ఎవరికీ చెప్పుకోలేని వేదన, భావోద్వేగాల ఒత్తిడి శరీరం మీద పడుతుంది. చాలావరకు ఆరోగ్య సమస్యలు మందులతో నయం కావచ్చు. కానీ, కొన్నింటికీ ఎంతకీ పరిష్కారం దొరకకపోతే, అందుకు మూల కారణమేంటో తెలుసుకోవడానికి తగిన శోధన అవసరం. వర్టిగో (కళ్లు తిరగడం) సమస్యకు మూల కారణమేంటో తెలుసుకుంటూ చికిత్స చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ వాసి న్యూరటాలజిస్ట్ డాక్టర్ లాస్య సాయి సింధుకు కేంద్రప్రభుత్వం ఇటీవల ‘నేషనల్ అచీవర్స్ అవార్డ్ ఫర్ హెల్త్ ఎక్సలెన్స్’ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఈ సందర్భంగా లాస్య సాయి సింధును సాక్షి పలకరించింది.
నలభైఏళ్లకు పైబడిన ఒక మహిళ... ‘మంచం మీద పడుకుంటే కళ్లు తిరుగుతున్నాయి’ అనే సమస్యతో వచ్చింది. రెండేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతూ మంచం మీద కాకుండా కుర్చీలో కూర్చుని నిద్రపోవడం అలవాటు చేసుకుంది. పూర్తి చికిత్స తర్వాత ఇప్పుడు మామూలుగా మం^è ం మీద నిద్రపోగలుగుతోంది. 90 శాతం మహిళలు భావోద్వేగాల ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు.
పదిహేనేళ్ల అబ్బాయి స్కూల్లో బెంచిమీద కూర్చున్న కాసేపటికి కళ్లు తిరిగే సమస్యతో బాధపడుతూ సరిగా చదవలేకపోతున్నాడు. చికిత్సలో అతనికి చదువుకు సంబంధించిన సమస్యనే కాదు, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండే విభేదాలు కూడా కారణమని తెలిసింది.
పనిలో చురుకుగా ఉండే యాభైఏళ్ల వ్యక్తి రెండు నెలలుగా కళ్లు తిరుగుతున్నాయన్న సమస్యను ఎదుర్కొంటూ పరిష్కారం కోసం వచ్చారు. కరోనా తర్వాత వైరల్ అటాక్ అతని మెదడు పనితీరులో సమస్యకు కారణం అయ్యిందని తేలింది.
ఇలాంటివెన్నో ప్రతిరోజూ చూస్తుంటాం. నేను ఈఎన్‌టీ సర్జన్‌ని. వెర్టిగో అండ్ బ్యాలెన్స్ డిజార్డర్‌లో పరిశోధన చేశాను. ఈఎన్‌టీలోనే మరింత ఉన్నతమైన విద్యార్హత ఈ న్యూరటాలజిస్ట్. 200 మంది వర్టిగో పేషెంట్స్‌పై పరిశోధన చేసినప్పుడు నాకు ఈ విభాగంలో ఆసక్తి పెరిగింది. నాలుగేళ్లుగా న్యూరటాలజిస్ట్‌గా వైద్య రంగంలో సేవలందిస్తున్నాను. చేస్తున్న కృషికి గుర్తింపుతోపాటు గతంలోనూ రెండు జాతీయస్థాయి అవార్డులు అందుకున్నాను.
వచ్చిన రివ్యూస్...
ఈ సమస్యలో ప్రధానంగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అందుకని, 5–10 నిమిషాల్లో పేషెంట్ పూర్తి సమస్య అర్థం కాదు. ఈ గంట సమయంలో చేసిన చికిత్సకు రోగిలో సరైన మార్పులు రావడం, వారు ఇచ్చే రివ్యూస్.. మంచి గుర్తింపును తీసుకు వచ్చాయి.
అన్ని వర్గాల్లోనూ...
ఇటీవల చూస్తున్న కేసుల్లో మగవారిలోనూ సమస్య ఎక్కువ గమనిస్తున్నాం. నిజానికి ఆడవాళ్లలోనే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. కానీ, మగవారు తమ సమస్యలను బయటకు చెప్పుకోరు. భావోద్వేగాలను బయటకు వెలిబుచ్చరు. ఈ సమస్య వర్టిగోకు దారితీస్తుంది. మరో ఆందోళనకర సమస్య ఏంటంటే.. టీనేజ్ పిల్లల్లో వర్టిగో కనిపిస్తోంది. మానసికంగా వారు ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నారు. వీరిలో చదువుకు సంబంధించినవి, కుటుంబ సమస్యలు... కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
ఫ్యామిలీ కౌన్సెలింగ్
ముందు పేషెంట్‌కు సంబంధించిన అన్నిరకాల టెస్ట్ రిపోర్ట్స్ పరిశీలించి చూస్తాం, వారు చెప్పిన ఆరోగ్య సమస్యమీద వర్క్ చేస్తాం. ఆ తర్వాత ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇస్తాం. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వర్టిగో సమస్యలు పెరిగాయి కాబట్టి ఫిజికల్ హెల్త్ ఆ తర్వాత ఎమోషనల్ హెల్త్ కూడా చూస్తున్నాం. కుటుంబం కూడా ఈ సమస్య పట్ల అవగాహన పెంచుకొని, పేషెంట్‌కు సపోర్ట్‌గా ఉండాలి.
ఆన్‌లైన్ అవగాహన
కాన్ఫరెన్స్, సోషల్‌మీడియా ద్వారా కూడా అవేర్‌నెస్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. విదేశాల నుంచి కూడా ఆన్‌లైన్ కన్సల్టేషన్ తీసుకునేవారున్నారు. ముఖ్యంగా విదేశాలలో ఎమ్మెస్ చేసేవాళ్లు ఉంటున్నారు. జీవితంలో ఎవరికి తగ్గ సమస్య వారికి ఉంటుంది. దానినుంచి బయటకు రావడమే ముఖ్యం. అందుకోసం చేసే ప్రయత్నం ప్రతిరోజూ ఉంటుంది. డాక్టర్‌గా రోజు చివరలో నా నుంచి చికిత్స తీసుకున్నవాళ్లు ‘మా సమస్యకు సరైన పరిష్కారం దొరికింది’ అనుకుంటే చాలు. అదే పెద్ద అవార్డ్’’ అంటారు ఈ డాక్టర్.
కోవిడ్ తర్వాత...
‘కళ్లు తిరుగుతున్నాయి..’ అనే సమస్యతో వచ్చే వారి సంఖ్య కోవిడ్ తర్వాత బాగా పెరిగింది. గతంలో ఒత్తిడి, భావోద్వేగాలలో మార్పు కారణం అనుకునేవాళ్లం. ఆ తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ కూడా కారణం అని తెలిసింది. వర్టిగో సమస్యకు టాబ్లెట్స్ ఇస్తారు డాక్టర్లు. టాబ్లెట్లు వాడినప్పుడు బాగానే ఉంటుది. ఆ తర్వాత మళ్లీ మామూలే! దీనికి టాబ్లెట్స్‌తోపాటు కౌన్సెలింగ్, కొన్ని ఎక్సర్‌సైజ్‌లు కూడా అవసరం అని గమనించాను. ఒక పేషెంట్‌కి ఇచ్చే చికిత్స 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. వారంలో మూడుసార్లు ఈ సెషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
– డాక్టర్ లాస్య సాయి సింధు
– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment