నగరానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యం పాలైంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఉదంతంలో... కార్ఖానాలోని సదరు క్లినిక్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. నగరంలో జేబులు ఖాళీ చేయడంతోపాటు రోగాల పాలు చేస్తున్న వెయిట్ లాస్ క్లినిక్స్ నయామోసాలకు ఇది తాజా ఉదాహరణ మాత్రమే.
సాక్షి, హైదరాబాద్: నగరం ఇప్పుడు ఒబె‘సిటీ’ క్యాపిటల్‌గా మారింది. అధిక బరువుతో బాధపడేవారితో పాటు ఆ బాధను సొమ్ము చేసుకోవాలనుకునే చికిత్సా కేంద్రాలూ పుట్టగొడుగుల్లా పెరిగాయి. కానీ వీటిలో పలు వెయిట్ లాస్ సెంటర్లకు సరైన చికిత్సా విధానం లేదు. సరైన వైద్య నిపుణులు లేరు. దీంతో తోచిన వైద్యం చేస్తున్నారు.
రూ.వేలకు వేలు ముందే కట్టించేసుకుంటూ నెలల తరబడి ట్రీట్‌మెంట్స్ సాగదీస్తున్నారు. వెరసి ఎటువంటి ఫలితం లేకపోగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. పోనీ పోతే పోయింది డబ్బే కదా అనుకోవడానికి లేదు.. చాలామంది డబ్బుతో పాటు అనారోగ్యాల పాలవుతున్నారు. అదే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.
15 కిలోల బరువు తగ్గడానికి 30 ఏళ్ల క్లయింట్ మహేశ్వరి కార్ఖానాలోని కలర్స్ క్లినిక్‌ని ఆశ్రయించింది. దీంతో ఆమెకు గత ఏప్రిల్ 15 నుంచి చికిత్స ప్రక్రియ మొదలైంది, ఆ తర్వాత ఆమెకు క్లినిక్ సిబ్బంది కరెంట్ షాక్స్ ఇచ్చారు. అలాగే కొన్ని మందులు కూడా ఇచ్చారు. వీటి కారణంగా ఆమెకు తీవ్రంగా వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి.
దీని గురించి క్లినిక్ సిబ్బందికి చాలాసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ నేపధ్యంలోనే శనివారం ఆమె స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు క్లినిక్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: బుర్ర వేడెక్కి, కాలిపోతుంది.. బర్న్ ఔట్ సిండ్రోమ్, మూన్‌లైటింగ్ అంటే?
శరీరం కాలిపోయింది...
అధిక బరువు తగ్గించే చికిత్స కోసం నగరవాసి గాయత్రి రాణా గచ్చిబౌలిలోని రిచ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్‌కు రూ.3 లక్షలు చెల్లించారు. మూడు నెలల చికిత్స వల్ల కనీసం 1% ప్రయోజనం పొందలేదు. పైగా 30డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ‘మెషినరీ‘ ఉపయోగించడటం వలన చికిత్స సమయంలో తనకు కాలిన గాయాలు సహా ఒంటిపై ఇతరత్రా అనేక గాయాల య్యాయని ఈ విషయాన్ని క్లినిక్‌లోని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదని, సరైన వైద్యం అందించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు పై విచారణ జరిపిన జిల్లా వినియోగదారుల ఫోరం నష్టాన్ని నిర్ధారించి, ఆమె చెల్లించిన రూ.3 లక్షలను 6% వడ్డీతో వాపసు చేయాలని ఇతర ఖర్చుల నిమిత్తం రూ.5,000 చెల్లించాలని క్లినిక్‌ని ఆదేశించింది.
వెన్నునొప్పి, చర్మ సమస్యలు..
నగరానికే చెందిన కె.హాసిని యాదవ్ చికిత్స కోసం లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ ను సంప్రదించారు. తుంటి భాగంలో కొన్ని అంగుళాల కొవ్వు తగ్గించే చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల్లో కనీసం 10–15 కిలోల బరువు తగ్గుతుందని ఆమెను క్లినిక్ నిర్వాహకులు నమ్మించారు. దాంతో ఆమె చికిత్స రుసుముగా రూ.లక్ష చెల్లించారు.
నాలుగు నెలలు గడిచినా అంగుళం, బరువు తగ్గలేదని పైగా తనకు కొత్తగా వెన్నునొప్పితో పాటు చర్మ సమస్యలు మొదలయ్యాయని ఆమె ఆరోపించారు. తన తొమ్మిది నెలల చికిత్స సమయంలో, ఫిజియోథెరపిస్ట్‌ని కనీసం ఆరు సార్లు మార్చారని, నేర్చుకోవడానికి ప్రయోగాలు చేయడానికి తనను ఒక మోడల్‌గా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కూడా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా నష్టపరిహారం ఇవ్వాలని క్లినిక్‌ను ఆదేశించింది.
చదవండి: Weather Update: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ అలర్ట్.. నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
జాగ్రత్తలు తీసుకోవాలి
►బరువు తగ్గించుకునే చికిత్సలు అందించే కేంద్రాల్లో ఉన్న నిపుణుల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఏ ఆరోగ్య సమస్యలు రావని నిర్ధారించుకున్నాక, అది కూడా వైద్యుని సలహా తీసుకున్న తర్వాతే చికిత్స గురించి ఆలోచించాలి.
►వీలైనంత వరకూ మందులు, కఠినమైన వ్యాయామాలు, మసాజ్‌ల ద్వారా కాకుండా నిదానంగా ప్రారంభించి తగినంత సమయం తీసుకుని బరువు తగ్గే విధానాన్ని ఎంచుకోవాలి.
►ప్రకటనలు, ఆర్భాటాలు చూసి కాకుండా గత చరిత్ర, వ్యక్తిగత అనుభవాలు తెలుసుకుని క్లినిక్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. సంప్రదించిన రెండో నిమిషం నుంచే డబ్బులు కట్టమని ఒత్తిడి చేసే క్లినిక్స్‌ను దూరంగా పెట్టడమే మంచిది.
Comments
Please login to add a commentAdd a comment