‘ఫీజు’ రాక... వేలకువేలు కట్టలేక | Students problems | Sakshi
Sakshi News home page

‘ఫీజు’ రాక... వేలకువేలు కట్టలేక

Published Wed, Oct 7 2015 1:01 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM

‘ఫీజు’ రాక... వేలకువేలు కట్టలేక - Sakshi

‘ఫీజు’ రాక... వేలకువేలు కట్టలేక

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిర్వాకం విద్యార్థులకు శాపంగా మారింది. కళాశాలల యాజమాన్యాల విముఖత వారి ఉజ్వల భవితకు గండి కొడుతోంది. ఫీజురీయింబర్స్‌మెంట్‌ను నమ్ముకుని ఎడ్‌సెట్‌లో ర్యాంకులు తెచ్చుకున్న వారి కలలను కల్లలు చేస్తోంది. గతేడాది ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో... ఈ ఏడు బీఈడీ కళాశాలలు ప్రవేశాలకు నో అంటున్నాయి. దీంతో కన్వీనర్ కోటాలో సీటు దక్కినా... వేలకు వేలు కట్టలేక వేలమంది ర్యాంకర్లు ఆందోళనలో ఉన్నారు.

 ఐదువేల మందికి పైనే...
 రాష్ట్రంలో 204 ప్రైవేటు బీఈడీ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 15 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఎడ్‌సెట్‌లో ఉత్తీర్ణత సాధించిన 57 వేల మందిలో 31 వేలకు పైగా అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొన్నారు. గతనెల 17న సీట్లు కేటాయించారు. మొత్తం 12 వేల మంది సీట్లు దక్కించుకున్నారు. 25 నుంచి తర గతులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే సీట్లు సాధించుకున్న వారిలో 6,346 మంది విద్యార్థులు మాత్రమే రిపోర్ట్ చేశారు. మిగిలిన సుమారు 5,600 మంది విద్యార్థులు అందుకు నోచుకోలేదు. కారణం... కళాశాలల యాజమాన్యాలు అడుగుతున్న ఫీజులు చెల్లించే స్తోమత లేకపోవడం.

ఫీజు చెల్లిస్తేనే కళాశాలలోకి అడుగుపెట్టండంటూ యాజమాన్యాలు కరాఖండిగా చెప్పడంతో వారు ప్రవేశాలకు దూరమయ్యారు. డబ్బు చెల్లించలేక.. కష్టపడి చదివి ఖాళీగా ఉండలేక.. దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం ఫీజు రీయిం బర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో తాము శిక్ష అనుభవిస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు... రాష్ట్రంలో చాలా కళాశాలలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో రీయింబర్స్‌మెంట్ విధివిధానాలు ఖరారు కాకపోవడంతో గతేడాది నిధుల విడుదలలో జాప్యం జరి గింది. ఈ ఏడాది విధివిధానాలున్నా అమలుపై స్పష్టత కరువైంది. దీంతో యాజమాన్యాలూ గగ్గోలు పెడుతున్నాయి. అప్పులు తెచ్చి కళాశాలలను అతి కష్టంమీద కొనసాగిస్తున్నామని.. ఈ ఏడూ ఇదే పరిస్థితి ఎదురైతే కాలేజీలకు తాళాలు వేయడమే శరణ్యమంటున్నాయి.
 
 అప్పుల్లో చిక్కుకున్నాం...
 ఏడాదిన్నరగా రీయింబర్స్‌మెంట్ అందకుంటే కళాశాలలు ఎలా మనుగడ సాగిస్తాయి? అధ్యాపకులకు వేతనాలు, నిర్వహణకు యజమానులు అప్పులు తెస్తున్నారు. వాటికి వడ్డీలు కట్టేందుకు తిరిగి అప్పులు చేస్తున్నారు. ఈ ఏడాది ఎన్‌సీటీఈ నిబంధనలను కఠినతరం చేసింది. రెగ్యులర్ అధ్యాపకులు ఉండడంతో పాటు శాశ్వత భవనాలు తప్పనిసరిగా పేర్కొంది. ఇది తీవ్ర ఆర్థిక భారంగా మారింది. ఈ పరిస్థితి నుంచి కొంతనైనా ఉపశమనం కలగడానికి విద్యార్థులను కొంత ఫీజు చెల్లించమని అడుగుతున్నాం. రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాగానే చెల్లించిన డబ్బు తిరిగి విద్యార్థులకు అందజేస్తాం.
 - సూరం ప్రభాకర్‌రెడ్డి, బీఈడీ, డీఈడీ ప్రైవేట్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు
 
 ఏడాది ఫీజు చెల్లిస్తేనే...
 నాది న ల్లగొండ జిల్లా గుర్రంపోడ్. ఎడ్‌సెట్ గణితం మెథడాలజీలో 249 ర్యాంకు సాధించాను. కౌన్సెలింగ్ ద్వారా నల్లగొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో సీటు వచ్చింది. సర్టిఫికెట్లు తీసుకొని కళాశాలలో చేరదామని వెళితే తీవ్ర నిరాశ ఎదురైంది. ఫీజు రియింబర్స్‌మెంట్ రావడం లేదని, ఒక ఏడాది ఫీజు చెల్లిస్తేనే చేర్చుకుంటామని మేనేజ్‌మెంట్ నిర్దాక్షిణ్యంగా చెప్పింది. సగం ఫీజు చెల్లిస్తానన్నా.. వారు ఒప్పుకోలేదు. మొత్తం ఫీజు చెల్లించే స్తోమత లేక కళాశాలలో చేరలేదు.
 - ఆడెపు నాగరాజు, ఎడ్‌సెట్ ర్యాంకర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement