ఫస్ట్ డే..పస్తులే..!
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కడుపు నింపేందుకు ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకం విద్యాసంవత్సరం మొదటి రోజే విద్యార్థుల కడుపులు మాడ్చింది. డ్వాక్రా మహిళలు, ఏజెన్సీల స్థానంలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణ (ఎండీఎం)ను ఆర్భాటంగా ప్రభుత్వం కట్టబెట్టిన ప్రైవేటు సంస్థ పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు ఆహారం అందించకుండా చేతులెత్తేసింది. ఫలితంగా తొలి రోజు ఉదయం ఎంతో ఆనందంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకూ ఖాళీ కడుపులతో గడిపారు.
ఆ మూడు మండలాల్లో..
ప్రభుత్వ పాఠశాలల్లో ఎండీఎం నిర్వహణను సంవత్సరాల తరబడి డ్వాక్రా మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన పలువురు మహిళలు నిర్వహిస్తున్నారు. రాజధాని పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల పరిధిలోని పాఠశాలలను ప్రైవేటు సంస్థకు కట్టబెడుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే సోమవారం మధ్యాహ్నం ఆయా మండలాల్లోని పాఠశాలల విద్యార్థులకు ఆహారం సరఫరా చేయలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.
మళ్లీ ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడండి ..
పెనుమాకలోని పాఠశాలను పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి, డీఈవో కేవీ శ్రీనివాసులురెడ్డి సందర్శించి అక్కడి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మూడు మండలాల పరిధిలోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా కాలేదని తెలుసుకున్న అధికారులు అక్కడి నుంచి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. మొదటి రోజు కావడంతో రవాణా సమస్య తలెత్తి భోజనం సరఫరా చేయలేకపోయామని సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు అధికారులు తెలిపారు. మళ్లీ ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని వారికి సూచించారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు.
మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే : ఎమ్మెల్యే ఆర్కే
రాజధాని (తాడేపల్లి రూరల్) : పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తన కార్యాలయం నుంచి సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. మిడ్ డే మీల్స్‌ను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి పిల్లలలను పస్తులుంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాజధాని ప్రాంతంలో మోసాలు చేయడం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. కలెక్టర్ కాంతిలాల్ దండేకు విషయాన్ని తెలియజేయడంతో విషయం తనకు తెలియదని, దీనిపై వివరణ తీసుకుంటానని చెప్పినట్లు తెలిపారు. దీనిపై మంగళగిరి, తాడేపల్లి ఎంఈవోలను ప్రశ్నించగా వారు సైతం పరిశీలిస్తున్నామన్నారేగానీ, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.