ఇవి తింటే గుండె చాలా పదిలం!
న్యూయార్క్: వేరుశనగ విత్తనాలు తింటే గుండెకు మంచిదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పల్లీలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా గుండెపోటు ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ఆరోగ్యంగా ఉన్నవారు, ఊబకాయంతో బాధపడుతున్న 15 మంది పురుషులపై పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. వీరిలో కొంతమందికి నియమబద్ధంగా రోజుకు 85 గ్రాముల వేరుశనగలను అందించారు. ఇంకొంతమందికి ఇచ్చే ఆహారంలో అన్ని పోషకాలు ఉండి వేరుశనగలు లేకుండా ఇచ్చారు. అలా ఇచ్చిన తరువాత వారి రక్తనమునాలలో లైపిడ్, లైపిడ్ ప్రోటీన్, ఇన్సులిన్ స్థాయిలను 30, 60, 120, 240 నిముషాలకోసారి పరిశీలించారు.
వేరు శనగ విత్తనాలు తీసుకున్న వారు, తీసుకోని వారిని పోల్చిచూస్తే విత్తనాలు తీసుకున్నవారి రక్తనమూనాలో ట్రైగ్లిసరైడ్స్ 32 శాతం తగ్గినట్లు గమనించారు. అంతేగాక ధమనులు మరింత ఆరోగ్యంగా ఉండి ఎక్కువ వ్యాకోచాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడైంది. వేరుశనగ విత్తనాలు తీసుకుంటే అలాంటి సమస్య తగ్గుతుందని యూనివర్సిటీ ప్రొఫెసర్ పెన్నీ క్రిస్ ఎథిరన్ తెలిపారు.