తీవ్రమైన ఒత్తిడికీ, భావోద్వేగాలకు గురైనప్పుడు సినిమాల్లోని కొన్ని పాత్రలు అమాంతం గుండెపట్టుకు కూలబడిపోవడం చూశాం. ఒక్కోసారి తట్టుకోలేమనుకునే ఓ అనారోగ్యం లేదా శస్త్రచికిత్సలతోనూ ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఆ పరిస్థితిని నిభాయించుకోలేక ఒక్కోసారి గుండెపోటు రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో తాత్కాలికంగా గుండె పంపింగ్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. గుండెలోని కొంతభాగం పనిచేయకుండా మొరాయించవచ్చు. మిగతా భాగమంతా మామూలుగానే పనిచేయవచ్చు. కానీ గుండె సంకోచించే కార్యక్రమం కొంత బలంగా జరగాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితినే ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ అనవచ్చు. ఈ కండిషన్‌నే ‘స్ట్రెస్ కార్డియోమయోపతి’ అనీ, ‘టాకోట్సుబో కార్డియోమయోపతి’ అనీ లేదా ‘ఎపికల్ బలూనింగ్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తారు. ఈ కండిషన్‌కు చికిత్స చేయవచ్చు. ఇందుకు సాధారణంగా కొన్ని రోజులు మొదలుకొని వారాల సమయం పట్టవచ్చు.
లక్షణాలు: బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ లక్షణాలన్నీ గుండెపోటులాగే ఉంటాయి. ఛాతీలో నొప్పి వస్తుంది. ఊపిరి అందదు.
కారణాలు: బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కు కారణాలేమిటో ఇప్పటికీ ఇదమిత్థంగా తెలియదు. అయితే తీవ్రమైన ఒత్తిడి వల్ల ఒక్కసారిగా పెరిగే ‘అడ్రినాలిన్’ వంటి ‘స్ట్రెస్ హార్మోన్లు’ దీన్ని ప్రేరేపిస్తుందని నిపుణుల అభిప్రాయం. దాంతో కొందరిలో గుండెలో కొంత భాగం... మరీ ముఖ్యంగా గుండె కండరం కొంతమేర దెబ్బతినే ప్రమాదం ఉంది. దాంతో గుండె కండరం నిర్మాణం/ఆకృతిలో కొన్ని మార్పులు రావచ్చు.
గుండెకు రక్తం అందించే రక్తనాళాలు (ధమనులు) సన్నబడవచ్చు. అయితే ఈ హార్మోన్లు గుండెనెలా దెబ్బతీస్తాయనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. సాధారణంగా విపరీతమైన శారీరక శ్రమ లేదా మానసిక బాధ/ఉద్వేగం తర్వాత ఇది కనిపిస్తున్నట్లుగా నిపుణులు గుర్తించారు. ఉదాహరణకు ఏదైనా ఆరోగ్య సమస్య తర్వాత అంటే... ఆస్తమా అటాక్, కోవిడ్ ఇన్ఫెక్షన్, ప్రమాదంతో కాలూ చేయి విరగడం లేదా ఏదైనా మేజర్ సర్జరీ వంటి సమస్యల తర్వాత ఇది కనిపించవచ్చు.
దగ్గరివారితో వాగ్వాదాలూ లేదా కుటుంబ సభ్యుల్లో అత్యంత ఆత్మీయులో, బాగా దగ్గరివారో చనిపోయినప్పుడు కూడా ఇది రావచ్చు. అయితే కాస్తంత అరుదుగానే అయినా... కొన్ని మందులు కూడా ఈ సమస్యను తెచ్చిపెట్టవచ్చు.
ఉదాహరణకు...
► తీవ్రమైన అలర్జిక్ రియాక్షన్ లేదా ఆస్తమాను అదుపు చేసేందుకు వాడే మందులు
► తీవ్రమైన ఉద్విగ్నత (యాంగై్జటీ) పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు వాడేవి, ముక్కులు బిగదీసుకుపోయినప్పుడు రిలీఫ్ కోసం వాడేవి
► కొకెయిన్ వంటి మాదకద్రవ్యాలు వాడినప్పడు కూడా ఇదే పరిస్థితి కనిపించే అవకాశాలున్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితి వస్తే... బాధితులు ఏవైనా మందులు వాడుతున్నారా అనే విషయాన్ని డాక్టర్‌కు స్పష్టంగా చెప్పాలి. ఏవైనా కొత్తమందులు వాడాక ఇలాంటి పరిస్థితి ఎదురైతే... ఆ విషయాన్ని డాక్టర్ దృష్టికి వీలైనంత త్వరగా తీసుకెళ్లాలి.
బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్‌కీ.. గుండెపోటుకీ తేడా ఏమిటంటే...
గుండెకు రక్తం అందించే రక్తనాళాలన్నీ (ధమనులన్నీ) పూడుకుపోవడం లేదా దాదాపుగా పూర్తిగా పూడుకుపోవడం జరిగినప్పుడు సాధారణంగా గుండెపోటు వస్తుంది. కానీ ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’లో అలాంటి పరిస్థితి ఉండదు. ధమనుల్లో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ గుండెపోటు లాంటి పరిస్థితి ఎదురవుతుంది.
రిస్క్ ఫ్యాక్టర్లు : బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ ముప్పును పెంచే అంశాలివి...
జెండర్: పురుషులతో పోలిస్తే ఇది మహిళల్లో ఎక్కువ.
వయసు : యాభై ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఆరోగ్య చరిత్ర : గతంలో యాంగై్జటీ లేదా డిప్రెషన్ (కుంగుబాటు) వంటి ఏదైనా మానసిక సమస్యకు లోనై ఉండటం.
దుష్ప్రభావాలు :
► కొన్ని ద్రవాలు (ఫ్లూయిడ్స్) వెనక్కు ప్రవహిస్తూ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం. (పల్మునరీ ఎడిమా)
► అకస్మాత్తుగా రక్తపోటు తగ్గడం (హైపోటెన్షన్)
►గుండె లయ తప్పడం (అరిథ్మియాస్)
►గుండె వైఫల్యం
►గుండె కండరాలు బలహీనం కావడంతో లోపల రక్తపు గడ్డలు ఏర్పడటం.
► దీని వల్ల మరణం సంభవించే అవకాశం ఉన్నప్పటికీ అది చాలా చాలా అరుదు.
నివారణ : తీవ్రమైన ఉద్వేగాలకు / మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా జాగ్రత్తపడటం ప్రధానం. ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్న బాధితుల్లో డాక్టర్లు దీర్ఘకాలిక చికిత్సను అందజేస్తారు. బీటా బ్లాకర్స్ లేదా అలాంటివే మందులు వాడుతూ ఈ పరిస్థితిని నివారిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment