రూ.100 ఇస్తామన్నా.. రూ.30 చాలట! | Contractors Sewing Low-Quoted School Uniforms | Sakshi
Sakshi News home page

రూ.100 ఇస్తామన్నా.. రూ.30 చాలట!

Published Fri, Jul 19 2019 8:10 AM | Last Updated on Fri, Jul 19 2019 8:11 AM

Contractors Sewing Low-Quoted School Uniforms - Sakshi

హాస్టల్‌ విద్యార్థుల దుస్తులు కుట్టేందుకు గతంలో సర్కార్‌ జతకు రూ.40 ధరను నిర్ణయించగా ఇప్పుడు  రూ.100 పెంచింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు పెంచారు. గిట్టుబాటు కావాలన్న ఉద్దేశంతో  ప్రభుత్వం కుట్టుకూలి ధర పెంచితే... వద్దు.. వద్దు... పాత ధర కంటే రూ.10 తక్కువగానే కుడతామంటూ కాంట్రాక్టర్లు టెండర్‌ను దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ. 40కి ఒక జత వస్త్రాలు కుట్టగా ఈసారి రూ. 40 వద్దు... రూ. 30కే జత బట్టలు కుట్టేందుకు టెండర్‌ వేసి దక్కించుకోవడంతో ప్రభుత్వానికే ఆదా అయినట్లు అయింది. కానీ యూనిఫామ్‌ల కుట్టు నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

నల్లగొండ :  జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 46 ప్రీమెట్రిక్, హాస్టళ్లు ఉన్నాయి. అందులో మొత్తం 4420 మంది విద్యార్థులు ఉన్నారు.  ప్రతి సంవత్సరం  విద్యార్థులకు 3 జతల యూనిఫాం, ఒక జత నైట్‌ డ్రెస్‌ను ప్రభుత్వం ఇస్తుంది. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ఇది అమలు చేస్తూ వస్తున్నారు.  గత సంవత్సరం కూడా నాలుగు జతల బట్టలను హాస్టల్‌ విద్యార్థులకు ఇచ్చింది.

పెంచిన కుట్టుకూలి
ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా  హాస్టల్‌ విద్యార్థులకు బట్టలను కుట్టే కూలి ధరలు పెంచింది. గత సంవత్సరం ఒక్కో జతకు రూ.40 చొప్పున ధర నిర్ణయించారు. అయితే అదే ధరకు టెండర్‌లో ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు మూడు డివిజన్లలో టెండర్లు దక్కించుకొని కుట్టిచ్చారు. రూ. 40కే కొన్ని సంవత్సరాలుగా కుట్టిస్తున్నారు.  ఈ సంవత్సరం కుట్టు కూలి సరిపోవడం లేదని, ధరలు పెంచాలని కార్మికులంతా ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. దారం, గుండీలు, జిప్పుల ధరలు పెరిగాయని, వాటికి అనుగుణంగా ధరలు పెంచాలంటూ కోరుతూ వచ్చారు. దీంతో అధికారులు కూడా ఆలోచించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో రూ.40 ఉన్న కుట్టు కూలి ధరను ఏకంగా రూ. 100కు పెంచింది. 

ఈ సంవత్సరం బట్టలు కుట్టేందుకు టెండర్‌
ఈ సంవత్సరం సాంఘిక సంక్షేమ శాఖలో హాస్టల్‌ విద్యార్థులకు బట్టల కుట్టడం కోసం టెండర్ల ప్రక్రియ కొనసాగించారు. చాలా మంది టెండర్లలో పాల్గొన్నారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కోట్‌ చేస్తూ వచ్చారు. కొందరు రూ.75కు కుడతామంటూ టెండర్‌లో కోట్‌ చేయగా, మరికొందరు రూ.65, రూ. 60 కోట్‌ చేస్తూ వచ్చారు. మదర్‌ ఎడ్యుకేషన్‌ రూరల్‌ సొసైటీ మాత్రం అతి తక్కువకు కోట్‌ చేసింది. డివిజన్ల వారీగా టెండర్ల ప్రక్రియ కొనసాగింది. నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ డివిజన్లలో ఈ సొసైటీనే అతి తక్కువ ధరకు టెండర్‌లో కోట్‌చేసింది. దేవరకొండ, మిర్యాలగూడ డివిజన్లలో రూ. 35కే ఒక జత బట్టలు కుట్టేందుకు టెండర్‌ వేయగా, నల్లగొండ డివిజన్‌లో మాత్రం రూ. 30కే జత బట్టలు కుడతామంటూ కోట్‌ చేసింది. దీంతో ఆ సొసైటీనే నల్లగొండ జిల్లాలోని మూడు డివిజన్ల టెండర్‌ను దక్కించుకుంది.

 గతంతో పోలిస్తే ఒక జతలో మూడు జతలు పూర్తి
ప్రభుత్వం ఒక్క జతకు రూ.100 ఇస్తామంటే, రూ.100కు మూడు జతలు కుట్టేందుకు కాంట్రాక్టర్‌ ముందుకురావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  బట్టలు కుట్టుకూలి విషయంలో అధికారులు కూడా జాగ్రత్త వహించి సక్రమంగా కుడుతున్నారా లేదా, అవి సక్రమంగా ఇన్‌టైంలో అందే విధంగా చూడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గుండీలు కుట్టిన మూడు నాళ్లకే ఊడిపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కుట్లు ఊడిపోవడం కూడా జరిగింది. అలా కాకుండా  పకడ్బందీగా నాణ్యమైన పద్ధతిలో కుట్టించే విధంగా ఆ కాంట్రాక్టర్‌పై కన్నేసి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

 అసలు వీరికి ఏమి మిగులుతుంది..?
జత కుట్టుకూలి రూ.30కి ఇస్తే కాంట్రాక్టర్లకు ఏమి మిగులుతుందన్న వాదన వినిపిస్తోంది.  ప్రభుత్వమే వస్త్రం ఇస్తుంది. దీనిని కాంట్రాక్టర్‌ బయట కటింగ్‌కు ఇస్తారు. ఒక్కో జత కటింగ్‌ రూ.3 నుంచి రూ.4 తీసుకుంటారు. మిషన్‌పై బల్క్‌గా కట్‌ చేస్తారు కాబట్టి తక్కువకే పడుతుంది. బయట దర్జీలకు (ఇటీవల ఇంటి దగ్గర ఖాళీగా ఉండే గృహిణిలు కుడుతున్నారు). అంగికి రూ. 7.50, ప్యాంట్‌కు రూ.11 నుంచి రూ.12 ఇస్తున్నారు.  ఇక ట్రాన్స్‌పోర్టు, ఇతర ఖర్చులు ఉంటాయి. వీటి ఖర్చులు పోను కాంట్రాక్టర్‌కు ఒక్కో జతకు రూ.4 నుంచి రూ.5 రూపాయలు మిగులుతున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం ఇచ్చే వస్త్రంలో మిగులుబాటు ఉంటుందని, దీంతో అధిక లాభాలు వస్తాయని తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement