సాక్షి, ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వాహకులను ఆ పథకం అప్పుల పాలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా వీరికి బిల్లు మంజూరు కావడం లేదు. అయితే విద్యార్థుల కడుపు మాడ్చలేక వీరు అప్పు చేసైనా సరే అన్నం పెడుతున్నారు. ఈ అప్పుకు వడ్డీ పెరిగిపోతున్నా బిల్లులు మాత్రం మంజూరు కావడం లేదు. గత ఏడాది బిల్లు రూ.2 కోట్లు పెండింగ్‌లో ఉన్నా ఇప్పటికీ ఏజెన్సీ నిర్వాహకులకు అందలేదు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు రూ.10.8 కోట్లు విడుదల చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నా ఇదీ అందక వారు మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
జిల్లాలో 3,416 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. డ్వాక్రా సంఘాల మహిళలు, ఇతర మహిళలు ఏజన్సీలుగా ఏర్పడి ఆయా పాఠశాలల్లోని 2.50 లక్షల మంది విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారు. ఏజెన్సీలకు ప్రతి నెల సక్రమంగా బిల్లు అందితేనే మరుసటి నెలలో మెనూ ప్రకారం పెట్టే కూరగాయలు, ఉప్పు, నూనె, చింతపండు, కారం కొనుగోలు చేస్తారు. ఈ పథకం నిబంధనల ప్రకారం ప్రతినెల బిల్లులు అందించాల్సి ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఐదారు నెలలకు ఒకసారి మంజూరు చేస్తోంది. దీంతో నిర్వాహకులకు అప్పుల భారం అధికమవుతోంది.
కిరాణ దుకాణాల వద్ద వంట పదార్థాలు తేవడంతో ప్రతి నెల బిల్లు తడిసిమోపెడవుతోంది. ఒక నెల చెల్లించకపోతే దుకాణదారులు ఆ మొత్తాన్ని వడ్డీకి రాసుకుంటున్నారు. జిల్లాలో గత విద్యా సంవత్సరంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆర్నెళ్లకు సంబంధించి రూ.2 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉంది. ఇక ఈ విద్యా సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు మూడు నెలలకు రూ. 10.8 కోట్లు విడుదల చేసినట్లు విద్యాశాఖ అదికారులు పేర్కొంటున్నారు. అయితే ట్రెజరీ కమిషన్ నుంచి ఆథరైజేషన్ రాకపోవడంతో ఈ బిల్లులు ట్రెజరీలోనే మూలుగుతున్నాయి.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలైనా ఇప్పటి వరకు ఏజెన్సీలకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం. బిల్లులు రాకపోవడంతో తమకు తోచిన కూరగాయలు కొనుగోలు చేసి పెడుతున్నామని, మెనూ ప్రకారం వడ్డించాలనే అధికారుల ఆదేశాలు ఎలా సాధ్యమని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. కాగా, జిల్లాలో 5,982 మంది కుకింగ్ కమ్ హెల్పర్స్(సీసీహెచ్)కు ఇవ్వాల్సిన రూ.1000 గౌరవ వేతనం నెలల తరబడి రావడం లేదు. ఇవి వచ్చినా వంట పదార్థాల కొనుగోలుకు ఆసరా అయ్యేవని వారు అంటున్నారు.
గిట్టుబాటు కాక..
మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి వారానికి రెండు రోజులు గుడ్లు పెట్టాలి. గుడ్డు ధర రూ. 4కు పైగా పెరగడంతో ఏజన్సీల మహిళలు నష్టాల పాలవుతున్నారు. పెరిగిన ధర ప్రకారం వారికి బిల్లు రావడం లేదు. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మెస్ చార్జీ రూ.4.35 పైసలు, ఉన్నత తరగతి విద్యార్థులకు రూ.6కు పెంచినా ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉప్పు, కారం, పసుపు, నూనెలు ఐఎస్‌ఐ, ఆగ్‌మార్క్ ఉన్నవి వాడాలనే నిబంధన ఉండటంతో నిర్వహణ వ్యయం అధికమవుతోందని, పెరిగిన ధరల ప్రకారం సకాలంలో బిల్లు ఇవ్వకపోవడంతో తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన ప్రభుత్వమైనా గత ఏడాది బిల్లుతో పాటు ఈ విద్యా సంవత్సరం ఎప్పటికప్పుడు బిల్లు మంజూరు చేస్తేనే మధ్యహ్న భోజనం నాణ్యతగా విద్యార్థులకు అందే అవకాశం ఉంటుం దని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
అప్పుల అన్నం
Published Tue, Aug 5 2014 1:46 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement