విలేకరుల సమావేశంలో పరికరాలను చూపిస్తున్న విజయ్, బద్రీనారాయణ్, ఎంవీ గౌతమ
సాక్షి,హైదరాబాద్: గుండెజబ్బులు, గుండె పోట్లు సాధారణమైపోతున్న కాలమిది. గుండెజబ్బు చేస్తే స్టెంట్లు వేసుకుని కాలం వెళ్లదీయవచ్చునేమో కానీ.. పోటు వస్తే, మెదడుకు రక్త సరఫరా ఆగిపోతే పక్షవాతం బారిన పడాల్సి వస్తుంది. జీవితాంతం మంచానికి పరిమితం కావాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అయితే...ఈ పరిస్థితి ఇంకొంతకాలమే అంటున్నారు ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత కలాం–రాజు స్టెంట్ రూపకర్తల్లో ఒకరైన ఎన్.జి.బద్రీ నారాయణ్.
మెదడు నాళాల్లోని అడ్డంకుల (క్లాట్)ను తొలగించేందుకు తాము అత్యాధునిక వ్యవస్థ ఒకదాన్ని తయారు చేశామని ఎన్.జి.బద్రీ నారాయణ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుండెపోటు వచ్చిన తరువాత వీలైనంత తొందరగా (గోల్డెన్ అవర్... గరిష్టంగా 24 గంటల్లోపు) ఈ టెక్నాలజీని ఉపయోగిస్తే పక్షవాతం రాకుండా చూడవచ్చునని ఆయన తెలిపారు.
న్యూరో క్లాట్ రిట్రీవర్, న్యూరో ఆస్పిరేషన్ క్యాథరర్, న్యూరో మైక్రో క్యాథరర్ అనే పరికరాలన్నీ కలిగిన ఈ వ్యవస్థను అతితక్కువ ధరల్లోనే అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ అన్ని ప్రయత్నాలూ చేస్తోందని చెప్పారు. భారత్‌లో ఇలాంటి విప్లవాత్మకమైన టెక్నాలజీ ఒకటి అందుబాటులోకి రావడం ఇదే తొలిసారని, తెలంగాణ గవర్నర్ తమిళిసై గురువారం (డిసెంబరు 15) ఈ కొత్త టెక్నాలజీని లాంఛనంగా ప్రారంభించనున్నారని చెప్పారు.
ఎలా పనిచేస్తుంది?: ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ తయారు చేసిన వ్యవస్థ స్టెంట్లు వేసేందుకు వాడే క్యాథరర్ మాదిరిగానే ఉంటుంది కానీ.. వెంట్రుక మందంలో నాలుగోవంతు మాత్రమే ఉంటుంది. దీని చివర సమయంతోపాటు తన ఆకారాన్ని మార్చుకునే ధాతువు (నికెల్–టైటానియం) తో తయారు చేసిన స్టెంట్‌లాంటి నిర్మాణం ఉంటుంది. మెదడులో అడ్డంకి ఉన్న ప్రాంతానికి దీన్ని తీసుకెళ్లి... వెనుకవైపు నుంచి వ్యతిరేక పీడనాన్ని సృష్టిస్తారు.
దీంతో అక్కడి క్లాట్ క్యాథరర్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. తద్వారా పక్షవాతం లక్షణాలు తగ్గిపోయే అవకాశం ఏర్పడుతుంది. గోల్డెన్ అవర్‌లో ఈ చికిత్స చేయగలిగితే కనీసం 70 శాతం మందిని పక్షవాతం నుంచి రక్షించుకోవచ్చు. పక్షవాతాన్ని నివారించగలిగే వ్యవస్థను ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో చేర్చగలిగేంత తక్కువ ధరకు అందించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, తద్వారా భారత్‌లో ఏటా కనీసం 2.5 లక్షల మందిని పక్షవాతం నుంచి రక్షించవచ్చని బద్రీ నారాయణ్ తెలిపారు.
ఈ వ్యవస్థపై తాము కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నామని, డిజైనింగ్‌తోపాటు పూర్తిస్థాయిలో తయారీ కూడా దేశీయంగానే నిర్వహించినట్లు వివరించారు. ఈ న్యూరో పరికరాల పరీక్షకు తగిన లైసెన్సులు ఇప్పటికే పొందామని, వాణిజ్యస్థాయి ఉత్పత్తికి కూడా తగిన అనుమతులు త్వరలోనే పొందుతామని వివరించారు. వైద్య పరికరం కాబట్టి.. మందులేవీ లేని కారణంగా ఇది యూఎస్‌ఎఫ్‌డీఏ క్లాస్–2 వర్గానికి చెందుతుందని, అనుమతులు తొందరగానే వస్తాయన్న ఆశాభావంతో ఉన్నామని తెలిపారు.
మైసూరులో ఫ్యాక్టరీ ఏర్పాటు: ఎం.వి.గౌతమ
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో 2011లో పురుడు పోసుకున్న ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ ఇప్పుడు మైసూరు వద్ద అత్యాధునిక ఫ్యాక్టరీ ఒకదాన్ని నిర్మించనుందని, కర్ణాటక ప్రభుత్వం తమకు 8.5 ఎకరాల స్థలాన్ని అందజేసిందని ఎస్3వీ వాస్క్యులర్ టెక్నాలజీస్ డైరెక్టర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మాజీ సీఎండీ ఎం.వి.గౌతమ తెలిపారు. యూఎస్ ఎఫ్‌డీఏ ప్రమాణాలతో దీన్ని రానున్న 18 నెలల్లో నిర్మించనున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment