ప్రై‘వేటు’ | show-cause notices for 137Unrecognized schools | Sakshi
Sakshi News home page

ప్రై‘వేటు’

Published Sat, Jun 11 2016 3:13 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

show-cause notices for 137Unrecognized schools

137 ప్రైవేటు స్కూళ్లకు షోకాజ్ నోటీసులు
పట్టణ మండలాల్లోనే ఎక్కువ పాఠశాలలు
వారంలోగా వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ
వివరణ సంతృప్తికరంగా లేకుంటే సీజ్!

గుర్తింపులేని పాఠశాలలపై ఉచ్చు బిగుసుకుంటోంది. అనుమతులు లేకుండా పాఠశాలలను నిర్వహిస్తున్న అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ వాటిపై కొరడా ఝళిపిం చేందుకు సిద్ధమవుతోంది. క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం జిల్లాలో 137 ప్రైవేటు పాఠశాలలు అనధికారికంగా కొనసాగుతున్నాయి. వాటికి ఎలాంటి అనుమతులు లేనప్పటికీ విద్యార్థులను చేర్చుకుంటున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈక్రమంలో వాటికి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు విద్యాశాఖ ఉపక్రమించింది. ఇందుకు సంబంధించి మండల విద్యాశాఖ అధికారుల ద్వారా నోటీసులను ఆయా పాఠశాలల యాజమాన్యాలకు  పంపిస్తోంది. 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: అనుమతి లేకుండా కొనసాగుతున్న పాఠశాలలకు రెండ్రోజుల క్రితం షొకాజ్ నోటీసులు జారీ చేసిన విద్యాశాఖ.. వారంలోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. అనుమతుల కోసం చేసిన ప్రయత్నాలు.. ప్రభుత్వ శాఖలనుంచి పొందిన సర్టిఫికెట్లకు సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని విద్యాశాఖ అధికారులకు అందించాలని స్పష్టం చేసింది. మొత్తంగా బడులు తెరిచేనాటికి ఆయా పాఠశాలలు వివరణ ఇవ్వాల్సి ఉంది. వివరణ సంతృప్తికరంగా లేకుంటే వెంటనే సదరు  పాఠశాలను సీజ్ చేస్తామని ఆ నోటీసులో విద్యాశాఖ స్పష్టం చేసింది.

 అన్నీ పట్టణ ప్రాంతాల్లోనే..
రాజధాని నగరానికి చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో అటు గ్రామీణ వాతావరణం.. ఇటు పట్టణ ప్రాంతం మిళితమై ఉంది. జిల్లాలో 37 మండలాలకుగాను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 మండలాలు పూర్తిగా.. ఏడు మండలాలు పాక్షికంగా కలిసిపోయాయి. ఈ పరిధిలో ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో ప్రైవేటు పాఠశాలలున్నాయి. అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో 2,250 ప్రభుత్వ పాఠశాలలుండగా.. 3,220 ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటిలో ఇప్పటివరకు గుర్తించిన వివరాల ప్రకారం అనుమతి లేని పాఠశాలలు 137. ఇందులో అత్యధికంగా సరూర్‌నగర్ మండలంలో 28 అనుమతిలేని పాఠశాలలున్నాయి. అదేవిధంగా రాజేంద్రనగర్ మండలంలో 19, ఘట్‌కేసర్, కుత్బుల్లాపూర్ మండలాల్లో 12 చొప్పున ఉన్నాయి.

 మండల విద్యాశాఖ కార్యాలయాల్లో..
ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దని విద్యాశాఖ ప్రచారం చేస్తోంది. ఈక్రమంలో గుర్తింపులేని పాఠశాలల వివరాలను మండల విద్యాశాఖ కార్యాలయంలో అందుబాటులో పెట్టింది. పాఠశాలలో విద్యార్థులను చేర్పించే ముందు ఆ పాఠశాల నేపథ్యాన్ని తెలుసుకోవాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అందుకు మండల కేంద్రంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement