సాధారణ సాగు విస్తీర్ణం 20 లక్షల ఎకరాలు.. సాగైంది 8.45 లక్షల ఎకరాలే
సగానికి తగ్గిన వేరుశనగ పంట నువ్వులు, సన్‌ఫ్లవర్ సాగు పరిస్థితి అంతే
ఆహార పంటల తర్వాత అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే నూనె గింజల సాగు ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. ఖరీఫ్‌లో ఈ పంటల సాధారణ విస్తీర్ణమే 20 లక్షల ఎకరాలు. దాంట్లో వేరుశనగ, 18.30 లక్షల ఎకరాలుండగా, ఆముదం, నువ్వులు, సన్‌ఫ్లవర్, సోయాబీన్
వంటి ఇతర నూనెగింజల పంటలన్నీ కలిపి 1.77 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఖరీఫ్–2024 సీజన్‌లో 17.25 లక్షల ఎకరాల్లో వేరుశనగ, ఇతర పంటలన్నీ కలిపి సాగు చేయాలని నిర్ధేశించగా.. కేవలం 8.45 లక్షల ఎకరాలే సాగయ్యింది. – సాక్షి, అమరావతి
ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసినా..
రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో కృష్ణ, గోదావరి, వంశధార, నాగావళి నదులకు వరదలు పోటెత్తాయి. దీంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపించాయి. భూగర్భ జలాలన్నీ ఎగసి పడుతున్నాయి. వాస్తవానికి నూనె గింజల పంటలు కూడా రికార్డు స్థాయిలో సాగవ్వాలి. కానీ ఊహించని రీతిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. రాయలసీమ జిల్లాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు తోడు భారీ వర్షాలు ఈ పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. మరొకపక్క ప్రభుత్వ అలసత్వం తోడవడంతో నిర్ధేశించిన లక్ష్యంలో సగం కూడా సాగవని పరిస్థితి నెలకొంది.
సాగుకు దూరమైన వేరుశనగ రైతు
రాష్ట్రంలో ఏటా 18 లక్షల ఎకరాలకు పైగా సాగయ్యే వేరుశనగ ఈసారి కేవలం 7.17 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. వేరుశనగ పంట అత్యధికంగా రాయలసీమ జిల్లాల్లోనే సాగవుతుంది. ఈ జిల్లాల్లో 13.50 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, కేవలం 6.95 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇతర నూనె గింజల పంటలను పరిశీలిస్తే సన్‌ఫ్లవర్ సాధారణ విస్తీర్ణం 13వేల ఎకరాలు కాగా, 3785 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఆ తర్వాత నువ్వులు సాధారణ విస్తీర్ణం 50వేల ఎకరాలు కాగా, సాగైంది కేవలం 20వేల ఎకరాలే. ఆముదం సాధారణ విస్తీర్ణం 92వేల ఎకరాలు కాగా, 88వేల ఎకరాల్లోనే సాగయ్యింది.
సీమలో సగానికి తగ్గిన సాగు
వర్షాభావ పరిస్థితుల వలన రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ స్థానంలో సుమారు 3 లక్షల ఎకరాలకు పైగా ప్రత్యామ్నాయ పంటలు సాగవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క రాయలసీమ జిల్లాలోనే 3.50లక్షల ఎకరాలు వేరుశనగ పంట వేయలేని పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ కనీస మద్దతు ధర రూ.6,783 కాగా, ప్రస్తుతం కనిష్ట ధర రూ.3,300 ధర ఉండగా, గరిష్టంగా రూ.7వేల వరకు పలుకుతోంది.
వర్షాభావ పరిస్థితులకు తోడు ధర లేకపోవడం, తెగుళ్ల బారిన పడడం, పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోవడం ఈసారి వేరుశనగ విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల పంటల సాగును ప్రోత్సహించేలా రాయితీపై మినీ కిట్స్ ఇచ్చేవారు. ఆర్బీకేల ద్వారా అన్ని రకాలుగా అవసరమైన చేయూతనిచ్చేవారు. సాగులో అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ ప్రోత్సహించే వారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మచ్చుకైనా కన్పించడం లేదని రైతులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment