సెలవుల్లో యూనిఫారమా!
► నేటి నుంచి పాఠశాలలకు సెలవులు
► ఇప్పుడు వచ్చిన ఏకరూప దుస్తులు
► చివరి రెండు రోజుల్లో పంపిణీ మొదలుపెట్టిన అధికారులు
► సగం మందికి కూడా అందని వైనం
సాక్షి, విశాఖపట్నం : పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్ధి ఏకరూప దుస్తులు ధరించి వెళ్లాలనేది ప్రాథమిక నియమం. అది ఆ పసి హృదయాల్లో తామంతా ఒక్కటేననే ఐక్యత భావాన్ని పెంపొందిస్తుందనేది ప్రధాన సదుద్దేశం. ఈ ఏడాది స్కూల్ యూనిఫామ్స్ ఎప్పుడు వచ్చాయో తెలుసా.?రెండు రోజుల క్రితం. విచిత్రం ఏమిటంటే నిన్నటితో పాఠశాలల పనిదినాలు పూర్తయ్యాయి. నేటి నుంచి వేసవి సెలవులు ఇచ్చేశారు.
జిల్లాలో 2,38,489 మంది విద్యార్ధులకు (బాలురు 1,15,547 ,బాలికలు 1,22,942) రెండు జతలు చొప్పున ఏక రూప దుస్తులు ఇచ్చేందుకు 2014-15 సంవత్సరానికి ఒక్కో యూనిఫాంకు రూ.200చొప్పున రూ.1041.880 లక్షల సొమ్మును ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిలో రూ.953.956 లక్షలు ఖర్చు చేసి అధికారులు ఆప్కో నుంచి దుస్తులు కొన్నారు. దానిలో రూ.160 క్లాత్‌కు, రూ.40 కుట్టుకూలికి కేటాయించారు.
ఈ దుస్తులను కట్టే బాధ్యతలను గాజువాక, సబ్బవరం, విశాఖ నగరం, అనకాపల్లిలో ఐదుగురికి అప్పగించారు. వారు కుట్టు పనులు పూర్తిచేసి ఇటీవలే ఇచ్చారు. వాటిని అధికారులు విద్యార్ధులకు అప్పగించడం ప్రారంభించారు. కొన్ని స్కూళ్లకు అందించారు. ఇంకా పలు స్కూళ్లకు వెళ్లలేదు. ఇస్తున్న దుస్తుల్లో కొన్నిటికి బటన్స్ లేవు,మరికొన్ని సైజ్ సరిపోవడం లేదు. క్లాత్ చిరిగిపోయేలా ఉందని విద్యార్ధులు అంటున్నారు. నిజానికి క్లాత్ ఎవరిదగ్గర తీసుకోవాలనే దానిదగ్గర్నుంచీ రాజకీయాలు మొదలయ్యాయి. పలు ప్రైవేట్ సంస్థలు టెండరు దక్కించుకోవడానికి ప్రయత్నించాయి.
ఎట్టకేలకు ఆప్కోకే టెండర్ దక్కింది. కమిషన్లు తేలకపోవడంతో ఫిబ్రవరి ఆప్కో క్లాత్ ఇవ్వలేకపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవహారం ఎంఈఓల పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఎంఈఓకు 2శాతం, హెడ్‌మాస్టర్‌కు 3 శాతం, ఓ ప్రజా ప్రతినిధికి 5 శాతం చొప్పున కమిషన్లు మాట్లాడుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కమిషన్ల కోసం నాసిరకం దుస్తులను కొనుగోలు చేశారని, పంపిణీ చేస్తే బంఢారం భయటపడుతుందనే దాచిపెట్టారని తెలుస్తోంది.
ఇప్పుడు ఇచ్చినా విద్యార్ధులు వేసవి సెలవుల్లో ఆటపాటల్లో దుస్తులు పాడుచేసుకున్నారని తప్పించుకోవచ్చనేది వారి ఎత్తుగడగా విద్యార్ధుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ విషయంపై సర్వ శిక్షఅభియాన్ కమ్యూనిటీ మెబలైజేషన్ ఆఫీసర్ స్వప్న ప్రియారెడ్డిని ‘సాక్షి’ కోరగా వివరణ ‘ఆప్కో ఆలస్యంగా క్లాత్ ఇవ్వడంతో కుట్టడం ఆలస్యం అయ్యిందన్నారు.