కమిటీ..వీటి సంగతేమిటి? | Facilities Problems In Government Schools In Khammam | Sakshi
Sakshi News home page

కమిటీ..వీటి సంగతేమిటి?

Published Mon, Dec 9 2019 9:48 AM | Last Updated on Mon, Dec 9 2019 9:48 AM

నయాబజార్‌ పాఠశాలలో ట్యాంకు వద్ద అపరిశుభ్రత - Sakshi

సాక్షి, ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో ఇటీవల ఏర్పాటైన స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌ఎంసీ) కమిటీలు పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం కనిపిస్తున్నాయి. బాధ్యతగా కనీస సౌకర్యాల కల్పనకు తోడ్పాటునందించాల్సిన అవసరం కనిపిస్తోంది. జిల్లాలో మూడు సంవత్సరాల తర్వాత ఎస్‌ఎంసీ కమిటీలను ఎన్నికల విధానంలో నియమించడంతో కొత్త ఉత్సాహం ఏర్పడింది. మొత్తం 1,619 పాఠశాలలు ఉండగా..1,240 బడుల్లో ఎన్నికలు నిర్వహించారు. 781 ఎస్‌ఎంసీ కమిటీలు ఏకగ్రీవమయ్యాయి. నూతన కమిటీలు కొలువుదీరాయి. 81 పాఠశాలల్లో వివిధ కారణాల చేత ఎన్నికలు నిర్వహించలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 98వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో పదో తరగతి పిల్లలే 20వేల మంది వరకు ఉన్నారు. ఈ కమిటీలు కనీస సౌకర్యాలపై దృష్టి సారించనున్నాయి.

ముఖ్యంగా మరుగుదొడ్ల సమస్య పీడిస్తోంది. కొన్నిచోట్ల శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారాయి. మరికొన్ని చోట్ల నీటి వసతి లేక ఉపయోగంలో లేవు. చాలా బడుల్లో బల్లలు సరిపడా లేక పిల్లలు నేలమీదనే కూర్చొని విద్యనభ్యసిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఈ ఇబ్బంది తీవ్రంగా కనిపిస్తోంది. ఇక తాగునీటి సమస్య పీడిస్తోంది. చేతిపంపులు పనిచేయక, ఉన్నచోట చిలుము నీరు వస్తుండడంతో పిల్లలు ఇళ్ల నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. జలమణి పేరిట శుద్ధి జలం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్లాంట్ల నిర్వహణ కూడా లోపభూయిష్టంగా మారింది. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల నుంచి కుళాయిల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఖమ్మం నగరంతో పాటు రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, వైరా, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి లాంటి అనేక మండలాల్లోని పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి నెలకొంది. టీచర్ల కొరత ఉండడంతో చదువులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఇలాంటి వారిపై ఎస్‌ఎంసీ కమిటీలు దృష్టి సారించాయి. 

నిధులకు చైర్మన్, హెచ్‌ఎంల భాగస్వామ్యం
ప్రభుత్వం విడుదల చేస్తున్న వివిధ రకాల నిధులు ఎస్‌ఎంసీ చైర్మన్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బ్యాంక్‌ ఖాతాల్లో జమకానున్నాయి. ఇరువురి సంతకాలతోనే..డ్రా చేసి అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సి ఉంటుంది. యాజమాన్య కమిటీల పనితీరును ఈసారి పక్కాగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అనేక పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల పెంపు కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే అల్పాహారం అందించట్లేదు. ఇందుకోసం చర్యలు తీసుకునేలా ఎస్‌ఎంసీ కమిటీలు ప్రయత్నం చేస్తున్నాయి.

కమిటీల సహకారం తీసుకుంటాం..
కొత్తగా ఏర్పడిన ఎస్‌ఎంసీ కమిటీల ద్వారా సౌకర్యాల కల్పనకు సహకారం తీసుకుంటాం. ఇప్పటికే పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు పెంచాలనే ఉద్దేశంతో విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. త్వరలో అల్పాహారం అందించేందుకు నిధులు రానున్నాయి. అందుకు అనుగుణంగా అందించనున్నాం. మిగతా సమస్యల పరిష్కారానికి కమిటీల ద్వారా కృషి చేస్తాం. 
– కనపర్తి వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం–రిక్కాబజార్‌ హైస్కూల్, పరీక్షల విభాగం సెక్రటరీ ఉమ్మడి ఖమ్మం జిల్లా

మా వంతు కృషి చేస్తాం..
స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ తరఫున బడిలో సౌకర్యాలు కల్పించేందుకు మావంతుగా కచ్చితంగా కృషి చేస్తాం. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నిస్తాం. అందరి సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నాం. పాఠశాలలో పదో తరగతి ఫలితాలు పెంచేలా ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తాం. 
– జి.శ్రీనివాసరావు, ఎస్‌ఎంసీ చైర్మన్, జెడ్పీఎస్‌ఎస్‌ కొత్తగూడెం, ఖమ్మంఅర్బన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement