సాక్షి, హైదరాబాద్: కోర్సు ముగిసేలోపు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఇకపై కోర్సు ముగిసిన వెంటనే ఒరిజినల్ ధ్రువపత్రాలను విద్యార్థులకు అందించేందుకు సంక్షేమ శాఖలు చర్యలు మొదలెట్టాయి. ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల జాప్యంతో కోర్సు పూర్తి చేసినప్పటికీ విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేవి కావు. దీంతో విద్యార్థులు ఉపాధి అవకాశాలను కోల్పోవాల్సి వచ్చేది. తాజాగా ఈ పరిస్థితికి చెక్ పడనుంది. ఇందులో భాగంగా విద్యాసంవత్సరం ముగిసేలోపే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులివ్వనుంది. అన్ని కేటగిరీ విద్యార్థులకు కాకుండా కేవలం ఫైనల్ ఇయర్ కోర్సు విద్యార్థులకు మాత్రమే ఈ ముందస్తు నిధులు చెల్లించనుంది.
వారి ఫీజులు, స్కాలర్‌షిప్‌లకు రూ.650 కోట్లు...
2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల కింద 13.05 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు 3.25 లక్షల మంది ఉన్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రాథమికంగా తేల్చింది. ఈ విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోర్సు ముగిసేలోపే ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల అంచనాలు రూపొందించింది.
ఈ మేరకు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫీజులు, ఉపకారవేతనాల కింద రూ.650 కోట్లు కేటాయించింది. 2017–18 వార్షిక సంవత్సరంలోని ఫైనల్ ఇయర్ విద్యార్థులకు నిధుల మంజూరు సంతృప్తికర స్థాయిలో ఉండటంతో అధికారులు చర్యలు వేగవంతం చేశారు. విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన సైతం త్వరితంగా చేపట్టాలని భావిస్తోంది. మొత్తంగా విద్యా సంవత్సరం ముగిసేనాటికి పరిశీలన పూర్తి చేసి నిధులు విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఫలితాలు వచ్చిన తర్వాత ఆయా విద్యార్థులు కాలేజీల నుంచి నేరుగా ధ్రువపత్రాలు పొందవచ్చని, ఆలోపు ప్రక్రియ పూర్తి చేసేందుకు కృషి చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ ‘సాక్షి’కి తెలిపారు.
కోర్సు ముగిసేలోపు ఫీజు రీయింబర్స్‌మెంట్!
Published Mon, Jan 1 2018 3:25 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment