సాక్షి, హైదరాబాద్: మూడు పదుల వయసు దాటిన భారతీయుల్లో గుండె సంబంధిత సమస్యలు మొదలవుతున్నాయి. జీవనశైలిలో వస్తున్న మార్పులతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతుండగా.. వీటిలో అత్యధికంగా గుండెపైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇలాంటి అనారో గ్య సమస్యలపై సకాలంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అవి దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తున్నాయి.
శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న ప్రతి వంద మందిలో ఐదుగురు గుండె సంబంధిత సర్జరీలు చేయించుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఎక్కడైనా కార్పొరేట్ వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు చేయించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద చేయించుకుంటున్న శస్త్ర చికిత్సలపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గత ఆర్థిక సంవత్సరంలో పరిశీలన నిర్వహించింది.
ఇందులో ప్రతి వంద సర్జరీల్లో 5 శాతం హృదయ సంబంధిత శస్త్ర చికిత్సలే ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద జరుగుతున్న సర్జరీల్లో 79 శాతం ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహిస్తుండగా.. 21 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్నట్లు వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఖర్చు చేస్తున్న ప్రతి రూ.100లో ఏకంగా రూ.26 గుండె సంబంధిత సమస్యల చికిత్సకే ఖర్చు చేస్తున్నట్లు విశ్లేషణలో వెల్లడైంది.
అలవాట్లలో మార్పులతో..
గుండె సమస్యలు ముప్ఫై ఏళ్లు దాటిన తర్వాత మోదలవుతున్నాయి. ప్రస్తుతం శస్త్ర చికిత్సల తీరును పరిశీలిస్తే ప్రతి వంద మందిలో 70 మంది పురుషులు హృదయ సమస్యలతో సతమతమవుతున్నారు. మహిళలు మాత్రం 30 శాతమే ఉన్నారు. ప్రధానంగా ప్రజల జీవన శైలిలో వస్తున్న మార్పులు.. ఆహారపు అలవాట్లను మారుస్తుండడంతో హృదయ సమస్యలు తలెత్తుతున్నట్లు పరిశీలన చెబుతోంది.
విద్యార్థి దశ నుంచి ఉద్యోగం చేసే స్థాయికి వచ్చే వారి వయసు సగటున 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఈ దశలోనే ఆహారపు అలవాట్లు గాడితప్పుతున్నాయి. క్రమంగా ఈ ప్రభావం గుండెపైన పడు తున్నట్లు తెలుస్తోంది. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, జంక్‌ఫుడ్ తదితరాలకు అలవాటు పడటం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుదలతో గుండె నాళాలు ముసుకుపోతున్న ఘటన లు ఎక్కువగా ఉంటున్నాయి.
దీంతో రక్త ప్రసరణలో తేడాలు రావడంతో శస్త్రచికిత్స చేసి స్టెంట్స్ వేయాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రస్తుతం గుండె సంబంధిత శస్త్రచికిత్సలను పరిశీలిస్తే 52 శాతం స్టెంట్ వేసే సర్జరీలే ఉంటున్నట్లు స్పష్టమవుతోంది. వయసుల వారీగా విశ్లేషిస్తే 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారిలో 29 శాతం సింగిల్ స్టెంట్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
►గుండెకు శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న వారిల్లో పిల్లల సంఖ్య కూడా అధికంగానే ఉంది. అయితే వీరిలో మెజార్టీ బాధితులు పుట్టుకతోనే గుండె సమస్యలతో జన్మిస్తున్నట్లు ఆరోగ్య శాఖ పరిశీలనలో వెల్లడైంది. అందులోనూ 26 శాతం బాధితులు హోల్ క్లోజర్ (గుండెలో ఏర్పడిన రంధ్రాల పూడిక) కోసమే సర్జరీలు చేయించుకుంటున్నారు. మిగతా 74 శాతం వివిధ రకాల సమస్యలతో చికిత్స చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.
►గుండె సంబంధిత శస్త్రచికిత్సలు అత్యధికంగా చేస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ముందువరుసలో ఉన్నాయి.
►తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు ఆలస్యంగా జరిగింది. దీంతో ఈ పరిశీలన నుంచి తెలంగాణను మినహాయించారు. అయితే తెలంగాణలో ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సల తీరును పరిశీలిస్తే హృదయ సంబంధిత కేటగిరీ ప్రథమ స్థానంలో ఉంది.
గుండె సంబంధిత ఆస్పత్రుల సంఖ్య పెరగాలి
ఆయుష్మాన్ భారత్ పథకం కింద నమోదైన ఆస్పత్రుల సంఖ్యను పరిశీలిస్తే ప్రతి ఎనిమిది ఆస్పత్రుల్లో ఒకటి మాత్రమే కార్డియాక్ కేర్ హాస్పిటల్ ఉంది. వీటి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు జీవనశైలిలో మార్పులకు అనుగుణంగా వ్యాయామం, యోగాలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి.
తెలంగాణలో ‘స్టెమీ’పేరుతో హైదరాబాద్‌లోని వైద్య నిపుణుల సహాయంతో టెలీమెడిసిన్ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో గుండె వైద్యం అందిస్తున్నారు. వైద్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వాడుకలోకి తీసుకురావాలి.
– డాక్టర్ కిరణ్ మాదల, అఖిల భారత ప్రభుత్వ వైద్య సంఘాల సమాఖ్య జాతీయ కార్యవర్గ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment