ఎదురు చూపులు | Against Glances | Sakshi
Sakshi News home page

ఎదురు చూపులు

Published Sun, May 25 2014 2:11 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

Against Glances

అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. 2013-14 విద్యా సంవత్సరం ముగిసినా రూ.64.56 కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పట్లో నిధులు మంజూరయ్యే పరిస్థితులు కనిపించడంలేదు.
 
 దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఫీజు బకాయిల కోసం కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ‘ముందుగా మీరు ఫీజు చెల్లించండి. ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత మీరు కట్టిన మొత్తం వెనక్కు ఇస్తాం’ అంటూ యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. దీంతో విద్యార్థులు బిక్కమొహాలు వేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది పేద వర్గాలకు చెందినవారే. వీరి కుటుంబాల్లో రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. ఈ తరుణంలో వేలాది రూపాయలు ఫీజు చెల్లించలేక విద్యార్థుల తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
 
 ఇప్పటిదాకా
 రూ.100 కోట్లు మంజూరు
 2013-14 విద్యా సంవత్సరంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల కింద ఇప్పటిదాకా రూ.వంద కోట్లు విడుదలయ్యాయి. ఈ మొత్తాన్ని విద్యార్థులకు అందజేశారు. శాఖల వారీగా పరిశీలిస్తే.. 31,183 మంది బీసీ విద్యార్థులకు రూ.12.33 కోట్లు, 10,033 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.4.63 కోట్లు, 3,179 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.32 లక్షల స్కాలర్‌షిప్పు మొత్తాన్ని మంజూరు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 23,896 మంది బీసీ విద్యార్థులకు రూ.44.22 కోట్లు, 7,998 మంది ఈబీసీ విద్యార్థులకు రూ.35.73 కోట్లు, 8211 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.6.70 కోట్లు, 1502 ఎస్టీ విద్యార్థులకు రూ.41.79 లక్షలు మంజూరు చేశారు.
 
 విడుదల కాని బకాయిలు
 జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులకు సంబంధించి రూ.64 కోట్ల బకాయిలు రావాలి. ఇందులో 31,509 మంది బీసీ విద్యార్థులకు రూ.12.60 కోట్లు, 6,262 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.4.33 కోట్లు, 1,427 మంది ఎస్టీ విద్యార్థులకు రూ.18.69 లక్షల స్కాలర్‌షిప్పు మొత్తం విడుదల  కావాల్సివుంది.
 
 రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 30,924 మంది బీసీ విద్యార్థులకు రూ.23.04 కోట్లు, 7,604 మంది ఈబీసీ విద్యార్థులకు రూ.15.47 కోట్లు, 8,084 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.7.24 కోట్లు, 3,102 ఎస్టీ విద్యార్థులకు రూ.1.88 కోట్లు రావాల్సివుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బకాయి నిధులు ఇప్పట్లో విడుదలయ్యేలా కనిపించడంలేదు. రాష్ర్ట విభజన నేపథ్యంలో జూన్ రెండు తర్వాతే కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ క్రమంలో స్కాలర్‌షిప్పు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎప్పుడు విడుదలవుతాయో అధికారులకే స్పష్టత లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement