సాక్షి, హైదరాబాద్: నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోతున్నారు..నృత్యం చేస్తూ నేలరాలిపోతున్నారు. జిమ్ చేస్తూ జీవితాలు ముగిస్తున్నారు. జోకులేస్తూనే ప్రాణాలొదిలేస్తున్నారు. వీరిలో మధ్య వయసు్కలు, యువత, కొన్ని సందర్భాల్లో 15 ఏళ్ల లోపు వారూ ఉంటున్నారు. దీంతో ఆరోగ్యవంతుల్ని సైతం గుండెపోటు భయం పట్టిపీడిస్తోంది. అనుమానాలతో ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది.
అయితే అన్ని ఆకస్మిక మరణాలకూ గుండెపోట్లనే కారణంగా పరిగణించలేమని వైద్యులు చెబుతున్నారు. జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించడంలో జాప్యం కూడా ఆకస్మిక మరణాలకు దారితీస్తోందని వారంటున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులతో ఈ పరిస్థితుల్ని అధిగమించవచ్చని స్పష్టం చేస్తున్నారు.
భయం..భయం..
గుండె పనితీరు గురించిన రకరకాల భయాలు, సందేహాలతో వైద్యుల్ని సంప్రదిస్తున్నవారు ఇటీ వల పెరిగారని ఆన్‌లైన్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ ‘ప్రాక్టో’అధ్యయనం తేల్చింది. గుండె పనితీరు గురించి సందేహాలతో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణె నగరాల నుంచీ వైద్యుల్ని సంప్రదించిన వారిలో 56% మంది 30–39 సంవత్సరాల మధ్య వయస్కు లేనని వెల్లడించింది.వీరిలో 75% మంది పురుషులు, 25% మహిళలు ఉన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది తాము 100 మందికి పైగా కార్డియాలజిస్టులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుప్రాక్టో నిర్వాహకులు తెలిపారు.
టీకా కారణం కాదు
యువకులు, మధ్య వయస్కు లు ఆకస్మికంగా తీవ్రమైన అనారోగ్యాలకు గురికావడం ఒక్క ఏడాదిలో 31% నుంచి 51%కి పెరిగిందని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. అయితే ఇవి కరోనా టీకాలు వేసిన, వేయని వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ నివేదిక ప్రకారం.. కోవిడ్ 19 వ్యాక్సిన్‌లు తీసుకున్న 1,00,000 మందిలో 1.7% మంది మాత్రమే మయోకార్డిటిస్ (కరోనా నేపథ్యంలో గుండె సంబంధిత వ్యాధికి గురికావడం)కు గురయ్యే అవకాశం ఉంది.
గుండెపోటు ఎవరికి వస్తుంది?
గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులలో ఆకస్మిక అడ్డంకులు ఏర్పడటం వల్ల గుండెపోటు సంభవిస్తుంది. ‘ధమనిలో కొవ్వు ఫలకం ఏర్పడి ఇది రక్తనాళంలోకి ప్రవేశించి, గడ్డ కట్టి, అకస్మాత్తుగా ఉక్కిరిబిక్కిరి చేయడాన్నే గుండెపోటుగా పేర్కొంటారు. ‘సాధారణంగా ధూమపానం చేసే వ్యక్తులు, కూర్చుని ఉద్యోగం చేసేవారు, ఊబకాయం కలిగినవారు, తక్కువ రక్తపోటు లేదా తీవ్రమైన మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలున్నవారిలో ఈ పరిస్థితి రావచ్చు..’అని వైద్యులు చెబుతున్నారు.
‘శిక్షణ లేకుండా లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా కరోనరీ నాళాలలో ఫలకాలు పగిలి, గుండె ఆగిపోవడానికి దారితీయవచ్చు..’అని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయకుమార్ చెప్పారు. వ్యాయామశాలకు వెళ్లేవారిలో, ప్రొటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం పెరిగిందని, వైద్యుల పర్యవేక్షణ లేకపోతే అది ప్రమాదమని స్పష్టం చేశారు.
జీవనశైలిలో మార్పులతో..
జీవనశైలిలో మార్పులు చాలావరకు యుక్త వయస్కులలో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అలాగే కొన్ని జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించడంలో ఆలస్యం కూడా ఆకస్మిక మరణాలను తెస్తోంది. నిజానికి ప్రతి ఆకస్మిక మరణాన్నీ హార్ట్ ఎటాక్‌గా పరిగణించలేం. మొత్తం ఆకస్మిక మరణాల్లో 3 శాతమే గుండె పోటు కారణంగా సంభవిస్తాయి. ఆహారపు అలవాట్లు, దినచర్యలో మార్పుచేర్పులతో జీవనశైలిని సరైన విధంగా తీర్చిదిద్దుకోవాలి. అలాగే ఏ మాత్రం సందేహం ఉన్నా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. – డా.ఆర్.కె.జైన్, కార్డియాలజిస్ట్, కిమ్స్ ఆసుపత్రి
కార్డియో వ్యాస్క్యులర్‌వ్యాయామాలు అవసరం..
ధూమపానం, మద్యపానం, మధుమేహం, అధిక కొలె్రస్టాల్ వంటి వాటి వల్ల కావచ్చు, ఆధునిక జీవనశైలి వల్ల కావచ్చు గుండె బలహీనపడటం సాధారణమైపోయింది. హృద్రోగాల వల్ల కోల్పోయిన గుండె సామర్థ్యాన్ని తిరిగి దశలవారీగా సంతరించుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని కార్డియో వాసు్క్యలర్ వ్యాయామాలు చేయడం అవసరం. అవి గుండె పంపింగ్ సామర్థ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని, మందుల వాడకాన్ని తగ్గిస్తాయి.
– డాక్టర్ మురళీధర్, ఈఎస్‌ఐసీ ఆసుపత్రి
Comments
Please login to add a commentAdd a comment