బి.కొత్తకోట: జిల్లాలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న వంట ఏజెన్సీల నిర్వాహకులు అప్పులపాలవుతున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలల విద్యార్థులకు వంట ఏజెన్సీల నిర్వాహకులే భోజనం వండీ పెడ్తారు. బియ్యాన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తుంది.
ఇందుకోసం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.4.35, ఆరు నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6 చొప్పున నిర్వాహకులకు ప్రభుత్వం చెల్లించాలి. ఈ నిధులతో విద్యార్థులకు అందించే భోజనంలో కూరలు, గుడ్లు వడ్డించాలి. అయితే ఏజెన్సీ నిర్వాహకులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను చెల్లించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
9.63కోట్లు పెండింగ్
జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 3.2 లక్షల మంది బాలబాలికలు చదువుతున్నారు. వీరిలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు 70వేల మందికిపైగా ఉన్నారు. మిగిలిన వారంతా 1 నుంచి 8 వరకు చదువుతున్న వా రే. వీరికి భోజనం అందిస్తున్న నిర్వాహకులకు మొత్తం రూ.9.63కోట్లు బకాయిపడ్డారు. రాష్ట్రప్రభుత్వ నిధుల విడుదలలో జాప్యం జరిగేది. కేంద్ర నిధులు సకాలంలో అందేవి. ప్రస్తుతం రెండు ప్రభుత్వాల నిధులు అందలేదు. ఇందు లో 1 నుంచి 8వ తరగతి వరకు రూ.5.12కోట్లను ఈ ఆగస్టు నుంచి ఇప్పటివరకు కేంద్ర నిధులు అందాల్సి ఉంది. 9,10 తరగతుల విద్యార్థులకు ఈ ఫిబ్రవరి నుంచి రూ.4.51 కోట్ల నిధులు అందలేదు. ఒకేసారి కేంద్ర, రాష్ట్ర నిధులు అందకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
వడ్డీలకు అప్పులు
సకాలంలో మధ్యాహ్న భోజన నిధులు మంజూరుకాకపోవడంతో నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఒక్కో ఏజెన్సీకి రూ.2లక్షల నుంచి నాలుగైదు లక్షల బకాయిలు రావాల్సి ఉంటుంది. నిర్వహణ ఆపలేక రూ.100కు రూ.3నుంచి రూ.6 వడ్డీకి డబ్బు అప్పులకు తీసుకొచ్చి పథకం అమలుచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పథకం నిర్వహణ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు.