర్థికంగా చితికిపోయేలా చేస్తున్న ఈ పరిస్థితి చూసి వైద్య నిపుణులతోపాటు సర్కారూ ఆందోళన వ్యక్తంచేస్తోంది. బాధిత కుటుంబాల పరిస్థితి అయితే ఊహించలేనిది. ముఖ్యంగా కుటుంబ పెద్ద ఈ రోగాల బారిన పడితే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లే. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిశీలనలో తాజాగా వెలుగుచూసిన ఈ వాస్తవాలు అందరినీ విస్మయానికి.. ప్రధానంగా ప్రభుత్వాన్నీ తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే.. ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి గత ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.వెయ్యి కోట్లు ఖర్చయితే.. ఇందులో రెండు జబ్బులకే రూ. 500 కోట్లు అయింది. సగం వ్యయం ఆ రెండు రోగాలకే గుండెజబ్బులు, క్యాన్సర్లదే సింహ వాటా కోటీ 32 లక్షల మంది ఎన్సీడీ కోరల్లో రాష్ట్రంలో అసాంక్రమిక వ్యాధులు (ఎన్సీడీ–నాన్ కమ్యునికబుల్ డిసీజెస్) బారిన పడిన వారిలో 1.35 కోట్ల మంది ఉన్నట్లు తేలింది. వీరిలో అనేకమంది క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు.. ఇలా జీవనశైలి జబ్బుల్లో ఏదో ఒక జబ్బుకు దగ్గరై ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వాస్పత్రుల్లో ఎన్సీడీ క్లినిక్‌ల పేరిట చికిత్సలు చేస్తుండగా.. అందులో నమోదైన వారు కేవలం 53 వేల మంది మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయిలో 13, సామాజిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 85 క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్లినిక్‌లలో అన్ని రకాల జీవన శైలి జబ్బులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. బాధితుల జనాభాను బట్టి చూస్తే మరో 200 ఎన్సీడీ క్లినిక్‌లు పెంచాల్సిన అవసరం ఉందని, దీనికి రూ.32 కోట్లు వ్యయమవుతుందని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ నివేదిక ఇచ్చింది. గుండెజబ్బులు.. క్యాన్సర్లకే తడిసిమోపెడు మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో జీవనశైలి జబ్బులు (లైఫ్‌స్టైల్ డిసీజెస్) ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా గుండెపోటు జబ్బులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆరోగ్యశ్రీలో గత ఏడాది జరిగిన చికిత్సల వివరాలు పరిశీలిస్తే ఈ విషయం బయటపడింది. కార్డియో వాస్క్యులర్ జబ్బులకు ఒక్క ఏడాదిలో రూ.365.14 కోట్ల వ్యయమైంది. ఇక క్యాన్సర్ రోగులకూ గతేడాదిలో రూ.197.40 కోట్లు వ్యయం చేశారు. అలాగే, కిడ్నీ బాధితుల చికిత్స, డయాలసిస్‌లకు కలిపి రూ.69.31 కోట్లు ఖర్చయింది. ఇలా మొత్తం 1048 జబ్బులకు గాను రూ.1000 కోట్లు నిధులు ఇస్తే ఇందులో రూ.532.12 కోట్లు ఈ మూడు జబ్బులకే వ్యయమైందంటే పరిస్థితి తీవ్రతను అంచనా వెయ్యొచ్చు. క్యాన్సర్‌కు కారణాలు చాలా.. పురుగు మందుల అవశేషాలున్న ఆహార పదార్థాలు, మేనరికాలు, మద్యం సేవించడం, పొగతాగడం వంటివి క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా చెప్పచ్చు. మన రాష్ట్రంలో 35 ఏళ్లు దాటిన ప్రతి 28 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నట్టు అంచనా. వీలైనంత వరకూ నిల్వ ఉంచిన ఆహారం తీసుకోకపోవడం. తాజా పళ్లు, కూరగాయాలు తినడం మంచిది. – డా. సీహెచ్ సులోచనాదేవి, క్యాన్సర్ వైద్య నిపుణులు, విజయవాడ జీవనశైలి జబ్బులు పెరిగాయి గ్రామాల్లోనూ బీపీ, మధుమేహం మందుల వినియోగం బాగా పెరిగింది. గుండెజబ్బులు విపరీతంగా పెరిగాయి. వీటి చికిత్స ఖరీదైపోవడంతో అటు ప్రభుత్వానికీ, ఇటు ప్రజలకూ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ప్రాథమిక దశలో గుర్తించడం లేదా రాకుండా చూడటం చేయాలి. నాలుగు క్యాన్సర్ ఆస్పత్రులను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించాం. – డా. బి.