- స్కూళ్లకు షోకాజ్
- నోటీసులివ్వండి
- ప్రాథమిక విద్యా శాఖకు
- బాలల హక్కుల పరిరక్షణ
- కమిషన్ ఆదేశం
- ‘సాక్షి’ కథ నంతో
- సుమోటోగా కేసు
సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న వైనంపై ‘ఫీ ‘జులుం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనం చదివి, చలించిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్.. ప్రైవేటు స్కూళ్ల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాక సుమోటోగా కేసు స్వీకరించింది.
అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ప్రాథమిక విద్యాశాఖ డెరైక్టర్‌కు సూచించింది. అధిక ఫీజుల వసూళ్లను కట్టడి చేయాలని... ఈమేరకు తెలంగాణ జిల్లాల్లోని డీఈఓలను ఆదేశించాలని స్పష్టం చేసింది. కథనం ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణలో చేపట్టి... విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలంది. లేకుంటే నిరుపేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు చదువు భారమవుతుందని.. ఆ పరిస్థితి రానివ్వద్దని సూచించింది.
న్యాయవాదిని నియమించండి
మరో పక్క హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌పీఏ) కూడా అధిక ఫీజులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే రీతిలో ఫీజులు ఉంటే భవిష్యత్‌లో చదువంటేనే భయపడే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘విద్యా హక్కు చట్టం, విద్యాశాఖ నిబంధనలను గాలికి వదిలి కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు అధిక మొత్తంలో ఫీజులు తీసుకుంటున్నాయి. స్కూళ్ల అభివృద్ధి జరగాలి. కానీ ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచకూడదు. హైకోర్టు కూడా ఈ విషయంలో స్పష్టంగా తీర్పు చెప్పింది.
అన్ని ధరలు పెరిగాయన్న సాకుతో ఏకబిగిన ఫీజులు వసూలు చేయకూడదు. ఏటా స్వలంగా పెంచుకోవాలే తప్ప ఒకేసారి తల్లిదండ్రులపై భారాన్ని మోపకూడదు. ఫీజుల రూపంలో దోపిడీ తీరును గతంలో ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాం. అయినా స్పందన రాలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా వినతిపత్రం అందజేశాం. ఫీజుల దోపిడీ అడ్డుకుంటామని ప్రభుత్వం సూత్రప్రాయంగా చెప్పింది. జీఓ 42పై ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. దీనిపై వాదించడానికి ప్రభుత్వం తరఫున లాయర్‌ను నియమించాల్సిన అవసరం ఉంది’ అని హెచ్‌ఎస్‌పీఏ జనరల్ సెక్రటరీ రవికుమార్ కోరారు.