‘తప్పుచేస్తే దండన ఉంటుందనే భయం ఉండాలి. అందుకే యాక్షన్‌లోకి దిగా. వారం రోజుల వ్యవధిలో ఆరుగురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశా. పనిచేయని అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చా. ఇదంతా మార్పు కోసమే. అధికారుల్లో స్పీడ్ పెరగాలి. నా స్పీడ్ ఇలాగే ఉంటుంది. నగరపాలక సంస్థను గాడిలో పెట్టే వరకు ఇక్కడే ఉంటా..’ అంటూ మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ తన మనో గతాన్ని వెల్లడించారు. నగర పాలనపై పట్టుబిగించిన ఆయన బాధ్యతలు చేపట్టి మంగళవారానికి అర్ధసంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. - విజయవాడ సెంట్రల్
- తప్పుచేస్తే సస్పెండ్ అవుతామనే భయం ఉండాలి
- కార్పొరేషన్ గాడిలో పడే వరకూ ఇక్కడే ఉంటా..
- త్వరలో మళ్లీ సమగ్ర సర్వే
- ‘సాక్షి’తో మునిసిపల్ కమిషనర్ వీరపాండియన్
- పాలనలో అర్ధ సంవత్సరం పూర్తి
సాక్షి : ఇటీవలి కాలంలో స్పీడ్ పెంచినట్టున్నారు. ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా?
కమిషనర్ : నేనెప్పుడూ ఇంతే. వచ్చిన కొత్తలో పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నా. తప్పులు చేయొద్దని హెచ్చరించా. కొందరు ఉద్యోగుల్లో మార్పు రాలేదు. అందుకే యాక్షన్‌లోకి దిగా. తప్పు చేస్తే సస్పెండ్ అవుతామనే భయం ఉండాలి. అప్పుడే పరిస్థితులు చక్కబడతాయి.
సాక్షి : విభాగాధిపతుల నుంచి సహకారం ఎలా ఉంది. మీకు స్పీడ్ ఎక్కువైందన్న కామెంట్స్ వస్తున్నాయి?
కమిషనర్ : వాళ్ల సహకారం బాగుంది. కొందరు అధికారులు స్లోగా ఉన్నారు. అలా ఉంటే పాలన సాగదు. స్పీడ్‌గా పనిచేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు.
సాక్షి : బదిలీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది?
కమిషనర్ : అలాంటి ఆలోచనలేమీ లేదు. నగరపాలక సంస్థను గాడిలో పెట్టే వరకు ఇక్కడే ఉంటా. ఒక్కరోజు సెలవు పెట్టాలన్నా మనసు ఒప్పడం లేదు. ఉన్నతస్థాయి కాన్ఫరెన్స్‌లు అవైడ్ చేస్తున్నా. రోజూ భోజనం చేసే సరికి సాయంత్రం 4 అవుతోంది. దృష్టాంతా పాలనపైనే.
సాక్షి : బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం) కొంచెం స్లోగా నడుస్తున్నట్టుంది?
కమిషనర్ : ఇప్పుడే వేగం పెరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ స్థాయికి చేరుకున్నాం. 529 దరఖాస్తులు అందాయి. మరో 5,400 లెసైన్స్‌డ్ సర్వేయర్ల దగ్గర ఉన్నాయి. 21,100 దరఖాస్తులు బీపీఎస్ ద్వారా రావాలన్నది లక్ష్యం. తద్వారా వంద కోట్ల ఆదాయం వస్తోంది.
సాక్షి : సమగ్ర సర్వే మధ్యేలోనే ఆపేశారే?
కమిషనర్ : మళ్లీ ప్రారంభిస్తాం. సర్కిల్-3లో 90 శాతం, సర్కిల్-2లో 20 శాతం పూర్తయింది. రూ.8కోట్ల ఆదాయం పెరిగింది. ఇతరత్రా పనిఒత్తిళ్లు పెరగడంతో సర్వేకు బ్రేక్ ఇచ్చాం. త్వరలోనే తిరిగి మొదలుపెడతాం.
సాక్షి : మొండి బకాయిల వసూళ్ల వ్యవహారం ఎంతవరకు వచ్చింది?
కమిషనర్ : చర్చలు సాగిస్తున్నాం. 90 శాతం మేర బకాయిలు చెల్లిస్తే పదిశాతం రాయితీ ఇస్తామంటున్నాం. ఐవీ ప్యాలెస్ చర్చలు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. వస్త్రలత బకాయిలు రూ.11 కోట్లు ఉండగా, రూ.4 కోట్లు మాత్రమే చెల్లిస్తామంటున్నారు. వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం కుదరదు. కాబట్టి ఆ ప్రతిపాదనను తిరస్కరించం.
సాక్షి : కీలక విభాగాలకు సంబంధించి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కమిషనర్ : యూసీడీ పీవో, ఎస్టేట్స్, ప్రాజెక్ట్స్, రెవెన్యూ వంటి 12 పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇటీవలే లేఖ రాశా. డెప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు కనీసం ముగ్గురు కావాల్సి ఉందని అందులో పేర్కొన్నా. ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది.
సాక్షి : గుణదల ప్లాట్ల వ్యవహారం ఎంతవరకు వచ్చింది?
కమిషనర్ : ఉద్యోగులకే కేటాయిస్తాం. అయితే, ఉన్న ప్లాట్ల కంటే పదింతల దరఖాస్తులు వచ్చాయి. ఎలాంటి వివాదం తలెత్తకుండా ప్లాట్లు విక్రయించాలి. ఆ బాధ్యతను చీఫ్ ఇంజినీర్‌కు అప్పగించా.
సాక్షి : భవిష్యత్ ప్రణాళికలు
కమిషనర్ : ప్రతి సర్కిల్‌కు రెండు చొప్పున హ్యాపీ స్ట్రీట్‌లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాం. సర్కిల్-3లో గురునానక్ రోడ్డులో శ్రీకారం చుట్టాం. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై సర్వే చేస్తున్నాం. నగరంలో ఎల్‌ఈడీ బల్బుల్ని ఏర్పాటు చేస్తున్నాం. మరో నెలన్నరలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
నేనింతే
Published Wed, Jul 8 2015 4:25 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement
Advertisement