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రముఖ న్యూరో వైద్యులు, నిపుణుల కమిటీ సభ్యులు అవగాహన కల్పించాలి మనం ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఎక్కువగా గుండెజబ్బులు, క్యాన్సర్‌కు ఖర్చుచేస్తున్న విషయం వాస్తవమే. అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ నమోదవుతున్నాయి. వీటిని అరికట్టాలంటే చిన్నతనం నుంచే ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలకు మంచి ఆహార అలవాట్లు, వ్యాయామం నేర్పాలి. – డా. ఎ. మల్లిఖార్జున, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో -
పోటెత్తిన గుండెకు అండగా
సాక్షి, హైదరాబాద్: ఆకస్మికంగా గుండెపోటు వస్తే తక్షణం వైద్యం అందక రాష్ట్రంలో అనేక మరణాలు సంభవిస్తున్నాయి. 108 అత్యవసర అంబులెన్సులున్నా వాటిల్లో అత్యాధునిక సదుపాయా లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు మరణాల రేటు అధికంగా ఉంటోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ‘స్టెమీ’ అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అకస్మాత్తుగా గుండెపోటు రావడాన్ని ఎస్టీ–ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (స్టెమి) అంటారు. అత్యాధునిక వసతులతో కూడిన అంబులెన్సులు, ఇతరత్రా సదుపాయాలు కల్పించడమే ఈ అంబులెన్స్ ఉద్దేశం. ఈ అంబులెన్సులను ఆగస్టు 15న ప్రారంభించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 30 అంబు లెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆకస్మికంగా గుండెపోటు వచ్చిన రోగిని బతికించేందుకు దేశంలో పలుచోట్ల ‘జాతీయ స్టెమీ కార్యక్రమం’ నడుస్తోంది. తమిళనాడులో ప్రస్తుతం ఇది పైలట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. ఇప్పుడు తెలంగాణలో ప్రారంభించనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద దీనికి కేంద్రం నిధులు రానున్నాయి. చేయి దాటుతోంది.. దీర్ఘకాలం గుండెలో రంధ్రాలు మూసుకొని పోయి ఉండటం వల్ల ఒకేసారి తీవ్రమైన గుండెపోటు వస్తుంది. ఈ పరిస్థితినే స్టెమీ అంటారు. ఇలాంటి సందర్భంలో ప్రతి క్షణం అత్యంత కీలకమైంది. స్టెమీ అనే తీవ్రమైన గుండెపోటు వచ్చిన వారు చనిపోవడానికి ప్రధాన కారణం ఆసుపత్రికి తీసుకెళ్లేంత సమయం ఉండకపోవడం, రవాణా సదుపాయాలు లేకపోవడం.. అంతేకాదు సాధారణమైన ప్రాథమిక స్థాయి ఆసుపత్రుల్లో తీవ్రమైన గుండెపోటు గుర్తించే పరిస్థితి లేకపోవడమేనని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. సాధారణ అంబులెన్సుల్లో తీవ్రమైన గుండెపోటుకు తీసుకోవాల్సిన ప్రత్యేక వ్యవస్థ ఉండదు. ఆక్సిజన్ ఇచ్చి సాధారణ వైద్యం చేస్తూ సమీప ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి మాత్రమే అవి పనికొస్తున్నాయి. దీనివల్ల ఈ అంబులెన్సులు రోగిని తీసుకెళ్లేందుకు వచ్చినా ప్రాణాలు కాపాడటం సాధ్యం కావట్లేదు. అత్యాధునిక సదుపాయాలు.. స్టెమీ అంబులెన్సులు ఆకస్మిక గుండె పోటును నివారించేందుకు ఉపయోగపడతాయి. అందులో కేతలాబ్లో ఉండే అన్ని రకాల అత్యాధునిక వసతులు ఉంటాయి. ఈసీజీ రికార్డు చేయడం, గుండె చికిత్సకు అవసరమైన ప్రొటోకాల్ వ్యవస్థ ఉంటుంది. అడ్వాన్స్ లైఫ్ సపోర్టుతో వైద్యం అందుతుంది. ఈ అంబులెన్సులను ఆకస్మికంగా గుండెపోటు వచ్చిన వారి కోసమే పంపుతారు. 108 అత్యవసర వాహనాలకు స్టెమీని అంబులెన్సులను అనుసంధానం చేస్తారు. స్టెమీ అంబులెన్సులతో పాటు ప్రతి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కేతలాబ్ను ఏర్పాటు చేస్తారు. దానివల్ల రోగిని ఏదో ఆసుపత్రికి కాకుండా కేతలాబ్కే తీసుకెళ్లడానికి వీలుంటుంది. దేశంలో కొన్నిచోట్ల ఇప్పటికే స్టెమీ అంబులెన్సులను ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో 19 శాతం ఆకస్మిక గుండె మరణాలను తగ్గించగలిగారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. -
కార్మికుడిని బలిగొన్న ‘కారుణ్యం’
రెబ్బెన(ఆసిఫాబాద్): విధులు నిర్వహించేందుకు ఆరోగ్యం సహకరించకపోవటంతో కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కారుణ్యం దక్కకపోగా చేసే పనిని కాదని సర్ఫేస్ జనరల్ మజ్దూర్‌గా ఫిట్ చేయటంతో తీవ్ర మానసిక క్షోభకు గురై గుండెపోటుతో కార్మికుడు ప్రాణాలు వదిలిన సంఘటన బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. బెల్లంపల్లి ఏరియాలోని గోలేటిటౌన్‌షిప్‌లో నివాసం ఉండే దొమ్మటి లింగయ్య(56) ఏరియా ఖైరిగూడ ఓసీపీలో కన్వేయర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహించే వాడు. కొంతకాలంగా తీవ్ర ఆనారోగ్యం కారణంగా విధులు నిర్వహించే సత్తువ లేక ఇంకా నాలున్నర సంవత్సరాల సర్వీస్ ఉన్నా యాజమాన్యం అవకాశం కల్పించిన కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో గత నెల 10, 11 తేదీల్లో కొత్తగూడెంలో నిర్వహించిన మెడికల్ బోర్డుకు వెళ్లగా లింగయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించి అతని అనారోగ్యపరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గనుల్లో పని చేసేందుకు అనర్హుడిగా పేర్కొంటూ సర్వేస్ జనరల్ మజ్దూర్‌గా ఫిట్ చేస్తూ మైన్‌కు రిపోర్ట్ పంపించారు. దీంతో గత 18న ఏరియా జీఎం కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా కైరిగూడ గని అధికారులు లెటర్ సిద్ధం చేశారు. విషయం తెలియని లింగయ్య మంగళవారం విధులు నిర్వహించేందుకు ఖైరిగూడకు వెళ్లి మాస్టర్ వేయాలని కోరగా మాస్టర్ లాక్ అయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అనారోగ్య కారణాలతో కోరుకున్న కారుణ్య నియామకం దక్కకపోగా, కన్వేయర్ ఆపరేటర్ ఉద్యోగం నుంచి సర్ఫేస్ జనరల్ మజ్దూర్‌గా ఫిట్ చేశారని తెలుసుకున్న లింగయ్య తీవ్ర మానసిక క్షోభకు గురై అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే వాంతులు కావటంతో హుటాహుటిన అంబులెన్సులో గోలేటి డిస్పెన్సరీకి తరలించిన అధికారులు అపై మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. కాగా మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కార్మికుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ‘సీఎం హామీ అమలులో విఫలం’ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయటంతో సీఎం కేసీఆర్, గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ విఫలం కావడంతో కార్మికులు మానసిక క్షోభను అనుభవిస్తూ మృత్యువాత పడుతున్నారని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి ఆరోపించారు. కారుణ్య నిమాయకం ద్వారా కార్మికులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చిన మెడికల్‌బోర్డులో కార్మికులకు న్యాయం జరగటం లేదన్నారు. అనారోగ్య కారణాలతో విధులకు హాజరుకాలేక మానసికక్షోభను అనుభవిస్తూ కార్మికులు గుండె పగిలి మృతి చెందుతున్నారని అన్నారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ కారుణ్య నియామకాలు అందించాలని డిమాండ్ చేశారు. -
పరి పరిశోధన
చలికాలంలోనే గుండెపోట్లు ఎక్కువ! వాతావరణం చల్లబడితే గుండెపోట్లు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని అంటున్నారు తైవాన్ శాస్త్రవేత్తలు. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉన్నప్పుడు ఎక్కువమంది మరణించినట్లు గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త పో జూయి వూ తెలిపారు. 2008 – 2011 మధ్యకాలంలో గుండెపోటుకు గురైన 40 వేల మంది వివరాలు.. రెండు ఇతర అధ్యయనాల ద్వారా సేకరించిన పది లక్షల మంది వివరాలను కలిపిపరిశీలించినప్డుపు ఈ విషయం స్పష్టమైందని ఆయన చెప్పారు. చలికాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఛాతి నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి ఇబ్బందులు ఎదురై.. ఆ మరుసటి రోజు చాలామంది గుండెపోటుకు గురైనట్లు తెలిపారు. చలికాలంలో ఎవరైనా గుండెపోటు తాలూకూ లక్షణాలతో ఉంటే జాగ్రత్త వహించాలని సూచించారు. గుండెపోట్లకు.. చలికాలానికి కార్యకారణ సంబంధం ఉందా? లేదా? అన్నది మాత్రం ఈ అధ్యయనం స్పష్టం చేయలేదు. ఆసియా పసఫిక్ కార్డియాలజీ సొసైటీ సమావేశంలో ఈ అధ్యయన వివరాలను ప్రకటించారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని అంచనా. ఇన్సులిన్ మాత్రలతో సత్ఫలితాలు... మధుమేహులు తరచూ సూదిమందు తీసుకోవాల్సిన అవసరాన్ని తప్పించే ఇన్సులిన్ మాత్రల ప్రభావం బాగానే ఉన్నట్లు తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఓరామెడ్ అనే సంస్థ అభివద్ధి చేసిన ఈ మాత్రలపై ఇంకో దశ ప్రయోగాలు పూర్తి అయితే అందరికీ అందుబాటులోకి వస్తాయని అంచనా. మధుమేహ చికిత్సకు నోటి ద్వారా ఇన్సులిన్ అందివ్వడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చునని దశాబ్దాలుగా తెలిసినప్పటికీ ఇలాంటి మాత్రలను తయారు చేయడం ఇప్పటివరకూ వీలుపడలేదు. కడుపులో ఉండే ఆమ్లాలు ఇన్సులిన్‌ను నిర్వీర్యం చేయడం దీనికి కారణం. ఓరామెడ్ సంస్థ ఆమ్లాలను తట్టుకునే తొడుగు ఉండే మాత్రలను తయారు చేయడం ద్వారా సమస్యను అధిగమించింది. దీంతో ఈ కంపెనీ మాత్రలు చిన్నపేవులను చేరేవరకూ ఇన్సులిన్‌ను విడుదల చేయవు. తొలి రెండు దశల ప్రయోగాల్లో ఈ మాత్రల ప్రభావ శీలతను, భద్రతలను రుజువు చేయగా.. ఇది అందరిలో దాదాపు ఒకేలా పనిచేస్తుందని తెలుసుకునేందుకు ఇంకో దశ ప్రయోగాలు జరిపారు. గతంలో మందు 28 రోజుల పాటు మందు ప్రభావం ఏమిటన్నది గుర్తిస్తే... తాజా ప్రయోగాల్లో 90 రోజులపాటు పరిశీలనలు జరిపారు. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో రెండేళ్లలో ఈ మాత్రలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఓరామెడ్తోపాటు కొన్ని ఇతర కంపనీలు కూడా ఇన్సులిన్ మాత్రలను తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. పొగాకు పూలలో సరికొత్త యాంటీబయాటిక్ వ్యాధి కారక బ్యాక్టీరియా మందులకు నిరోధకత పెంచుకుంటున్న ప్రస్తుత తరుణంలో లా ట్రోబ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పొగాకు పూలలో ఉండే ఓ రసాయన మూలకం మెరుగైన యాంటీబయాటిక్‌గా పనిచేస్తుందని గుర్తించారు. యాంటీబయాటిక్ నిరోధకత ఎక్కువైతే.. ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త యాంటీబయాటిక్ మూలకాల కోసం శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రకరకాల జంతువులు, సేంద్రీయ ఉత్పత్తుల నుంచి కొత్త యాంటీబయాటిక్‌లను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుతున్నాయి. లా ట్రోబ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అలాంటిదాన్ని పొగాకు పూలలో గుర్తించారు. నికోటినా అలాటా అని పిలిచే పొగాకు మొక్క శిలీంధ్రాల దాడిని తట్టుకునేందుకు కొన్ని రసాయలను ఉత్పత్తి చేసుకుంటుందని.. వీటిల్లో ఒకటైన ఎన్ఏడీ1 మనుషుల్లో బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులపై కూడా ప్రభావం చూపగలదని తమ పరిశోధనల ద్వారా తెలిసిందని హ్యులెట్ అనే శాస్త్రవేత్త తెలిపారు. హెచ్ఐవీ, జికా వైరస్, డెంగ్యూ, ముర్రే రివర్ ఎన్‌సెఫిలైటిస్ వంటి అనేక వ్యాధులకు ఈ కొత్త యాంటీబయాటిక్ ద్వారా మెరుగైన చికిత్స కల్పించవచ్చునని అంచనా. -
ఇవి తింటే గుండె చాలా పదిలం!
న్యూయార్క్: వేరుశనగ విత్తనాలు తింటే గుండెకు మంచిదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పల్లీలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండెపోటు ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఆరోగ్యంగా ఉన్నవారు, ఊబకాయంతో బాధపడుతున్న 15 మంది పురుషులపై పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. వీరిలో కొంతమందికి నియమబద్ధంగా రోజుకు 85 గ్రాముల వేరుశనగలను అందించారు. ఇంకొంతమందికి ఇచ్చే ఆహారంలో అన్ని పోషకాలు ఉండి వేరుశనగలు లేకుండా ఇచ్చారు. అలా ఇచ్చిన తరువాత వారి రక్తనమునాలలో లైపిడ్, లైపిడ్ ప్రోటీన్, ఇన్సులిన్ స్థాయిలను 30, 60, 120, 240 నిముషాలకోసారి పరిశీలించారు. వేరు శనగ విత్తనాలు తీసుకున్న వారు, తీసుకోని వారిని పోల్చిచూస్తే విత్తనాలు తీసుకున్నవారి రక్తనమూనాలో ట్రైగ్లిసరైడ్స్ 32 శాతం తగ్గినట్లు గమనించారు. అంతేగాక ధమనులు మరింత ఆరోగ్యంగా ఉండి ఎక్కువ వ్యాకోచాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడైంది. వేరుశనగ విత్తనాలు తీసుకుంటే అలాంటి సమస్య తగ్గుతుందని యూనివర్సిటీ ప్రొఫెసర్ పెన్నీ క్రిస్ ఎథిరన్ తెలిపారు. -
అభిమాన హీరోను ఆలింగనం చేసుకుని..
తుమకూరు (కర్ణాటక): తన అభిమాన హీరోను దగ్గరగా చూసి మనసారా ఆలింగనం చేసుకున్న ఆ అభిమాని గుండె ఆ ఆనందాన్ని పట్టలేకపోయిందేమో... ఒక్కసారిగా ఆగిపోయింది. కన్నడ సినీ హీరో, బహుభాషా నటుడు సుదీప్‌ను వాటేసుకున్న అభిమాని కాసేపటికే కన్నుమూశాడు. సుదీప్ తన కొత్త సినిమా హెబ్బులి విజయయాత్ర ప్రారంభోత్సవం కోసం సోమవారం తుమకూరు పట్టణంలోని గాయత్రి థియేటర్‌కు వచ్చాడు. సుదీప్‌ను చూడటానికి భారీఎత్తున అభిమానులు తరలివచ్చారు. హోటల్ కార్మికుడైన శశిధర్(45)కు సుదీప్ అంటే వీరాభిమానం. అతడు సుదీప్తో కరచాలనం చేసి కార్యక్రమంలో సందడి చేశాడు. ఆ ఆనందంలో ఇంటికి వెళ్తుండగా, మార్గమధ్యలో గుండె పోటుతోకుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా శశిధర్ మరణించాడు. -
యంగ్ ఎటాక్
నేడు వరల్డ్ హర్ట్ డే హార్ట్ ఎటాక్స్ గురించి విన్నాం. నడి వయసులో వస్తుందని జాగ్రత్త పడతాం. హై కొలెస్ట్రాల్, హై బీపీ, హై షుగర్, హై స్ట్రెస్... వంటివి ఈ హార్ట్ ఎటాక్స్‌కి గట్టిగా ముడిపడి ఉన్నాయని తెలుసుకున్నాం. పురుషుల్లో ఎక్కువ, మహిళల్లో ఒక వయసు వరకు కాస్త తక్కువ అని చదివాం. కానీ ఇప్పుడు చిన్న వయసులో హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి! యంగ్‌గా ఉన్నప్పుడే ప్రాణాలు తీస్తున్నాయి. ఆలస్యం చేయకుండా లైఫ్స్టైల్లో మార్పులు తెచ్చుకోగలిగితే ఈ యంగ్ ఎటాక్స్‌ను నివారించుకోవచ్చు. ఒక 23 ఏళ్ల విద్యార్థి ఎమర్జెన్సీ విభాగానికి ఛాతీలో నొప్పి అంటూ వచ్చాడు. అతడిని చూసిన ఎమర్జెన్సీలోని ఫిజీషియన్స్ తొలుత దాన్ని సాధారణ ఛాతీ నొప్పిగానే భావించారు. ఎమర్జెన్సీకి ఛాతీ నొిప్పి అంటూ వచ్చిన వారికి ఈసీజీ తీసి పరీక్షించడం ఒక నియమం. డాక్టర్లనే అబ్బురానికి గురిచేస్తూ ఆ ఈసీజీలో గుండెపోటు వచ్చిన సూచనలు కనిపించాయి. అంతే... మరికొన్ని పరీక్షలు చేశారు. దాంతో అది గుండెపోటు అని స్పష్టంగా తెలిసింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... అతడికి డయాబెటిస్, హైబీపీ, హైకొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలేవీ లేవు. ఆ కుర్రవాడితో మాట్లాడాక తెలిసిన విషయం ఏమిటంటే... అతడి రూమ్మేట్స్ విపరీతంగా పొగతాగుతుంటారు. ఆ పొగ (పాసివ్ స్మోకింగ్) ఇతడి మీద ప్రభావం చూపింది! ఒకప్పుడు... అంటే 1960లకు పూర్వం... రక్తనాళాలకు సంబంధించిన గుండెజబ్బులు (కరొనరీ ఆర్టరీ డిసీజ్) 40 ఏళ్లలోపు వారిలో కనిపించడం చాలా అరుదు. కరొనరీ ఆర్టరీ డిసీజ్ అనేది గుండె ధమనులకు సంబంధించిన వ్యాధి. ధమనులు అనే ఈ రక్తనాళాలే గుండెకు రక్తం, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. గుండెజబ్బు కారణంగా ఈ ధమనులు సన్నబడి, రక్తం సరఫరా తగ్గిపోవడం లేదా ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోవడం జరగవచ్చు. ఇలాంటప్పుడు ఛాతీలో నొప్పి రావచ్చు. ఈ కండిషన్‌ను యాంజినా పెక్టోరిస్ అంటారు. తగినంత రక్తసరఫరా జరగని సందర్భాల్లో గుండె కండరాలు చచ్చుపడిపోవడం ప్రారంభమవుతుంది. దాన్నే సాధారణంగా హార్ట్ ఎటాక్ (అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (ఏఎమ్ఐ) అంటారు. ఆ సమయంలో వచ్చే నొప్పిని గుండెపోటు అని పిలుస్తారు. ఈ 21వ శతాబ్దంలో కరొనరీ ఆర్టరీ డిసీజ్ బారిన పడే యువకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు దీన్ని ఆధునిక జీవనశైలి (నాగరికత) తీసుకువచ్చిన వ్యాధిగా చెప్పవచ్చు. మన దేశంలో గుండెపోటు అవకాశాలెక్కువ మిగతా పాశ్చాత్య దేశవాసులతో పోలిస్తే మన దేశవాసుల్లో కరొనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా ఇటీవల చిన్నవయసు వారిలోనే ఇది కనిపిస్తోంది. ఈ జబ్బు వచ్చిన అతి చిన్న వయసు వారిలో ఓ 14 ఏళ్ల చిన్నారి కూడా ఉండటాన్ని నిపుణులు గుర్తించారు. ఇక వయసు పెరుగుతుండటం ఈ జబ్బుకు ఒక రిస్క్ ఫ్యాక్టర్. స్థూలకాయమూ ఎక్కువే! పాశ్చాత్య దేశాలలో వచ్చే స్థూలకాయంతో పోలిస్తే మన దేశవాసుల్లో వచ్చే స్థూలకాయం కాస్తంత విభిన్నంగా ఉంటుంది. మన దేశవాసుల్లో ఊబకాయం ఎక్కువగా పొట్ట దగ్గర వస్తుంది. దీన్నే అబ్డామినల్ ఒబేసిటీ అంటారు. అధిక శాతం కొవ్వు నడుము వద్ద పెరగడం వల్ల ఇది కనిపిస్తుంది. దీన్నే ఆపిల్ షేప్డ్ ఊబకాయం అంటారు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను మన పొట్ట దగ్గర్నుంచి మన కాలేయానికి నేరుగా రవాణా జరిగేలా చూస్తుంది. ఫలితంగా కాలేయంలో కొవ్వు చేరుతుంది. ఇలా కాలేయంలో కొవ్వు చేరడాన్ని ‘ఫ్యాటీ లివర్’గా పిలుస్తుంటారు. ♦ ఇక యువతలో డయాబెటిస్ కేసులు పెరుగుతుండటం కూడా గుండెపోటుకు దోహదం చేసే అంశాలలో ఒకటి. డయాబెటిస్ లేనివారితో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవారిలో గుండెపోటు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఒక్కోసారి అకస్మాత్తుగా మరణం కూడా సంభవించవచ్చు. గుండె రక్తనాళాల్లో / ధమనుల్లో క్లాట్స్ ఏర్పడే అవకాశాలు డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో ఎక్కువ. అంతేకాదు... ఇలాంటివారికి కాళ్లు, మెదడులోని రక్తనాళల్లోనూ క్లాట్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ♦ మారుతున్న ఆహారపు అలవాట్లలో భాగంగా ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఎక్కువవుతోంది. సమోసా, శ్నాక్స్‌లో ఇప్పుడు ఉప్పు ఎక్కువగా ఉంటోంది. దాంతోపాటు కొవ్వులు (ట్రాన్స్‌ఫ్యాట్స్) సైతం పెరుగుతున్నాయి. దీని వల్ల కూడా రక్తనాళాల్లో కొవ్వులు చేరి రక్తనాళాలను సన్నగా అయ్యేలా చేస్తున్నాయి. ఇది కూడా యువతలో గుండెపోటు పెరగడానికి ఒక ప్రధాన కారణం. ♦ మన యువతలో వ్యాయామం లేకపోవడం అన్నది పాఠశాల, కాలేజీ స్థాయిలోనే ప్రారంభమవుతోంది. మన విద్యావ్యవస్థలో వ్యాయామం కంటే చదువుల మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇక జిమ్‌లకు హాజరయ్యే యువత కూడా తమ కండరాలకు వ్యాయామం కల్పించడం కంటే కండరాల నిర్మాణం పైనే ఎక్కువగా దృష్టి నిలుపుతున్నారు కానీ ఏరోబిక్స్ శిక్షణపై దృష్టి కేంద్రీకరించడం లేదు. ఇప్పుడు యువత కనీసం రోజులో 30 - 60 నిమిషాలు వ్యాయామం చేయడం అవసరం. కానీ సమయం సరిపోవడం లేదనే సాకు మన దేశంలో చాలా ఎక్కువే. అధికశాతం యువకులు గుండెపోటు బారిన పడుతుండటానికీ ఇదీ ఒక ప్రధాన కారణమే. ♦ పాశ్చాత్యులతో పోలిస్తే భారతీయులలో రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణభారతీయుల్లో ఇవి మరీ సన్నగా ఉంటాయి. వీరికి మిగతావారితో పోలిస్తే గుండెపోటు రావడానికి కుటుంబ చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) కూడా ఒక కారణం. దాదాపు 25 శాతం మంది రోగుల్లో గుండెపోటుకు ఈ ఫ్యామిలీ హిస్టరీ అన్నదే ప్రధాన కారణం. ♦ కొన్ని వృత్తుల్లో ఎక్కువ పనిగంటలు, రాత్రుళ్లు సైతం పనిచేయాల్సి రావడం వల్ల చాలా ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ♦ గుండెపోటు వల్ల కలిగే మరణాలు కేవలం ఆ కుటుంబపైనే కాకుండా సమాజం, దేశంపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే వాటిని నివారించడానికి అన్ని వైపుల నుంచి సమష్టిగా, సమీకృతంగా కృషి జరగాలి. లక్షణాలు సాధారణంగా చాలామందిలో ఛాతీనొప్పితో గుండెపోటు కనిపిస్తుంది. ఈ లక్షణం కనిపించే వారు 97.3 శాతం మంది, చెమటలు పట్టడం 11 శాతం మందిలో, వాంతులు లేదా వికారం 8.2 శాతం కేసుల్లో, శ్వాస ఆడకపోవడం 6.8 శాతం మందిలో కనిస్తాయి. ఈ వయసులో చాలా మందిలో వచ్చే గుండెపోటుకు కారణమైన నొప్పికి.. గ్యాస్, అజీర్ణం, అసిడిటీ కారణం అని భావిస్తుంటారు. వైద్య నిపుణులలో సైతం ఈ వయసు వారిలో బహుశా అది కరొనరీ ఆర్టరీ వ్యాధి వల్ల కావచ్చని చాలా తక్కువ మంది భావిస్తారు. ఈ అంశం కూడా చికిత్స ప్రారంభించడాన్ని ఆలస్యం చేస్తోంది. కారణాలు ♦ సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్క్లిరోసిస్ అని వ్యవహరిస్తుంటారు. ఈ అథెరో స్క్లిరోసిస్ ప్రక్రియ మొదలైన ఏడాది వ్యవధిలోనే గుండెపోటు కనిపించవచ్చు. గతంలో సాధారణంగా 40 ఏళ్లకు పైబడ్డాక ఈ పరిణామం సంభవిస్తుండేది. అయితే ఇప్పుడు ఈ వయసు కంటే ముందే.. అంటే 25 నుంచి 30 ఏళ్లలోపే ఇలా రక్తనాళాలు గట్టిబారగడం కనిపిస్తోంది. కొందరిలో కొలెస్ట్రాల్ నిల్వలు చాలా నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరుతుంటాయి. కానీ కొందరిలో చాలా వేగంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇలా పేరుకునే కొవ్వును ‘ప్లేక్స్’గా వ్యవహరిస్తుంటారు. ఈ ప్లేక్స్ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల ధమనులు / రక్తనాళాలు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ప్లేక్స్ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్ (అడ్డంకులు)గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు. ♦ యువతలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం, ఆల్కహాల్ అలవాటు గుండెపోటుకు ఒక కారణం. ఈ అలవాట్ల వల్ల అథెరో స్క్లిరోసిస్ చిన్న వయసు నుంచే ప్రారంభమవుతుంది. ♦ పొగతాగడం అథెరోస్క్లిరోసిస్కూ... తద్వారా గుండెపోటుకు మరో ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. ♦ జెండర్ అంశం కూడా గుండెపోటుకు ఒక ప్రధాన కారణం. మహిళలతో పోలిస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు పురుషుల్లో ఎక్కువ. రుతుస్రావం ఆగిపోయే వరకు మహిళల్లో కనిపించే ఈస్ట్రోజెజ్ మహిళలకు ఒక రక్షణ కవచం. పురుషులు, మహిళలైన యువ రోగుల్లో గుండెపోటు నిష్పత్తిని పరిశీలిస్తే అది 20 : 1 గా ఉంటుంది. కానీ రుతుక్రమం ఆగిపోయాక మహిళలకూ గుండెపోటు అవకాశాలు సమానంగా ఉంటాయి. ♦ మారుతున్న ఆహారపు అలవాట్లను పరిగణనలోకి తీసుకుంటే ఆహారంలో గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) తగ్గడం, కీడు చేసే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్), చెడు కొవ్వులైన ట్లైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం అన్నది కూడా యువతలో గుండెపోటు పెరగడానికి దోహదం చేసే అంశాల్లో ప్రధానమైనదే. ♦ పొట్ట దగ్గర కొవ్వు పెరగడం (సెంట్రల్ ఒబేసిటీ), ఒత్తిడి (స్ట్రెస్)తో కూడిన ఆధునిక జీవనశైలి కూడా గుండెపోటును పెంచేవే. ♦ అధిక రక్తపోటు (హైబీపీ) కూడా గుండెపోటుకు దోహదం చేస్తుంది.