school uniforms
-
సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల ఆర్వీఎం ఆర్డర్లు
సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు రూ.130 కోట్ల రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) వ్రస్తోత్పత్తి ఆర్డర్లు రానున్నాయి. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వ్రస్తానికి గిట్టుబాటు ధర లేక నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో ‘ఆధునిక మగ్గాలు ఆగాయి’శీర్షికన ఈనెల 3న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర జౌళి శాఖ అధికారులు స్పందించి సిరిసిల్ల టెక్స్‌టైల్‌పార్క్ వ్రస్తోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు టెక్స్‌టైల్‌పార్క్‌లోని యూనిట్లకు ఆర్వీఎం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తామని జౌళి శాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్‌రావు గురువారం ‘సాక్షి’కి తెలిపారు. 1.30 కోట్ల మీటర్ల వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నామని వివరించారు. టెక్స్టైల్ పార్క్‌లోని ఆధునిక మగ్గాలపై షరి్టంగ్ వస్త్రం, సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌పై సూటింగ్, ఓనీ వ్రస్తాన్ని ఉత్పత్తి చేసే ఆర్డర్లు ఇవ్వనున్నామని చెప్పారు. ఆర్వీఎం ఆర్డర్ల విలువ రూ.130 కోట్లు ఉంటుందని అంచనా. 50 శాతం కాటన్‌తో వ్రస్తాల ఉత్పత్తి గతానికి భిన్నంగా 50 శాతం కాటన్ నూలుతో కలిపి ఆర్వీఎం వ్రస్తాలను ఉత్పత్తి చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ కోసం ఈ వ్రస్తోత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందిస్తున్నారు. వ్రస్తోత్పత్తికి ముందే నూలును వార్పిన్ చేసి, సైజింగ్ చేసిన తరువాత మగ్గాలపై వ్రస్తాన్ని ఉత్పత్తి చేయనున్నారు. సిరిసిల్లలో తొలిసారి ఈ ప్రయోగం చేస్తున్నారు. గతంలో ప్లెయిన్ వస్త్రాన్ని ఉత్పత్తి చేసి ప్రింటింగ్ చేయించేవారు. కానీ ఈసారి వీవింగ్లోనే డిజైన్లు వచ్చేలా ఉత్పత్తి చేస్తున్నారు. -
స్కూళ్లు తెరిచే నాటికే యూనిఫాం: మంత్రి సబిత
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే యూనిఫాం అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. మన ఊరు–మన బడి, యూనిఫాం సరఫరా అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. వచ్చే ఏడాది 25 లక్షల మంది విద్యార్థులకు రూ.121 కోట్లతో యూనిఫాం అందించాలని నిర్ణయించారు. విద్యార్థుల మధ్య తారతమ్యాల దూరానికి యూనిఫాం అవసరమని ఆమె తెలిపారు. ఏప్రిల్ నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు జిల్లా స్థాయిలో యూనిఫాం సిద్ధం చేయాలని సూచించారు. -
యూనిఫామ్స్‌లో అవినీతి; విచారణకు సీఎం ఆదేశాలు
సాక్షి, అమరావతి : గత టీడీపీ పాలనలో పచ్చ నాయకుల అవినీతికి అడ్డులేకుండా పోయింది. అసలే సర్కారీ బడుల్లో పిల్లల్ని చేర్చేందుకు తల్లిదండ్రులు వెనకడుగేస్తున్న వేళ.. విద్యార్థుల యూనిఫామ్స్ పంపిణీలో అవినీతికి పాల్పడ్డారు. ఆప్కో పేరుతో యూనిఫామ్స్ సరఫరాలో టీడీపీ నేతల అవినీతి బాగోతాన్ని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన చర్యలు చేపట్టారు. స్కూల్ యూనిఫామ్స్‌లో అవినీతిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. గత ఐదేళ్లలో యూనిఫామ్స్ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లు తెరిచేసరికే యూనిఫామ్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. -
పంద్రాగస్టుకైనా అందేనా?
సాక్షి, ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యాప్రమాణాల పెంపుదలకు కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా యి. కానీ అందుకు సరైన ప్రణాళిక లేకపోవడం తో అనుకున్న లక్ష్యం నీరుగారిపోతోంది. పాఠ శాలల ప్రారంభంలోనే విద్యార్థులకు అందజే యాల్సిన ఏకరూప దుస్తులు పాఠశాలలు ప్రా రంభమై రెండునెలలు గడుస్తున్నా ఇప్పటికీ అం దకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. పంద్రాగస్టుకైనా అందేనా? సర్వశిక్షా అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫాంలు అందజేస్తోంది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ఏకరూప దుస్తులు పాఠశాలలు ప్రారంభమై రెండునెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆయా పాఠశాలలకు అందలేదు. దీంతో విద్యార్థులు మాకు జెండా పండుగకు కొత్త బట్టలు కుట్టించమని ఇంటివద్ద మారాం చేస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎక్కువశాతం పేద కుటుంబాలకు చెందినవారే కావడంతో వారికి కొత్తబట్టలు కుట్టించుకునే ఆర్థికస్థోమత లేక ప్రభుత్వం సరఫరా చేసే యూనిఫాం కోసం ఎదురుచూస్తున్నారు. కనీసం పంద్రాగస్టుకైనా మా పిల్లలకు యూనిఫాం అందించాలని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కానీ యూనిఫామ్ ఇంకా సిద్ధం కాక పోవడంతో విద్యార్థుల ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. జిల్లాలో ఇది పరిస్థితి.. జిల్లాలోని 15 మండలాల్లో అన్ని ప్రభుత్వ లోకల్ బాడి యాజమాన్యాలలో మొత్తం 722 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రాథమిక పాఠశాలలు 560, ప్రాథమికోన్నత పాఠశాలలు 104, ఉన్నత పాఠశాలలు 58 ఉన్నాయి. వాటిల్లో మొత్తం 61,629 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వారందరికీ ఒక్కొక్కరికి రెండు జతల దుస్తులు ప్రభుత్వం ఇవ్వాలని, అందుకు అనుగుణంగా వస్త్రాన్ని ఆయా మండలాలకు పంపిణీ చేసింది. కానీ విద్యార్థుల కొలతలు తీసుకుని వాటిని కుట్టించి ఇచ్చే బాధ్యతను ఆయా పాఠశాలల ఎస్ఎంసీలకు అప్పగించింది. కుట్టుకూలితోనే సమస్య జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని బాలబాలికలకు యూనిఫామ్ కోసం అధికారులు వస్త్రాన్ని పంపిణీ చేశారు. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు బాలబాలికలకు కొలతలు తీసుకుని కుట్టించి ఇచ్చే బాధ్యతను ఎస్ఎంసీలకు అప్పగించారు. 1 నుంచి 7వ తరగతి వరకు షర్ట్నిక్కర్, 8వ తరగతి నుంచి పదోతరగతి షర్ట్, పాయిట్ బాలుర కోసం కుట్టించి ఇవ్వాలి. టైలర్లకు ప్రభుత్వం ఇస్తున్న ఒకజత కుట్టుకూలి రూ.50 సరిపోకపోవడంతో ముందుకు రావడం లేదు. కొన్ని ఏజెన్సీలు ముందుకు వచ్చినప్పటికీ వారికి వీలైనప్పుడు పాఠశాలలకు డ్రెస్‌లు పంపిస్తున్నారు. మరికొందరు రూ.50లకు షర్టు, పాయింట్ గిట్టుబాటు అవడం లేదని తిరిగి ఇచ్చేస్తున్నారు. దీంతో పూర్తిస్థాయిలో యూనిఫాం తయారుకాక పంపిణీకి నోచుకోవడంలేదు. కనీసం 8నుంచి పదోతరగతి విద్యార్థుల డ్రెస్‌కు రూ.70 నుంచి రూ.80 అందిస్తే కూలి పడుతుందని టైలర్లు పేర్కొంటున్నారు. బిల్లుల చెల్లింపులో ఆలస్యం గతేడాది కుట్టిన యూనిఫాంలకు టైలర్లకు సకాలంలో బిల్లుల చెల్లింపులో ఆలస్యం కావడంతో ఈఎడాది ముందుకు రావడం లేదు. ఇచ్చే అతి తక్కువ కూలికి అధికారుల చుట్టూ తిరగడంకంటే కుట్టకుండా ఉంటేనే మేలంటున్నారు. దానికి తోడు మండలాలకు పూర్తిస్థాయి ఎంఈవోలు లేకపోవడం, ఒక్కో ఎంఈవోకు రెండు నుంచి నాలుగు మండలాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో పర్యవేక్షణ లోపించి పనులు కుంటుపడుతున్నాయి. పంద్రాగస్టులోగా కొత్త డ్రెస్‌లు అందుతాయో లేదోనని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పంద్రాగస్టులోగా అందిస్తాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం కోసం క్లాత్ పంపిణీ చేశాం. ప్రభుత్వం ఒక్కో డ్రెస్‌కు చెల్లించే మొత్తం తక్కువనే ఉద్దేశంతో దర్జీలు ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలో పూర్తి అయ్యాయి. మిగితా పాఠశాలలకు పంద్రాగస్టు వరకు పూర్తిస్థాయిలో అందించాలని ఎంఈవో, హెచ్ఎంలకు సూచించాం. – భిక్షపతి, డీఈవో -
రూ.100 ఇస్తామన్నా.. రూ.30 చాలట!
హాస్టల్ విద్యార్థుల దుస్తులు కుట్టేందుకు గతంలో సర్కార్ జతకు రూ.40 ధరను నిర్ణయించగా ఇప్పుడు రూ.100 పెంచింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు పెంచారు. గిట్టుబాటు కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కుట్టుకూలి ధర పెంచితే... వద్దు.. వద్దు... పాత ధర కంటే రూ.10 తక్కువగానే కుడతామంటూ కాంట్రాక్టర్లు టెండర్‌ను దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ. 40కి ఒక జత వస్త్రాలు కుట్టగా ఈసారి రూ. 40 వద్దు... రూ. 30కే జత బట్టలు కుట్టేందుకు టెండర్ వేసి దక్కించుకోవడంతో ప్రభుత్వానికే ఆదా అయినట్లు అయింది. కానీ యూనిఫామ్‌ల కుట్టు నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నల్లగొండ : జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 46 ప్రీమెట్రిక్, హాస్టళ్లు ఉన్నాయి. అందులో మొత్తం 4420 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు 3 జతల యూనిఫాం, ఒక జత నైట్ డ్రెస్‌ను ప్రభుత్వం ఇస్తుంది. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ఇది అమలు చేస్తూ వస్తున్నారు. గత సంవత్సరం కూడా నాలుగు జతల బట్టలను హాస్టల్ విద్యార్థులకు ఇచ్చింది. పెంచిన కుట్టుకూలి ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు బట్టలను కుట్టే కూలి ధరలు పెంచింది. గత సంవత్సరం ఒక్కో జతకు రూ.40 చొప్పున ధర నిర్ణయించారు. అయితే అదే ధరకు టెండర్లో ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు మూడు డివిజన్లలో టెండర్లు దక్కించుకొని కుట్టిచ్చారు. రూ. 40కే కొన్ని సంవత్సరాలుగా కుట్టిస్తున్నారు. ఈ సంవత్సరం కుట్టు కూలి సరిపోవడం లేదని, ధరలు పెంచాలని కార్మికులంతా ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. దారం, గుండీలు, జిప్పుల ధరలు పెరిగాయని, వాటికి అనుగుణంగా ధరలు పెంచాలంటూ కోరుతూ వచ్చారు. దీంతో అధికారులు కూడా ఆలోచించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో రూ.40 ఉన్న కుట్టు కూలి ధరను ఏకంగా రూ. 100కు పెంచింది. ఈ సంవత్సరం బట్టలు కుట్టేందుకు టెండర్ ఈ సంవత్సరం సాంఘిక సంక్షేమ శాఖలో హాస్టల్ విద్యార్థులకు బట్టల కుట్టడం కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగించారు. చాలా మంది టెండర్లలో పాల్గొన్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కోట్ చేస్తూ వచ్చారు. కొందరు రూ.75కు కుడతామంటూ టెండర్లో కోట్ చేయగా, మరికొందరు రూ.65, రూ. 60 కోట్ చేస్తూ వచ్చారు. మదర్ ఎడ్యుకేషన్ రూరల్ సొసైటీ మాత్రం అతి తక్కువకు కోట్ చేసింది. డివిజన్ల వారీగా టెండర్ల ప్రక్రియ కొనసాగింది. నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ డివిజన్లలో ఈ సొసైటీనే అతి తక్కువ ధరకు టెండర్లో కోట్‌చేసింది. దేవరకొండ, మిర్యాలగూడ డివిజన్లలో రూ. 35కే ఒక జత బట్టలు కుట్టేందుకు టెండర్ వేయగా, నల్లగొండ డివిజన్లో మాత్రం రూ. 30కే జత బట్టలు కుడతామంటూ కోట్ చేసింది. దీంతో ఆ సొసైటీనే నల్లగొండ జిల్లాలోని మూడు డివిజన్ల టెండర్‌ను దక్కించుకుంది. గతంతో పోలిస్తే ఒక జతలో మూడు జతలు పూర్తి ప్రభుత్వం ఒక్క జతకు రూ.100 ఇస్తామంటే, రూ.100కు మూడు జతలు కుట్టేందుకు కాంట్రాక్టర్ ముందుకురావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బట్టలు కుట్టుకూలి విషయంలో అధికారులు కూడా జాగ్రత్త వహించి సక్రమంగా కుడుతున్నారా లేదా, అవి సక్రమంగా ఇన్‌టైంలో అందే విధంగా చూడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గుండీలు కుట్టిన మూడు నాళ్లకే ఊడిపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కుట్లు ఊడిపోవడం కూడా జరిగింది. అలా కాకుండా పకడ్బందీగా నాణ్యమైన పద్ధతిలో కుట్టించే విధంగా ఆ కాంట్రాక్టర్‌పై కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు వీరికి ఏమి మిగులుతుంది..? జత కుట్టుకూలి రూ.30కి ఇస్తే కాంట్రాక్టర్లకు ఏమి మిగులుతుందన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వమే వస్త్రం ఇస్తుంది. దీనిని కాంట్రాక్టర్ బయట కటింగ్‌కు ఇస్తారు. ఒక్కో జత కటింగ్ రూ.3 నుంచి రూ.4 తీసుకుంటారు. మిషన్‌పై బల్క్‌గా కట్ చేస్తారు కాబట్టి తక్కువకే పడుతుంది. బయట దర్జీలకు (ఇటీవల ఇంటి దగ్గర ఖాళీగా ఉండే గృహిణిలు కుడుతున్నారు). అంగికి రూ. 7.50, ప్యాంట్‌కు రూ.11 నుంచి రూ.12 ఇస్తున్నారు. ఇక ట్రాన్స్‌పోర్టు, ఇతర ఖర్చులు ఉంటాయి. వీటి ఖర్చులు పోను కాంట్రాక్టర్‌కు ఒక్కో జతకు రూ.4 నుంచి రూ.5 రూపాయలు మిగులుతున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం ఇచ్చే వస్త్రంలో మిగులుబాటు ఉంటుందని, దీంతో అధిక లాభాలు వస్తాయని తెలుస్తోంది. -
పొడుగు అంగీ..పొట్టి చెడ్డీ
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫాం వేసుకుంటే చదువు మాట అటుంచి.. సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. విద్యార్థుల బరువు, ఎత్తుతో నిమిత్తం లేకుండా గంపగుత్తగా యూనిఫాం పంపిణీ చేయడంతో వాటిని వేసుకుని పాఠశాలకు వస్తున్న విద్యార్థుల్లో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ ఒక్కరికీ సరిపోయిన సైజు ఇవ్వకపోవడం ఒక ఎత్తయితే.. ఏకరూప దుస్తులు ఇచ్చిన నెలలోపే ఎక్కడికక్కడ కుట్లు ఊడిపోతుండడం మరో ఎత్తు. దీంతో బిగుతు దుస్తులు వేసుకోలేక.. వేసుకున్నాక ఎక్కడ చినిగిపోతుందోన్న ఆందోళన మరోపక్క వెరసి విద్యార్థుల దృష్టి వాటిమీదే పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. నగరంలోని వివిధ ప్రభుత్వ స్కూళ్లలో యూనిఫాంల పంపిణీ, విద్యార్థుల సౌకర్యంపై ‘సాక్షి’ క్షేత్ర పరిశీలన నిర్వహించింది. ఇందులో విద్యార్థుల నుంచి అనేక చోట్ల అసంతృప్తి వ్యక్తమైంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు రెండేసి జతల యూనిఫాంలు పంపిణీ చేయాలి. కానీ చాలాచోట్ల కేవలంఒక్క జతే ఇచ్చి సరిపెట్టారు. కొన్ని పాఠశాలల్లో రెండు జతలు పంపిణీ చేసినా విద్యార్థి ఎత్తు, బరువుతో సంబంధం లేకుండా ఇచ్చారు. దీంతో అవి కొందరికి మోకాళ్ల మీదకు చెడ్డీలు రాగా, మరికొందరికి మోకాళ్ల కిందకు వచ్చాయి. ఇక షర్ట్స్ విషయంలో అనేక వింతలు కనిపించాయి. పొడవు షర్టులున్న విద్యార్థులు ఇబ్బంది పడకుండా టక్ చేసుకుని ‘కవర్’ చేస్తున్నారు. ఇంకొందరు పొడవు తగ్గించి కుట్టించుకున్నారు. ఇంకొందరు అలానే వదిలేసి అవస్థలు పడుతున్నారు. మెడవద్ద సైతం లూజ్‌గా ఉండడంతో రోజంతా వాటిని సర్దుకునేందుకే సమయం సరిపోతుందని అనేక మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ వాటితో ఇబ్బంది పడలేక సాధారణ దుస్తుల్లో వస్తున్న వారి సంఖ్య భారీగానే కనిపించింది. ఇదిలావుంటే.. యూనిఫాం సైజుతో పనిలేకుండా.. ఇచ్చినవాటిని వేసుకు రావాల్సిందేనని స్కూళ్లలో ఉపాధ్యాయులు ఒత్తిడి తెస్తుండడంతో బిగుతు యూనిఫాం వేసుకుని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మీద నుంచి అలానే వచ్చాయి ఏకరూప దుస్తులను ‘టెస్కో’ నుంచి వచ్చిన వస్త్రాన్ని కుట్టించి పంపిణీ చేశామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల పొడుగున్న దుస్తులను సరిచేయించామని, చాలాచోట్ల అసౌకర్యాలు ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్న మాట వాస్తవమేనని వారు అంగీకరించారు. -
ఏకరూపం.. అయ్యేనా సిద్ధం!
చెన్నూర్‌రూరల్: కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, తదితర సదుపాయాలను సమకూరుస్తోంది. ఏకత్వ భావనతో పాటు, విశ్వాసం పోగవుతుందనే ఆశయంతో ఏకరూప దుస్తుల అందజేత కార్యక్రమాన్ని ప్రారంభించింది. లక్ష్యం బాగానే ఉన్నప్పటికి విద్యా సంవత్సరం గడిచినా కొన్ని ప్రాంతాలలో దుస్తులు అందని సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచే నాటికి ఏకరూప దుస్తులు విద్యార్థులందరికీ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంచిర్యాల జిల్లాలో 18 మండలాలకు గాను 671 పాఠశాలలు ఉండగా, 45,288 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున దుస్తులను అందజేస్తారు. డీఈవో ఆదేశాల ప్రకారం ఎంఈవోలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, యాజమాన్య కమిటీలతో కలిసి దుస్తులు కుట్టించేందుకు సిద్ధమయ్యారు. గతేడాది ఒక జతకు రూ.40 చెల్లిస్తే, ఈ ఏడాది ఒక జతకు రూ.50 అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది జతకు రూ.10 పెంచి అందజేస్తోంది. పాఠశాలలకు చేరిన వస్త్రం అన్ని మండలాల్లోని మండల విద్యావనరుల కేంద్రాలకు వారం రోజుల క్రితం వస్త్రాలు వచ్చాయి. ఇక్కడ నుంచి పాఠశాలల సముదాయాల వారిగా సరఫరా చేశారు. మండలాల్లోని అన్ని పాఠశాలలకు దాదాపు వస్త్రాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తీసుకువెళ్లి యూనిఫాంలు కుట్టించేందుకు సిద్ధం చేస్తున్నారు. దర్జీలను పిలిపించి కొలతలు కూడా తీసుకుంటున్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున 14,878 మీటర్లు వస్త్రాన్ని పంపిణీ చేశారు. జూన్ 1న పాఠశాలలు పునః ప్రారంభం కావడాన్ని దృష్టిలో పెట్టుకొని బడులు తెరిచే నాటికి విద్యార్ధులకు ఏకరూప దు స్తులను అందజేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ ముం దుకు Ðð ళ్తోంది. పాఠశాలలు పునః ప్రారంభమైన మొద టి వారంలోనే విద్యార్థులకు కొత్తగా అందజేసిన ఏకరూప దుస్తులతో పాఠశాలలకు రావాలని నిర్ణయిం చారు. గతంలో ఏకరూప దుస్తులు సకాలంలో అందక పాత వాటితో విద్యార్థులు పాఠశాలలకు వచ్చేవారు. కానీ ఈ ఏడాది ముందస్తుగా ఏకరూప దుస్తులను వి ద్యార్థులకు అందజేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఏకరూప దుస్తులతో పాఠశాల పునః ప్రారంభంలోనే కనిí ³ంచనున్నారు. ఒక్క జత స్కూల్ యూనిఫాం కుట్టేం దుకు రూ. 50 సరిపోవని దర్జీలు వాపోతున్నారు. దీం తో విద్యార్థుల తల్లిదండ్రులు అదనంగా వారికి రూ.30 చెల్లిస్తున్నారు. మొత్తం రూ.80కి ఒక జత యూనిఫాంను కుడుతున్నారు. పాఠశాలల ప్రారంభంలోనే అందిస్తాం ప్రభుత్వ పాఠశాలలు జూన్ 1వ తేదీన పునఃప్రారంభిస్తాం. బడులు తెరిచే నాటికే ఏకరూప దుస్తులు కుట్టించడం పూర్తయ్యి, మొదటి వారంలోనే విద్యార్ధులు ఏకరూప దుస్తులతో పాఠశాలలకు రావాలని మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఎప్పటికప్పుడు దుస్తులు కుట్టించేందుకు ఇచ్చిన దర్జీలతో మాట్లాడి మే నెల చివరి వారం వరకు ఏకరూప దుస్తులు తెప్పించాలి. – వెంకటేశ్వర్రావు, ఇన్చార్జి డీఈవో -
బడి పిల్లలకు బట్టలు
ఇక 9, 10వ తరగతుల విద్యార్థులకు ప్రతీ ఏటా రెండు జతల యూనిఫాంలు ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇంత వరకు పాఠశాలల్లో కొనసాగిన రెండు డ్రెస్సుల విధానం కనుమరుగు కానుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులంతా ఒకే రకమైన యూనిఫాంలో కనిపించనున్నారు. జిల్లాలో 231 ఉన్నత పాఠశాలలుండగా 9, 10వ తరగతుల్లో సుమారు 19 వేల మంది చదువుతున్నట్లు సమాచారం. వీరందరికీ ఏడాదికి రెండు జతల యూనిఫాం ఇవ్వనున్నారు. పాపన్నపేట(మెదక్) : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే రెండు జతల యూనిఫాంల విధానంతో జిల్లాలో ఏటా సుమారు రూ.76 లక్షల వ్యయం కానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ధనిక, పేద తారతమ్యం రూపుమాపి విద్యార్థులంతా ఒకటే అనే భావన పెంపొందించేందుకు. నిరుపేద విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించేందుకు.. విద్యాహక్కు చట్టం అమలు పర్చేందుకు 2009 నుంచి ఉచితంగా రెండు జతల యూనిఫాంలు అందజేస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వీటిని సమకూరుస్తున్నారు. దీనికోసం ఒక్కో జత (ప్యాంటు, షర్టు)కు రూ.200 ఇస్తున్నారు. ఇందులో రూ.160 బట్ట ఖరీదు, రూ.40 కుట్టు కూలీ ఖర్చులుగా అందజేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకైతే 1 నుంచి 7వ తరగతుల వారికి నెక్కర్, షర్టు, 8వ తరగతుల వారికి ప్యాంటు, షర్టు, బాలికలకు 1నుంచి 2వ తరగతుల వారికి ఫ్రాక్స్, 3నుంచి 5 వరకు స్కర్టులు, షర్టు, 6 నుంచి 8వ తరగతుల వారికి పంజాబీ డ్రెస్సు, చున్నీ పంపిణీ చేస్తున్నారు. అయితే 9,10వ తరగతుల వారికి మాత్రం యూనిఫాంలు పంపిణీ చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 9,10 తరగతులకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి భాగస్వామ్యంతో ఇంత వరకు 1నుంచి 8 తరగతుల వారికి యూనిఫాంలు పంపిణీ చేశారు. 9, 10వ తరగతుల విద్యార్థులు ఇష్టమొచ్చిన విధంగా పాఠశాలకు సివిల్ డ్రెస్సులు వేసుకొని వచ్చేవారు. దీంతో పాఠశాలలో భిన్నత్వం కనిపించేది. పేద విద్యార్థులు కొంత మంది చిరిగిన అంగీలు కూడా వేసుకొని వచ్చేవారు. ఈ వివక్షతను రూపుమాపి, పేదలకు బాసటగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం వచ్చే యేడాది నుంచి 9, 10వ తరగతుల విద్యార్థులకు కూడా రెండు జతల యూనిఫాంలు ఇస్తుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. దీనికోసం రూ.34.31 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పారు. దీంతో నిరుపేద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం 9,10వ తరగతుల విద్యార్థులకు కూడా ఉచిత యూనిఫాంలు ఇస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత వరకు 1నుంచి 8 తరగతుల విద్యార్థులకే యూనిఫాంలు ఇవ్వడం, 9, 10వ తరగతుల వారికి ఇవ్వక పోవడం వల్ల ఒకే పాఠశాలలో చదివే విద్యార్థుల మధ్య వైరుధ్యం కనిపించేది. సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిల నిర్ణయంతో జిల్లాలో సుమారు 19వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. నిరుపేద విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. – మధుమోహన్, నోడల్ అధికారి ఎదురు చూపులు నేడు ఫలించాయి సుమారు పదేళ్లుగా 9, 10వ తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉచిత యూనిఫాంలు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఈ ఆర్థిక భారం కేవలం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతుండడంతో అటు వైపుగా ఎవరూ ఆలోచించలేదు. ప్రస్తుత నిర్ణయంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరగడానికి ఉచిత యూనిఫాంలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కూడా కారణమే. – నీలకంఠం, ఎంఈఓ, కొల్చారం -
యూనిఫాం.. ఇంకెప్పుడు?
కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడంతో పాటు అందరూ సమానమే అనే భావన కల్పించేందుకు ప్రతి ఏటా యూనిఫాం అందజేస్తారు. అయితే, జిల్లాలో కొందరికి మాత్రమే ఇచ్చారు. మిగతా వారికి ఇంకా ఇవ్వకపోవడంతో వారంతా చిరిగిన పాత బట్టలతోనే బడికెళ్తున్నారు. రెండున్నర నెలలు ఉంటే 2017–18 విద్యాసంవత్సరమే ముగుస్తుంది.. ఇంకెప్పుడు యూనిఫాం ఇస్తారని పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అందించాల్సిన సర్కారు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రతి ఏటా విద్యా సంవత్సరం మొదట్లోనే విదార్థులకు యూనిఫాం అందజేయాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో నేటికీ పేద విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందలేదు. కారణమేమిటంటే.. మొదట్లో క్లాత్ అందించే బాధ్యత ఆప్కోకు అప్పగించిన సర్కారు తర్వాత కుట్టి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దుస్తులు కుట్టేందుకు జిల్లాల వారీగా ఆప్కో ఒప్పందం చేసుకుంది. ఇక్కడ అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి తమవారికే ఆ కుట్టు బాధ్యతలు ఇవ్వాలని తీసుకోవడం..తర్వాత జాప్యం చేయడంతో పూర్తి స్థాయిలో విద్యార్థులకు యూనిఫాం అందించలేని పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి కొలతలు లేకుండా కుట్టడంతో కొన్ని పెద్దగా, మరికొన్ని చిన్నవిగా ఉండడంతో చాలా మంది విద్యార్థులు వాటిని వేసుకోలేకపోతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సైతం అరకొరగానే! జిల్లాలో 2940 ప్రభుత్వ, ఎయిడెడ్, కస్తూరిబా, ఏపీ మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 1914, ప్రాథమికోన్నత 475, ఉన్నత పాఠశాలలు 551 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 4,00,824 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1 తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ పాఠశాలలకు మాత్రమే యూనిఫాం పంపిణీ చేస్తారు. సర్వశిక్ష అభియాన్ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 3,20,714 మందికి యూనిఫాం అందించాలి. ఇప్పటి వరకు ప్రభుత్వ, మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలకు చెందిన 2,91,149(బాలురు–1,39,959, బాలికలు–1,51,932) మంది విద్యార్థులకు మాత్రమే పంపిణీ చేశారు. మరో రెండున్నర నెలలుంటే విద్యాసంవత్సరమే ముగిసిపోతుంది. ఇంకా ఎయిడెడ్‌స్కూళ్లలో 15,932, కేజీబీవీల్లో 6360, ఏపీ మోడల్ స్కూళ్లలో 8,118 మంది పిల్లలకు దుస్తులు అందలేదు. ఇదిలా ఉంటే ఏపీ మోడల్ స్కూళ్లలో యూనిఫాం ఇచ్చేందుకు ఎస్ఎస్ఏ ఎస్పీడీ నుంచి ఇంకా అనుమతులు రాకపోవడం గమనార్హం. ‘ఆదర్శ’ విద్యార్థులకు యూనిఫాం ఇవ్వాలని ప్రతిపాదించాం ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 2.91 లక్షల మంది విద్యార్థులకు యూనిఫాం ఇచ్చాం. ఇంకా కొందరికి ఇవ్వాల్సి ఉంది. కస్తూరిబా స్కూళ్లకు చెందిన 6,360 మందికి ఇవ్వాల్సి ఉండగా, వీరిలో కొందరికి యూనిఫాం నేరుగా ఆయా స్కూళ్లకే పంపించినట్టు తెలిసింది. అయితే ఎంత మందికి వచ్చిందనే విషయంపై స్పష్టత లేదు. ఆదర్శ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు యూనిఫాం కోసం ఎస్ఎస్ఏ ఎస్పీడీకి ప్రతిపాదనలు చేశాం. అక్కడి నుంచి అనుమతులు రాలేదు. -
ఎన్నాళ్లీ ఎదురు చూపులు
కడప ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు పేద, ధనిక అనే తేడా లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏకరూప దుస్తులు (యూనిఫాం) ఉచితంగా అందజేస్తోంది. అయితే యూనిఫాం విద్యార్థులకు సకాలంలో అందలేదు. దీంతో వారిమధ్య అసమానత స్పష్టంగా కనిపిస్తోంది. ఇందంతా అధికారుల తప్పిదం కాదు.. యూనిఫాం గుడ్డలో ప్రభుత్వ పెద్దల (అధికారపార్టీ నేతలు) కమీషన్ల కక్కుర్తితో తీవ్ర జాప్యం చోటుచేసుకున్నట్లు చర్యలు జోరుగా జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకుడి నియోజక వర్గంలోనే ఇలాంటి పరిస్థితి చోటుచేసుకుంటే మిగతా ప్రాంతాల పరిస్థితేంటని పలువురు విద్యార్థుల తల్లితండ్రులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం పాఠశాలలు ప్రారంభం అయ్యేనాటికి ప్రతి విద్యార్థికి యూనిఫాం, పాఠ్యçపుస్తకాలు అందించాల్సి ఉంది. పాఠశాలలు తెరుచుకున్న రెండు నెలలకు గానీ విద్యార్థుల చేతికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందడం లేదు. దీంతో నాయకులకు ప్రభుత్వ విద్యపైన ఎంత బాధ్యత ఉందో అర్థమవుతూనే ఉంది. అధికార పార్టీకి చెందిన పెద్దలు వేదికలెక్కినప్పుడు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తాం.. ప్రతి ఒక్కరికి గుణాత్మక విద్యనందిస్తామని ఊపుదంపుడు ఉపన్యాసాలను చేస్తారు. కానీ అది కింది స్థాయిలో ఏ మాత్రం అమలు జరగడం లేదనేది జగమెరిగిన సత్యం. రోజురోజుకు ప్రభుత్వ విద్య పట్ల నిర్లక్ష్యం ఎక్కువవుతోందనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు ఉదాహరణ.. అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ప్రాతినిథ్యం వహించిన రాజంపేట మండలంలో చోటుచేసుకుంది. రాజంపేటలో 109 పాఠశాలలకు రాజంపేట మండలంలో 109 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 6,771 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఒకొక్కరికి రెండు జతల చొప్పున 13,542 జతలు యూనిఫాం అందాల్సి ఉంది. కానీ ఇంతవరకూ ఒక్క పాఠశాలకు కూడా ఒక్క జత కూడా అందలేదు. ఇందుకు ఇప్పటివరకూ బట్ట రాకపోవడమే కారణమని తెలుస్తోంది. పాఠశాలలు తెరుచుకున్న మూడు నెలలకు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది పాఠశాలలు తెరుచుకున్న మూడు నెలలకు కానీ యూనిఫాం అందలేదు. అనంతరం మొదటగా 12 మండలాల్లోని పాఠశాలలకు యూనిఫాంను అందజేశారు. ఆ తర్వాత నెలరోజులకు మరో 6 మండలాలు కలుపుకుని 18 మండలాలకు యూనిఫాం అందజేశారు. అనంతరం నవంబర్, డిసెం బర్ నెలల్లో మరికొన్ని పాఠశాలలకు ఇలా.. జనవరి ముగిసేనాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,145 పాఠశాలలకు గానూ 3,036 పాఠశాలలకు ఏకరూప దుస్తులను అందజేశారు. అలాగే పాఠ్యపుస్తకాలు కూడా అందాయి. మాకు ఇంకా ఇవ్వలేదు.. మా పాఠశాలలో పుస్తకాలు ఇచ్చిండ్రు.. కానీ యూనిఫాం ఇవ్వలేదు. అయ్యవార్లను అడిగితే పై నుంచి బట్ట రాలేదంటాండ్రు. ఎప్పుడిస్తారో ఏమో. రోజు మామాలు దుస్తులే వేసుకుని వస్తున్నాం. – సంతోష్, 5వ తరగతి, శేషన్నగారిపల్లె -
లంబూ.. జంబూ!
ప్రభుత్వం వస్త్రం ఇచ్చింది.. ఎలాగోలా కుట్టేయే.. సరిపోతే మాకేం సరిపోకపోతే మాకేం అన్నట్టు కుట్టేశారు.. రెండేళ్ల క్రితం పిల్లల వద్ద తీసుకున్న కొలతలతోనే వస్త్రాలను కుట్టి పంపుతున్నారు. ఫలితంగా కుట్టిన దుస్తులు పిల్లలకు సరిపోక కొన్ని, లంబూ జంబూగా మరికొన్ని, మరీ బిగుసుగా కొన్ని రావడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వీటి గురించి పర్యవేక్షించేవారు లేరు.. పట్టించుకునేవారు అసలే లేరు. ఫలితంగా విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సర్వశిక్ష అభియాన్ నిధులతో ప్రభుత్వం యూనిఫాం పంపిణీ చేస్తోంది. విద్యార్థుల్లో గైర్హాజరు శాతం తగ్గించి వారు పాఠశాలల వైపు ఆకర్షితులయ్యేలా చేయాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకం పక్కదారి పడుతోంది. వస్త్రం నాణ్యతను గాలికొదిలేయడంతో సరఫరాదారులు అడ్డదారులు తొక్కుతున్నారు. నాసిరకం దుస్తులు ఇచ్చి పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నా విద్యాశాఖ యంత్రాం గానికి పట్టడం లేదు. ఎవరైనా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు ఆ దుస్తులు సరిగా లేవని వాటిని తీసుకోవడానికి తిరస్కరించినా పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. ఒక్కో విద్యార్థికి రూ. 4 వందల చొప్పున యూనిఫాంకు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఇచ్చేటప్పుడు ఆ వ్యయంతో నాణ్యమైన దుస్తులు సమకూర్చుకోవచ్చనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో.. తొలుత ఎక్కడికక్కడ పాఠశాలల వారీగా వస్త్రం సమకూర్చుకొని ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో వాటిని కుట్టించి ఇవ్వడంతో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాలేదు. ఈ పద్ధతి బాగున్నా కొందరు ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లకు నచ్చలేదు. ఇలాగైతే తమ జేబులు నిండవని ఈ విధానానికి స్వస్తి చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విధానంలో వస్త్ర నాణ్యత మొదలుకుని దాని సరఫరా దాకా పరిశీలిస్తే అడుగడుగునా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. పాఠశాలలు తెరిచి దాదాపు నాలుగు నెలలైనా ఇప్పటికి కేవలం 21 మండలాల్లోని పాఠశాలలకు మాత్రమే దుస్తులను సరఫరా చేశారు. ఇంకా 30 మండలాల్లో పంపిణీ చేయాల్సి ఉంది. అది కూడా రెండేళ్ల క్రితం తీసుకున్న కొలతలతో దుస్తులు కుట్టారు. పంపిణీ చేసిన వాటిలో చాలా మేరకు పిల్లలకు సరిపోవడం లేదని తెలిసింది. కొన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెనక్కు పంపుతున్నారు. జిల్లాలోని బి.కోడూరు, పోరుమామిళ్ల, కలసపాడు మండలాల్లో చాలా పాఠశాలల్లో పిల్లలకు దుస్తుల సైజులు సరిపడక వెనక్కు పంపారు. తాజాగా కడప నగరం నాగరాజుపేట నగర పాలక పాఠశాలలో విద్యార్థులకు పంపిన దుస్తులు సరిపడక 8వ తరగతి చదివే విద్యార్థుల దుస్తులు 6వ తరగతి విద్యార్థులకు.. 6వ తరగతి చదివే పిల్లల దుస్తులు 4వ తరగతి వారికి పంపిణీ చేశారు. ఇందులోనూ ఒక్కో విద్యార్థికి రెండు జతలు ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం ఒక జతతోనే సర్దుబాటు చేశారు. జిల్లాలో మూడు కేంద్రాల్లో యూనిఫాం తయారీ పిల్లలకు సంబంధించి స్కూల్ యూనిఫాంను జిల్లాలో మూడు కేంద్రాలలో తయారు చేస్తున్నారు. కడపలో మెప్మా ఆధ్వర్యంలో, అలాగే ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని కుట్టు కేంద్రంతోపాటు ఖాజీపేటలోని నందిని ఫ్యాబ్రిక్స్‌లో పిల్లల యూనిఫాంలను కుడుతున్నట్లు అధికారులు తెలిపారు. 1లక్షా 76 వేల 180 మంది విద్యార్థులు ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలలతో పాటు కేజీబీవీ, మోడల్ స్కూళ్లను కలుపుకుని 1 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులు 1,76,180 మంది ఉన్నారు. వీరి నుంచి ముందస్తుగా సైజులు, కొలతలు తీసుకుని యూనిఫాం కుట్టించి ఇచ్చి ఉంటే దుస్తులు సరిపోవడం లేదు అనే సమస్య ఎదురయ్యేది కాదు. అలాగే ఒక్కో పాఠశాలలో ఎంతమంది పిల్లలు ఉన్నారు. వారికి సరపడా దుస్తులు ఇస్తున్నామా లేదా అనే లెక్క కూడా ఉండటం లేదు. వస్త్రం నాణ్యత మొదలుకుని కుట్టు, సరఫరా దాకా ప్రతి విషయంలోనూ లోపాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. ఫలితంగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. -
సెలవుల్లో యూనిఫారమా!
► నేటి నుంచి పాఠశాలలకు సెలవులు ► ఇప్పుడు వచ్చిన ఏకరూప దుస్తులు ► చివరి రెండు రోజుల్లో పంపిణీ మొదలుపెట్టిన అధికారులు ► సగం మందికి కూడా అందని వైనం సాక్షి, విశాఖపట్నం : పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్ధి ఏకరూప దుస్తులు ధరించి వెళ్లాలనేది ప్రాథమిక నియమం. అది ఆ పసి హృదయాల్లో తామంతా ఒక్కటేననే ఐక్యత భావాన్ని పెంపొందిస్తుందనేది ప్రధాన సదుద్దేశం. ఈ ఏడాది స్కూల్ యూనిఫామ్స్ ఎప్పుడు వచ్చాయో తెలుసా.?రెండు రోజుల క్రితం. విచిత్రం ఏమిటంటే నిన్నటితో పాఠశాలల పనిదినాలు పూర్తయ్యాయి. నేటి నుంచి వేసవి సెలవులు ఇచ్చేశారు. జిల్లాలో 2,38,489 మంది విద్యార్ధులకు (బాలురు 1,15,547 ,బాలికలు 1,22,942) రెండు జతలు చొప్పున ఏక రూప దుస్తులు ఇచ్చేందుకు 2014-15 సంవత్సరానికి ఒక్కో యూనిఫాంకు రూ.200చొప్పున రూ.1041.880 లక్షల సొమ్మును ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిలో రూ.953.956 లక్షలు ఖర్చు చేసి అధికారులు ఆప్కో నుంచి దుస్తులు కొన్నారు. దానిలో రూ.160 క్లాత్‌కు, రూ.40 కుట్టుకూలికి కేటాయించారు. ఈ దుస్తులను కట్టే బాధ్యతలను గాజువాక, సబ్బవరం, విశాఖ నగరం, అనకాపల్లిలో ఐదుగురికి అప్పగించారు. వారు కుట్టు పనులు పూర్తిచేసి ఇటీవలే ఇచ్చారు. వాటిని అధికారులు విద్యార్ధులకు అప్పగించడం ప్రారంభించారు. కొన్ని స్కూళ్లకు అందించారు. ఇంకా పలు స్కూళ్లకు వెళ్లలేదు. ఇస్తున్న దుస్తుల్లో కొన్నిటికి బటన్స్ లేవు,మరికొన్ని సైజ్ సరిపోవడం లేదు. క్లాత్ చిరిగిపోయేలా ఉందని విద్యార్ధులు అంటున్నారు. నిజానికి క్లాత్ ఎవరిదగ్గర తీసుకోవాలనే దానిదగ్గర్నుంచీ రాజకీయాలు మొదలయ్యాయి. పలు ప్రైవేట్ సంస్థలు టెండరు దక్కించుకోవడానికి ప్రయత్నించాయి. ఎట్టకేలకు ఆప్కోకే టెండర్ దక్కింది. కమిషన్లు తేలకపోవడంతో ఫిబ్రవరి ఆప్కో క్లాత్ ఇవ్వలేకపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవహారం ఎంఈఓల పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఎంఈఓకు 2శాతం, హెడ్మాస్టర్కు 3 శాతం, ఓ ప్రజా ప్రతినిధికి 5 శాతం చొప్పున కమిషన్లు మాట్లాడుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కమిషన్ల కోసం నాసిరకం దుస్తులను కొనుగోలు చేశారని, పంపిణీ చేస్తే బంఢారం భయటపడుతుందనే దాచిపెట్టారని తెలుస్తోంది. ఇప్పుడు ఇచ్చినా విద్యార్ధులు వేసవి సెలవుల్లో ఆటపాటల్లో దుస్తులు పాడుచేసుకున్నారని తప్పించుకోవచ్చనేది వారి ఎత్తుగడగా విద్యార్ధుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ విషయంపై సర్వ శిక్షఅభియాన్ కమ్యూనిటీ మెబలైజేషన్ ఆఫీసర్ స్వప్న ప్రియారెడ్డిని ‘సాక్షి’ కోరగా వివరణ ‘ఆప్కో ఆలస్యంగా క్లాత్ ఇవ్వడంతో కుట్టడం ఆలస్యం అయ్యిందన్నారు. -
పంద్రాగస్టు వచ్చినా అందని యూనిఫాంలు
పేద, ధనిక, కుల, వర్గ తారతమ్యాలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఏకరూప దుస్తువులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విద్యార్థుల క్రమశిక్షణ అలవరిచేందుకు యూనిఫాంలు ఈ సంవత్సరం కూడా జెండా పండుగకు కూడా విద్యార్థులకు అందలేకపోతున్నాయి. ఈ సంవత్సరం ప్రభుత్వం యూనిఫాంలు కుట్టించే బాధ్యతల ను జిల్లా విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ కాంట్రాక్టు దర్జీలకు అప్పగించడం జరిగింది. మరికొన్ని చోట్ల గ్రామైక్య సంఘాలకు అప్పగించారు. ఆ బాధ్యతలను వారు సరిగ్గా నిర్వహించకపోవడంతో విద్యార్థులు పాత దుస్తువులతోనే జెండా పండుగను జరుపుకోవాల్సి వస్తున్నది. ఇప్పటివరకు ప్రభుత్వం విద్యార్థులకు స్కూల్ యూనిఫాంలను పొదుపు పాటిగా అందించి తమ అసమర్థతను చాటుకున్నది. దానికి తోడు విద్యార్థుల కొల తలు తీసుకుని యూనిఫామ్‌లు కుట్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినా అబాసుపాలైంది. గత సంవత్సరం లాగే ఈ విద్యా సంవ త్సరం కూడా విద్యార్థులకు ఆగస్టు 15కు దుస్తువులు అందలేకపోయాయి. జిల్లా వ్యాప్తంగా 2లక్షల 77వేల 859 మంది విద్యార్థులు(ఒకటి నుంచి 8వ తరగతి వరకు) ఒక విద్యార్థికి రెండు జతల చొప్పు న 5లక్షల 5వేల 718 యూనిఫామ్‌లు సరఫరా చేయా ల్సిఉంది. ఇందుకు రాజీవ్ విద్యామిషన్ ద్వారా కుట్టుటకు అయ్యే ఖర్చు జతకు రూ.400 చొప్పున రూ.22 కోట్ల 22లక్షలు ఎంఈఓల ఖాతాలో జమచేశారు. కానీ నిధులు కేటాయించి నెలలు గడుస్తున్నా విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేయలేకపోయారు. పర్సంటేజీల వల్లే ఆలస్యం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల స్కూల్ కాంప్లెక్స్ ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లతో పర్సంటేజీలు మాట్లాడుకోవడం వల్లే కాంట్రాక్టర్ దర్జీలు అశ్రద్ధతో సరైన సమయానికి యూనిఫాంలు అందజేయలేకపోతున్నారు. ఒక స్కూల్ కాంప్లెక్స్‌లో ఉండే సుమారు వెయ్యి మంది విద్యార్థులకు యూనిఫాంలు అందజేయలేని పరిస్థితి నెలకొన్నది. జిల్లావ్యాప్తంగా ఆగస్టు 10 వరకు కేవలం 40శాతం మాత్రమే యూనిఫాంలను సరఫరా చేయడం జరిగిందని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. 60శాతం యూనిఫాంలు ఇంకా స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలోనే కనీసం దర్జీలకు బట్టలు సరఫరా చేయలేని పరిస్థితి నెలకొన్నది. డీఈఓ వివరణ ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్‌ను వివరణ కోరగా విద్యార్థుల యూనిఫాంల కోసం బట్టలు సరఫరా చేయాల్సిన ఏజెన్సీలు సకాలంలో బట్టను సరఫరా చేయకపోవడం వల్ల యూనిఫామ్‌లను పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోయామని వివరణ ఇచ్చారు. త్వరలోనే అందరికీ సరఫరా చేస్తామని డీఈఓ తెలిపారు.