ఆ గ్యాస్ స్టవ్‌లు ఏమైనట్టు?
⇒ కట్టెలపొయ్యిలతో మధ్యాహ్న భోజన
⇒ ఏజె న్సీల తంటాలు
పరిగి: ప్రభుత్వ పాఠశాలల్లో పొగ కష్టాలు తప్పడం లేదు. సర్కారు అందజేసిన గ్యాస్ స్టవ్‌లు అటకెక్కాయి. సిలిండర్లను స్కూల్ గడప దాటించారు. వంటగదులు నిర్మిస్తారని చాలా కాలంగా ఎదురు చూస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు నిరాశే మిగులుతోంది. పాఠశాలలు ప్రారంభమై ఏడు నెలలు కావస్తున్నా సర్కారు వంట గదుల ఊసే ఎత్తడ ంలేదు. బడులన్నీ పొగ రాజుకుంటున్నా ఎవరూ పట్టించుకోవటంలేదు. వంటవారికి కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి. 2004-05 విద్యా సంవత్సంరలో ప్రభుత్వం పాఠశాలలకు పంపిణీ చేసిన గ్యాస్ పొయ్యిలు, సిలిండర్లు మూణ్నాళ్లకే మూలనపడ్డాయి. మరో వైపు సగం పాఠశాలలకు వంటగదులు లేక మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలు తంటాలు పడుతున్నారు.
పక్కదారి పట్టిన ప్రభుత్వ పొయ్యిలు
2004-05 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పాఠశాలలకు పంపిణీ చేసిన పొయ్యిలు పక్కదారి పట్టాయి. ఆ విషయం అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప వాటిని రికవరీ చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. పంపిణీ సమయంలో పాఠశాలల విద్యాకమిటీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు.. వారి వారి ఇళ్లకు సిలిండర్లు చేరవేసుకున్నారు. పొయ్యిలు మాత్రం కొన్ని చోట్ల పాఠశాలల్లో ఓ మూలన పడేశారు. వీటి నిర్వహణపై పదే పదే విమర్శలు వినిపిస్తున్నా అధికారులు తిరిగి గ్యాస్‌పొయ్యిలు వెలిగించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. దీంతో అధికారుల తీరుపై గ్రామాల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి
పరిగి మండలంలో 8 ప్రాథమికోన్నత, 48 ప్రాథమిక పాఠశాలలకు, దోమలో 3 ప్రాథమికోన్నత, 48 ప్రాథమిక, కుల్కచర్లలో 7 ప్రాథమికోన్నత, 94 ప్రాథమిక, గండేడ్‌లో 7 ప్రాథమికోన్నత, 84 ప్రాథమిక, పూడూరులో 6 ప్రాథమికోన్నత, 39 ప్రాథమిక పాఠశాలలకు మొత్తం 394 పాఠశాలలకు గ్యాస్‌స్టవ్‌లు, సిలిండర్లు పంపిణీ చేయగా ప్రస్తుతం ఏ ఒక్క పాఠశాలలోనూ సిలిండర్లతో వంటలు చేయడం లేదు.
పొగచూరుతున్న పాఠశాల గదులు
ప్రభుత్వ పాఠశాలల్లో కట్టెల పొయ్యిలపైనే మధ్యాహ్న భోజనం వండుతుండటంతో గదులన్నీ పొగబారి నల్లగా మారుతున్నాయి. మరోవైపు వంటచెరుకు సేకరించేందుకు ఏజెన్సీలు నానా తంటాలు పడుతున్నాయి. సమకూర్చుకున్న పొయ్యిల కట్టెలు పాఠశాలల ఆవరణల్లో, గదుల్లో నిల్వ చేస్తుండటంతో విద్యార్థులకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వానొస్తే వరండాలో.. లేకుంటే ఆరుబయట అన్న చందంగా విద్యార్థుల మధ్యాహ్నం భోజనం వంట పరిస్థితి తయారయ్యింది. గ్యాస్ పొయ్యిల విషయం తమకు తెలియదని సంబంధిత అధికారులు చెబుతుండటం గమనార్హం.