బడుగుల అభ్యున్నతికి కృషిచేస్తా..
- ‘సాక్షి’తో బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని బడుగు,బలహీనవర్గాల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని మంత్రి జోగు రామన్న చెప్పారు. రాబోయే బడ్జెట్‌లో బీసీలకు పెద్దపీట వేసి, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వెనుకబడిన వర్గాలను ఆదుకుని, ముం దుకు తీసుకెళతామన్నారు. అటవీశాఖ మంత్రిగా ఉన్న ఆయనకు కేబినెట్ విస్తరణలో బీసీ సంక్షేమశాఖను సీఎం కేసీఆర్ కేటాయించిన విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది 2015-16 బడ్జెట్‌ను ప్రవేశపెట్టేలోగా అన్నిజిల్లాల్లో పర్యటించి ప్రజాసంఘాలు, బీసీ సంఘాలతో సమావేశమవుతామని బుధవారం మంత్రి ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలు, బీసీల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెడతామన్నారు.
బడుగు,బలహీనవర్గాల ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఈ వర్గాల నుంచి వచ్చే మంచి సలహాలు, సూచనలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బీసీల్లో ఎన్నో కులాలు రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నాయని, ఈ వర్గాలకు చెందినవారిని వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జోగు రామన్న వెల్లడించారు.