గొంతెండుతోంది
గ్రామీణ ప్రాంత పాఠశాలల విద్యార్థులకు రక్షిత నీటిని అందించాలనే కేంద్ర ప్రభుత్వ సంకల్పం నీరుగారుతోంది. జలమణి పథకంలో భాగంగా 1.66 కోట్లతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. రక్షిత నీటి కిట్స్‌ను గతేడాది జూన్ నాటికే ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే గడువు ముగిసి ఎనిమిది నెలలైనా నేటికీ 20 శాతం మేర పనులైనా పూర్తి కాలేదు. పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నా సంబంధిత అధికారుల్లో స్పందనలేదు.
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా 42 మండలాల్లోని 280 పాఠశాలల్లో 2013-14 ఏడాదికిగాను కేంద్ర ప్రభుత్వం జలమణి ఫేజ్-2 కింద 280 జలమణి ప్లాంట్లను మంజూరు చేసింది. ఒక్కొక్క ప్లాంటుకు 16 వేల చొప్పున రూ.1.66 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ అందుకు సంబంధించిన పనులు మాత్రం ఏమాత్రం ముందుకు సాగడంలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతేడాది జూన్ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే నేటికీ 20 శాతం పనులు కూడా పూర్తి చేయలేదు.
జిల్లా వ్యాప్తంగా 280 ప్లాంట్లకు గాను డిసెంబర్ చివరినాటికి కేవలం 32 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన వాటి పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఫలితంగా దాదాపుగా 35 వేలమంది విద్యార్థులు మంచినీటి సమస్యతో అల్లాడుతున్నారు. అపరిశుభ్ర నీరు తాగి చాలామంది విద్యార్థులు జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు. జలమణి ప్లాంట్ల పనుల్లో తీవ్రజాప్యం జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.
మెదటి ఫేస్ పనులు కూడా:
జలమణి ఫేజ్-1లో అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 40 మండలాల్లోని పాఠశాలల్లో 150 జలమణి ప్లాంట్‌లను ఏర్పాటు చేశారు. కానీ వాటిపైన కూడా పర్యవేక్షణ కొరవడిన కారణంగా చాల వరకు పనిచేయటం లేదనే విమర్శలు ఉన్నాయి. జలమణి ప్లాంట్ల విషయంలో ఉపాధ్యాయులు కూడా చొరవతీసుకుని పరిరక్షించుకోవాల్సిన అవరసం ఎంతైనా ఉంది.