లండన్ : చేపలను తరచూ తీసుకుంటే అకాల మరణాల ముప్పు 40 శాతం వరకూ తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. చేపల్లో ఉండే ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపును తగ్గిస్తాయని, ఫలితంగా క్యాన్సర్, గుండెజబ్బుల బారిన పడే ముప్పు ఉండదని గత అథ్యయనాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే తాజా అథ్యయనంలో చేపలను తరచూ తీసుకునే పురుషుల్లో కాలేయ వ్యాధులతో పురుషుల్లో మరణించే ముప్పు 37 శాతంమేర తగ్గుతుందని, అల్జీమర్స్ కారణంగా మహిళల్లో మరణాల ముప్పు 38 శాతం మేర తగ్గుతుందని తేలింది.
చైనాకు చెందిన జెజాంగ్ యూనివర్సిటీ 16 ఏళ్ల పాటు 2,40,729 మంది పురుషులు, 1,80,580 మంది మహిళల ఆహారపు అలవాట్లు, ఆరోగ్యాన్ని విశ్లేషించిన అనంతరం ఈ వివరాలు వెల్లడించింది. అథ్యయన సమయంలో 54,230 మంది పురుషులు, 30,882 మంది మహిళలు మరణించారు. చేపలను అధికంగా తీసుకున్న పురుషుల్లో గుండె జబ్బులతో మరణించడం పది శాతం, క్యాన్సర్ మరణాలు ఆరు శాతం, ఊపిరితిత్తుల వ్యాధులతో మరణాలు 20 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది.
మహిళల్లోనూ చేపలను ఆహారంగా తీసుకున్న వారిలో హృద్రోగాలతో మరణించే ముప్పు పది శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఒమేగా-3ని ఆహారంలో అధికంగా తీసుకునే స్ర్తీ, పురుషుల్లో హృద్రోగాల కారణంగా మరణాల ముప్పు వరుసగా 15, 18 శాతం తక్కువగా ఉందని గుర్తించారు. అయితే చేపలను ఫ్రై కాకుండా ఉడికించి తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment