పొడుగు అంగీ..పొట్టి చెడ్డీ | Low Range Cloths Distribution Government School Uniforms hyderabad | Sakshi
Sakshi News home page

పొడుగు అంగీ..పొట్టి చెడ్డీ

Published Mon, Aug 13 2018 10:07 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

Low Range Cloths Distribution Government School Uniforms hyderabad - Sakshi

బంజారాహిల్స్‌ ఎన్బీ నగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తనకి సరిపోని ఫ్రాక్‌ను ఇచ్చారని చూపిస్తున్న విద్యార్థిని.. ఉప్పల్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన యూనిఫాం వేసుకుంటే చదువు  మాట అటుంచి.. సర్కస్‌ ఫీట్లు చేయాల్సి వస్తోంది. విద్యార్థుల బరువు, ఎత్తుతో నిమిత్తం లేకుండా గంపగుత్తగా యూనిఫాం పంపిణీ చేయడంతో వాటిని వేసుకుని పాఠశాలకు వస్తున్న విద్యార్థుల్లో చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఏ ఒక్కరికీ సరిపోయిన సైజు ఇవ్వకపోవడం ఒక ఎత్తయితే.. ఏకరూప దుస్తులు ఇచ్చిన నెలలోపే ఎక్కడికక్కడ కుట్లు ఊడిపోతుండడం మరో ఎత్తు. దీంతో బిగుతు దుస్తులు వేసుకోలేక.. వేసుకున్నాక ఎక్కడ చినిగిపోతుందోన్న ఆందోళన మరోపక్క వెరసి విద్యార్థుల దృష్టి వాటిమీదే పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. నగరంలోని వివిధ ప్రభుత్వ స్కూళ్లలో యూనిఫాంల పంపిణీ, విద్యార్థుల సౌకర్యంపై ‘సాక్షి’ క్షేత్ర పరిశీలన నిర్వహించింది.

ఇందులో విద్యార్థుల నుంచి అనేక చోట్ల అసంతృప్తి వ్యక్తమైంది. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు రెండేసి జతల యూనిఫాంలు పంపిణీ చేయాలి. కానీ చాలాచోట్ల కేవలంఒక్క జతే ఇచ్చి సరిపెట్టారు. కొన్ని పాఠశాలల్లో రెండు జతలు పంపిణీ చేసినా విద్యార్థి ఎత్తు, బరువుతో సంబంధం లేకుండా ఇచ్చారు. దీంతో అవి కొందరికి మోకాళ్ల మీదకు చెడ్డీలు రాగా, మరికొందరికి మోకాళ్ల కిందకు వచ్చాయి. ఇక షర్ట్స్‌ విషయంలో అనేక వింతలు కనిపించాయి. పొడవు షర్టులున్న విద్యార్థులు ఇబ్బంది పడకుండా టక్‌ చేసుకుని ‘కవర్‌’ చేస్తున్నారు. ఇంకొందరు పొడవు తగ్గించి కుట్టించుకున్నారు. ఇంకొందరు అలానే వదిలేసి అవస్థలు పడుతున్నారు. మెడవద్ద సైతం లూజ్‌గా ఉండడంతో రోజంతా వాటిని సర్దుకునేందుకే సమయం సరిపోతుందని అనేక మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ వాటితో ఇబ్బంది పడలేక సాధారణ దుస్తుల్లో వస్తున్న వారి సంఖ్య భారీగానే కనిపించింది. ఇదిలావుంటే.. యూనిఫాం సైజుతో పనిలేకుండా.. ఇచ్చినవాటిని వేసుకు రావాల్సిందేనని స్కూళ్లలో ఉపాధ్యాయులు ఒత్తిడి తెస్తుండడంతో బిగుతు యూనిఫాం వేసుకుని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

మీద నుంచి అలానే వచ్చాయి
ఏకరూప దుస్తులను ‘టెస్కో’ నుంచి వచ్చిన వస్త్రాన్ని కుట్టించి పంపిణీ చేశామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల పొడుగున్న దుస్తులను సరిచేయించామని, చాలాచోట్ల అసౌకర్యాలు ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్న మాట వాస్తవమేనని వారు అంగీకరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement