విద్యార్థులకు నెలనెలా స్కాలర్‌షిప్‌లు | Monthly scholarships to students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నెలనెలా స్కాలర్‌షిప్‌లు

Published Sat, Apr 9 2016 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

విద్యార్థులకు నెలనెలా స్కాలర్‌షిప్‌లు

విద్యార్థులకు నెలనెలా స్కాలర్‌షిప్‌లు

జూన్ నుంచి అమలుకు ప్రభుత్వ నిర్ణయం
♦ విద్యార్థులకు బకాయిలు చెల్లించాకే కాలేజీలకు ఫీజులు
♦ సంక్షేమ శాఖల వారీగా చెల్లింపులు
♦ బకాయిల వివరాలను సేకరించిన సీఎం కార్యాలయం
 
 సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్(ఎంటీఎఫ్)లను ఇక నుంచి నెలనెలా అందజేయాలని నిర్ణయించింది. సకాలంలో స్కాలర్‌షిప్‌లు అందక, బకాయిలు పెరిగిపోయి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం(2016-17) ప్రారంభమయ్యే జూన్ నుంచి దీనిని అమలు చేయనుంది. 2014-15 స్కాలర్‌షిప్ బకాయిలను పూర్తిగా చెల్లించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు, 2015-16కు సంబంధించి స్కాలర్‌షిప్‌ల మంజూరును ప్రారంభించింది. ఇవి పూర్తయ్యాకే కాలేజీలకు ట్యూషన్ ఫీజును రీయింబర్స్(ఆర్‌టీఎఫ్) చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ విధానం ద్వారా విద్యార్థుల హాజరును పర్యవేక్షించనున్నారు. 75 శాతం హాజరు ఉంటేనే స్కాలర్‌షిప్‌లను చెల్లిస్తారు.

 సమగ్ర వివరాల సేకరణ
 పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయిం బర్స్‌మెంట్‌లో భాగంగా రెండేళ్లలో ఏయే శాఖ ఎంత చెల్లించింది, ఇంకా బకాయిలు ఏ మేరకు ఉన్నాయనే వివరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి సీఎం కార్యాలయం సేకరించింది. ఆ వివరాలకు అనుగుణంగా స్కాలర్‌షిప్‌లు, ఫీజులు చెల్లింపుపై దృష్టి పెడుతోంది. మొత్తంగా 2014-15, 2015-16 ఫీజు బకాయిలను చెల్లించేందుకు రూ.3 వేల కోట్ల వరకు నిధులు అవసరమని అంచనా.

 భారీగానే బకాయిలు..
 ‘ఆర్‌టీఎఫ్, ఎంటీఎఫ్’ల కింద 2014-15లో మొత్తంగా 13,77,890 విద్యార్థుల కోసం రూ.2,400 కోట్లు అవసరమని లెక్కించారు. ఈ ఏడాది మార్చి 30 వరకు కూడా కాలేజీలకు(ఆర్‌టీఎఫ్) రూ.1,342 కోట్లు, విద్యార్థులకు(ఎంటీఎఫ్) రూ.446 కోట్లు మంజూరు చేశారు. ఇంకా రూ.622 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2015-16లో 14 లక్షల మంది ఫీజు, స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి దాదాపు రూ.2,400 కోట్ల బడ్జెట్ అవసరమని అంచనా వేశారు. మార్చి 30 వరకు స్కాలర్‌షిప్‌లకు రూ.126.68 కోట్లు, కాలేజీలకు ఫీజుల కింద రూ.14 లక్షలు మంజూరు చేశారు. అంటే ఇంకా సుమారు రూ.2,273 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. అంటే మొత్తంగా బకాయిల చెల్లింపునకే రూ.3వేల కోట్లు అవసరం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement