మొక్కు‘బడి’గా భోజనం
► మండుతున్న ఎండలే ప్రధాన కారణం
► చాలా చోట్ల ప్రారంభం కాని పథకం
కరీంనగర్‌ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకం ఫలితమివ్వలేదు. మండుతున్న ఎండలు, నెలరోజుల ముందే పరీక్షలు ముగియడంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. జిల్లాలో 1955 ప్రాథమిక, 327 ప్రాథమికోన్నత, 644 ఉన్నత పాఠశాలల్లో సుమారు 2.12 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు తక్కువ మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి హాజరయ్యారు. పెద్దపల్లి, హుజూరాబాద్, ధర్మపురి, గోదావరిఖని, మంథని నియోజకవర్గాల్లో భోజన పథకం అసలే ప్రారంభంకాలేదు. వేములవాడ, మాన కొండూర్, చొప్పదండి, కరీంన గర్, సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లోని కొన్ని పాఠశాలల్లో పథకం ప్రారంభమైనా.. మరికొన్నింటిలో అసలే ప్రారంభం కాలేదు.
ఎండలు...వసతుల లేమి....
జిల్లాలోని 57 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేలా జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు చేసినా.. ఎండ కారణంగా విద్యార్థులు పాఠశాలకు వచ్చి భోజనం చేయడానికి ఆసక్తి చూపలేదు. ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులు పక్క గ్రామాల నుంచి తాము చదువుకునే పాఠశాలకు వచ్చేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు పాఠశాలల్లో తాగేందుకు నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. ఏజెన్సీల నిర్వాహకులూ ఎండలు చూసి భయపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం, వ్యాసరచన, ఆటపాటలు, పెయింటింగ్‌పై శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలనే ఆదేశాలు ఎక్కడా అమలు కావడంలేదు. ఉపాధ్యాయులూ పాఠశాలలకు వచ్చేందుకు ముందుకు రావడంలేదు. కరీంనగర్ నియోజకవర్గంలో 136 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 98 పాఠశాలల్లో బుధవారం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించారు. 13,320 మంది విద్యార్థులకు కేవలం 1400 మంది విద్యార్థులు మాత్రమే మధ్యాహ్న భోజనానికి హాజరయ్యారు.
జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 180 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 12,859 మంది విద్యార్థులున్నారు. అయితే మధ్యాహ్న భోజనం ఆరగించేందుకు కేవలం 3,223 మంది విద్యార్థులే హాజరయ్యారు. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలంలో 4,465 మంది విద్యార్థులకు గాను 2,680 విద్యార్థులు హాజరయ్యారు. మెట్‌పల్లి మండలంలో 4,163 మంది విద్యార్థులకు గాను 1,050 మంది హాజరయ్యారు. కోరుట్ల అర్బన్, రూరల్ పరిధి పాఠశాలల్లో 6 వేల మంది విద్యార్థులకు గాను 580 మంది హాజరయ్యారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడంతో వంట ఏజెన్సీ నిర్వాహకులు వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపించింది.
మానకొండూర్ నియోజకవర్గంలో తిమ్మాపూర్ మండలంలో 3,466 మంది విద్యార్థులకుగాను 803 మంది మధ్యాహ్న భోజనం తిన్నారు. ఇల్లంతకుంట మండలంలో 51 పాఠశాలల్లో 3,508 మంది విద్యార్థులకుగాను 948 మంది హాజరయ్యారు. మానకొండూరు మండలంలో 57 ప్రభుత్వ పాఠశాలల్లో 4005 మంది విద్యార్థులకు గాను 719 మంది మాత్రమే భోజనం చేశారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో 237 ప్రభుత్వ పాఠశాలల్లో 27842 మంది విద్యార్థులకు గాను 4656 మంది మధ్యాహ్న భోజనానికి వచ్చారు. తొమ్మిది స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా తినేందుకు రాకపోవడం విశేషం.వేములవాడ నియోజక వర్గంలో వేములవాడ అర్బన్, రూరల్‌తో పాటు చందుర్తి, కోనరావుపేట, కథలాపూర్, మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో 21,026 మంది విద్యార్థులకు గాను 3,420 మంది విద్యార్థులు హాజరయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక్క చిగురుమామిడి మండలంలోని కొన్ని గ్రామాల్లో మాత్రమే మధ్యాహ్న భోజనం నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, బోయినపల్లి మండలాల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించారు.
పూర్తి వివరాలు అందలేదు
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ మొదటి రోజు సగం నియోజకవర్గాల్లోనే కొనసాగింది. గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలవుతుం ది. ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులు ఇతర గ్రామాల నుంచి వచ్చేవారు కాబట్టి హాజరు శాతం ఉండడంలేదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థుల హాజరు శాతం 45 మాత్రమే ఉంది. జిల్లా వ్యాప్తంగా భోజనం చేసిన విద్యార్థుల వివరాలు అందలేదు. గురువారం నుంచి ఎస్‌ఎంఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రధానోపాధ్యాయులు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పాఠశాల యూడైస్ కోడ్ కొట్టి స్పేస్ ఇచ్చి ఎండీఎంటీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి విద్యార్థుల సంఖ్యను టైప్ చేసి 99634 72066 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలి.
- శ్రీనివాసాచారి, డీఈవో